Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

పంజాబ్‌ గొడవను రచ్చకీడ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

కాంగ్రెస్‌ రాజకీయాలు ఎప్పుడూ నాటకీయంగానే ఉంటాయి. కానీ చాలా వరకు ఇవి నాటకీయంగా కన్నా ప్రహసన ప్రాయంగా ముగుస్తాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ శనివారం సాయంత్రం రాజీనామా చేయడం ఆశ్చర్యకరమేమీ కాదు. అయితే అంతర్గత వ్యవహారాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలా నిర్వహిస్తోంది అని ఆలోచిస్తే అనుకూలమైన పరిస్థితులను కూడా వ్యతిరేకంగా మార్చుకోగల నైపుణ్యం ప్రదర్శిస్తుంది అని కచ్చితంగా చెప్పొచ్చు. కాంగ్రెస్‌ పాలన దేశమంతటా ఏకచ్ఛత్రాధిపత్యంగా సాగిన రోజుల్లో కూడా కాంగ్రెస్‌ నడవడిక ఇలాగే ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ఇష్టానుసారం మార్చడం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి అలవాటైపోయింది. ప్రతి ముఖ్యమంత్రి మీద అసమ్మతి వాదులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఇందిరా గాంధీ హయాం నుంచి ఒంటబట్టిన విద్య. అమరేంద్ర సింగ్‌ చేత రాజీనామా చేయించడంలో అదనపుకోణంకూడా ఉంది. 2017 ఎన్నికలలో పదేళ్ల అకాలీ పాలనకు స్వస్తి చెప్పి అనూహ్యంగా కాంగ్రెస్‌కు మూడిరట రెండువంతుల మెజారిటీ సాధించి పెట్టిన అమరేంద్ర సింగ్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం అస్థిరీకరించడమేకాదు. ఆయనను ఘోరంగా అవమానించింది. ఇది ఇంతకు ముందు కనిపించని కొత్త పరిణామం. ఏ ముఖ్యమంత్రి పాలనా నూటికి నూరు పాళ్లు మెచ్చదగిందిగా ఉండకపోవచ్చు. ప్రజలలో అసంతృప్తి ఎప్పుడూ మిగిలే ఉంటుంది. కానీ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా సొంత పార్టీలోనే క్రమశిక్షణా రాహిత్యాన్ని, అసమ్మతిని, అరాచకాన్ని అధిష్ఠానమే పనిగట్టుకుని ప్రోత్సహించడం తాజా పరిణామం. కాంగ్రెస్‌కు నాయకులెవరో తెలియని అయోమయ పరిస్థితి. పేరుకు సోనియా గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేశారు. 136 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ చేసింది ఏమిటంటే సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం. తాత్కాలిక అన్న మాటను అపహాస్యం చేసే రీతిలో 2019 మే నుంచి సోనియా గాంధీనే అధ్యక్షురాలిగానే కొనసాగుతున్నారు. ఎ.ఐ.సి.సి. సమావేశం నిర్వహించి అధ్యక్ష స్థానానికి కొత్త వారిని ఎన్నుకునే సాహసం కాంగ్రెస్‌ ఎటూ చేయలేదు. కనీసం సోనియా గాంధీనే అధికారికంగా అధ్యక్ష స్థానంలో ప్రతిష్ఠించే ప్రయత్నమైనా చేయలేదు. ఈ వ్యవహారం చూస్తే కాంగ్రెస్‌ ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా లేదా కుటుంబ సంస్థగా నడుస్తోందన్న విమర్శలు నిజమేననిపిస్తోంది. 23 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పార్టీలో అపసవ్య ధోరణులను ఏకరువు పెడ్తూ సోనియా గాంధీకి లేఖ రాసినా ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అటుంచి కనీసం ప్రస్తావన కూడా తేకపోవడం కాంగ్రెస్‌ కే చేతనైన వినాశకరమైన ప్రవర్తనా సరళి. అలాగని నిర్ణయాలన్నీ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న సోనియా గాంధీ చేతిలో ఉంటాయా అంటే అదీ లేదు. కాంగ్రెస్‌లో హేమా హేమాలనిపించుకునే నాయకులకే ఆమె దర్శనం దుర్లభం. తమ గోడు చెప్పుకోవడానికి వెళ్లే ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్‌ నాయకులు కూడా దర్శన భాగ్యం లేక వెనుదిరగాల్సిందే. గోడు వెళ్లబోసుకోవడానికి వెళ్లే వారు వీలైతే రాహుల్‌ గాంధీనో, ప్రియాంకా గాంధీనో కలుసుకుంటారు. రాహుల్‌కు కాంగ్రెస్‌లో ఉన్న హోదా మాజీ అధ్యక్షుడు అని మాత్రమే. కనీసం ప్రియాంకా గాంధీకైనా ప్రధాన కార్యదర్శి పదవి ఉంది. కానీ నిర్ణయాలు వీరిద్దరిలో ఎవరో ఒకరు తీసుకుంటుంటారు. ఒక రాజకీయ పార్టీని నడిపే పద్ధతి ఇది కాదు. అయితే కాంగ్రెస్‌ తీరే అంత.
అమరేంద్ర సింగ్‌ రాజీనామా వచ్చే ఏడాది పంజాబ్‌ శాసనసభ ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలు అందిస్తుందన్న నమ్మకం ఏ కోశానా లేదు. అమరేద్ర సింగ్‌పై తిరుగుబాటు చేసిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ లాంటి వారి చేతికి పగ్గాలిచ్చినా పరిస్థితి కుదుట పడ్తుందన్న ఆశలేదు. సిద్ధూ అసమర్థుడని రాజీనామా లేఖ అందించిన వెంటనే కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత దశలో 80 మంది సభ్యులతో కూడిన శాసనసభా పక్షంలో అమరేంద్రసింగ్‌ మద్దతుదార్ల సంఖ్య పలచబడి ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవిని ఎవరికి అప్పగించినా అసమ్మతి తెరపడే లక్షణం మాత్రం కాంగ్రెస్‌లో లేదు. అమరేంద్ర సింగ్‌ పరిపాలనలో లోపాలు ఉండవచ్చు. ఆయన శాసనసభ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమై ఉండవచ్చు. అత్యుత్సాహపరులైన నవ జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ లాంటి వారికి అమరేంద్ర సింగ్‌ బొత్తిగా నచ్చక పోవచ్చు. కానీ రెండు నెలల కాలంలో అమరేంద్ర సింగ్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానమే అవమానించడం కుసంస్కృతికి నిదర్శనం. అవమాన భారం మోయలేకే అమరేంద్ర సింగ్‌ తప్పుకున్నారు. శనివారం సోనియా గాంధీకి ఫోన్‌ చేసి ఇదే మాట చెప్పారు. దీనికి సోనియా కలిగించిన ఊరట ఏమీ లేదు. అసమ్మతి వాదులతో రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మంతనాలు జరిపారు. అమరేంద్ర సింగ్‌ ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం మంచి చెడ్డలను పక్కనపెట్టినా కనీసం మర్యాద పాటించలేదు. పంజాబ్‌ వ్యవహారాల కాంగ్రెస్‌ పర్యవేక్షకుడు హరీశ్‌ రావత్‌ స్వయంగా శనివారం సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశం ఉందని అమరేంద్ర సింగ్‌తో నిమిత్తం లేకుండా ప్రకటించారు. ఆ విషయం ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను అమరేంద్ర సింగ్‌ను ముప్పు తిప్పలు పెట్టిన నవ్‌ జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వెంటనే మళ్లీ ట్వీట్‌ చేశారు. అంటే నిష్పాక్షికత అన్న మాటకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉదాహరణ ప్రాయంగానైనా విలువ ఇవ్వనట్టే. అమరేంద్ర సింగ్‌ మద్దతుదార్లు కొద్ది మందే అయినా వారు ప్రతీకారం తీర్చుకోవాలని ఆయనను కోరుతున్నారు. ఇది కచ్చితంగా పంజాబ్‌లో కాంగ్రెస్‌ చీలిక తప్పదనడానికే సంకేతం. అమరేంద్ర సింగ్‌తో సిద్ధూకు వైరం కొద్ది నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఆయన యాగీ భరించలేక అధిష్ఠానం జులైలో ఆయనను పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించింది. అయినా ఆయన శాంతించలేదు. అమరేంద్ర మీద విమర్శలు కొనసాగిస్తూనే వచ్చారు. అలాంటప్పుడు సిద్ధూను పి.సి.సి. అధ్యక్షుడిగా నియమించి కాంగ్రెస్‌ ఏం సాధించినట్టు? అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టడంలో కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గం అసమర్థత మాత్రం బట్టబయలైంది. అమరంద్ర సింగ్‌ కాంగ్రెస్‌ను వీడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన వేరు కుంపటి పెట్టినా పెట్టకపోయినా కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బ తీయడం మాత్రం ఖాయం. లాంఛనంగా కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశం జరిగినా షరా మామూలుగా కొత్త ముఖ్యమంత్రిని నియమించే బాధ్యతను సోనియాకు అప్పగిస్తూ తీర్మానం ఆమోదించారు. భాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలబడే స్థాయి కూడా కాంగ్రెస్‌కు కొరవడిరదని మరోసారి రుజువైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img