దాదాపుగా మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో దేశ ప్రజలలో కలహాలు రేపుతున్న బీజేపీని ఓడిరచాలన్న ఆకాంక్ష అన్ని ప్రతిపక్ష పార్టీలలో బలంగానే కనిపిస్తోంది. అయితే ప్రతిపక్షాల ఐక్యతాయత్నాలు అంతే బలహీనంగా ఉన్నాయి. పదునైన ఎన్నికల యంత్రాంగంగా మారిపోయిన మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడిరచాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కాక తప్పదు అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు మాత్రం కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధానికైనా ససేమిరా అంటున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలలో మొట్టమొదట ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడిరది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసే. కానీ ఆ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి విముఖంగా ఉంది. మరో వేపున తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి నాయకత్వం వహిస్తున్న కె.చంద్రశేఖరరావు ఒంటరిగా ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేయడానికి ఒకటి రెండు విడతలు ప్రయత్నం చేశారు. ఆయన సమస్య కూడా కాంగ్రెస్‌ను ప్రతిపక్ష కూటమిలో భాగస్వామిని చేయడమే. తెలంగాణలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌నే కె.సి.ఆర్. ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. పైగా జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలన్న భావనతో తెలంగాణ రాష్ట్రసమితి పేరు భారత రాష్ట్రసమితిగా మార్చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ లాంటి వారు దేశమంతటా అస్తిత్వంఉన్న కాంగ్రెస్‌ను మినహాయించే ప్రతిపక్ష కూటమివల్ల ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను మినహాయిస్తే అనేక బీజేపీ వ్యతిరేక పక్షాలకు కాంగ్రెస్‌లేని ప్రతిపక్ష కూటమివల్ల ఫలితం ఉండదన్న అభిప్రాయం బలంగానే ఉంది. కానీ కాంగ్రెస్‌కు భాగస్వామ్యం ఉండే ప్రతిపక్ష కూటమికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఈ నేతలలో కొందరు భావిస్తున్నారు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన తరవాత ఎనిమిది పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులమీద దాడికి మోదీ సర్కారు వినియోగించడం ప్రజాస్వామ్యానికి విఘాతంగా భావించి గతవారంలో ఈ విషయమై ప్రధానమంత్రి మోదీకి ఉమ్మడిగా ఒక లేఖ రాశారు. ఎన్ని సమస్యలమీద ప్రతిపక్షాలు స్పందించినా, ఎంత మంది ప్రతిపక్ష నాయకుల మీద ఆదాయపు పన్నుశాఖ, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించినా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ పెదవైనా విప్పలేదు. అయితే లేఖ రాసిన వారిలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఉండడం విచిత్రమే. ఎనిమిది పార్టీలకు చెందిన తొమ్మిదిమంది నాయకులు కలిసి ప్రధానమంత్రికి లేఖ రాయడంతో మూడో ప్రత్యామ్నాయం కోసం కృషి మొదలైందన్న భావం మొలకెత్తింది. అంటే ప్రతిపక్ష ఫ్రంటో, మూడో ఫ్రంటో ఏర్పడితే అందులో ఆమ్ ఆద్మీ పార్టీని భాగస్వామిని చేయడానికి ఈ లేఖ మీద సంతకాలు చేసిన నాయకులకు అభ్యంతరం లేదనుకోవాలి. ఈలేఖ రాసినవారిలో నేషనలిస్ట్ కాంగ్రెస్‌పార్టీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా, శివసేనలో ఒక వర్గం నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, అఖిలేష్ యాదవ్ తప్ప మిగతా వారంతా కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి సానుకూలంగా ఉన్నవారే. ప్రధానికి లేఖ రాసిన వారిలో కాంగ్రెస్ నాయకులు ఎవరూలేరు. అలాగే భారత రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్నాటకలో జె.డి.(ఎస్) నాయకుడు హెచ్.డి.కుమారస్వామి కూడా సంతకం చేయలేదు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి అభ్యంతరంలేని శరద్‌పవార్, ఫరూఖ్‌అబ్దుల్లా మాత్రం సంతకాలుచేసిన వారిలోఉన్నారు. అంటే ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెస్‌కు ఎలాంటి పాత్రాలేని ప్రతిపక్ష కూటమిలో భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారనుకోవాలా? ఈ విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.
మూడో ఫ్రంట్ కచ్చితంగా బీజేపీకే మేలుచేస్తుందని భారత్ జోడో యాత్ర సఫలమైన ఊపులో రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే ఈ యాత్రతో కాంగ్రెస్ ఎంతోకొంత పుంజుకుందనుకుంటున్న తరుణం లోనూ కాంగ్రెస్ ప్రతిపక్ష ఐక్యతకు చేసిన ప్రయత్నమూ పూజ్యమే. మోదీసర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి అన్ని పార్టీల వారినీ వేధిస్తూనే ఉంది. ఈ పార్టీలు కలిసి ఉమ్మడిగా మోదీ నాయకత్వంలోని బీజేపీని ఎదిరించడం దాడులనుంచి తప్పించుకున్న పార్టీ ఒక్క నితీశ్ కుమార్ నాయకత్వంలోని జె.డి(యు) మాత్రమే అనుకోవాలి. అయినా ఆయన కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు కలిసి పోరాడడం ఒక్కటే మార్గం అంటున్నారు. బిహార్‌లో ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకుని తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రతిపక్ష ఐక్యత గురించి నితీశ్ నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. పైగా ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ ఉండి తీరవలసిందే నంటున్నారు. ఈ కూటమికి నితీశ్ కుమార్ తగిన నాయకుడన్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. నాయకుడు లేదా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం ఎన్నికల తరవాత తేల్చుకోవచ్చునన్నది ఆయన గట్టి నమ్మకం. కానీ భారత్ జోడో యాత్ర సఫలమైందన్న అభిప్రాయం కల్గిన తరవాత పైకి చెప్పకపోయినా రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అభ్యర్థి అన్నమాట కాంగ్రెస్ నాయకుల నోట వినిపిస్తూనే ఉంది. కాంగ్రెస్ కేవలం 200 సీట్లకే పోటీ చేయమంటే ఎలా అంగీకరించగలం అని భారత్ జోడో యాత్ర మధ్య లోనే రాహుల్ వెన్నంటి నడిచిన జై రాం రమేశ్ దాపరికం లేకుండానే మనసులోమాట చెప్పేశారు. ఈ వ్యవహారం అంతా చూస్తే మోదీని ఓడిరచాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష కూటమి ఏర్పడుతుందన్న నమ్మకం కుదరడంలేదు. అంటే ప్రతిపక్ష కూటమి పగటికలగానే మిగిలి పోతుందేమో! 2019లోనూ ప్రతిపక్ష ఐక్యతాయత్నాలు ఫలించనందు వల్ల బీజేపీకే మేలు కలిగింది. ఇప్పుడూ ప్రతిపక్షాలు సమైక్యం కాకపోతే లాభపడేది మళ్లీ మోదీనే.