Monday, February 6, 2023
Monday, February 6, 2023

పట్టు వీడని రైతులు మెట్టు దిగని ప్రభుత్వం

దిల్లీ సరిహద్దుల్లో రైతులు దీక్ష ప్రారంభించి గురువారం నాటికి తొమ్మిది నెలలు పూర్తి అయినాయి. కానీ వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనీ, కనీస మద్దతు ధరకు నికరమైన హామీ ఉండాలన్న రైతుల డిమాండ్లను అంగీకరించడానికి మోదీ సర్కారు ససేమిరా సిద్ధంగా లేదు. రైతుల ఆందోళన ఇప్పటి వరకు శాంతియుతంగానే కొనసాగుతోంది. కానీ హర్యానా ప్రభుత్వం అనేక సార్లు రైతుల మీద కక్షపూరిత ధోరణితో వ్యవహరించింది. వచ్చే మునిసిపల్‌ ఎన్నికల గురించి చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేసిన హర్యానా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి రైతులు గుమిగూడారు. ఆ సమావేశానికి వస్తున్న హర్యానా బీజేపీ అధ్యక్షుడు ఓ.పి.ధన్‌కర్‌ను బస్తారా టోల్‌ ప్లాజా దగ్గర ఆపడానికి రైతులు ప్రయత్నించినప్పుడు పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో రైతుల రక్తం చిందింది. రైతుల నిరసన వల్ల ప్రధానమైన రహదారులలో రాకపోకలకు అంతరాయం కలిగింది. రైతుల మీద పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసించారు. ఇది కిరాతకం అని నినదించారు. ఆందోళన సందర్భంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని, గాయపడిన వారికి చికిత్స చేయించాలని గట్టిగా కోరారు. కర్నాల్‌ జిల్లా కలెక్టర్‌ ఆయుష్‌ సిన్హా ‘‘వారి తలలు పగులగొట్టండి’’ అని అరవడం వినిపించిందంటున్నారు. శనివారం నాడు జరిగిన లాఠీ చార్జీని చిన్న సంఘటనగా కొట్టిపారేయవచ్చు. కానీ అసలు సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయకపోవడం విడ్డూరంగా ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమార్‌ రైతులతో పది పన్నెండు దఫాలు చర్చలు జరిపారు. ఆచరణలో ఈ చర్చల తంతు ప్రహసనంగానే సాగింది. చర్చలు జరిగిన ప్రతి సారీ వివాదాస్పదమైన మూడు చట్టాలను వెనక్కు తీసుకునే అంశం మినహా ఏ సమస్య గురించి అయినా చర్చిస్తామని చెప్పడం ప్రభుత్వం మంకుతనానికి పరాకాష్ఠ. రైతుల ప్రధానమైన కోరికే చట్టాలను వెనక్కు తీసుకోవడం అయినప్పుడు ఇక చర్చించడానికి ఏముంటుంది? జనవరి 22 తరవాత అసలు చర్చలే జరగలేదు. జనవరి 26వ తేదీన రైతులు దిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ప్రశాంతంగా కొనసాగిస్తున్న ఉద్యమాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి కొందరు పనిగట్టుకుని ప్రయత్నించడంవల్లే ఆ రోజు అనుచిత సంఘటనలు జరిగాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటిదాకా నిజానిజాలు తేల్చనే లేదు. ఒక సందర్భంలో పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పిన రైతులు ఇలాంటి సంఘటనల కారణంగా ఆ ప్రతిపాదన ఉపసంహరించారు. జనవరి 26వ తేదీన జరిగిన సంఘటనలను ఖండిరచారు. ఆ తరవాత ప్రధానమంత్రి స్వయంగా రైతులతో మాట్లాడడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమేనని, ఒక్క ఫోన్‌ చేస్తే చాలునని అన్నారు. రైతులు లేఖ రాసినా ఇంతవరకు ప్రభుత్వం ఉలక లేదు, పలక లేదు. దీన్నిబట్టి మోదీ సర్కారు వైఖరేమిటో స్పష్టం అవుతూనే ఉంది. ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగినప్పుడు పార్లమెంటుకు సమీపంలోని జంతర్‌ మంతర్‌లో రైతులు సమాంతర పార్లమెంటు నిర్వహించారు. వివాదాస్పద చట్టాల మీద చర్చించారు. ఒక రోజు కేవలం మహిళా రైతులే సమాంతర పార్లమెంటు నిర్వహించారు. ప్రతిపక్షాలు దీనికి మద్దతు పలికాయి. అసలు పార్లమెంటు సమావేశాలకు ప్రతి రోజూ విఘాతమే కలిగింది. కానీ రైతులు నిర్వహించిన సమాంతర పార్లమెంటు ఏ అడ్డంకి లేకుండా సాగింది.
దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన మొదలై తొమ్మిది నెలలు పూర్తి అయిన సందర్భంగా రైతులు రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించారు. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయాలని తీర్మానించారు. ఇటీవల అయిదు శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు రైతుల నాయకులు ఆ రాష్ట్రాలలో పర్యటించి బీజేపీకి మినహా ఎవరికైనా ఓటు వేయండి అని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఉత్తర ప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఇలాంటి ప్రచారమే చేయాలనుకుంటున్నారు. అయితే మళ్లీ అధికారంలోకి రావడానికి నానా యాతన పడ్తున్న ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ రైతులకు కొన్ని రాయితీలు ప్రకటించారు. పంటలు కోసిన తరవాత మిగిలే కొయ్యకాళ్లను తగులబెట్టిన సందర్భంగా రైతుల మీద మోపిన కేసులను వెనక్కు తీసుకుంటామన్నారు. చెరకు ధర పెంచుతామంటున్నారు. విద్యుత్‌ బిల్లుల బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తామంటున్నారు. చెరకు రైతులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించేట్టు చూస్తామంటున్నారు. రైతుల ఆందోళన మొదలైన తరవాత ఒక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించడం ఇదే మొదటి సారి. పంజాబ్‌ శాసనసభకు కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగాలి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కూడా కొన్ని రాయితీలు ప్రకటించారు. రైతు ఉద్యమం సందర్భంగా పంజాబ్‌కు చెందిన 104 మంది మరణించారని, వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని కూడా అమరేంద్ర సింగ్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో మహా పంచాయత్‌ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్ణయించింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా జనాన్ని సమీకరిస్తామని కూడా కిసాన్‌ మోర్చా చెప్తోంది. రైతుల ఆందోళన రాజకీయాలకు అతీతంగా కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆందోళనకు రాజకీయ రంగు పులమడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. దిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి నిరసన తెలియజేస్తున్న వారిలో అసలు రైతులే లేరని, వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు రైతులను పెడదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వం దుష్ప్రచారం కొనసాగిస్తోంది. దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం దేశ వ్యాప్త ఉద్యమం కాదనీ ప్రధానంగా పంజాబ్‌, హర్యానా రైతులదేనని, కొద్ది మంది రాజస్థాన్‌ రైతులు కూడా ఉండవచ్చునని కేంద్ర ప్రభుత్వం టముకు వాయిస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతుల భాగస్వామ్యాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించదు. ప్రతి రాష్ట్రానికి చెందిన రైతులు ప్రత్యక్షంగా దిల్లీ సరిహద్దుల్లో లేకపోవచ్చు. కానీ అనేక సందర్భాలలో దక్షిణాది రాష్ట్రాల రైతులు కూడా దిల్లీ వెళ్లి సంఫీుభావం ప్రకటించారు. దేశవ్యాప్తంగా వందలాది కిసాన్‌ పంచాయత్‌లు నిర్వహించారు. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కామెర్ల రోగిలాగా ఇది కేవలం రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న ఉద్యమం అని పనిగట్టుకుని ప్రచారం చేస్తోంది. దీన్నిబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నదెవరో స్పష్టంగా తేలిపోతూనే ఉంది. ఈ చట్టాలు మాకు ఒద్దు మొర్రో అని రైతులు అంటూ ఉంటే వ్యవసాయ సంస్కరణల కోసమే ఈ చట్టాలని ప్రభుత్వం వాదిస్తోంది. విధ్వంసకర చట్టాలకు సంస్కరణ రంగు పూయడంలో బీజేపీని మించిన వారు లేరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img