Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

పరిహాసాస్పదం

‘‘మన్‌ కీ బాత్‌’’ చెప్పడమే తప్ప జనం ఘోష వినే అలవాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మొదటి నుంచీ లేదు. ఆయన మంత్రివర్గ సభ్యుల్లో జనానికి తెలిసిన నాలుగైదు పేర్లలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఉన్నారు. కానీ సకల వ్యవహారాలు తానై నడిపించడాన్ని ఒక కళగా అభివృద్ధిచేసిన మోదీ హయాంలో నిర్మలా సీతారామన్‌ కూడా ఇతరుల మాట వినకుండా ఉండే అవలక్షణాన్ని అలవర్చుకున్నట్టున్నారు. బడ్జెట్‌ రూపొందించ డానికి ముందు వివిధ వర్గాలవారితో సంప్రదింపులు జరపడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీని నిర్మలా సీతారామన్‌ అపహాస్యం పాలుచేస్తున్నారు. అందుకే పది కేంద్ర కార్మికసంఘాలు నిర్మలా సీతారామన్‌ అంతర్జాలం ఆధారంగా ఏర్పాటు చేయతలపెట్టిన సమావేశాన్ని సోమవారం బహిష్కరించాయి. ఈ వివాదం కొద్దిరోజులుగా రాజుకుంటూనే ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి దగ్గరనుంచి ప్రధాన కార్మిక సంఘాలకు గత 25వ తేదీన ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం అందినందుకు కార్మికసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కానీ అంతర్జాలం ఆధారంగా ఏర్పాటుచేసే ఈ సమావేశానికి కేటాయించిన మొత్తం సమయం 75 నిమిషాలు. ఆర్థికమంత్రి కనీసం 12 కార్మిక సంఘాలకు ఆహ్వానం పంపించారు. ఇతర కార్మిక సంఘాలూ ఉండొచ్చు. నిర్మలా సీతారామన్‌ తొలిపలుకులకు కొంత సమయం వదిలేస్తే ఇక మిగిలింది ఒక్కో కార్మికసంఘం నాయకుడు తమ అభిప్రాయం చెప్పడానికి మూడు నుంచి అయిదు నిమిషాలకన్నా ఎక్కువ సమయం చిక్కదు. అంటే బడ్జెట్‌కు ముందు జరగవలసిన ఈ సమావేశాన్ని నిర్మలా సీతారామన్‌ ఒక మొక్కుబడిగా మార్చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని కార్మికసంఘాలు ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశాయి. ప్రస్తుతం కరోనా బాధ లేదు కనక అంతర్జాలం ఆధారంగా సమావేశం ఏర్పాటు చేయవలసిన అగత్యం ఏమిటని ప్రశ్నించాయి. ఒక్కో కార్మిక సంఘానికి మూడు నిమిషాల సమయం కన్నా ఎక్కువ ఉండదనీ చెప్పాయి. అయినా ఆర్థిక మంత్రి వినిపించుకోనందువల్ల ఈ సమావేశాన్ని ఏ.ఐ.టి.యు.సి., ఐ.ఎన్‌.టి.యు.సి, సి.ఐ.టి.యు., హెచ్‌.ఎం.ఎస్‌. ఎల్‌.పి.ఎఫ్‌., ఎస్‌.ఇ.డబ్ల్యు.ఎ., ఏ.ఐ.యు.టి.యు.సి. లాంటివి బహిష్కరించక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఒక్కొక్క కార్మిక సంఘానికి కేవలం మూడు నిమిషాల సమయం కేటాయించడం ఇలాంటి సమావేశాన్ని పరిహసించడమేనని కార్మిక సంఘాలు తెలియజేశాయి. తరవాత మరో సమావేశం ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారన్న వార్తలూ వచ్చాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్‌సంఫ్‌ుకు చెందిన వారు మాత్రమే సోమవారం ఆర్థికమంత్రితో బడ్జెట్‌ గురించి చర్చించారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి కూడా ఆర్థికమంత్రి ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు. వ్యాపారవర్గాలకు ప్రాతినిధ్యం వహించే భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి (ఎఫ్‌.ఐ.సి.సి.ఐ-ఫిక్కీ), భారత పరిశ్రమల మహాసమాఖ్య(సి.ఐ.ఐ.) ప్రతినిధులతో చర్చలకు మాత్రం ఆర్థికమంత్రి తగినంత సమయం కేటాయించారు.
బడ్జెట్‌ రూపొందించడానికి ముందు వివిధవర్గాల అభిప్రాయాలు తెలుసుకుని, స్వీకరించడం సంప్రదాయం. మోదీ ప్రభుత్వం సంపద సృష్టించే కార్మికవర్గాన్ని ఖాతరు చేయకూడదనుకుంటున్నట్టుంది. కార్మిక సంఘాలు లేవనెత్తే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చే సత్తాకానీ, ఉద్దేశంకానీ కేంద్ర ప్రభుత్వానికి లేవు. కేంద్ర ప్రభుత్వ వైఖరినిబట్టిచూస్తే కార్మికవర్గానికి మరింత గడ్డుకాలం తప్పేట్టు లేదు. నాలుగు కార్మిక నిబంధనలను ఎలాగైనా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కార్మికసంఘాలు మొదటినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. పార్లమెంటులో కూడా ప్రతిపక్షాలు, ప్రధానంగా వామపక్షపార్టీలు ఈ కార్మిక నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏమైనా సరే శ్రమజీవుల మాట చెవినపెట్టకుండా కార్పొరేట్లకు అనుకూల విధానాలను కొనసాగించడానికే మోదీ సర్కారు కంకణం కట్టుకుంది. వివాదాస్పదమైన నాలుగు కార్మిక నిబంధనలను కేంద్రప్రభుత్వం 2019, 2020లో రూపొందించింది. వీటిని కార్మికసంఘాలు తీవ్రంగా ప్రతిఘటించినా కేంద్రప్రభుత్వం పట్టించు కోకుండా ముందుకు సాగుతోంది. కార్మిక వ్యవహారాలు చర్చించడానికి భారత కార్మికసంస్థ(ఐ.ఎల్‌.సి.) ఉంది. ఇది త్రైపాక్షిక సంస్థ. ఈ సంస్థ సమావేశాలను 2015 దగ్గరనుంచి నిర్వహించడమే లేదు. ఈ సంస్థ సమావేశాలు కార్మిక మంత్రిత్వ శాఖ నిర్వహించాలన్న నియమం ఉంది. అయినా మోదీ సర్కారు పట్టించుకోదు.
పారిశ్రామిక సంబంధాలపై ప్రభావంచూపే ఏ అంశాన్ని మోదీ సర్కారు పరిగణించడమే లేదు. బ్యాంకులు, బీమా కంపెనీలవంటి ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటురంగానికి అప్పగించడాన్ని కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకోసం దేశవ్యాప్త సమ్మెలు జరిగినా, మోదీ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ఒక్కో కార్మికసంఘానికి మూడు నిమిషాల సమయం మాత్రమే కేటాయించి సమావేశం ఏర్పాటు చేయడంవల్ల పెద్దప్రయోజనం ఏమీలేదని, అర్థవంతమైన చర్చ ఏమీ జరగదని కేంద్ర ప్రభుత్వానికి తెలియక కాదు. కేంద్ర కార్మికమంత్రి భూపేంద్ర యాదవ్‌తో ఇటీవల కేంద్ర కార్మికసంఘాలు సమావేశం అయినా అదీ నిష్ఫలమే అయింది. కార్మికవర్గానికి సంబంధించిన ఏ అంశంపైనా ఏకాభిప్రాయం కుదరనేలేదు. వ్యాపార, వాణిజ్య వర్గాలకు, బడాపెట్టుబడిదార్లకు శ్రామికులు సృష్టించిన సంపదను దోచి పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం కనక ప్రయోజనం ఆశించడం కూడా దండగే. ప్రభుత్వం ఇలా కార్మిక విరోధ విధానాలు అనుసరిస్తున్నప్పటికీ సాగిలపడ్తున్న ఆర్థికవిధానాన్ని మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యలను కార్మికసంఘాలు సూచిస్తూనే ఉన్నాయి. మహాత్మాగాంధీ జాతీయఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయిస్తే జనానికి పని దొరకడమే కాకుండా వారి చేతిలో డబ్బు ఉంటే కొనుగోలుశక్తి పెరిగి అది ఉత్పత్తి పెరగడానికి దోహదం చేస్తుందన్నది కార్మికసంఘాల వాదన.
ఉపాధిహామీ పథకం కింద పనిచేసే వారికి కనీసవేతనాలు అమలు చేయాలన్న డిమాండు చాలాకాలంగా ఉంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీచేసే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. 2022 నాటి విద్యుత్‌(సవరణ) బిల్లును ఉపసంహరించాలన్న వాదన చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే తయారైంది. కార్పొరేట్లమీద మరిన్ని పన్నులు విధించాలన్న సూచనను మోదీ సర్కారు దానికి విరుద్ధంగా అమలు చేస్తోంది. సంపదపన్ను విధించకుండా కాళ్లీడుస్తోంది. ఈ సమస్యలన్నింటినీ కార్మిక సంఘాలు లేవనెత్తుతాయని ఆర్థికమంత్రికి తెలుసుకనకే కార్మికసంఘాలతో సమావేశాన్ని పరిహాసాస్పదం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img