పట్టువిడుపులు వదిలి ఎన్నికలలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎదురైన ఫలితాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్చుకోనట్టు కనిపిస్తోంది. ఏకపక్ష ధోరణిని అవలంబించడం మానుకోవడంలేదు. ఫలితంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా ఐక్యసంఘటన ఉమ్మడిగా అభ్యర్థులను నిలపలేకపోయింది. కాంగ్రెస్ అతివిశ్వాసం, మంకుపట్టుతో కమలదళాన్ని దీటుగా ఎదుర్కొనే అవకాశం సన్నగిల్లింది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా 2019 ఎన్నికలలో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఆ ఎన్నికలలో బీజేపీ 40, మిత్రపక్షం జేజేపీ10 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ 31 సీట్లలో ఇతరులు తొమ్మిది స్థానాలలో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం పది లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకోగా, 2024 ఎన్నికలలో ఆ సీట్లు ఐదుకు పడిపోయాయి. అమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపెట్టుకుని 9 స్థానాలలో పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలలో విజయం సాధించింది. పోటీచేసిన ఒక స్థానంలో అమ్‌ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికలలో ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్య పార్టీలు ఐక్యంగా పోటీచేసి కాషాయదళాన్ని ఓడిరచాలన్న లక్ష్యంగా చర్చలు ప్రారంభించాయి. ఇండియా భాగస్వామ్య పక్షాలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించిన తర్వాతే పొత్తులపై కొంతవరకు చర్చలు ముందుకు సాగాయి. జాతీయ స్థాయి ప్రయోగాన్ని రాష్ట్రాలకు విస్తరించాలన్న రాహుల్ ఆశ కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తీరుతో అడియాసే అయింది. ఒంటెత్తుపోకడ, ఏకపక్ష ధోరణి కారణంగా సీట్ల సర్దుబాటు చర్చలు ఫలించలేదు. కేవలం సీపీఎంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అవగాహన కుదిరింది. ఆ పార్టీకి ఒక్క సీటు కేటాయించింది. హస్తం పార్టీ మంకుపట్టు కారణంగా ఆప్, సీపీఐతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. హర్యానా కాంగ్రెస్ నాయకులు ఆప్ విషయంలో సీట్లను వదులుకోవడానికి ఆసక్తి చూపలేదు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ పది సీట్లు డిమాండ్ చేయగా ఐదు కంటే ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడలేదు. గత వారం చివరిలో ఆప్‌తో చర్చలు విఫలమయ్యాయి. దానితో ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రారంభించింది. అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులతో చివరి, ఏడో జాబితాను విడుదల చేసింది. ఆప్ సోమవారం 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత మంగళవారం ఉదయం 9 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది. అదే రోజు రాత్రి మూడో జాబితాలో భాగంగా 11 మందిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక బుధవారం నాలుగో జాబితాలో 21 మందిని ప్రకటించింది. ఇలా విడతల వారీగా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో జాబితాలో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై మరో రెజ్లర్ కవితా దలాల్‌ను ఆప్ బరిలోకి దింపింది. 2022లో కవిత ఆప్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా యోగేశ్ బైరాగి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఎంతో మాత్రమే పొత్తు కుదుర్చుకోగలిగింది. ఆ పార్టీకి భివానీ నియోజకవర్గాన్ని కేటాయించింది. ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ విచిత్ర ధోరణి వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో చర్చలు విఫలమయ్యాయి. సీపీఐకి ఒక స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అయితే సీపీఐ సూచించిన ఏ సీటును ఆ పార్టీకి కేటాయించేందుకు కాంగ్రెస్ ససేమిరా అనడంతో రెండు పార్టీల మధ్య చర్చలు బెడిసికొట్టాయి. ఇక చేసేదిలేక సీపీఐ ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలిపింది. ఈ నెల 16న నామినేషన్ల ఉపసంహరణకు ముందుగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలన్న కృతనిశ్చయంతో సీపీఐ ఉన్నది. అధికార బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఎన్నికల పోరులో వామపక్షాలతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందనీ, సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పెద్దమనసుతో వ్యవహరించి ఉండాల్సిందన్నది సీపీఐ నేతల అభిప్రాయం. ్ట కైతాల్ నుంచి పార్టీ ఎంపీ రణదీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలాను బరిలోకి దింపిన కాంగ్రెస్ అంబాలా కాంట్ నుంచి పరిమల్ పారి, పానిపట్ రూరల్ నుంచి యువ నాయకుడు సచిన్ కుందును బరిలో నిలిపింది. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన జర్నలిస్ట్ సర్వమిత్ర కాంబోజ్ సిర్సా జిల్లాలోని రానియా స్థానం నుంచి పోటీకి దిగారు.
ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించగానే చాలా సందర్భాలలో రాజకీయ పార్టీలలో పొగలు, సెగలు సర్వసాధారణం. కానీ ఇప్పుడు టికెట్లు ఆశించిన, దీర్ఘ కాలికంగా బీజేపీనే నమ్ముకున్న వారిని బీజేపీ అధిష్ఠాన వర్గం ఉపేక్షించింది. దానితో టికెట్ ఇవ్వక పోయినా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవగలమన్న ధీమా, ఆత్మ విశ్వాసం, నమ్మకం ఉన్న వారు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలలో బీజేపీ పదకొండు కొత్త మొఖాలకు పోటీచేసే అవకాశం కల్పించింది. ముగ్గురు మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మోహన్‌లాల్ బడోలి సహా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. సీనియర్ నాయకుడు మాజీ విద్యా మంత్రి రామ్ బిలాస్ శర్మకు టిక్కెట్ నిరాకరించి మహేందర్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి కన్వర్ సింగ్ యాదవ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. తనకు టికెట్ ఇవ్వకపోవచ్చని ముందుగానే భావించిన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్ బిలాస్ ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థుల జాబితా రాష్ట్రంలో పార్టీ శ్రేణులలో అసంతృప్తిని రేకెత్తించింది. ఈ నిర్ణయం తక్షణ పర్యవసానమే రాష్ట్ర కమిటీ సభ్యుడు శివ కుమార్ మెహతా రాజీనామా. తాను కోరిన నార్నాల్ స్థానానికి ఓం ప్రకాష్ యాదవ్‌ను పార్టీ ఎంపిక చేయడం పట్ల అసంతృప్తితో రగిలిపోయిన మెహతా తన రాజీనామాను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బడోలీకి సమర్పించారు. టికెట్ల కేటాయింపులో బీజేపీ రాష్ట్రంలో ఎక్కువగా దిగుమతి చేసుకున్న నాయకులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందన్న ఆరోపణలున్నాయి. వంశ పారంపర్య రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ తరపున ఈ ఎన్నికల్లో అరడజను మందికిపైగా ఆనువంశిక రాజకీయాల కారణంగానే టికెట్ సంపాదించారు.