Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల మతలబు?

వచ్చే నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు అవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం హఠాత్తుగా ప్రకటించారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో మాత్రం ఆయన చెప్పలేదు. రేపో మాపో చెప్తారేమో తెలియదు. అన్నింటినీ ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవడంలో ఆరితేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక సమావేశాలను కూడా ఉపయోగించుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందు నవంబర్‌-డిసెంబర్‌ నెలల్లో శీతాకాల సమావేశాలు జరగవలసిఉంది. ఈ పార్లమెంటు గడువు పూర్తయ్యేలోగా అవే ఆఖరి సమావేశాలు కావచ్చు. సెప్టెంబర్‌లో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేనాటికి సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో జి20 సమావేశాలు పూర్తి అవుతాయి. దానితోపాటు చంద్రయాన్‌-3 సఫలం కావడం కూడా మోదీ ఘనతేనని భక్తులు ఇదివరకే ప్రచారం మొదలు పెట్టారు. ఈ రెండు సంఘటనల గురించి పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించి తమ గొప్ప చెప్పుకోవడానికి మోదీ ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటో చెప్పలేదు కాని బిల్లులు ప్రతిపాదించి ఆమోదింప చేసుకునే ఆలోచన అయితే ఉన్నట్టులేదు. పార్లమెంటు నూతన భవనంలోకి మారడానికి కూడా ఈ సమావేశాలను వినియోగించుకోవచ్చు. ఈ అయిదు రోజుల్లో కొన్ని రోజులు పాత భవనంలోనూ, మరికొన్ని రోజులు కొత్త భవనంలోనూ జరుగుతాయంటున్నారు. మణిపూర్‌ మారణకాండలాంటి ప్రజల సమస్యలను చర్చించడానికైతే మోదీ తప్పించుకు తిరుగుతారు కానీ స్వోత్కర్షలకు ఎన్నడూ వెనుకాడరు. పార్లమెంటు నూతన భవన ప్రారంభానికి ప్రతిపక్షాలు హాజరు కాలేదు. మోదీ ఒక్కరే ‘‘గృహప్రవేశం’’ చేసేశారు. ఇప్పుడు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలపేర నూతన పార్లమెంటు భవన ప్రవేశానికి మార్గం సుగమమం చేసుకోవాలనుకుంటున్నారు. కేవలం కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడానికే అయితే ప్రారంభోత్సవం ఎటూ అయిందనిపించారు కనక హడావుడిగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయవలసిన పనేలేదు. అంటే జి20 శిఖరాగ్రసభ ఎంత అద్భుతంగా నిర్వహించామో, చంద్రయాన్‌-3 ఎలా విజయవంతమైందో పార్లమెంటు వేదిక మీంచి ప్రకటించి దేశంలోనూ, అంతర్జాతీయంగాను తన ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేయడం మోదీ ఉద్దేశం కావచ్చు. లేకపోతే ఎజెండా ప్రకటించకుండా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయవలసిన అవసరమేలేదు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను చాటి చెప్పడానికి కూడా ఈ సమావేశాలను ఉపయోగించుకోవచ్చు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశం అని ప్రకటించినా ఆశ్చర్య పడక్కర్లేదు. మోదీ దృష్టిలో అభివృద్ధికి నిర్వచనం వేరు కనక పెరుగుతున్న పేదరికం, ధరలు, నిరుద్యోగం మొదలైనవి ఎన్ని ఉన్నా అభివృద్ధి సాధించామని చేప్తే మోదీని అడ్డుకునే వారు ఎవరు. అడ్డుకున్నా ఆయన ఎవరిమాట వినిపించుకుంటారు గనక! కశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని ఎప్పుడు పునరుద్ధరిస్తారు అని సుప్రీంకోర్టు ఇటీవలే నిలదీసింది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ప్రత్యేక సమావేశాల వేదికగా వెలువడుతుందన్న భరోసా అయితేలేదు. శీతాకాల సమావేశాలు సాధారణంగా అయితే నవంబర్‌-డిసెంబర్‌లో జరగాలి. ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు కనక శీతాకాలసమావేశాలు జాప్యం అయ్యే అవకాశాలూ లేకపోలేదు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తరవాత శీతాకాల సమావేశాలు నిర్వహించే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు. ఆలోగా చంద్రయాన్‌, జి20 సమావేశాల గురించి గొప్పలు చెప్పుకోవాలంటే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమే మేలని ప్రభుత్వం భావించినట్టుంది. గత సంవత్సరం కూడా గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు జరిగిన తరవాత డిసెంబర్‌ ఏడు నుంచి 23 దాకా శీతాకాల సమావేశాలు నిర్వహించారు. జి20 దేశాల పార్లమెంట్ల స్పీకర్ల సమావేశం (పి20) కూడా జరగనుంది కనక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు దానికి తగిన నేపథ్యం సమకూర్చినట్టు కూడా ఉంటుందని అనుకొని ఉండొచ్చు. పి20 సమావేశానికి హాజరవుతామని ఇప్పటికే 30 దేశాల స్పీకర్లు తెలియజేశారు. అయితే లోకసభ, రాజ్యసభ కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతాయి కాని ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించే సూచనలు ఉన్నట్టు లేదు. ఫిబ్రవరి మే మధ్యలో బడ్జెట్‌ సమావేశాలు, జులై నుంచి సెప్టెంబర్‌ మధ్య వర్షాకాల సమావేశాలు, నవంబర్‌-డిసెంబర్‌ నెలల్లో శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఇటీవలి కాలంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించే వ్యవధి గణనీయంగా తగ్గిపోతోంది. రెండు దశాబ్దాల కిందటి దాకా ఏడాదిలో కనీసం 120 రోజులపాటు పార్లమెంటు సమావేశాలు జరిగేవి. ఇప్పుడు ఆ వ్యవధి 70 రోజులకు తగ్గిపోయింది. పార్లమెంటు సమావేశాలు ఎంతకాలం నిర్వహిస్తున్నారు అన్న దానికన్నా నిర్వహించే కొద్ది రోజులైనా సవ్యంగా జరుగుతున్నాయా అంటే అదీలేదు. ఉదాహరణకు గత ఆగస్టు 12 న ముగిసిన వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమైనాయి. ఎక్కువ రోజులు మణిపూర్‌ మారణకాండపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినందువల్ల సభ సవ్యంగా జరిగిందే తక్కువ. అయినా ప్రభుత్వం ఆ రణగొణ ధ్వనుల మధ్య 23 బిల్లులను మమ అనిపించింది. బిల్లుల మీద చర్చ జరిగే సమయం మరీ కుంచించుకుపోతోంది. ఉదాహరణకు లోకసభ వర్షాకాల సమావేశంలో 43శాతం, రాజ్యసభ 55 శాతం మాత్రమే సభా కార్యక్రమాలు సాగాయి. లోకసభ 17 రోజులపాటు సమావేశం అయింది. అంటే మొత్తం 44 గంటల 15 నిముషాలు జరిగింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం మీద మాత్రం మూడు రోజుల వ్యవధిలో 19 గంటల 59 నిముషాలు చర్చ జరిగింది. ఇందులో రెండు గంటలు అమిత్‌ షా, మరో రెండు గంటలు మోదీ ప్రసంగాలతోనే సరిపోయింది. కానీ ఆమోదించిన బిల్లుల మీద జరిగిన చర్చ మాత్రం అత్యంత స్వల్పం. ఉదాహరణకు అటవీ సంరక్షక (సవరణ) బిల్లు మీద లోకసభలో 38 నిముషాలు, రాజ్యసభలో 41 నిముషాలు మాత్రమే చర్చ జరిగింది. జనన మరణాల సవరణ బిల్లు మీద లోకసభలో 23 నిముషాలు, రాజ్యసభలో 35 నిముషాలు, గనులు-ఖనిజాల బిల్లు మీద లోకసభలో 19 నిముషాలు, రాజ్యసభలో 34 నిముషాలు మాత్రమే చర్చ జరిగింది. మూడునిముషాలు, రెండు నిముషాల్లో ఆమోదించిన బిల్లులూ ఉన్నాయి. సెలెక్ట్‌ కమిటీలకు బిల్లులను పంపడం చాలా అరుదై పోయింది. ఏ బిల్లు మీద అయినా కూలంకషమైన చర్చ జరగాలి. హడావుడిగా, మొక్కుబడిగా ఆమోదించిన బిల్లులలో లోపాలు మిగిలిపోవచ్చు. బిల్లు సమగ్రంగా లేకపోతే ఆ తరవాత కోర్టులకెక్కే సందర్భాలు పెరుగుతూ ఉంటాయి. అసమగ్రమైన చర్చతో శాసనాలు ఆమోదించడం అంటే ప్రజానుకూలమైన చట్టాలు రూపొందడానికి పనిగట్టుకుని విఘాతం కలిగించడమే. ఈ అంశాలను పట్టించుకోకుండా ప్రత్యేక సమావేశాల వల్ల ఒరిగేదేమీ ఉండదు. స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా 1997లో, జి.ఎస్‌.టి.బిల్లు ఆమోదించడానికి 2015లో పార్లమెంటు సమావేశాలు జరిగాయి. వచ్చే నెల జరిగేవి మూడవవి కావొచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img