Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

పార్లమెంటు వేదికగా విద్వేషం

‘ఇతను ఉగ్రవాది, ఈయన తీవ్రవాది. ఈ ముల్లాను బయటకు విసిరేయండి.’ ఈ మాటలు అన్నది ముస్లింలను నోరారా దూషించడానికి అలవాటు పడిన బీజేపీ నాయకులో, కార్యకర్తలో కాదు. బీజేపీ లోకసభ సభ్యుడు రమేశ్‌ భిధూరీ. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి నిండు పార్లమెంటులో కసిదీరా బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన ముస్లిం డానిష్‌ అలీ మీద చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారంలో పొల్లుపోకుండా వినిపించాయి. భిధూరీ అంతటితో ఆగలేదు. డానిష్‌ అలీని తార్పుడుగాడు, ఖత్నా చేయించుకున్న వాడు అని కూడా అన్నారు. ఖత్నా చేయించుకోవడం ముస్లింల మతపరమైన ఆచారం లేదా నియమం. దక్షిణ దిల్లీ నుంచి ఎంపికైన భిధూరీ సాటి సభ్యుడిని తార్పుడుగాడనడం బీజేపీలో సర్వత్రా వ్యాపించిన విద్వేషానికి తార్కాణం. భిధూరీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు కొడికున్నార్‌ సురేశ్‌ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమని అధికారులను ఆదేశించానని చెప్పారు. కానీ కేవలం రికార్డుల నుంచి తొలగించినంత మాత్రాన విద్వేష ప్రచారానికి నిష్కృతి లభిస్తుందా? అలాంటి విద్వేషాగ్నిని వ్యాపింప చేసేవారికి రికార్డులనుంచి పరిహరించడం శిక్ష అవుతుందా? భిధూరీ లాంటి వారు నిర్భయంగా పార్లమెంటు సాక్షిగా ఇలాంటి ముస్లిం వ్యతిరేక అపశబ్దాలు పలుకుతున్నారంటే దానికి కారణం సంఫ్‌ు పరివార్‌ పెంచి పోషించిన ముస్లిం వ్యతిరేకతే. అది వారి రాజకీయ సిద్ధాంతానికి ప్రాతిపదిక. పోరాడవలసింది ఆ సైద్ధాంతికతతో. పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా తీరికగా చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పునరావృతం అవడానికి ఎన్నిసార్లు ఇలాంటి విద్వేషం విరజిమ్మాలో! తీవ్రంగా పరిగణించడం లాంటి పడికట్టు మాటలను వాడడానికి బదులుగా రమేశ్‌ భిధూరీని సభ నుంచి కనీసం సస్పెండ్‌చేసే చొరవ స్పీకర్‌ చూపకపోవడం ఆయన పక్షపాత వైఖరికి నిదర్శనం. ఇది కచ్చితంగా ద్వంద్వ ప్రమాణమే. ప్రభుత్వాన్ని నిలదీసినంత మాత్రాన రాహుల్‌గాంధీ మీద కత్తిగట్టినట్టు ప్రవర్తించారు. వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఆ సమావేశాల కాలం ముగిసేదాకా సస్పెండ్‌ చేశారు. మరి భిధూరీకి ఆ కొలమానమే వర్తించక పోవడానికి స్పీకర్‌ తన పూర్వాశ్రమాన్ని మరిచిపోకపోవడమే కారణం అనుకోవాలి. ఆయన ఒకప్పుడు ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త. అందుకే సభా మర్యాద పాటించకపోవడమే కాకుండా విద్వేషాన్ని వెదజల్లిన బీజేపీ ఎంపీని శిక్షించడానికి వెనుకాడుతున్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్నవారు అంతకుముందు ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నవారు కావొచ్చు. అది కొత్తా కాదు. ఆశ్చర్యకరమూ కాదు. కానీ స్పీకర్‌ స్థానాన్ని స్వీకరించిన తరవాత నిష్పక్షపాతంగా వ్యవహరించే సంస్కారాన్ని అలవరచుకోవాలి. ఈ సంప్రదాయం నీలం సంజీవ రెడ్డి, సోమనాథ్‌ చటర్జీతోనే అంతమైందనుకోవాలా? వారిద్దరూ స్పీకర్‌ స్థానం స్వీకరించే ముందే తమ పార్టీలకు రాజీనామా చేశారు. రమేశ్‌ భిధూరీ ప్రవర్తనకు బీజేపీ సీనియర్‌ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ క్షమాపణ చెప్పి ఈ వ్యవహారానికి అక్కడితో ముగింపుపలికే ప్రయత్నం చేశారు. ఆయన క్షమాపణ చెప్పడాన్ని అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఆయన ఎవరి తరపున క్షమాపణ చెప్తున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పలేదు. ప్రతిపక్షాలు భిధూరీ వ్యాఖ్యలకు నొచ్చుకుని ఉంటే క్షమించండి అని మాత్రమే అన్నారు. ఇదే సంఘటన బీజేపీ సభ్యుల విషయంలో జరిగితే ఎంత రభస జరిగి ఉండేది. డానిష్‌ మీద ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే మిగతా ముస్లిం సభ్యులు ఎందుకు స్పందించలేదు? పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఈ పనిచేస్తే సబబుగా ఉండేది. కానీ ఆయన ఇంతవరకు ఆ పని చేయలేదు. నిజానికి ఇది పార్లమెంటులో జరిగిన సంఘటన కనక సభా నాయకుడు కూడా అయిన ప్రధానమంత్రి మోదీ క్షమాపణ చెప్తే మరింత సముచితంగా ఉంటుంది. కానీ క్షమాపణ చెప్పే అలవాటు మోదీకి ఎప్పుడూలేదు. ఇప్పుడు ఉంటుందనుకోవడం భ్రమ. ఆయనకు ఈ పాటి ఔదార్యం ప్రదర్శించే సంస్కారం హఠాత్తుగా అబ్బుతుందనుకోలేం. హత్రాస్‌, కథువా లాంటి దుర్మార్గాలు జరిగినప్పుడే ఆయన ఉలకలేదు. పలకలేదు.
తనను మతం పేరెత్తి దూషించినందుకు మానసికవ్యథకు గురైన డానిష్‌ అలీ లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అనేంత దాకా వెళ్లారు. ఇది ఆయన తీవ్ర మనోవేదనకు నిదర్శనం కావచ్చు. కానీ రాజీనామా చేయాల్సింది డానిష్‌ అలీ కాదు. భిధూరీ వ్యాఖ్యలను సభా హక్కుల కమిటీకి నివేదించాలని డానిష్‌ అలీ లోకసభ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పాత పార్లమెంటు భవనంలో జరిగిన దుస్సంఘటనలను మరిచిపోవాలని నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సమావేశంలో రాజ్యసభ అధ్యక్షుడు, లోకసభ స్పీకర్‌, కడకు ప్రధానమంత్రి మోదీ కూడా హితవచనాలు పలికారు. నూతన పార్లమెంటు భవనంలో ఇలాంటి ఉదంతాలు జరగడం దురదృష్ట కరమని డానిష్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయించాలని కోరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జై రాం రమేశ్‌ బీజేపీ సభ్యుడి అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిరచారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదన్నారు. ఇది కంటి తుడుపు చర్య అన్నారు. నిజానికి భిధూరీ వ్యాఖ్యలు డానిష్‌ను, పార్లమెంటును మాత్రమే అవమానించడం కాదు. ప్రతి భారతీయుడిని పనిగట్టుకుని అవమానించడమే. ఇకనైనా జరగవలసింది అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డందువల్ల బీజేపీ సభ్యుడు భిధూరీని సభ నుంచి కనీసం సస్పెండ్‌ చేయాలి. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఆయన మీద కఠినమైన క్రమశిక్షణా చర్య తీసుకోవాలి. కానీ అలా ఎన్నటికీ జరగదు. ఎందుకంటే ముస్లింల మీద విద్వేషం వెదజల్లడం ఆ పార్టీ విధానం. అదే ఆ పార్టీ రాజకీయ సిద్ధాంతం. పార్లమెంటు నియమాల ప్రకారం భిధూరీ మీద చర్య తీసుకోవడం ఎలాగూ జరగవలసిందే. కానీ బీజేపీ దుర్నీతి, విధ్వంసకమైన విద్వేషవైఖరి మీద సైద్ధాంతిక స్థాయిలో తీవ్ర పోరాటం జరగాలి. ఇలాంటి సైద్ధాంతికతకు రాజకీయాలలో చోటు లేకుండా చేయగలగాలి. అది సులభమైందీ కాదు. సత్వరం ఫలితం ఉండేదీ కాదు. విద్వేష రాజకీయాలను ఎదిరించడానికి సెక్యులర్‌, ప్రజాస్వామ్య విలువల మీద అపేక్ష ఉన్నవారు సమైక్యంగా దీర్ఘకాల పోరాటం కొనసాగించక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img