Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

పిల్లికి ఎలక సాక్ష్యం

ఎదుటి మనిషిని పొగడడంలోనూ ప్రయోజనాలు ఉంటాయి. ఆ పొగడ్తలను సద్వినియోగం చేసుకోగలిగితే, ఉన్న మంత్రి పదవి నిలబెట్టుకోవడం, లేదా ఉద్యోగ విరమణ తరవాత కూడా ఏదో ఒక పదవిలో కొనసాగవచ్చు. ఆ పదవిని నిలబెట్టుకోవడానికి మళ్లీ పొగిడే లక్షణం కొనసాగించాల్సిందే. అమిత్‌ షా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పొగడడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మోదీ కరుణాకటాక్షాలు ఉంటే తప్ప ఆయన పదవిలో కొనసాగలేరు. కేంద్ర ప్రభుత్వం అంటే మనకు వినిపించేవి రెండు పేర్లే. మొదటిది నరేంద్ర మోదీ. రెండవది కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. కానీ అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ‘‘అంతిమ నిర్ణయం’’ మోదీదే కనక మోదీని పొగడకపోతే అమిత్‌ షా సైతం మనగలగడం కష్టమే. మోదీ గొప్ప ప్రజాస్వామ్య వాది అనీ, ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారని అమిత్‌ షా కితాబిచ్చారు. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడిగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్‌ కుమార్‌ మిశ్రాకు తన అభ్యున్నతికి తోడ్పడిన వారిని పొగిడే సామర్థ్యం అపారంగా ఉంది. అందుకే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను పొగడ్తలలో ముంచెత్తారు. జమ్మూ-కశ్మీర్‌లో, ఈశాన్య ప్రాంతాలలో శాంతి నెలకొల్పడానికి అమిత్‌ షా నిర్విరామంగా కృషి చేశారని అరుణ్‌ కుమార్‌ మిశ్రా నోరారా పొగిడారు. అమిత షా వల్లే జమ్మూ-కశ్మీర్‌లో నూతన శకం అవతరించిందని కూడా ఆయన కొనియాడారు. మోదీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారన్న ఆరోపణలను అమిత్‌ షా కొట్టి పారేశారు. మోదీ అంతటి మానవతా వాది, అభివృద్ధి ఆకాంక్షించే వాడు, ప్రజాస్వామ్య వాది లేడు అని అమిత్‌ షా స్త్రోత్ర పాఠాలు వినిపించారు. మంత్రివర్గ సమావేశాల్లో అందరి అభిప్రాయాలను మోదీ శ్రద్ధగా వింటారనీ అయితే గతంలో లాగా మంత్రివర్గ సమావేశాలలో ఏం జరిగిందో బయటికి పొక్కడం లేదు కనక సకల నిర్ణయాలూ మోదీనే తీసుకుంటారన్న పొరపాటు అభిప్రాయం కలుగుతోందని అమిత్‌ షా అన్నారు. మోదీ ప్రజా జీవితం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనను పొగడి తరిస్తున్నారు. ఇదే సందర్భంలో సన్సద్‌ టీవీకి మోదీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ నిరంకుశుడు అన్న ఆరోపణ నిరాధారమైందని షా కొట్టి పారేశారు. సకల రంగాల్లో దేశం కునారిల్లి పోయిన దశలో మోదీ ప్రధాన మంత్రి అయ్యారని, అంతకు మునుపు ప్రభుత్వ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే కుంభకోణాలు జరిగాయనీ, విధాన నిర్ణయాలు స్తంభించి పోయాయని షా చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు లాంటి నిర్ణయాలను మోదీ మాత్రమే తీసుకోగలరన్నారు. అయితే పెద్ద నోట్ల రద్దువల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం, ప్రజలెదుర్కున్న ఇబ్బందుల గురించి సన్సద్‌ టీవీ వారు అడగలేదు. అమిత్‌ షా చెప్పలేదు. ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో వారికి ఇష్టమైన సమాధానాలు రాబట్టే రీతిలోనే ప్రశ్నలడగడంలో ఆరితేరిన పత్రికా రచయితలకు కొదవలేదు. మనసులో మాట నెలకొకసారి వెళ్లగక్కడంతో సరిపెట్టుకునే మోదీకి ప్రశ్నించే వారికీ అవకాశం ఇవ్వాలన్న ప్రజాస్వామ్య లక్షణం ఎక్కడుంది? అదే ఉంటే ఏడేళ్లుగా పత్రికల వారికి ఎందుకు మొహం చాటేస్తున్నారు. విమర్శిస్తున్న కొద్దీ మోదీ బలపడుతూ ఉంటారు అని కూడా అమిత్‌ షా సెలవిచ్చారు. అసలు షా ఏ రకంగా మోదీకన్నా భిన్నమైన వ్యక్తి గనక! ఒకే రకమైన వ్యక్తిత్వం ఉన్నప్పుడు పరస్పరం నచ్చడంలో ఆశ్చర్యం లేదు. మోదీలో కనిపించే ప్రజాస్వామ్య లక్షణం ఏమైనా ఉంటే ఆయన ఎన్నికలలో గెలిచి ప్రధాని కావడమే. అది ఈ వ్యవస్థ గొప్పదనం. బాలాకోట్‌ వైమానిక దాడులు వద్దని వైమానిక దళాధిపతి అభ్యంతరం వ్యక్తం చేసిన అంశం సహజంగానే వంది మాగధులకు గుర్తు రాదు.
ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు న్యాయమూర్తి అరుణ్‌ కుమార్‌ మిశ్రా అమిత్‌ షాను పొగడడంలో ఆశ్చర్యం ఏముంది! భారత్‌ ఇవాళ అత్యంత పటిష్ఠమైన ప్రజాస్వామ్య దేశం అని కూడా అరుణ్‌ కుమార్‌ మిశ్రా పెద్ద రహస్యం చెప్పినట్టు చెప్పారు. ఇదే సందర్భంలో ఆయన ఏలిన వారి వాదనను పునరుద్ఘాటించారు. భారత్‌లో మానవహక్కులకు భంగం కలుగుతోందని అంతర్జాతీయంగా గగ్గోలు పెట్టడం ఈ రోజుల్లో మామూలు అయిపోయిందని మిశ్రా అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ 28వ వార్షికోత్సవం సందర్భంగా మిశ్రా ఈ అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. భారత్‌లో మత స్వేచ్ఛకు విఘాతం కలుగుతూనే ఉంది అని గత ఏప్రిల్‌లో అంతర్జాతీయ మత స్వేచ్ఛను బేరీజు వేసే అమెరికా సంస్థ చెప్పింది. మత స్వేచ్ఛ ఆందోళనకరంగా ఉన్న దేశాల జాబితాలో మన దేశాన్ని కూడా చేర్చింది. మత మార్పిడుల నిరోధక చట్టాలను కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదించడం అరుణ్‌ మిశ్రా దృష్టిలో మత స్వేచ్ఛకు భంగం కలగడం కాదు కాబోలు. ఈ చట్టాలు భిన్న మతాల వారిమధ్య వివాహాలకు అడ్డు తగులుతాయి. ఇది రాజ్యాంగ హామీలకు విఘాతం అని విజ్ఞుడైన న్యాయమూర్తి మిశ్రాకు ఎందుకు తోచలేదో! 2020 ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో జరిగిన మతకలహాల్లో మరణించిన 53 మందిలో నాలుగింట మూడొంతుల మంది ముస్లింలేనని, ఎక్కువగా ఆస్తులు నష్టపోయింది కూడా వారేనని దిల్లి పోలీసులే న్యాయస్థానానికి సమర్పించిన ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఇది మిశ్రా చెవిన పడలేదేమో! దిల్లీ మతకలహాల తరవాత వాటితో ఏ సంబంధం లేని వారి మీద కేసులు మోపారు. మోదీని విమర్శించే చాలా మంది దేశద్రోహ ఆరోపణనో, యు.ఎ.పి.ఎ. కింద కేసులనో ఎదుర్కుంటున్నారు.
పౌరసత్వం పొందడానికి మతమే ప్రధానమని పౌరసత్వ చట్టం చెప్పడమూ మిశ్రా దృష్టికి రాలేదేమో! అంతర్జాతీయ క్షమా సంస్థ మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడితే ఆ సంస్థ బ్యాంకు ఖాతాలను మూయించారు. కిట్టని వ్యక్తుల మీద, సంస్థల మీద కక్ష తీర్చుకోవడానికి విదేశీ విరాళాల నియంత్రణా చట్టాన్ని మోదీ సర్కారు ఆయుధంగా మార్చింది. 370వ అధికరణం రద్దు చేసిన తరవాత 290 మంది మీద ప్రజా భద్రతా చట్టం కింద కేసులు మోపారు. 2,300 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 50 శాతం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు ఎదుర్కుంటున్న వారే. అరుణ్‌ కుమార్‌ మిశ్రా బీజేపీకి సన్నిహితుడన్న విషయం రహస్యమేమీ కాదు. పిల్లికి ఎలక సాక్ష్యం అన్న సామెత అమిత్‌ షా, అరుణ్‌ కుమార్‌ మిశ్రాకు అతికినట్టు సరిపోతుంది. గుజరాత్‌ మారణకాండ అమిత్‌ షాకు గుర్తుండకపోవడం సహజం. న్యాయమూర్తి అరుణ మిశ్రా కూడా దాన్ని విస్మరించడంలో ఆంతర్యం బహిరంగ రహస్యమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img