Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

పి.ఎఫ్‌.ఐ. నిషేధం సరే కానీ…

ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ అనుకుంటున్న పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పి.ఎఫ్‌.ఐ.)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నీషేధించింది. ఈ సంస్థ రాజకీయాలలో నేరుగా పాల్గొనదు. కానీ ముస్లింల సాధికారికత, అభ్యున్నతి మొదలైన లక్ష్యాల సాధన కోసమే పని చేస్తామని చెప్పుకుంటుంది. ఆచరణలో ఆ సంస్థ ప్రవర్తన ఈ ప్రకటనకు అనుగుణంగా లేదు అన్న అనుమానాలు చాలా రోజులనుంచే ఉన్నాయి. అందువల్ల పి.ఎఫ్‌.ఐ.ని నిషేధిస్తే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆహ్వానించాయి తప్ప విమర్శించలేదు. ఇలా ఆహ్వానించిన పార్టీలలో ముస్లిం లీగ్‌ కూడా ఉండడం ప్రత్యేకంగా గమనించవలసిన అంశం. మజ్లిస్‌-ఎ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ అధినేత, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ పి.ఎఫ్‌.ఐ. తీవ్రవాద కార్యకలాపాలను ఖండిస్తూనే నిషేధాన్ని వ్యతిరేకించారు. వారం రోజుల కిందట దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో పి.ఎఫ్‌.ఐ. కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేట్‌ లాంటి వ్యవస్థలు దాడులు చేశాయి. వారం తిరక్కుండానే రెండో సారి కూడా దాడులు జరిగిన తరవాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సంస్థను నిషేధించింది. రెండువందల కన్నా ఎక్కువ మందిని నిర్బంధించారు. పి.ఎఫ్‌.ఐ.తో సంబంధం ఉన్న లేదా అనుబంధ సంస్థలుగా ఉన్న వాటిని కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) కింద నిషేధించారు. ఈ నిషేధం అయిదేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఈ నెల 22న, 27న దేశవ్యాప్తంగా వివిధ చోట్ల పి.ఎఫ్‌.ఐ. నెలవుల మీద దాడుల తరవాత కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ సంస్థ, దాని అనుబంధ సంఘాలు ‘‘చట్ట వ్యతిరేక’’ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనీ ఇవి ‘‘దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయి’’ అని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సంస్థ కార్యకలాపాలవల్ల దేశంలో మత సామరస్యానికి విఘాతం కలుగుతోందన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. ఈ సంస్థకు బంగ్లాదేశ్‌లోని జమాత్‌-ఉల్‌-ముజాహిదీంతోనూ. ఇరాక్‌, సిరియాలోని ఇస్లామిక్‌ (ఐ.ఎస్‌.ఐ.ఎస్‌.)తోనూ సంబంధాలున్నాయని హోం మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. పి.ఎఫ్‌.ఐ., దాని అనుబంధ సంస్థలు బహిరంగంగా అయితే సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన సంస్థగా వ్యవహరిస్తుంది. కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన, రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకమైన రీతిలో పని చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ నిషేధ ఉత్తర్వులో పేర్కొన్నారు. పి.ఎఫ్‌.ఐ.కి అనుబంధంగా పనిచేసే సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.డి.పి.ఐ.) మాత్రమే నిషేధాన్ని వ్యతిరేకించింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించింది. బీజేపీ విధానాలను బహిరంగంగా విమర్శించే వారి విషయంలో కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఎస్‌.డి.పి.ఐ. జాతీయ అధ్యక్షుడు ఎం.కె. ఫైసీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, బీజేపీ ఇతర నాయకులు సహజంగానే ఈ నిషేధాన్ని ఆహ్వానించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్‌ తమ పార్టీ అన్ని రకాల అంటే మెజారిటీ, మైనారిటీ వర్గాల మతతత్వాన్ని వ్యతిరేకిస్తుందని తెలియజేశారు. పి.ఎఫ్‌.ఐ.ని నిషేధించడం హేతుబద్ధమైందేనని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ శాసనసభ్యుడు ఎం.కె. మునీర్‌ వ్యాఖ్యానించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. కు వ్యతిరేకంగా కూడా సెక్యులర్‌ పద్ధతుల్లో పోరాడవలసిన అవసరం ఉందని ఆయన అంటున్నారు. కర్నాటక కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్య సైతం ‘‘మేం శాంతికి, చట్టానికి భంగం కలిగించే వారిపై చర్య తీసుకోవడాన్ని మేము వ్యతిరేకించబోం’’ అని అన్నారు. అయితే అదే పద్ధతిలో శాంతికి భంగం కలిగిస్తున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. లాంటి వ్యవస్థల మీద కూడా చర్య తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాజకీయ అంగమైన బీజేపీ కనక అలాంటి చర్య గురించి ఊహించనైనా లేం. కానీ గాంధీజీ హత్య తరవాత, ఎమర్జెన్సీ సమయంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను కూడా నిషేధించిన వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.
రాజకీయ హత్యలకు పాల్పడ్డారన్న ఆరొపణలపై గతంలో అనేక సార్లు పి.ఎఫ్‌.ఐ. కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇస్లాం ను అవమానిస్తున్నారన్న ఆరోపణతో ఆ సంస్థ వారు దాడులకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. కేరళలో ఒక కళాశాల అధ్యాపకుడు టి.జె. జోసెఫ్‌ చేయి నరికిన ఉదంతాలూ ఉన్నాయి. పి.ఎఫ్‌.ఐ.ని వ్యవస్థాపకులలో కొందరికి ఇదివరకే నిషేధించిన స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.ఐ.ఎం.ఇ. – సిమి)తో సంబంధాలున్నాయన్న ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. నిజానికి సిమీని నిషేధించిన తరవాతే 2007 లో మరో రూపందాల్చి పి.ఎఫ్‌.ఐ.అవతరించింది. దేశంలో ముస్లింలకు భద్రత లేదు అన్న కారణంతో ఆ వర్గం ప్రజలలో తీవ్రవాద భావాలు జొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగానే ఉన్నాయి. పి.ఎఫ్‌.ఐ. కార్యకర్తలకు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కేరళలోని నేషనల్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌, కర్నాటక ఫోరం ఫర్‌ డిగ్నిటీ, తమిళనాడులోని మనితా నీతి పసరాయ్‌ అనే మూడు సంస్థలు కలిసి సిమీని నిషేధించిన తరవాత 2007లో పి.ఎఫ్‌.ఐ.గా అవతరించాయంటున్నారు. పి.ఎఫ్‌.ఐ. ఎప్పుడూ ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ ముస్లింలలో సామాజిక చైతన్యం పెంచడానికి, మతపరమైన కార్యకలాపాలు ప్రోత్సహించడానికి కృషి చేస్తూ ఉంటుంది. నేరుగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలను రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించవచ్చు. హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయనుకునే విశ్వ హిందూ పరిషత్తు, హిందూ జాగరణ్‌ వేదిక లాంటివి కూడా ప్రత్యక్ష రాజకీయాలతో ప్రమేయం పెట్టుకోవు. కానీ ముస్లింల నుంచి హిందువులకు ముప్పు ఉందని ప్రచారం చేసి హిందువులలో ఒక రకమైన భయ వాతావరణం సృష్టించి హిందువులను సమీకరించి రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా జన సమీకరణకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. మతతత్వం మైనారిటీ మతాలలో ఉండడం కచ్చితంగా ప్రమాదకరమే. కానీ మెజారిటీ మతస్థుల్లో మతతత్వాన్ని పెంచి పోషించడం అంతకన్నా వినాశకరం. మెజారిటీ మతతత్వాన్ని ప్రోత్సహించే బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ఏలుబడిలో విద్వేష ప్రచారం ఎంత ఎక్కువైందో చూస్తూనే ఉన్నాం. మత వ్యవహారాలు వ్యక్తిగతంగా ఉన్నంత కాలం ఎవరూ అభ్యంతర పెట్టవలసిన పని లేదు. కానీ అది మతోన్మాదంగా మారితే, ముఖ్యంగా మెజారిటీ మతం వారిలో ఈ వికృత ధోరణి పెరిగితే కలిగే ముప్పు ఊహకు కూడా అతీతమైంది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తామన్న హుంకరింపులు ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. పి.ఎఫ్‌.ఐ. లాంటి సంస్థల ఆగడాలను నిలవిరించే చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించవలసిన పని లేదు. కానీ విద్వేషం రెచ్చగొడ్తున్న మెజారిటీ మతతత్వ వాదుల చేతిలో అధికారం ఉంటే దానికి నిష్కృతి ఏమిటి అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img