Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

పేచీకోరు గవర్నర్‌

తమిళనాడు ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. శాసనసభ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేయకుండా తాత్సారం చేయడం తమిళనాడు గవర్నర్‌కు అలవాటైపోయింది. ఆ రకంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం విధి నిర్వహణకు అడ్డు తగలడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చట్టసభ ఆమోదించిన బిల్లుల మీద గవర్నర్‌ సంతకం చేయకపోతే అవి చట్టాలు కావు. తమ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద సంతకాలు చేయకుండా అట్టి పెట్టుకుంటున్నందువల్ల ఇబ్బంది ఎదురవుతోందని ఫిర్యాదు చేస్తూ, ఆ బిల్లులను ఆమోదించాల్సిందిగా గవర్నరును ఆదేశించాలని అభ్యర్థిస్తూ ఇటీవలే స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. ఈ కేసు గత పదవ తేదీన సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చింది. అందువల్ల గవర్నర్‌ ఒకేసారి తన దగ్గర దాదాపు మూడేళ్లుగా మూలుగుతున్న బిల్లులతో సహా మొత్తం పది బిల్లులను శాసనసభకు వెనక్కు పంపించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నరుకు భిన్నాభిప్రాయమో, అభ్యంతరాలో లేదా తాను చేయదలచుకున్న సూచనలో ఉండొచ్చు. అలాంటప్పుడు గవర్నర్‌ ఆ బిల్లుల మీద ఎందుకు సంతకం చేయడంలేదో తెలియజేస్తూ వాటిని వెనక్కు పంపొచ్చు. అప్పుడు శాసనసభ వాటిని మళ్లీ పరిశీలించి గవర్నర్‌ చేసిన సూచనలను అంగీకరించనూవచ్చు. లేకపోతే మళ్లీ అవే బిల్లులను అదే రూపంలో ఆమోదించి గవర్నర్‌కు తిరిగి పంపవచ్చు. అప్పుడు గవర్నరుకు ఉన్న మార్గాలు రెండే. మొదటిది ఆ బిల్లుల మీద సంతకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం లేదా ఆ బిల్లుల మీద సంతకం చేయడం తనకు ససేమిరా కుదరదు అనుకున్నప్పుడు రాజీనామా చేసి వెళ్లిపోవడం. అసలు ఈ సమస్యంతా ఎందుకు వస్తోందంటే శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద గవర్నరు సంతకం చేయడానికి నిర్ణీత గడువు ఏమీ లేదు. తమకు నచ్చనప్పుడు బిల్లుల మీద సంతకం చేయకుండా జాప్యం చేస్తూ ఉంటారు. నిరవధికంగా బిల్లులను ఆమోదించకుండా ఉండే హక్కు గవర్నరుకు ఉందని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది కనక తదుపరి విచారణ జరిగే నాటికి ఇంతకాలం తొక్కిపెట్టిన బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి టోకున తిప్పి పంపారు. దీనికి స్టాలిన్‌ ప్రభుత్వం స్పందించిన తీరూ అపూర్వమైందే. శనివారం ఆ బిల్లులన్నింటినీ మళ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నరుకు పంపించింది. ఇప్పుడు గవర్నరుకు ఆ బిల్లుల మీద సంతకం చేయడం తప్ప గత్యంతరం లేదు. రెండోసారి మళ్లీ ఆ బిల్లులను వెనక్కు పంపే అవకాశం లేదు. గవర్నర్‌ బిల్లులు ఆమోదించకపోవడం క్రియా రాహిత్యం, జాప్యం చేయడమని, రాజ్యాంగ నిర్దేశాలను పాటించకపోవడమని ప్రకటించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పెట్టుకున్న అర్జీలో తెలియజేసింది. గత పదవ తేదీన విచారణ జరిగినప్పుడు ఈ అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తెలియజేయాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ఎలా ఉంటుందో కానీ గవర్నర్‌ ఆ బిల్లులను ఆమోదించకుండా ఉండే అవకాశం ఇక ఎంతమాత్రం లేకుండా స్టాలిన్‌ ప్రభుత్వం అవే బిల్లులను అదే రూపంలో మళ్లీ గవర్నరుకు పంపించింది.
గవర్నర్‌ ఇంతకాలం సంతకం చేయకుండా తిప్పి పంపిన బిల్లుల్లో 2020లో, 2023లో ఆమోదించినవి రెండేసి ఉన్నాయి. మరో ఆరు బిల్లులను గత ఏడాదే శాసనసభ ఆమోదించిన తరవాత గవర్నర్‌ సంతకం కోసం పంపించారు. ఈ మూడేళ్ల కాలంలో పంపిన పది బిల్లుల మీద సంతకం ఎందుకు చేయలేదో గవర్నర్‌ చెప్పలేదు. ఆయన అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయడానికి అవకాశం ఉంది. కానీ కారణం లేకుండా తిప్పి పంపడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యే. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల గవర్నర్లు ఏదో ఓ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. వీరందరినీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నియమించిందన్న అంశాన్ని ప్రత్యేకంగా గమనించాలి. స్టాలిన్‌ ప్రభుత్వానికీ, గవర్నరుకు రెండేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంతకుముందు కూడా తమిళనాడుకు ‘నీట్‌’ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని శాసనసభ బిల్లు ఆమోదించి పంపితే గవర్నర్‌ చాలాకాలం తాత్సారం చేశారు. ఆ బిల్లునే మళ్లీ ఆమోదించి పంపితే తప్ప గవర్నర్‌ దానిని రాష్ట్రపతికి పంపలేదు. ప్రతి ఏడాది ఆరంభంలో శాసనసభ సమావేశం జరిగినప్పుడు గవర్నర్‌ ప్రసంగించడం ఆనవాయితీ. అయితే ఆ ప్రసంగం గవర్నర్‌ ఇష్టానుసారం చేయగలిగింది కాదు. ప్రభుత్వం ఆ ప్రసంగ పాఠం తయారు చేసి పంపితే గవర్నర్‌ దాన్ని సభలో చదవాలి. కానీ ఆర్‌ఎన్‌ రవి ఆ ప్రసంగ పాఠంలో ఉన్న అంబేద్కర్‌, పెరియార్‌, కామరాజ్‌, అన్నాదురై, కరుణాధి పేర్లు చదవకుండా దాటేశారు. అయితే ఆయన చదవకుండా వదిలేసిన ప్రసంగం కాకుండా ప్రభుత్వం రూపొందించిన ప్రసంగమే రికార్డులలోకి ఎక్కాలని శాసనసభ తీర్మానం ఆమోదించింది. సాధారణంగా విశ్వవిద్యాలయాలకు గవర్నర్లు చాన్సలర్లుగా ఉంటారు. వైస్‌ చాన్సలర్లను నియమించడానికి గవర్నరుకు ఉన్న అధికారాలకు కత్తెర వేస్తూ చాలా రాష్ట్రాలు చట్టాలు తీసుకొచ్చాయి. గతంలో గుజరాత్‌లో కొంతకాలం ముఖ్యమంత్రినే విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా నియమించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి మోదీ చాన్సలరుగా ఉన్నారు. తమిళనాడులో కూడా ఇలాగే గవర్నరును కాకుండా ముఖ్యమంత్రిని చాన్సలర్‌గా నియమించాలని స్టాలిన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. సహజంగానే ఇది గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మింగుడు పడలేదు. చాన్సలర్‌ హోదాలో విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్లను గవర్నర్‌ నియమించినా ఎవరిని నియమించాలన్న సిఫార్సు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. కొన్ని సందర్భాలలో గవర్నర్లు ఈ విషయంలో పేచీకి దిగారు. ఇప్పుడు ఆర్‌ఎన్‌ రవి చేసిన పనీ అదే. గవర్నర్‌కు కొద్దిపాటి విచక్షణాధికారాలు ఉన్నమాట నిజమే. కానీ చాలా విషయాల్లో రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సు మేరకు నడుచుకోవలసిందే. అలా నడుచుకోకపోవడం అంటే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కించపరచడమే. గవర్నర్ల నడవడికను తప్పు పడుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టే అనేక రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. ఆ అభిప్రాయం వెలువడితే తప్ప కేంద్రం వైఖరేమిటో తెలియదు. ఈ లోగా మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత నియమితులైన చాలామంది గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. రాజ్యాంగాన్ని బాహాటంగా ఉల్లంఘిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలుగా వ్యవహరించడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img