Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

పేర్ల మార్పు పరంపర

పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు వాటిని పరిరక్షించు కోవడానికి తంటాలు పడ్తుంటారు. అవి లేని వారు పేరున్న వారి బుజాల మీదకు ఎక్కి తామూ ప్రసిద్ధులమేనని దబాయి స్తుంటారు. ఈ క్రమంలో భాగంగానే మోదీ సర్కారు అధికారం లోకి వచ్చిన మూడేళ్ల నుంచి వీధుల పేర్లు, నగరాల పేర్లు, రైల్వే జంక్షన్ల పేర్లు మార్చడమే పనిగా పెట్టుకుంది. ఇంతకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలకు వెల్లవేసి తమ పథకాలుగా చెలామణి చేసుకోవడమే కాదు, వాటి పేర్లూ మోదీ హయాంలో సునాయా సంగా మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి నిలయంలోని విశాలమైన మొగల్‌ గార్డెన్‌ పేరు అమృత్‌ ఉద్యాన్‌గా మార్చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము కార్యాలయం ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం 2016 నుంచి పాత పేర్లు తొలగించి కొత్త పేర్లు పెట్టడం ప్రారంభించింది. పేర్లు మార్చడం మోదీ సర్కారుతోనే ప్రారంభం కాని మాట నిజమే అయినా, మోదీ సర్కారు మారుస్తున్న పేర్ల వెనక సంఫ్‌ు పరివార్‌ సిద్ధాంత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతంత్య్రం తరవాత వలసవాద భావజాలానికి చిహ్నంగా ఉన్న పేర్లు కొన్ని మార్చారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ముస్లిం పేర్లను మార్చేస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ ప్రభు త్వాలు ఈ విషయంలో తామూ వెనుకబడి లేము అని నిరూపించే పనిలోపడ్డాయి. ప్రముఖుల పేర్లు వివిధ సంస్థలకు, విశ్వవిద్యాల యాలకు, క్రీడాంగణాలకు, పరిశోధనా కేంద్రాలకు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ ప్రముఖులనుకునే వారు సజీవంగా ఉన్నప్పుడే కొన్ని వ్యవస్థలకు తమ పేర్లే పెట్టుకోవడం ఎంత ఎబ్బెట్టుగా కనిపించినా ఆ సంప్రదాయమూ ఉంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ పేర అనేక వ్యవస్థలు ఉండడం ఒకప్పుడు విమర్శలకు గురైంది. అయితే ఇందులో కొంత సబబూ కనిపిస్తుంది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ పాలన దాదాపు నాలుగు దశాబ్దాలు కొనసాగింది. స్వాతంత్య్ర పోరాటంలో, నవ భారత నిర్మాణంలో నెహ్రూ పాత్రవల్ల ఆయన మరణానంతరం కొన్ని సంస్థలకు ఆయన పేరు పెడ్తే విమర్శలు అంతగా రాలేదు. ఆ తరవాత వివిధ వ్యవస్థలకు రాజీవ్‌ గాంధీ పేరు పెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఈ విమర్శలు ప్రధానంగా ప్రస్తుత ప్రధానమంత్రి మోదీ సైద్ధాంతిక కుదురునుంచే ఎక్కువగా వచ్చాయి. దిల్లీలో రేస్‌కోర్స్‌ రోడ్‌ లోక్‌నాయక్‌ మార్గ్‌ అయిపోయింది. ఔరంగజేబ్‌ రోడ్‌ అబ్దుల్‌కలాం రోడ్‌గా మారింది. డల్హౌసీ రోడ్‌కు దారా షికో పేరు పెట్టారు. దారా షికో ఔరంగజేబ్‌ను వ్యతిరేకించాడు కనక సంఫ్‌ు పరివార్‌ అనుయాయులు అక్కున చేర్చుకోవడంలో వింతేమీ లేదు. తీన్‌మూర్తి చౌక్‌ కాస్తా తీన్‌మూర్తి హైఫా చౌక్‌ అయిపోయింది. హైఫా ఇజ్రాయిల్‌లోని నగరం పేరు. ఇజ్రాయిల్‌ మీద సంఫ్‌ుపరివార్‌ అభిమానం ఈనాటిది కాదు. ఇందులో సంఫ్‌ుపరివార్‌ సిద్ధాంత ఛాయలు కనిపిస్తాయి. గంగానది ఒడ్డున ఉన్న అలహాబాద్‌ పేరు ప్రయాగ్‌ రాజ్‌గా మారింది. అది షాజహాన్‌ నిర్మించిన నగరం. దీనిని యునెస్కో వారసత్వ నగరంగా గుర్తించింది. వచ్చే ఏడాది ఇలాంటి అంశాలపై సమీక్ష జరిగినప్పుడు పేరు మార్చారు కనక వారసత్వ నగరంగా హోదా కొనసాగుతుందో లేదో చూడాలి. ఫైజాబాద్‌ డివిజన్‌ను కాస్తా ఉత్తరప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యగా మార్చేశారు. సకల వ్యవస్థ లకు నెహ్రూ కుటుంబానికి చెందినవారి పేర్లే పెడ్తున్నారన్న విమర్శలు సంఫ్‌ుపరివార్‌ తీవ్రంగా గుప్పించేది. మోదీ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ నాయకుల పేర్లు పెట్టి అదేపని చేస్తున్నారు. అటల్‌ బిహారీ వాజపేయి, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పేర్లు పెట్టిన సందర్భాలనేకం. ఉదాహరణకు మొగల్‌ సరాయ్‌ జంక్షన్‌ పేరును దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చేశారు. కాండ్లా రేవుకూ ఆయన పేరే పెట్టారు. ప్రభుత్వ పథకాలకు చాలా వరకు ప్రధానమంత్రి పథకం అన్న పేర్లే కనిపిస్తాయి. 

కానీ సజీవంగా ఉండగానే తన కీర్తిని శాశ్వతం చేసుకోవాలన్న దుగ్ధకు నరేంద్ర మోదీ కూడా అతీతుడు ఏమీ కాదు. అహ్మదాబాద్‌ లోని మోతేరాలో ఉన్న క్రికెట్‌ స్టేడియంకు తన పేరు పెట్టేసుకున్నారు. ఆ స్టేడియం ఉన్న ప్రాంతం వివిధ క్రీడా సదుపాయాలున్నది. ఆ క్రికెట్‌ స్టేడియం ప్రపంచంలోకెల్లా పెద్దది. ఆ క్రీడా ప్రాంగణాన్ని ఇంతకుముందు సర్దార్‌ వల్లభ భాయి పటేల్‌ పేర పిలిచేవారు. సర్దార్‌ పటేల్‌ అంటే బోలెడు అభిమానాన్ని కురిపించేవారు ఆ పేరును కురచన చేయడానికి ప్రయత్నించడం ఓ వైపరీత్యమే. అహ్మదాబాద్‌ క్రికెట్‌ స్టేడియంకు మరమ్మతులు చేసి రూపురేఖలు మార్చారు. ఈ ప్రతిపాదన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ చేశారు కనక ఆయన పేరుపెట్టడం సబబేనని కొత్తరూపు సంతరించుకున్న స్టేడియంను ప్రారంభించినప్పుడు అప్పటి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ సమర్థించారు. 2017లో బీజేపీకి పూర్వరూపమైన భారతీయ జనసంఫ్‌ు సిద్ధాంతవేత్త దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి వివిధ వ్యవస్థలకు ఆయన పేరు పెట్టడానికి ఉపకరించింది. అన్నిం టికీ నెహ్రూ కుటుంబం వారి పేర్లే పెట్టేశారని తెగ తిట్టిపోసిన బీజేపీ ఇప్పుడు తానూ అదే పనిచేస్తోంది. తమ నాయకుల పేర్లు తగిలిం చేస్తోంది. నెహ్రూ వారసత్వాన్ని రూపుమాపడంలో నిమగ్నమైన బీజేపీ పేర్లు పెట్టే విషయంలో తమ నాయకుల పేర్లు పెట్టి కాంగ్రెస్‌ దారి లోనే పయనిస్తోంది. కాంగ్రెస్‌ ప్రారంభించిన 23 పథకాలకు బీజేపీ తమ వారి పేరు పెట్టేసిందని శశిథరూర్‌ అయిదేళ్ల కిందే లెక్క తేల్చారు. అలీగఢ్‌ కాస్తా హరిగఢ్‌ అయిపోయింది. రాజ్‌పథ్‌ కర్తవ్య పథ్‌¸గా మారింది. మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్దార్‌ పటేల్‌ కీర్తి ప్రతిష్ఠలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన తీరు ఇందులో భాగమే. సుభాష్‌ చంద్రబోస్‌ విషయంలో అలాగే చేయాలను కున్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పేరు కొల్లగొట్టడం అంత సులభం కాలేదు. సుభాష్‌బోస్‌ తాత్వికంగా సోషలిస్టు భావాలున్న వారు. భగత్‌సింగ్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి సంఫ్‌ు పరివార్‌ చేసిన ప్రయత్నమూ విఫలమే అయింది. భగత్‌ సింగ్‌ మార్క్సిజం మీద అభిమానం పెంచుకున్న వాడు. పైగా తాను ఎందుకు నాస్తికుడిన య్యానో చెప్తూ చిరు గ్రంథమే రాశారు. ఏమైతేనేం ఈ పేర్ల మార్పు పరంపర ఇప్పుడప్పుడే ఆగే సూచనే లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img