Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

పౌరులకు చోటు లేని గణతంత్రం

ఉత్సవం జరుపుకునే రోజైనా, స్మరణకు తెచ్చుకునే రోజైనా మన నడవడికను గమనించి పొరపాట్లను, లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించేదే. గణతంత్ర దినోత్సవం కూడా అలాంటిదే. ఇది ఎన్నవ గణతంత్ర దినోత్సవం అని లెక్క వేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు. గణతంత్ర దినోత్సవం పేరిట మనం గడిపి వచ్చిన సంవత్సరాలు మన అడుగులను ఎటువేపు తీసుకెళ్తున్నాయనేదే ప్రధానం. 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశం అయిపోయింది. ఆ రోజు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. కానీ రాజ్యాంగ నిర్ణాయక సభ 1949 జనవరి 26ననే రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆ రోజున ఉత్సవం జరుపుకునే సంప్రదాయం ఎప్పుడూ లేదు. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత 2015 నుంచి నవంబర్‌ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని హుకుం జారీ చేశారు. ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నాం కానీ రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షిస్తున్నామా అంటే కచ్చితంగా అవును అని చెప్పడం దుస్సాహసమే అవుతుంది. రాజ్యాంగ ముసాయిదాను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్‌ ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించారు. ‘‘రాజ్య వ్యవస్థ విధానాలు ఏమిటో, సమాజాన్ని ఎలా వ్యవస్థీ కరించాలో, దాని సామాజిక, ఆర్థిక అంశాలు ఎలా ఉండాలో సమయాన్నిబట్టి, పరిస్థితులనుబట్టి ప్రజలే నిర్ణయించాలి’’ అని అంబేద్కర్‌ చెప్పారు. ఈ సూత్రాలన్నింటినీ రాజ్యాంగం నిర్దేశించలేదనీ అలా చేస్తే అది ప్రజాస్వామ్యాన్నే నాశనం చేస్తుంది అని కూడా అంబేద్కర్‌ హెచ్చరించారు. అంబేద్కర్‌ ప్రజాభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన దృష్టిలో ప్రజాభిప్రాయం అంటే మెజారిటీ ఉన్న వారికి నిర్ణయాధికారం ఉండడం కాదు. అందుకే మైనారిటీల హక్కులను పరిరక్షించడానికి రాజ్యంగంలో అనేక అంశాలను చేర్చారు. రాజ్య వ్యవస్థకు అనేక మార్గదర్శక సూత్రాలు నిర్దేశించారు. రాజ్యాంగానికి రూపకల్పన చేయడంలో మహాత్మా గాంధీకి ఏ ప్రమేయమూ లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చే దాకా ఆయన సజీవంగా కూడా లేరు. కానీ ఆయన సజీవంగా ఉన్నప్పుడే అవసరమైన హెచ్చరిక చేశారు. మరణించడానికి సరిగ్గా రెండు వారాల ముందు ‘‘విశాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే ఏ మంత్రివర్గమైనా అనాలోచిత ప్రజానీకం ప్రశంసలు పొందడానికి ఏ చర్యా తీసుకోలేదు. అనాలోచిత పరిస్థితులు ప్రబలినప్పుడు ఎంత ఉత్తములనుకున్న ప్రజా ప్రతినిధులైనా స్థిర చిత్తంతో ఉండలేరు. తమ అధీనంలోని రాజ్య వ్యవస్థ ధ్వంసం అయిపోవడాన్ని నిరోధించలేరు’’ అన్నారు. మనం సరిగ్గా ఇదే దశలో ఉన్నాం. కేవల ప్రజాస్వామ్యానికి, గణతంత్రానికి స్పష్టమైన తేడా ఉంది. సుదీర్ఘ కాలంపాటు వలస పాలనలో మగ్గి, సామ్రాజ్యవాదం కాడికింద నలిగి 1947 ఆగస్టు 15న స్వతంత్రులమై, ఆ తరవాత మూడేళ్ల పాటు కఠోర శ్రమకోర్చి రాజ్యాంగాన్ని ఖరారు చేసుకుంటే తప్ప మనం గణతంత్రంలోకి అడుగు పెట్టలేదు. గణ తంత్రంలో ప్రజలకే సర్వాధికారాలు ఉంటాయి. సార్వభౌమాధికారం ప్రజలదే. కానీ పార్లమెంటులో మెజారిటీ ఉందని విర్ర వీగే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా అధికారంలోకి వచ్చిన తరవాత సార్వభౌమాధికారం ప్రజలకే ఉంటుందన్న రాజ్యాంగ నిర్దేశాన్ని పక్కన పెట్టి అది తమదేనన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. గణతంత్ర స్ఫూర్తే కాదు మౌలికమైన ప్రజాస్వామ్య సూత్రాలు కూడా ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించాలన్న ఆదేశిక సూత్రాన్ని అమలు చేసే ప్రయత్నం చేయకపోగా అదే ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఉమ్మడి పౌర స్మృతి కోసం వెంపర్లాడుతున్నారు. ఇందులోనూ సమానత్వ భావన లేకపోగా మైనారిటీల విషయంలో వివక్ష ప్రదర్శించడానికి ఉమ్మడి పౌరస్మృతిని ఒక ఆయుధంగా మార్చుకోవాలని తాపత్రయ పడడం కళ్ల ముందు కనిపించే వాస్తవం.
రూపంలో మనది గణతంత్రం కావచ్చు. కానీ సారంలో గణతంత్రంగా మనగలగడానికి వీలు లేకుండా ఆ భావననే నీరసింప చేసే ప్రయత్నాలు దాదాపు గత ఎనిమిదిన్నరేళ్లకు పైగా జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నం అసంకల్పితమైంది కాదు. గణతంత్ర వ్యవస్థలో ప్రజలకు పాత్ర లేకుండా చేయడానికి పార్లమెంటులో తమకున్న మెజారిటీయే సర్వస్వం అన్న అభిప్రాయం రుద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. రూపం రీత్యా గణతంత్రంగా ఉండాలంటే రాజ్యాధినేత అంటే రాష్ట్రపతి ఎన్నికైన వారు కావాలి. ఆ ఎన్నిక విధానం సరైందా లేదా అన్న అంశాన్ని పక్కన పెడ్తే ఆ లాంఛనం అయితే పూర్తి అవుతోంది. విశేషాధికారాలుగల ప్రత్యేక వర్గం ఉండకూడదన్నది గణతంత్రంలో మరో ముఖ్య లక్షణం. ఇదీ మినహాయింపులతో అమలవుతున్నట్టే. ప్రభుత్వ పదవులు అందరికీ అందుబాటులో ఉండాలన్న నియమాన్నీ సూత్ర రీత్యా అయితే అమలు చేస్తున్నాం. ఆచరణలో కాదు. ప్రజలదే సార్వభౌమాధికారం అన్న నియమాన్ని మాత్రం చట్ట సభల్లో మెజారిటీ ఉన్న వారిదే సార్వభౌమాధికారం అనే స్థాయికి దిగజార్చారు. రాజకీయాలు, న్యాయవ్యవస్థ, సమాజం అన్న మూడు అంశాలలోనూ గణతంత్ర సూత్రాలు అమలు అయితేనే అది సంపూర్ణమైన గణతంత్ర దేశం అవుతుంది. నిఖార్సైన గణతంత్రం ఎక్కడా లేకపోవచ్చు. దేని లోపాలు దానికి ఉండొచ్చు. కానీ పనిగట్టుకుని మౌలిక సూత్రాలను, విలువలను ధ్వంసం చేయడం మోదీ హయాంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాజకీయాలలో మనం గణతంత్ర మౌలిక అంశాలను అమలు చేయడం లేదనడానికి ఎన్ని ఉదాహరణలైనా చూపొచ్చు. న్యాయ వ్యవస్థను నిబద్దమైన వ్యవస్థగా మార్చడానికి ఉప రాష్ట్రపతితో పాటు న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. న్యాయ వ్యవస్థపై వారు కొనసాగిస్తున్న దాడి వ్యక్తిగతంగా చేస్తున్నది కాదు. దీనికి మోదీ ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంది. సర్వ సమానత్వంతో కూడిన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాం. రాజరికాలను, సామ్రాజ్య వాదుల పాలనను తొలగించాం కానీ సమానత్వానికి అవకాశం ఉండే సమాజాన్ని నిర్మించలేక పోయాం. రాజకీయాల్లో, సామాజికంగానే కాక ఆఖరికి న్యాయవ్యవస్థలో కూడా ఆనువంశిక ఆధిపత్యం ఉంది అన్న విమర్శలను తప్పించుకోలేని స్థితిలో పడిపోయాం. కార్యనిర్వాహక వర్గం, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పార్లమెంటుతో సహా ఎక్కడా మహిళలకు, మైనారిటీలకు ఉన్న ప్రాధినిధ్యం ఇప్పటికీ నామ మాత్రమే.
పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా వారికి సమానత్వమైతే దక్కడం లేదు. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఉత్పత్తి క్రమంలో భాగస్వాములైనా వారికి ఇప్పటికీ సమాన వేతనాలు లేవు. అంటే కనీసం స్త్రీపురుష సమానత్వమూ అందకుండానే పోయింది. రాజకీయాలు, న్యాయవ్యవస్థ, సామాజిక వ్యవస్థలో సమానత్వం సాధించలేక పోయామంటే ఆ మేరకు మనం గణతంత్ర భావనకు దూరం అయినట్టే. పుట్టుక, కులం, మతం ఆధారంగా కాకుండా యోగ్యత, కృషి ఆధారంగా సంపూర్ణమైన సమానత్వం సాధిస్తేనే మనం గణతంత్ర నియమాలను పాటించినట్టు లెక్క. ఇముడ్చుకున్న విలువలనూ మోదీ సర్కారు ధ్వంసం చేస్తోంది. నిరంతర నిఘా మాత్రమే గణతంత్రంలో భాగమైన సమానత్వాన్ని, స్వేచ్ఛను పరిరక్షించగలుగుతుంది. కానీ వీటికోసం పాటు పడే వారిని మోదీ సర్కారు దేశద్రోహులు, అభివృద్ధి వ్యతిరేకులు, అర్బన్‌ నక్సలైట్ల జాబితాలో చేరుస్తోంది. మనకు ప్రజలున్నారు, ఓటర్లున్నారు. పౌరులు మాత్రం లేరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img