Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ప్రతిపక్షం ఎగరేసిన పత్రికా స్వేచ్ఛ పతాకం

బహిష్కరణలు, నిషేధాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతికూలమైనవి. కానీ మోదీ పరిపాలన మొదలైనప్పటి నుంచి మీడియాలో ఒక బలమైన భాగం ప్రభుత్వ ప్రచార సాధనంగా మారింది. ప్రభుత్వం తన ఘనత చాటుకోవడానికి అధికారిక వ్యవస్థల మీద ఆధారపడవలసిన అవసరమే లేకుండా పోయింది. ఇలాంటి మీడియానే గోదీ మీడియా అంటున్నారు. ఈ మీడియా వికృత చేష్టలను నిలువరించడానికి బహిష్కరణను మించిన మార్గం ‘ఇండియా’ ఐక్య సంఘటనకు కనిపించనందువల్లే 14 మంది ఆంకర్లను బహిష్కరించాలని నిర్ణయించారు. గోదీ మీడియా మీద ఏవగింపు విస్తృతంగానే వ్యక్తమైనప్పటికీ దానికి వ్యతిరేకంగా నేరుగా పొరాడే అవకాశం లేకుండా పోయింది. గోదీ మీడియాకు ప్రాతినిధ్యం వహించే 14 మంది ఆంకర్లను బహిష్కరించాలని గురువారం ప్రతిపక్షాల ‘ఇండియా’’ ఐక్య సంఘటన సమన్వయ సమితి నిర్ణయించింది. ప్రతిపక్షం ఇలాంటి పోరాటంలో ముందు వరసలో ఉండడం బహుశ చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు. నిజానికి 14 మంది టీవీ ఆంకర్ల బహిష్కరణ అనడం కన్నా సహాయ నిరాకరణ అనడమే సముచితంగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఈ 14 మంది ఆంకర్లు నిర్వహించే టీవీ చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. అందువల్ల ఇది సహాయ నిరాకరణే తప్ప బహిష్కరణ అనలేం. అయితే ప్రతిపక్షాలు బహిష్కరిస్తున్నది కొంతమంది ఆంకర్లనే తప్ప ఆ మీడియా సంస్థలను కాదు. యాజమాన్యాలనూ కాదు. యాజమాన్యాల ఆదేశం, ఒత్తిడి, దన్ను లేకుండా ఏ ఆంకర్‌ అయినా స్వతంత్రంగా ప్రభుత్వానికి లొంగిపోయి ప్రవర్తించే అవకాశం ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న. అయినా ప్రతిపక్షం తమ పోరాటాన్ని ఆంకర్లకే పరిమితం చేసింది. సహేతుకమైన కారణాలు ఉండవచ్చు. సాధారణంగా పత్రికలు, ప్రసార సాధనాలు ప్రభుత్వాలను నిలదీయడం సహజం. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత గోదీ మీడియా ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నించకుండా ఆ ప్రశ్నలన్నీ ప్రతిపక్షాలను అడగడం చాలా విచిత్రంగా ఉంది. ఈ వికట పత్రికా రచయితలు కొత్త ఒరవడి ప్రారంభించారు. ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యతను విస్మరించిన గోదీ మీడియా సహజంగానే ప్రజాసమస్యలను పట్టించుకోవడమూ మానేసింది. ఏడాదికి పైగా దిల్లీ పొలిమేరల్లో రైతులు ఉద్యమం చేస్తే గోదీ మీడియా పట్టించుకోనేలేదు. అంతకుముందు జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉద్యమం కొనసాగినా ఈ మీడియా ఎక్కడా కనిపించలేదు. కరోనా మహమ్మారి దేశమంతటినీ అల్లకల్లోలం చేసి, లక్షలాది మంది మృతికి కారణం అయినప్పుడు, కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైనప్పుడూ గోదీ మీడియా జాడే లేదు. పైగా ఇలాంటి అన్ని సందర్భాలలోనూ గోదీ మీడియా ప్రతిపక్షాలను నిలదీసి విలోమ దిశలో ప్రయాణించింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష ‘ఇండియా’ ఐక్య సంఘటన విధిలేక 14 మంది ఆంకర్లను బహిష్కరించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రతిపక్ష నాయకులు, పార్టీలు గోదీ మీడియాలో కనీసం దుష్ట పాత్రల కిందో, ప్రతి నాయకుల లాగో కూడా కనిపించకపోవచ్చు. కానీ ప్రతిపక్షాల మీద గోదీ మీడియా దుమారం మాత్రం ఆగదు. బహిష్కరణకు గురైన ఆంకర్లు ఏకపాత్రాభినయం చేసి వీరంగం వేస్తారు. కానీ ప్రతిపక్షాల నిరసన మాత్రం ప్రజల మనసుల్లోకి ఎక్కుతుంది. అయితే ఖల్‌ నాయకుల పాత్ర పోషిస్తున్నది ఈ 14 మందే కాదు. ఇంకా చాలా మందే ఉన్నారు. ఈ జాబితాను ప్రతిపక్షాలు ముందు ముందు పొడిగిస్తాయేమో చూడాలి. గత తొమ్మిదిన్నరేళ్ల నుంచి మోదీ మీడియాను దూరంగానే ఉంచారు. అప్పుడప్పుడు తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులకో, వార్తసంస్థలకో విడిగా ఇంటర్వ్యూలు ఇచ్చి సొంత ప్రచారం చేసుకున్నారు. కనీసం ఈ గోదీ మీడియాలోని వారిని కూడా మోదీ దరి చేరనివ్వలేదు. ఈ 14 మందిలో ఒక్కరు కూడా మోదీనే కాదు…అమిత్‌ షాను, రాజ్‌నాథ్‌ సింగ్‌ను, జె.పి.నడ్డాను నిలదీసిన సందర్భమే లేదు.
ఏ రోజు పత్రికలు తిరగేసినా సమాజం క్లిష్ట దశలో ఉంది అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇదే అభిప్రాయాన్ని మీడియాకు కూడా వర్తింపచేయవచ్చు. మన దేశంలో అయితే మొట్టమొదటి పత్రిక ‘బెంగాల్‌ గజెట్‌’ నడిపిన అగస్టస్‌ హిక్కీ అష్టకష్టాలు పడ్డాడు. ఆయన భారతీయుడు కాదు. అయినా బ్రిటిష్‌ పాలనలోని దురాగతాల్ని ఎండగట్టాడు. అప్పటి ప్రభుత్వం ఆయనను ఇంగ్లాండుకు వెనక్కు పంపించింది. ఆ తరవాత ఆయన విపరీతమైన దారిద్య్రం అనుభవించి దయనీయ స్థితిలో తనువు చాలించాడు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు పత్రికల మీద సెన్సార్‌షిప్‌ విధించారు. అచ్చేసే ప్రతి ముక్కా సెన్సార్‌ కత్తెరను దాటుకుని రావాల్సి వచ్చేది. ప్రభుత్వానికి నచ్చని వార్తకు ప్రచురణ యోగ్యతే ఉండేది కాదు. ఈ క్రమంలో ఈ నిరంకుశ ధోరణిని ప్రతిఘటించిన పత్రికా యాజమాన్యాలు, పత్రికా రచయితలూ ఉన్నారు. జైలు శిక్షలూ అనుభవించారు. అప్పుడు సెన్సార్‌షిప్‌ ప్రభుత్వం విధించింది. ఇప్పుడు దీనికి విరుద్ధమైన ధోరణి కొనసాగుతోంది. ప్రధాన స్రవంతిలోని పత్రికలు, ముఖ్యంగా ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు-ఇలా సకల వ్యవస్థలు చాలావరకు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నాయి. ప్రభుత్వం విధించిన సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా అప్పుడు పోరాడిన పత్రికా యాజమాన్యాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అసలు పోరాటం అంతా పత్రికా రచయితలే కొనసాగించారు. అందువల్ల వృత్తి ధర్మానికి కట్టుబడాలనుకున్న, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ హక్కు అనుకున్న పత్రికా రచయితలు అనేకమంది తమ ఉద్యోగాలు కూడా వదులుకుని ఎవరికి వారు ఒంటరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే ఇలా పోరాడుతున్న వారు ప్రధానమైన పత్రికలు, ప్రసార సాధనాల్లో మిగల లేదు. ఈ పోరాటం సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కువగా సాగుతోంది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక పత్రికలు ఎప్పుడూ ఉండేవి. ఉంటాయి. కానీ స్వచ్ఛందంగా దాసోహం అనే పత్రికా వ్యవస్థలు మోదీ హయాం కారణంగా పుట్టిన ప్రత్యేక జాతి అనుకోవాలి. గోదీ మీడియా ఆగడాలు రోత పుట్టిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు పత్రికలు సాగించిన పోరాటాన్ని మరుగు పరచడానికి తీవ్ర ప్రయత్నమే జరిగింది. పత్రికాస్వేచ్ఛ అన్న మాటను మోదీ హయాంలో గోదీ మీడియా నవ్వుల పాలు చేసింది. అవసరమైన మేళతాళాలు గోదీ మీడియానే సమకూర్చింది కనక ప్రభుత్వ ప్రచారం సునాయాసంగా కొనసాగింది. అందుకే పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడే పత్రికా రచయితలు, పత్రికా సిబ్బంది సంఘాలు కూడా ఈ విషయాన్ని లేవనెత్తే సందర్భమే రాలేదు. ఈ స్థితిలో ప్రతిపక్షాలు గోదీ మీడియా మీద యుద్ధం ప్రకటించడం చరిత్రాత్మక పరిణామం. ప్రతిపక్షాలలో అతి పెద్దదైన కాంగ్రెస్‌ హయాంలోనే సెన్సార్‌షిప్‌ విధించారు అని దెప్పి పొడుస్తున్న వారూ ఉన్నారు. ఆ మాట నిజమే. ఆ సెన్సార్‌షిప్‌ ప్రభుత్వ వ్యతిరేక గొంతు పెగలకుండా చేసినందువల్లే ఆ తరవాతి ఎన్నికలలో ఘోరపరాజయానికి గురికావలసి వచ్చిందన్న తెలివిడి కాంగ్రెస్‌కు కలగలేదనుకోలేం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img