Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ప్రతిపక్షానికి వీధిలోనూ అడ్డంకే

ప్రతిపక్షం గొంతు నొక్కడానికి మోదీ సర్కారు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడంలేదు. అదానీ లోగుట్టు హిండెన్‌ బర్గ్‌ సంస్థ బయట పెట్టింది. దీనితో దేశంలో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికీ తేరుకుంటున్న ఆనవాళ్లు లేవు. అదానీ సంపద లక్షలాది కోట్లు గాలిలో కలిసి పోయింది. హిండెన్‌ బర్గ్‌ బయట పెట్టిన నివేదిక దురుద్దేశంతో కూడుకున్నదని, నిరాధారమైందనీ ఇది దేశంపైనే దాడి అనేంత దాకా అదానీ వెళ్లాడు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి.) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా మోదీ సర్కారు అంగీకరించలేదు. ప్రతిపక్ష నేతల మీద మాత్రం సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ విరుచుకు పడుతున్నాయి. అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరడానికి బుధవారం 16 ప్రతిపక్ష పార్టీలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కు విన్నవించాలనుకున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 200 మంది నాయకులు పార్లమెంటు నుంచి ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్‌ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు రోడ్డుమీద అడ్డంకులు ఏర్పాటుచేసి ప్రతిపక్ష నాయకులను ముందుకు వెళ్లనివ్వలేదు. అంటే జె.పి.సి. ఏర్పాటు చేయాలని పార్లమెంటులో మొరపెట్టుకున్నా వినే నాథుడు కనిపించలేదు. కనీసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ను కలిసి అదానీ వ్యవహారం నివేదించాలనుకున్నా ప్రభుత్వం అడ్డంకులు కల్పించక మానలేదు. అంటే ప్రతిపక్షం మాట పార్లమెంటులోనూ వినిపించకూడదు, వీధుల్లోనూ చెల్లకూడదు అన్నదే మోదీ సర్కారు లక్ష్యంగాఉంది. 

ప్రతిపక్ష నాయకులు ముందుకు సాగకుండా దిల్లీ పోలీసులు రోడ్డుమీద భారీస్థాయిలో అడ్డంకులు ఏర్పాటుచేశారు. ఉమ్మడిగా వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను నిరోధించడానికి దిల్లీ పోలీసు విభాగం రెండువేలమంది పోలీసులను రంగంలోకి దించింది. దీనితో ప్రతిపక్ష నేతలు తమ సంకల్పాన్ని విరమించవలసి వచ్చింది. ఈ విషయమై ఉమ్మడిగా ఫిర్యాదు చేస్తామని ఈ నాయకులు తెలియజేశారు. ఇది ప్రతిపక్షం గొంతు నొక్కడంలో భాగమే. నోరు మెదిపితే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మోదీ సర్కారు, బీజేపీ నాయకులు ఇతరుల ప్రజాస్వామ్య హక్కులను మాత్రం ఖాతరు చేసే దాఖలాలే లేవు. అయితే కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం), జె.డి.యు, శివసేన ఉద్ద్ధవ్‌ వర్గం, లాలూ నాయకత్వంలోని ఆర్‌.జె.డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని డి.ఎం.కె., జార్ఖండ్‌ ముక్తీ మోర్చా, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఐ.యు.ఎం.ఎల్‌., వి.సి.కె., కేరళ కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని ప్రతిపక్షాల నాయకులు కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ప్రతిపక్షాలతో కలిసి ఏ విషయంపైనైనా అడుగు ముందుకు వేయడానికి మొన్నటి దాకా ముందుకు రాని ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా బుధవారం నాటి ప్రదర్శనలో కలిసి రావడం సానుకూల పరిణామమే అనుకోవాలి. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు సత్యేంద్ర జైన్‌ కొన్ని నెలలుగా జైలులో ఉండడం, ఇటీవల దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను అరెస్టు చేయడం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పనిచేయడానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతిపక్షాల ప్రదర్శనలో చేరలేదు. విచిత్రం ఏమిటంటే శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి.) కూడా ప్రతిపక్షాలతో కనిపించక పోవడం గమనార్హం. తృణమూల్‌ కాంగ్రెస్‌, కె.సి.ఆర్‌. నేతృత్వంలోని భారత రాష్ట్రసమితి లాంటివి ఎటూ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పనిచేయడం లేదు. చాలా ప్రాంతీయ పార్టీలు ఇదే ఒంటెత్తు పోకడ అవలంబిస్తున్నాయి. పేరుకు మాత్రం తాము మోదీ నాయకత్వంలోని బీజేపీకి వ్యతిరేకులం అని ప్రచారం చేసుకుంటాయి. ఉమ్మడి కార్యాచరణ దగ్గరికి వచ్చేసరికి కాళ్లీడుస్తాయి.
అదానీ కుంభకోణం నేపథ్యంలో స్టాక్‌మార్కెట్‌ కుప్పకూలిన అంశంపై సమగ్ర దర్యాప్తు చేయడం కోసం సుప్రీంకోర్టు ఆరుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి మరింత అవగాహన కల్పించడం, నియంత్రణా వ్యవస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలను సూచించడం ఈ కమిటీ బాధ్యత. ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమైనా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఇది చిన్నపాటి సానుకూలాంశం మాత్రమే. అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సెక్యురిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డును (సెబీ)కూడా ఆదేశించింది. నిజానికి సెబీ ఆ పని చేయనందువల్లే అదానీ కుంభకోణానికి అవకాశం వచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను ఉల్లంఘించి స్టాక్‌ మార్కెట్‌ లో ఏవైనా అవతవకలు జరిగాయేమో పరిశీలించే బాధ్యతకూడా సుప్రీంకోర్టు సెబీకి అప్పగించింది. ఈ దర్యాప్తులవల్ల నిర్ణీత కాలంలో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది అని గౌతం అదానీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆహ్వానించారు. ఇటీవలి కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ ప్రతిపక్ష నాయకుల మీద కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తోందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఇది కేవలం ఆరోపణ కాదని జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది.
నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ పూర్తి పక్షపాతదృష్టితో దాడులకు పాల్పడుతోంది. సుప్రీంకోర్టు ఆరుగురితో దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయడంకూడా పరిమితమైన ప్రయోజనాలనే నెరవేరుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌కు మొత్తం పరిస్థితిని వివరించడానికి ప్రతిపక్ష నాయకులు ప్రయత్నించారు. ఆ విభాగం డైరెక్టర్‌ను కలవడానికి అనుమతి కూడా తీసుకున్నారు. కానీ మోదీ సర్కారు ఆ అవకాశం కూడా దక్కనివ్వ లేదు. అదానీ వ్యాపార సామ్రాజ్యం మీద వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడానికి జె.పి.సి. ఏర్పాటు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు ఇప్పటికీ పట్టుబడ్తూనే ఉన్నాయి. జె.పి.సి. ఎవరినీ శిక్షించలేదు కానీ ఎవరినైనా పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు జె.పి.సి. ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనను నిరాకరిస్తూ తన మంకుపట్టు కొనసాగిస్తూనే ఉంది. అదానీని కాపాడడానికి తన చేతిలో ఉన్న సకల ఆయుధాలను మోదీ సర్కారు ఉపయోగిస్తూనే ఉంది. ప్రతిపక్షాల మాట పెడచెవిన పెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విధానాలకు తిలోదకాలిస్తోంది. ఇదే మోదీ మార్కు ప్రజాస్వామ్యం. మచ్చుకైనా ఎదుటి పక్షం వాదనను వినే అలవాటు మోదీ సర్కారుకు లేదు. గతంలో వెలికి వచ్చిన 2జి, కామన్వెల్త్‌, బోఫోర్స్‌, కేతన్‌ పారేఖ్‌, బొగ్గు నిల్వల కేటాయింపు కుంభ కోణాలలో ఇమిడి ఉన్న మొత్తం కన్నా అదానీ కుంభకోణంలో ఇమిడి ఉన్న మొత్తం అనేక రెట్లు ఎక్కువ. అయినా వినిపించుకునే తత్వం మోదీ సర్కారుకు లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img