Friday, December 1, 2023
Friday, December 1, 2023

ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు

లోకసభ ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్ష శిబిరంలో మాత్రం హడావుడి మొదలైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల ఒక సారి ముంబైలో, మరో సారి దిల్లీలో నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ తో సమావేశం కావడంవల్ల బీజేపీ వ్యతిరేక పార్టీలలో చలనం ప్రారంభమైంది. ఇటీవల తమిళనాడులో ఎం.కె. స్టాలిన్‌ నాయకత్వంలోని డి.ఎం.కె., పశ్చిమ బెంగాల్‌ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడం కూడా ప్రతిపక్ష పార్టీల్లో ఆశలు చిగురించాయి. అయితే బీజేపీ రాజకీయాలను వ్యతిరేకిస్తున్న పక్షాలు మళ్లీ ఏకీకృతం కావాలని ప్రయత్నించడానికి 2024 సార్వత్రిక ఎన్నికలు మాత్రమే కారణం కాదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మొదలుకొని డిసెంబర్‌ వరకు ఏడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగవలసి ఉంది. కరోనాను ఎదుర్కోవడంలో మోదీ సర్కారు విఫలమైందన్న విమర్శలైతే ఉన్నాయి కాని అది మోదీ పలుకుబడి తగ్గిందనడానికి నిదర్శనం కాదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ శాసనసభల ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌ లో అక్టోబర్‌ లో, గుజరాత్‌ లో డిసెంబర్‌ లో ఎన్నికలు జరగాలి. ఈ ఏడు రాష్ట్రాలలో గోవా, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఏలుబడి సాగుతోంది. మణిపూర్‌లో స్థానిక పార్టీలు ఏలుతున్నాయి. 2022లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు, 21 రాష్ట్రాలలో రాజ్యసభకు 68 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగాలి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నందువల్ల ఆ మేరకు బీజేపీ సీట్లు తగ్గవచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ మళ్లీ గెలవలేకపోయినా రాజ్యసభలో బీజేపీ స్థానాల మీద ప్రభావం పడక మానదు. జమ్మూ-కశ్మీర్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరగాల్సింది. కానీ అక్కడ రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందువల్ల, శాసనసభ లేకుండా పోయినందువల్ల రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయలేదు. జమ్మూ-కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రప్రతిపత్తి కల్పిస్తారా లేదా, శాసన సభ ఉంటుందా లేదా అనే అంశాన్నిబట్టి ఈ స్థానాలు భర్తీ విషయం తేలుతుంది. కశ్మీర్‌ శాసన సభను పునరుద్ధరించేటట్టయితే వచ్చే ఏడాది మొత్తం ఎనిమిది శాసన సభలకు ఎన్నికలు నిర్వహించవలసిందే.
సత్వర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే వచ్చే ఏడాది ఏడు శాసనసభలకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు, రాజ్యసభలో 68 సీట్లకు ఎన్నికలు జరగనున్నందువల్ల బీజేపీని వ్యతిరేకించే పార్టీలలో ఆశలు చిగురిస్తూ ఉండవచ్చు. ఎన్నికలలో విజయం సాధించడంలో మోదీ దిట్ట అన్న అభిప్రాయానికి గణనీయమైన గండి పడిరది కనక సమైక్యం కావాలన్న ఆలోచన ప్రతిపక్షాలలో వచ్చి ఉంటుంది. దేశవ్యాప్తంగా పటిష్ఠంగా ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటే. కాంగ్రెస్‌ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ అంతః కలహాలు, కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ ప్రభుత్వం నాసిరకంగా లేకపోయినా ఓ మోస్తరుగానే ఉందన్న అభిప్రాయం కాంగ్రెస్‌ విజయం ఖాయం అని చెప్పడానికి అవకాశం లేదు. ఒక్కటి మాత్రం ఖాయం. బీజేపీ ఎట్టి పరిస్థితిలోనూ పంజాబ్‌ లో అధికారంలోకి వచ్చే వీలు లేదు. ఆ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ బలమైన పార్టీ కాదు. అకాలీదళ్‌ తో పొత్తు పెట్టుకున్నందువల్ల కిందటి సారి అధికారంలో భాగస్వామి కాగలిగింది. పైగా ఏడు నెలల నుంచి నిరవధికంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమంపై బీజేపీ వైఖరి పంజాబ్‌లో ఆ పార్టీమీద వ్యతిరేకత పెరగడానికి దోహదం చేసింది. రైతు ఉద్యమ నేపథ్యంలోనే అకాలీ దళ్‌ బీజేపీతో తెగ తెంపులు చేసుకుంది. తాజాగా అకాలీ దళ్‌, బి.ఎస్‌.పి., సి.పి.ఐ., సి.పి.ఐ.(ఎం) కూటమిగా ఏర్పడ్డాయి. బి.ఎస్‌.పి.-అకాలీదళ్‌ మధ్య సఖ్యత అంటే కొన్ని సామాజిక వర్గాలు ఏకమైనట్టే. ఈ సామాజిక వర్గాలు అన్నీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు, స్థానికంగా మాత్రమే బలమున్న పార్టీలు ఏకమైతే బీజేపీ ఆధిపత్యాన్ని సవాలు చేయవచ్చునన్న ఆలోచనను కొట్టి పారేయలేం కానీ ఎంత బలహీన పడినా కాంగ్రెస్‌ భవిష్యత్తు పంథా ఏమిటో తెలియదు. బలహీన పడిన కాంగ్రెస్‌ సహకారం వల్ల ప్రతిపక్షాలకు చేకూరే ప్రయోజనం పరిమితమే. అయితే ప్రతిపక్షాలతో చేరకుండా విడిగా పోటీ చేస్తే గనక ప్రతిపక్షాల అభ్యర్థులను ఓడిరచడానికి కాంగ్రెస్‌ కారణం అవుతుంది. తమిళనాడు, బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీ పరాజయానికి నిర్దిష్ట కారణాలున్నాయి. కాంగ్రెస్‌ లేని మూడవ ఫ్రంట్‌ వల్ల ప్రయోజనం లేదని శరద్‌ పవార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అంటున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ మంచి వ్యూహ కర్తే కావచ్చు. కానీ వ్యూహ రచన మాత్రమే విజయానికి తోడ్పడదు. బలమైన ప్రాంతీయ పార్టీల శక్తి కూడా ఎంత కాదన్నా పరిమితమే. బీజేపీని ఎదిరించడానికి ఎంత పటిష్ఠమైన వ్యూహం రూపొందించినా సంపూర్ణ ప్రతిపక్ష ఐక్యత అత్యవసరం. అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష కూటమిలో చేరడంవల్ల ప్రయోజనం ఉంటుంది. అదే లేకపోతే ప్రతిపక్షాల వ్యూహాలు, ఆకాంక్షలు సత్ఫలితాలనివ్వవు. ఒంటరిగా బీజేపీని ఎదుర్కునే శక్తి కాంగ్రెస్‌ ఎప్పుడో కోల్పోయింది.
కాంగ్రెస్‌ లేని ప్రతిపక్షాల ఐక్యత సైద్ధాంతిక పునాది ఏర్పరచడానికి ఉపకరిస్తుందే తప్ప ఎన్నికల్లో విజయం సాధించి పెట్టలేదు. 2019 ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌కు నికరమైన అధ్యక్షులే లేరు. సోనీయా గాంధీని ఏడాది పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారు. ఆ గడువు పూర్తి అయి చాలా కాలం అయింది. ఇందిరా గాంధీ కుటుంబం నాయకత్వంలోనే నడవాలన్న హ్రస్వ దృష్టి కాంగ్రెస్‌ లో సీనియర్‌ నాయకులను కూడా వీడలేదు. 23 మంది కాంగ్రెస్‌ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసినప్పటికీ ఆచరణలో జరిగిన మార్పేమీ లేదు. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడమో లేదా రాహుల్‌ గాంధీ మళ్లీ బాధ్యత స్వీకరించడమో ఒక్కటే మార్గం. ఎందుకంటే మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నుంచి బలంగా వినిపిస్తున్న స్వరం ఇప్పటికీ రాహుల్‌ది మాత్రమే. సోనీయా నాయకత్వం అలంకారప్రాయంగానే ఉంది. కాంగ్రెస్‌ సొంత గూటిలోనే అనిశ్చితి కొనసాగడం ప్రతిపక్షాలకు మరో ప్రతికూలాంశం. ప్రాంతీయ పార్టీలో చాలా వాటికి నిర్దిష్టమైన సిద్ధాంత ప్రాతిపదిక లేకపోవడం ఇంకో అవాంతరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img