మనదేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎన్నడూ లేనంతగా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్వాతంత్య్ర లక్ష్యాలు గాలికి ఎగిరిపోయాయి. దాదాపు తొమ్మిదేళ్ల పాలనాకాలంలో పేదరికం పెరిగిందేకానీ తరగలేదు. రాష్ట్రాల అనేక హక్కులను నరేంద్రమోదీ ప్రభుత్వం స్వాయత్తం చేసుకుంది. పత్రిక,మీడియా స్వేచ్ఛ హరించుకుపోయి పాలకులకు అణగిమణిగి పనిచేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా కార్పొరేట్ల వశమైంది. మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుండి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మేధావులను, ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టి వేధిస్తున్నారు. న్యాయవ్యవస్థ చాలాసార్లు పాలకులకు అనుకూలంగా పనిచేస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇటీవల సుప్రీంకోర్టును సైతం బెదిరింపు ధోరణితో న్యాయశాఖమంత్రి మాట్లాడు తున్నారు. ప్రతిపక్షాన్ని పూర్తిగా అణగదొక్కి బీజేపీ పాలనను దీర్ఘకాలం కొనసాగించి ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమైన హిందు రాష్ట్రాన్ని సాధించేదిశగా సర్వవ్యవస్థలపై మోదీ ప్రభుత్వం ఆధిపత్యం చెలాయిస్తున్నది. దేశ ఆర్థికవ్యవస్థను కుదేలుపరిచే అనేక నిర్ణయాలు మోదీ ఏకపక్షంగా తీసుకొని అమలు జరిపారు. ఫలితంగా నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. ఈ స్థితిలోనూ ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకివచ్చి 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఇంతకంటే మెరుగైనపాలన అందించాలని అత్యధిక దేశ ప్రజలు కోరుకుంటున్నారు. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షం గణనీయంగా బలహీనడిరది. వామపక్షాల పరిస్థితీఇదే. మోదీపాలన కార్పొరేట్ల పాలనగా మారింది. కార్పొరేట్ దిగ్గజం అదానీ గ్రూపు కుంభకోణం వెలుగుచూసిన నేపధ్యంలో మోదీ ప్రభుత్వం బాగా అప్రతిష్టపాలైంది. మోదీకి అత్యంత సన్నిహితుడి కుంభకోణం మూలంగా ఆయనకు అప్పులిచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ, ఇతర ఆర్థికసంస్థలు వేలాదికోట్ల రూపాయలు నష్టపోయాయి. స్టాక్‌మార్కెట్‌లో అదానీ గ్రూపు షేర్లు కొనుగోలుచేసిన వారంతా లక్షల కోట్లు నష్టపోయారు. అయినప్పటికీ మోదీ మౌనం వహిస్తుండగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు అదానీకి అండగా నిలవడం దారుణం. పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు నిర్వహించి దోషిని నిర్థారించి శిక్షించవలసిన మోదీ ప్రభుత్వం తిరస్కరించింది. అంతర్జాతీయంగా మోదీ ప్రభుత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. అదానీ కుంభకోణం మూలంగా దేశంలో పెట్టుబడులుపెట్టేవారు వెనుకాడుతున్నారన్న వార్తలు వెలువడ్డాయి. మోదీ పాలనాకాలంలో బ్యాంకులకు ఎగవేసిన మొండి రుణబకాయిలు 12లక్షల కోట్ల రూపాయలకుపైగా రద్దుచేసి లక్షలమంది సామాన్య డిపాజిట్ దారులను నష్టపరిచారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ముందుకువచ్చి తక్షణం ప్రతిపక్ష ఐౖక్యతను సాధించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. గతంలో రెండు,మూడుసార్లు మోజారిటీ ప్రతిపక్షాలు సమావేశమై సంప్రదింపులు జరిపినప్పటికీ ఒక సంఘటన ఏర్పడలేదు. తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని ఐక్యంచేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అతి పెద్ద ప్రతిపక్షమైన కాంగ్రెస్ లేకుండా ఇతర ప్రతిపక్షాలు కొన్ని సంఘటనల్లో కలిసివచ్చే అయా పార్టీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని బలమైన పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ మొదట హడావుడి చేసినప్పటికీ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆమె మోదీ పాలనను వ్యతిరేకిస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలక టీఆర్‌ఎస్ పార్టీని జాతీయపార్టీగా మార్చి బీజేపీ పాలనను తీవ్రంగా దుయ్యబడుతున్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దూరమే. మమతాబెనర్జీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కయ్యానికి రెఢీగా ఉంటారు. ఈ స్థితిలో ప్రతిపక్షాల ఐక్యత ఎలాసాధ్యమని సందేహాలు వ్యక్తంచేసే వారున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశాలున్నందున కాంగ్రెస్ తక్షణం ప్రతిపక్షాల ఐక్యతకు ఈనెల 24న జరగనున్న ప్లీనరీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం అవసరం. ఈ సమావేశం ప్రతిపక్షాల ఐక్యతపైన చర్చిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తాజాగా చేసిన జోడోయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం నింపిందని అనేక విశ్లేషణలు వచ్చాయి. రాహుల్ సైతం పరిపక్వత సంతరించుకున్నారని ఆయన ప్రసంగాలు, పత్రికాగోష్టులలో ఇస్తున్న సమాధానాలు తెలియ జేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో ఈ సానుకూలతను ఓట్లుగా మార్చు కొనేశక్తి, స్థోమతులను కాంగ్రెస్ పెంచుకోవాలి. తగిన యంత్రాంగం లేకుండా ఓట్లు రావడం అంత తేలికకాదు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల ఎన్నికలు, ప్రచారయంత్రాంగం చాలా బలమైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగేనాటికి ప్రతిపక్షాలు ఐక్యంగా పనిచేయగలిగితే దేశప్రజల్లో విశ్వాసం నెలకొంటుంది. కాంగ్రెస్‌తోపాటు నితీష్, శరద్‌పవర్ తదితరులు ఈ దిశగా తక్షణం పూనుకోవాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిరక్షణకోసం, స్వాతంత్య్ర లక్షాల సాధనంకోసం ప్రతిపక్షాలు సొంత ప్రయోజనాలకంటే ఐక్యతకు ప్రాధాన్యతనివ్వాలి.