Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ప్రత్యర్థులని సహించని బీజేపీ

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై సీబీఐ దాడి ఎంత మాత్రం ఆశ్చర్యకరమైంది కాదు. తమ అధికారాన్ని ప్రశ్నించే రాజకీయ పార్టీల నేతల మీద నేరుగా దాడి చేయ కుండా ఆ పక్షంలోని రెండవ, మూడవ శ్రేణి నాయకుల మీద సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ను ప్రయోగించడాన్ని మోదీ సర్కారు ఒక కళగా రూపొందించింది. మహారాష్ట్రలో అనిల్‌ దేశ్‌ ముఖ్‌, నవాబ్‌ మాలిక్‌, సంజయ్‌ రౌత్‌, కొన్నాళ్ల కిందట ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సయేంద్ర జైన్‌ మీద కేంద్ర ప్రభుత్వం దాడులు చేయించడంలో ఇదే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ సర్కారు ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులను వేధించింది సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని మాత్రమే. వీరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రోజుల తరబడి ప్రశ్నించింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రుల మీద సీబీఐనో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌నో ప్రయోగిం చిన దాఖలాలే లేవు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిజానికి బీజేపీకి బి టీమ్‌లాంటి పార్టీనే. అనువైనప్పుడు కేజ్రీవాల్‌ హిందుత్వ విధానాలను అనుసరిస్తూనే ఉన్నారు. అయినా దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా మీద సీబీఐ ఎందుకు దాడి చేసిందన్న ప్రశ్నకు సమాధానం వెతకడం అంత కష్టమైన పనేం కాదు. దిల్లీలో వరసగా ముఖ్యమంత్రిగా కొనసాగడంతో పాటు ఇటీవలే కేజ్రీవాల్‌ పార్టీ పంజాబ్‌ లో కూడా అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో గోవా లాంటి రాష్ట్రాలలో పోటీ చేసింది. పెద్దగా ఫలితం లేదన్నది వేరే విషయం. ఆ రాష్ట్రాలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీ నిజానికి బీజేపీకి నష్టం కలిగించలేదు. ఆ పార్టీకి వచ్చిన కొద్ది ఓట్లైనా ప్రతిపక్షాలకు దక్కాల్సినవే. కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఒకటి రెండు రాష్ట్రాలకు పరిమితం చేయ కుండా మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని అనుకుంటున్నారు. వచ్చే నవంబర్‌లో ఎన్నికలు జరగవలసి ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ లోనూ, డిసెం బర్‌లో ఎన్నికలు జరగవలసి ఉన్న గుజరాత్‌లోనూ భారీ స్థాయిలోనే పోటీ చేయాలనుకుంటున్నారు. నిజానికి ఈ రాష్ట్రాల్లో కేజ్రీవాల్‌ పార్టీ పోటీకి దిగడం కాంగ్రెస్‌ ఓట్లను గండి కొట్టడానికే. అయితే తన పలుకుబడి క్రమంగా పెరుగుతూ ఉండడంతో కేజ్రీవాల్‌ ఏకంగా ప్రధానమంత్రి పదవి మీదే కన్నేశారు. తనను సవాలు చేయడానికి ప్రయత్నించే ఏ వ్యక్తినైనా సహించే లక్షణం మోదీకి లేదు. పైగా మోదీ లాగానే కేజ్రీవాల్‌ కూడా వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాదు అన్న పేరుంది. ఆ విషయంలోనూ ప్రత్యర్థిని మోదీ సహించలేరు. అందుకే మద్యం అమ్మకాలకు సంబంధించి దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసో డియా రూపొందించిన విధానంలో అవకతవకలు జరిగాయన్న అభియో గంపై ఆయన మీద సీబీఐ దాడులు చేసింది. సిసోడియా, కేజ్రీవాల్‌ వ్యక్తులుగా వేర్వేరు అయినా వారిని విడదీసి చూడడానికి వీలు లేదు. కానీ నీతిమంతులుగానే కాక పని తీరులో కూడా మనీశ్‌ సిసోడియా ప్రపంచంలోకెల్లా ప్రధమ స్థానంలో ఉన్న విద్యా శాఖ మంత్రి అని న్యూ యార్క్‌ టైమ్స్‌ లాంటి పత్రికలు కీర్తించడాన్నీ మోదీ సహించలేరు. ఆబ్కారీ విధానం ఏ రాష్ట్రంలోనైనా అవినీతికి దూరంగా కడిగిన ముత్యంలా ఉండదు. అవినీతి మకిలి అంటని కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో ఆబ్కారీ శాఖను నిర్వహిస్తున్న మనీశ్‌ సిసోడియా రూపొందించిన ఆబ్కారీ విధానంలోనూ లోపాలు ఉండే ఉంటాయి. అదే సిసోడియా భుజం మీద తుపాకి పెట్టి కేజ్రీవాల్‌ మీద దాడి చేయడానికి మోదీ సర్కారుకు ఉపకరించింది.
గుజరాత్‌లో మద్య నిషేధం ఉంది. అయినా అక్కడ తాగేవాడికి తాగినంత అన్న రీతిలో మద్యం అందుబాటులో ఉంది. అక్కడ అక్రమ మద్యం వ్యాపారం పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. మద్య నిషేధం ఉన్న చోట కల్తీ మద్యం అమ్మకాలు ఊపందుకుంటాయి. ఈ కల్తీ మంద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకునే వారు ఉంటారు. గుజరాత్‌లో కూడా ఇటీవలే 40 మందికి పైగా మరణించారు. జనం ప్రాణాలు కోల్పోయే అంతగా అక్రమ మద్య వ్యాపారం జరుగుతున్న గుజరాత్‌లో మాత్రం ప్రభుత్వంపై ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు. బీజేపీ నాయకుల మీద వచ్చే అవినీతి ఆరోపణలను మోదీ సర్కారు ససేమిరా నమ్మదు. దాడులు చేయదు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదే దాడులు జరుగుతున్నాయి. ఇది ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీసుకోవడం కావొచ్చు. విద్యా శాఖ మంత్రిగా సిసోడియా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఏ నాయకుడిని ఎవరు మెచ్చుకున్నా మోదీ సర్కారుకు ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకినట్టు ఉంటుంది. మంచి పేరు తెచ్చుకున్న వారు కేంద్రం పనుపున జరిగే దాడులకు సిద్ధంగా ఉండల్సిందే. త్వరలో ఎన్నికలు జరగవలసిన హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి నగరాల్లో ఆదరణ ఉంటుందనుకుంటున్నారు. బీజేపీకి ఉన్న పట్టు కూడా పట్టణాలు, నగరాలోనే ఎక్కువ. ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ఈ రెండు రాష్ట్రాలలో తమ అభ్యర్థులను పోటీకి దించడంవల్ల కేజ్రీవాల్‌ పార్టీ కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడానికి బదులు తమ ఓట్లను కూడా చీల్చే ప్రమాదం ఉందని బీజేపీ భయపడుతోంది. అందువల్ల ఆ పార్టీ నాయకులను అపఖ్యాతి పాలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. నిజాయితీ విషయంలో మోదీని సవాలు చేసే మరో నాయకుడిని భరించడం మోదీకి ఎటూ ఇష్టం ఉండదు. బీజేపీలో అవినీతి పరులు మోదీకి కనిపించరు. అవినీతి అంతా ప్రతిపక్షాలకే పరిమితం అవుతుంది. మోదీ లేదా ఆయన సర్కారు ఎవరిని అవినీతిపరులుగా నిర్ణయిస్తుందో వారే పెద్ద అవినీతి పరులు అని నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. 2014 కు ముందు అధికార పక్షం వారి మీద ఆరోపణలు వస్తే ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలయ్యేవి. తూతూ మంత్రంగానైనా దర్యాప్తు జరిగేది. కానీ మోదీ హయాంలో రాఫేల్‌ కుంభకోణం మీద ఎంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా దర్యాప్తు ఊసే లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న వారు, కళంకితులని పేరుపడ్డవారు ప్రతిపక్షంలో ఉంటే వారి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు దిగుతాయి. ఆ నాయకులే బీజేపీలో చేరితే ఆరోపణలు మటుమాయమైపోతాయి. కాంగ్రెస్‌ లో ఉన్నప్పుడు హేమంత్‌ బిశ్వ శర్మ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ముకుల్‌ రాయ్‌ కూడా అదే కోవకు చెందిన వారు. కానీ వారు బీజేపీలో చేరగానే పునీతులై పోయారు. సిసోడియా మీద దాడి అసలు సమస్య కాదు. బీజేపీని ఎదిరించడానికి ఏ రూపంలో ఎవరు ప్రయత్నించినా దాడులకు సిద్ధంగా ఉండాల్సిందేనని మోదీ సర్కారు బాహాటంగానే హెచ్చరిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img