Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ప్రభుత్వానికి సుప్రీం చురకలు

ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ సంస్థ. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను ప్రభుత్వమే నియమిస్తుంది. వీరి నియామకంలో రాజకీయపార్టీలు, ప్రభుత్వం జోక్యం ఉంటుందని అందువల్ల కమిషన్‌ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, స్వతంత్రంగా పనిచేయడంలేదన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 1991 చట్టం ప్రకారం ఆరేళ్లపాటు పనిచేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. తక్కువ పదవీకాలంతో కమిషనర్‌ని నియమించడం వల్ల ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తి ధ్వంసం అవుతుందని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని కూడా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ ధోరణివల్ల ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తాను సంకల్పించిన ఎన్నికల సంస్కరణలు అమలు చేయలేరని ధర్మాసనం తెలిపింది. ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటుచేసిన నాటి నుండి కమిషనర్ల నియామక కాలానికి సంబంధించిన గణాంకాలను ధర్మాసనం ప్రస్తావించింది. జస్టిస్‌ కె.ఎం జోసెఫ్‌ నాయకత్వంలోని ఐదుగురు సభ్యులుగల రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ జోక్యం లేకుండా ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పనిచేయడానికి అవకాశం కల్పించాలని కోరుతూ వచ్చిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషనర్లను ఎంపికచేసి నియమిస్తున్న కాలపరిమితి చాలా తక్కువగా ఉంటోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 నుండి 1996 వరకు కేవలం పదిమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లనే ప్రభుత్వం నియ మించింది. టి.ఎన్‌ శేషన్‌ ఒక్కరే ఆరేళ్లు పనిచేశారు. ఆయన పదవీకాలంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాన్ని గడగడలాడిరచి ఎన్నికల సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎన్నికలను న్యాయబద్దంగా పారదర్శకంగా నిర్వహించడానికి కృషి చేశారు. ఎంతటివారినైనా లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించి మంచిపేరు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత గడచిన 26 ఏళ్ల కాలంలో 15 మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లను ప్రభుత్వాలు నియమించాయి. ధర్మాసనంలో న్యాయమూర్తులు అజయ్‌రస్తోగి, అనురుద్దబోస్‌, హృషికేశ్‌రావ్‌, సి టి రవికుమార్‌ ఉన్నారు. ఎన్నికల కమిషనర్లు పనిచేసిన పదవీకాలం గణాంకాలు విభ్రాంతి గొలిపాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత పూర్తిగా ధ్వంసమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తాను అనుకున్నది ఏనాడూ అమలు జరపలేదు. యూపీఏ ప్రభుత్వకాలంలో గానీ, ఎన్‌డీఏ ప్రభుత్వంలో గానీ పరిస్థితి ఒకేవిధంగా ఉందని ధర్మాసనం చేసిన వ్యాఖ్య నూటికి నూరు శాతం వాస్తవం. 2004`2015 మధ్యకాలంలో ఆరుగురు ఎన్నికల కమిషనర్లను నియమించగా ప్రస్తుత ప్రభుత్వం గత ఏడేళ్లకాలంలో ఎనిమిది మందిని నియమించింది. అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించిన కమిషనర్లు అతి తక్కువకాలం మాత్రమే పనిచేయ గలిగారు. కొన్ని నెలలకాలం మాత్రమే పనిచేసేవారు ఎలాంటి మార్పులు చేయలేరు. పైగా వీరిని నియమించే ప్రభుత్వాలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. మరో కీలకమైన విషయాన్ని కూడా ధర్మాసనం పేర్కొంది. మనకంటే మేలుగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ సహా అనేక దేశాల్లో ఎన్నికల కమిషన్ల వ్యవస్థలున్నాయని ధర్మాసనం చేసిన వ్యాఖ్య మన పాలకులు ఎంత లోపభూయిష్టంగా పనిచేస్తున్నారని అర్థం చేసు కోవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్లలో ఒక్కరిని కూడా ఆరేళ్లు పదవిని నిర్వహించడానికి వీలుగా నియమించకపోవడానికి పాలకుల ఎత్తుగడలు, వ్యూహాలు ఉండవని చెప్పలేము. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే ధోరణి కొనసాగుతున్నప్పటికీ మోదీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల కమిషన్‌ కూడా ప్రధాని కనుసన్నల్లో పనిచేయవలసివచ్చిందన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ కోరడం చాలా సహేతుకంగా ఉంది. ప్రభుత్వానికి నియమించదలచిన అభ్యర్థి పుట్టిన తేదీ తెలుస్తుంది. వారి పదవీ విరమణకాలం తెలుస్తుంది. అలాంటప్పుడు ఆరేళ్లు పనిచేయడానికి అవకాశం గల సీనియర్‌ న్యాయమూర్తులను ఎంపికచేసి నియమించవచ్చు. ఆరేళ్లు పనిచేయడానికి వీలులేని అభ్యర్థులను మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు ఎంచుకుంటున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి ప్రశ్నలకు జవాబులుండవు. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా వ్యవస్థలలో మార్పులు చేయడానికి అంతగా ఆసక్తి చూపవు. ఆర్టికల్‌ 324(2) ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్లను పార్లమెంట్‌ చేసే చట్టానికిలోబడి రాష్ట్రపతి నియమిస్తారు. ఈ చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేశాయా? అని కోర్టు అటార్ని జనరల్‌ ఆర్‌ వెంకటరమణిని ప్రశ్నించింది.
ఎన్నికల కమిషనర్ల నియామకాలలో శాసనవ్యవస్థ చట్టాన్ని అమలుచేసిందా అన్న ప్రశ్నకు బహుశా జవాబు లేదు. ‘‘పార్లమెంట్‌కు రాజ్యాంగం తప్పక నెరవేర్చవలసిన ఒక బాధ్యతను అప్పగించింది. చట్టం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు, అది చేయబోనని ఎంతకాలం వాదిస్తారు’’ అని ప్రశ్నించింది కోర్టు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70ఏళ్లయిన తర్వాత ఈ అంశాన్ని మనం తీసుకున్నామని కోర్టు చెప్పగా ఈ విషయంలో పార్లమెంటు పరిధిలోకి కోర్టు వెళ్లరాదని అటార్ని జనరల్‌ వాదించారు. ‘‘రాజ్యాంగం మౌనంగా’’ ఉండటంవల్ల అన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేశాయి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కమిషనర్ల ఎంపిక పానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలని ధర్మాసనం సూచించింది. కోర్టులు ప్రభుత్వాలకు చురకలు అంటించినా పెద్దగా ఫలితం ఉండదని ఏడుపదులకాలంలో ప్రజలు చూస్తున్న వాస్తవం. ఎన్నికల షెడ్యూలు ప్రకటన, అధికారుల బదిలీలు, ఇష్టం వచ్చినట్లుగా ప్రచారకాలంలో మాట్లాడినా మౌనంగా ఉండే కమిషనర్లు కొనసాగినంతకాలం, తమకు ప్రయోజనకరంగా ఉండే ఎన్నికల కమిషన్‌ ఉన్నప్పుడు పాలకులు మార్పులకు శ్రీకారం చుడతారా?

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img