Monday, December 5, 2022
Monday, December 5, 2022

ప్రియాంక గట్టెక్కించేనా?

చరిత్రలో ఎన్నడు లేనంత బలహీనంగా ఉన్న దశలో కాంగ్రెస్‌ మరో ఆరేడు నెలల్లో ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల శాసన సభలకు జరగవలసి ఉన్న ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకూ సవాలే. అయినా ఉత్తరప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీకి, తమ పార్టీకి జవసత్వాలు అందించాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కూ ఆ రాష్ట్రం కీలకమైందే. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల పరిణామాలు అధికార పక్షానికి, ప్రతిపక్షానికీ చాలా కీలకమైనవి. వచ్చే శాసనసభ ఎన్నికలలో కనక బీజేపీని ఓడిరచగలిగితే 2024 ఎన్నికలలో ప్రతిపక్ష ఐక్యత మీద పెట్టుకున్న ఆశలు కొత్త చిగుళ్లు తొడుగుతాయి. దేశవ్యాప్తంగానే కుదేలైపోయి ఉన్న కాంగ్రెస్‌ పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇప్పటికైతే ఆశావహంగా ఏమీ లేదు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలను ప్రియాంకా గాంధీకి అప్పగించినా ఫలితమేమీ కనిపించడం లేదు. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ సమాజ్‌ వాది పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయినా దక్కింది ఏడు సీట్లే. పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పరిస్థితి అంత బాగున్నట్టు లేదు. ఇటీవల ఆయన దిల్లీ పర్యటనలు కూడా చేశారు. బీజేపీ అధిష్ఠాన ప్రతినిధులు లక్నో వచ్చి చర్చోపచర్చలు జరిపారు. కరోనాను ఎదుర్కోవడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం కన్నా యోగీ సర్కారు వైఫల్యం మరింత తీవ్రంగా ఉంది. శాంతిభద్రతలను పరిరక్షించే పేర యోగీ ప్రభుత్వ దాష్టీకం ప్రజలను భయ కంపితుల్ని చేస్తోంది. అన్ని అభివృద్ధి సూచికల్లోనూ యోగీ నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్‌ దిగదుడుపుగానే ఉంది. కానీ యోగీ బలహీనత వల్ల నేరుగా కాంగ్రెస్‌కు ఉపకరించేదేమీ లేదు. సమాజ్‌ వాది పార్టీ ఈ సారి గట్టిపోటీ ఇవ్వాలనుకుంటోంది. చాలా కాలంగా స్తబ్దుగా కనిపించిన మాయవతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌ పార్టీ కూడా ఒళ్లు విరుచుకుని జూలు విదిలిస్తోంది. భీం ఆర్మీ నాయకుడిగా ప్రసిద్ధుడైన యువ అంబేద్కర్‌ వాది చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావణ్‌ 2020 మార్చిలో ఆజాద్‌ సమాజ్‌ పార్టీ స్థాపించారు. ఇటీవలే రాష్ట్రంలో అనేక చోట్ల సైకిల్‌ యాత్ర కూడా నిర్వహించారు. అయితే ఇంతవరకు ఆయనకు మాయావతితో సఖ్యత ఏర్పడలేదు. ఈ వాస్తవ పరిస్థితిని పరిగణిస్తే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలన్నీ శాసనసభ ఎన్నికల నాటికి ఒక్క తాటిమీదకు వస్తాయన్న నమ్మకం ఎంత మాత్రం లేదు. ప్రతిపక్ష పార్టీలలో కాంగ్రెస్‌ సుదీర్ఘ కాలం ఉత్తరప్రదేశ్‌ను ఏలింది. సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ ఇదివరకు అధికారం చవి చూసినవే. అందువల్ల బీజేపీని సవాలు చేయడానికి ఏయే పార్టీలు ఫ్రంట్‌ కడ్తాయో ఇప్పుడే ఊహించడానికి కూడా అనువుగా లేదు. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు అట్టడుగు స్థాయి నుంచి పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తే తప్ప వచ్చే శాసనసభ ఎన్నికలలో కనీసం పరువు నిలబెట్టుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. ప్రియాంకా గాంధీకి ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలను అప్పగించినంత మాత్రాన ఆమె దగ్గర మంత్రదండం ఏమీ లేదు. 2019 లోకసభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ బాధ్యతను ప్రియాంకకే అప్పగించారు.
విచిత్రం ఏమిటంటే ఇప్పుడూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రియాంకనే నాయకత్వం వహించాలని అంటున్నారు. ఆమెనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కూడా ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులలో ఉత్సాహం నింపడానికి ప్రియాంక ఇటీవల బాగానే కృషి చేస్తున్నారు. వ్యవస్థాపరంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని పాటుపడ్తున్నారు. ఇటీవల ఆమె ఉత్తరప్రదేశ్‌లో పర్యటించడం కార్యకర్తలకు ఆశలు చిగురింప చేసింది. అయితే ఆమె లక్నోలోనే మకాం వేసి ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. దానివల్ల 2022 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగుపడవచ్చుననుకుంటున్నారు. జిల్లా, బ్లాకు, పంచాయతీ స్థాయి దాకా కాంగ్రెస్‌ను పునర్నిర్మించడానికి ఆమె ప్రయత్నించారు. అనేక చోట్ల కిసాన్‌ పంచాయత్‌లు నిర్వహించడం ఆశలకు ఊపిరులూదింది. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌ ఇసుమంతైనా బలం పుంజుకోగలిగింది. బ్లాకు స్థాయి, నగర స్థాయి, జిల్లా కాంగ్రెస్‌ నాయకుల కోసం కాంగ్రెస్‌ వరసగా శిక్షణా శిబిరాలు నిర్వహించింది. ప్రియాంకా గాంధీ వీలైనంత మేరకు ఈ శిక్షణా తరగతులకు హాజరు కావడంవల్ల కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. యోగీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆమె కార్యకర్తలకు ఉద్బోధిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేయడానికి, అభ్యర్థులను ఖరారు చేయడానికి కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామని కూడా ప్రియాంక అంటున్నారు. శిక్షణా కార్యక్రమాలను రూపొం దించడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ లల్లూ, సీనియర్‌ నాయకులు ప్రమోద్‌ తివారీ, పి.ఎల్‌. పునియా నిమగ్నమై ఉన్నారు. కాంగ్రెస్‌కు ఉన్నది ఏడుగురు శాసనసభ్యులైతే అందులో ఇద్దరు అసమ్మతివాదులున్నారు. పాతతరం నాయకులకు, యువతరానికి మధ్య పొంతన తక్కువే ఉంది. యువతరం పార్టీపై పట్టు సంపాదించింది. పార్టీకి దూరంగా ఉన్నవారిని కూడా క్రియాశీలం చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. కరోనా వ్యాపించిన సమయంలో వలస కార్మికులకు సహాయపడడం, ఆక్సిజన్‌ సరఫరా చేయడం వంటి కార్యక్రమాల్లో ప్రియాంక చురుగ్గానే పాల్గొన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలలాంటి వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలు అరెస్టు కావడం కూడా కాంగ్రెస్‌ శ్రేణులను కదిలించింది. సేవాదళ్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇతర అనుబంధ సంఘాలలో మార్పులు చేర్పులు చేశారు. ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ నాయకత్రయంతో సమావేశం కావడం కూడా గమనించదగ్గ పరిణామం. ప్రియాంకా గాంధీ రాజకీయాలలో తన సత్తా చాటుకున్న సందర్భం ఇప్పటికైతే లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఏ మాత్రం మెరుగైన ఫలితాలు సాధించినా ఆమె నాయకత్వ పటిమ వ్యక్తం అవుతుంది. అసలు కాంగ్రెసే అధ్యక్ష స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలని నిర్ణయించుకోలేక పోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరవాత కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి సోనియా తాత్కాలిక అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆమె ఏడాదిపాటే ఆ స్థానంలో ఉంటారని అనుకున్నారు. ఆ గడువు ఎప్పుడో దాటిపోయినా ఎ.ఐ.సి.సి. సమావేశం జరగనే లేదు. కొత్త అధ్యక్షులెవరో తేల్చనే లేదు. ఇందిరా గాంధీ కుటుంబాన్ని దాటి ఆలోచించే సామర్థ్యం కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. అనుభవజ్ఞులైన నాయకులు ఎంతమంది ఉన్నా వారందరూ అనేక కారణాలవల్ల ఇందిరా గాంధీ కుటుంబం వేపే చూస్తుంటారు. మళ్లీ రాహులే పగ్గాలు చేపట్టాలన్న వాదనా వినిపిస్తోంది. ఆచరణలో రాహులే కాంగ్రెస్‌కు ఏకైక ప్రతినిధిగా కనిపిస్తున్నారు. జనాకర్షణలో ప్రియాంక ఓ మెట్టు పైనే ఉన్నా ఆమెకు అగ్రనాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో అయినా ఆమె ఫలితాలు సాధించ గలరేమో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img