Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

బిల్కిస్‌కు న్యాయం జరిగేనా!?

ఇరవై ఏళ్ల కింద గుజరాత్‌ మారణకాండ కొనసాగినప్పుడు సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్‌ బానోకు ఇప్పటికీ ప్రశాంత జీవితం గడిపే అవకాశమే రావడం లేదు. గత ఆగస్టు పదిహేనవ తేదీన దేశానికి స్వాతత్య్రం వచ్చి 75 ఏళ్లు కావడంతో పాటు బిల్కిస్‌ మీద అత్యాచారం చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందికి గుజరాత్‌ ప్రభుత్వం శిక్షాకాలం పూర్తి కాకుండానే స్వేచ్ఛ కల్పించింది. తన మీద అత్యాచారం చేసినవారు బలాదూరుగా తిరుగుతుండడంతో బిల్కిస్‌ బానో బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి ఎదురైంది. 2002లో గుజరాత్‌ మారణకాండ సమయంలో బిల్కిస్‌ బానో కుటుంబంలోని 14 మందిని కిరాతకంగా హత్య చేశారు. అప్పుడు 21 ఏళ్లున్న బిల్కిస్‌ మీద సామూ హిక అత్యాచారం చేశారు. ఆమె ఒడిలో ఉన్న మూడేళ్ల పసిబిడ్డను గోడకేసి బాది హతమార్చిన వారిని శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదలచేస్తే ఇంత ఘోష అనుభవించిన బిల్కిస్‌ మానసిక పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో ఊహించు కోవచ్చు. న్యాయస్థానం దోషులుగా తేల్చిన వారిని స్వాతంత్య్ర దినోత్సవం మిష చూపి విడుదల చేయడంపై దేశమంతా గగ్గోలు మొదలైంది. అనేక మహిళా సంఘాలతో పాటు కనీసం ఆరువేల మంది మహిళలు ఆ 11మంది కిరాతకులనూ మళ్లీ జైలుకు పంపించాలని సుప్రీంకోర్టును కోరారు. అంతకు ముందే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రా, సీపీఎం నాయకురాలు సుభాషిణీ అలీ, చిత్ర దర్శకురాలు, పత్రికా రచయిత్రి రేవతి లౌల్‌, తత్వశాస్త్ర ప్రొఫెసర్‌, సామాజిక కార్యకర్త రూప్‌ రేఖా వర్మ కూడా ఈ కిరాతకుల హత్యను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. అది సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ లోగా బాధితురాలు బిల్కిస్‌ బుధవారం ఆ 11 మంది విడుదలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జైలులో ఆ కిరాతకుల ప్రవర్తన భేషుగ్గా ఉంది కనక వారిని విడుదల చేశామని గుజరాత్‌ ప్రభుత్వం చెప్పుకుంది. నిజానికి 1992 నాటి కాలంచెల్లిన విధానం ప్రకారం గుజరాత్‌ ప్రభుత్వం వారిని విడుదల చేసింది. ఈ పదకొండు మందిలో ఒకరు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 1992 నాటి విధానం ప్రకారం అతనిని విడుదల చేసే అంశం పరిశీలించవచ్చునని చెప్తే గుజరాత్‌ ప్రభుత్వం మొత్తం 11 మందిని విడుదల చేసింది. ఈ కేసును విచారించిన సీబీఐ, ప్రత్యేక జడ్జీ వీరి విడుదలను వ్యతిరేకించినా తమకు అనుకూలమైన 10 మందితో ఓ కమిటీ వేసి ఆ సిఫార్సు ఆధారంగా 11 మందినీ గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది. గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దోషుల విడుదలకోసం సిఫార్సు చేసిన కమిటీలో ఉన్న వారిలో ఎక్కువ మంది బీజేపీ వారే. అందులో చంద్రసింగ్‌ రావుల్జీ ఆరుసార్లు బీజేపీ అభ్యర్థిగా శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీన్నిబట్టి గుజరాత్‌ ప్రభుత్వం బిల్కిస్‌ కు జరిగిన తీరని అన్యాయాన్ని పట్టించుకోకుండా పక్షపాత దృష్టితో దోషులను విడుదల చేసినట్టు స్పష్టం అవుతూనే ఉంది. విషయం అక్కడితో ఆగలేదు. ఆ 11 మంది కిరాతకులు విడుదల అయినప్పుడు సంఫ్‌ు పరివార్‌కు చెందిన వారు వారికి ఘనంగా స్వాగతం పలికి తాము ఎవరి వేపు ఉన్నారో నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. దోషులకు పూలమాలలు వేశారు. వారు బ్రాహ్మణులు కనక సంస్కారవంతులు అని ప్రచారం చేశారు.
ఖైదీలకు సత్ప్రవర్తన కింద జైలు శిక్ష నుంచి రాయితీ ఇచ్చే 1992 నాటి కాలంచెల్లిన విధానం ఆధారంగా కాకుండా 2014 నాటి తాజా విధానం ప్రకారం అయితే వారిని విడుదల చేయడానికి ఆస్కారమే ఉండేది కాదు. కానీ గుజరాత్‌ ప్రభుత్వం ఈ నిబంధనలన్నింటినీ పక్కకు తోసేసి అత్యాచారానికి పాల్పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించింది. 2014 విధానం ప్రకారమైతే అత్యాచారానికి, హత్యకు పాల్పడిన వారికి జైలుశిక్ష పడితే వారు జైలులో ఎంత సత్ప్రవర్తనతో మెలగినా విడుదల చేయడానికి ఆస్కారమే ఉండేది కాదు. అంతే కాకుండా బిల్కిస్‌ మీద అత్యాచారం చేసిన వారి మీద కేసు విచారణ జరిగింది గుజరాత్‌లో కాదు. మహారాష్ట్రలోని కోర్టులో. అప్పుడు నిష్పాక్షికంగా విచారణ జరగడం కోసం సుప్రీంకోర్టే కీలకమైన కొన్ని కేసుల విచారణను మహారాష్ట్రకు బదలాయించింది. ఈ పదకొండు మంది ‘‘బ్రాహ్మణ సత్పురుషులను, సంస్కారవంతులను’’ విడుదల చేసేటప్పుడు మాత్రం కేసు విచారించిన మహారాష్ట్ర కోర్టును సంప్రదించనైనా లేదు. బిల్కిస్‌ బానో బుధవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అంతకు ముందు వీరి విడుదలను గుజరాత్‌ ప్రభుత్వం పరిశీలించవచ్చును అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కూడా కోరారు. దోషుల విడుదల అంశాన్ని గుజరాత్‌ ప్రభుత్వం పరిశీలించవచ్చునని తీర్పు చెప్పింది న్యాయమూర్తి రస్తోగీ నాయకత్వంలోని బెంచి. ఆ తీర్పు రాసింది ఆయనే. ఇప్పుడు ఆయన రాజ్యాంగ వ్యవహారాలు పరిశీలించే బెంచ్‌ సభ్యులుగా ఉన్నారు. బిల్కిస్‌ బానో పెట్టుకున్న పిటిషన్‌ మళ్లీ ఆయన బెంచి ముందుకే వెళ్తే న్యాయం ఎలా ఉంటుందో తెలియదు. బిల్కిస్‌ తరఫు న్యాయవాది శోభా గుప్తా ఈ అంశాన్ని పిటిషన్‌ దాఖలు చేస్తున్న సందర్భంలోనే లేవనెత్తారు.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు న్యాయమూర్తి రస్తోగీ నాయకత్వంలోని బెంచి దోషులను విడుదల చేయాలా వద్దా అన్న అంశాన్ని అసలు కేసు విచారణ జరిగిన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవలసిన అవసరం లేదనీ గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించవచ్చునని చెప్పారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఎలాంటి వైఖరి తీసుకుంటుందో వేచి చూడవలసిందే. బిల్కిస్‌ పై అత్యాచారానికి పాల్పడిన పదకొండు మందిని విడుదల చేసేటప్పుడు కనీస మానవీయ, నైతిక విలువలను కూడా గుజరాత్‌ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంతటి ఘోరమైన అత్యాచారానికి గురైన మహిళ ముస్లిం కాకుండా హిందువు అయి ఉంటే గుజరాత్‌ ప్రభుత్వం దోషులను విడుదల చేసేదా అన్న ప్రశ్న తలెత్తక మానదు. గుజరాత్‌ మారణకాండ జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన మీద ఆ సమయంలో వచ్చిన ఆరోపణలు అన్నీ తేలిపోయి ఉండొచ్చు. కానీ ఇటీవలే గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్‌షా 2022లో తాము ‘‘మత కలహాలకు పాల్పడే వారికి’’ తగిన గుణపాఠం చెప్పామని గొప్పలు చెప్పుకోవడం చూస్తే అప్పుడూ ఇప్పుడూ మోదీ ఎటు వేపు నిలబడ్డారో ఎవరూ విప్పి చెప్పనక్కర్లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img