Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

బీజేపీ కోటలో రాహుల్‌కు ఆదరణ

బీజేపీ కోటలో భారత్‌ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు రాహల్‌గాంధీకి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం బీజేపీ నాయకుడు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ యాత్రకు దక్షిణాది రాష్ట్రాల్లో లభించిన స్పందన కంటే మిక్కిలిగా ప్రజాదరణ లభించింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తోంది. దక్ష్షిణాదిన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రాహుల్‌ జరిపిన యాత్రలో కర్ణాటకలో మంచి స్పందన కనిపించింది. మధ్యప్రదేశ్‌లో అంతకంటే ఎక్కువగా ఆదరణ లభించడం చెప్పుకోదగిన విశేషం. ఈ నెల 27న రాహుల్‌ యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఇండోర్‌లో రాహుల్‌ యాత్రకు కనిపించినంత స్పందన మరెక్కడా కనిపించలేదని భద్రతా దళానికి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారంటే కాంగ్రెస్‌ పట్ల సానుకూలత పెరిగిందని భావించవచ్చు. యాత్రకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో వారిని అదుపుచేయడానికి అదనపు బలగాలను రప్పించవలసి వచ్చిందని సిఆర్‌పీఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. పైగా ఈ ప్రాంతంలో ఎంఎల్‌ఏలు, ఎంపీలంతా బీజేపీకి చెందినవారు కావడం మరింత విశేషం. రాజ్యాంగ నిర్మాత డాక్టరు బిఆర్‌ అంబేద్కర్‌ జన్మించిన మహోవ నుంచి రాష్ట్రంలో యాత్రను ప్రారంభించారు. అంబేద్కర్‌ విగ్రహానికి నమస్కరించి 27 ఉదయమే యాత్రను ప్రారంభించినప్పటికీ రాహుల్‌ నడిచిన ఇండోర్‌ వీధుల్లో జనం ఊహించినదానికంటే ఎక్కువగా చేరి స్వాగతం పలికారు. నగర రోడ్లన్నీ ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయని, ఇందులో భాగస్వాములైన ప్రజలు పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. వీధుల్లో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కనిపించారని, విద్వేషం ఎక్కడా కనిపించలేదని రాహుల్‌ వ్యాఖ్యానించి నగర ప్రజల సానుకూలతను పెంచుకొనేందుకు ప్రయత్నించి వ్యూహాత్మక రాజకీయనాయకుడన్న అభిప్రాయాన్ని కలిగించారు. చరిత్రాత్మక రజ్వాడలో జరిగిన సభలో రాహుల్‌ మాట్లాడుతూ, పార్లమెంటులో రైతుల రుణాలను రద్దు చేయాలని, మూడు రైతుచట్టాలకు వ్యతిరేకంగా పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు మాట్లాడేందుకు అనుమతించ కుండా మైకులు కట్‌చేసిన వైనాన్ని వివరించి బీజేపీపాలనను తూర్పార బట్టి బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎక్కడా బీజేపీ నాయకులను తూలనాడటం కనిపించకపోవడం ప్రత్యేకత. యాత్ర ప్రారంభించిన నాటికి, నేటికీ పరిణితగల రాజకీయ నాయకుడిగా ఎదుగు తున్నాడని విశ్లేషకులు భావించడం సబబేనని అనిపిస్తోంది. దక్షిణాదిన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజల్లో క్రమిశిక్షణ కనిపించిందని, మధ్యప్రదేశ్‌లో జనాన్ని అదుపుచేయలేక అదనంగా సీఆర్‌పీఎఫ్‌ దళాలను పిలిపించామని 25ఏళ్ల అనుభవంగల అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాహుల్‌ యాత్ర విజయ వంతమైందని భావించేందుకు ఇదొక ఉదాహరణ. దక్షిణాది రాష్ట్రాలలో జరిగిన యాత్రకు పూర్తి భిన్నంగా మధ్యప్రదేశ్‌లో జనం స్పందన కనిపించిందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
రాహుల్‌ యాత్రను ప్రారంభించిన నాటి నుంచి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు పెద్దగా పట్టించుకోలేదు. అత్యధిక ప్రింట్‌ మీడియా టెలివిజన్‌ ఛానల్స్‌ బడా కార్పొరేట్లు, బీజేపీ నేత, ప్రధానమంత్రి మోదీ కనుసన్నల్లో పనిచేయడమే ఇందుకు కారణంగా భావించారు. కొన్ని ఛానల్స్‌ మోదీ ప్రభుత్వ ప్రాతినిధ్యం వహించినట్టుగా 24 గంటలూ పనిచేయడం ఎంత మాత్రం ప్రజానుకూలంగా ఉండవలసిన ధర్మాన్ని పాటించడంలేదు. పైగా జర్నలిస్టులపైన అకారణంగా కేసులు నమోదుచేసి జైళ్లలో పెట్టి హింసించడం కూడా రాహుల్‌ యాత్రను పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణమై ఉండవచ్చు. మీడియా సైతం మాఫియా చేతుల్లోకి వెళ్లడం నేటి విషాదం. ఖర్గొనె జిల్లాలో యాత్ర సాగుతుండగా పాకిస్తాన్‌ అనుకూల నినాదాలిస్తున్న మార్ఫింగ్‌ వీడియోను ప్రసారం చేశారని, ఇది బీజేపీ కుట్రపూరిత ఎత్తుగడఅని కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేష్‌ వ్యాఖ్యానించినప్పటికీ, బీజేపీ స్పందించకపోవడం విచిత్రం. ఈ విషయంపై దర్యాప్తు జరిపించాలన్న జైరామ్‌ రమేష్‌ డిమాండుకు ఆ రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులు స్పందించలేదు. బీజేపీ సొంత ప్రచార యాంత్రాంగం ఇలాంటివి సృష్టించి సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే వీటిని బీజేపీ నేతలు, ప్రచార యంత్రాంగం ఏనాడు అంగీకరించదు. పరిపాలనలో చేసిన తప్పిదాలు వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రజలు అనుభవిస్తున్నా మోదీ ప్రభుత్వం అంగీకరించదు.
రాహుల్‌ యాత్ర విజయవంతంగా సాగుతున్న నేపధ్యంలో బీజేపీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కోవిడ్‌`19 మహమ్మారి విజృంభించగా వ్యాధిని అదుపుచేసి ప్రజల ప్రాణాలు రక్షించడంలో చౌహాన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. 2023లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాహుల్‌ యాత్ర విజయవంతం కావడం సహజంగా ఆందోళన కలిగించేదే. డిసెంబరు1న, 5న, రెండు దశల్లో గుజరాత్‌ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు సందేహా స్పదమేనన్న వార్తలు వస్తున్నాయి. పెట్రోలు, డీజిల్‌ రేట్లు, నిత్యావసర వస్తువులు రేట్ల పెరుగుదల, గతంలో ఏనాడులేనంతగా నిరుద్యోగం పెరగడంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సమస్యలన్నీ మధ్యప్రదేశ్‌ లోనూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌లో గ్రూపుల మధ్య ఘర్షణల సంస్కృతి కొనసాగడం, వీటిని పరిష్కరించగల బలమైన నేతలేక పోవడం ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. అనేక తప్పిదాల మూలంగా బలహీన పడిన కాంగ్రెస్‌ పుంజుకొనేందుకు రాహుల్‌ యాత్ర ఎంతో కొంత సహకరిస్తుందని అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img