Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బీజేపీ సొంతింట్లో అసమ్మతి సెగ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలు చివరకు సొంతింట్లోని వారికి కూడా నచ్చడం లేదు. బీజేపీకి అనుబంధంగా ఉన్న భారతీయ కిసాన్‌ సంఫ్‌ు (బి.కె.ఎస్‌)కు చెందిన రైతులు మంగళవారం దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో పంజాబీ భాషే కాదు, తమిళం, మరాఠీ, గుజరాతీ, అస్సామి తదితర స్వరాలూ వినిపించాయి. దాదాపు 550 జిల్లాలకు చెందినవారు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి కిసాన్‌నిధి మొత్తం పెంచాలని, వ్యవసాయ ఉత్పత్తులను జి.ఎస్‌.టి. పరిధి నుంచి తొలగించాలనీ, జన్యు మార్పిడి చేసిన పంటలకు ఇచ్చిన ఆమోదాన్ని ఉపసంహరించాలని బి.కె.ఎస్‌. కోరుతోంది. ఉత్తరప్రదేశ్‌లో స్వేచ్ఛగా సంచరించే పశువులు పంట పొలాలను నాశనంచేస్తున్న సమస్యను పరిష్కరిస్తామన్న మోదీ హామీ సైతం అమలుకాని మిగతా హామీల ఖాతాలో చేరిపోయింది. ఈ సమస్యవల్ల రైతులు తెల్లవార్లూ జాగారంచేసి తమ పంటలకు కాపలా కాయాల్సి వస్తోంది. చెరకుధరలు, జన్యు మార్పిడి చేసిన ఆవాలకు ఇచ్చిన అనుమతి ఉపసంహరించడం, ప్రధానమంత్రి నీటిపారుదల పథకం వైఫల్యం, మార్కెట్లు అందుబాటులో లేకపోవడం, చాలా సందర్భాలలో రైతులబ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం సహాయంకింద అందించే మొత్తం బదిలీ కాకపోవడం మొదలైన సమస్యలను నిరసనకు దిగిన బి.కె.ఎస్‌ ఎత్తి చూపింది. ఇతర రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న రైతుసంఘాలు కూడా సరిగ్గా ఇవే సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాయి. అంటే రైతులందరికీ ఉమ్మడిగా ఉన్న సమస్యలను బి.కె.ఎస్‌ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తోంది. ప్రభుత్వ విధానాలకు తలూపి మిన్నకుంటే ఇబ్బందులు దూరంకావని బీజేపీకి అనుబంధంగా ఉన్న రైతుసంఘం కూడా భావిస్తోంది. ప్రజల ఉమ్మడిసమస్యలను పట్టించుకోవడంలో తాము ఎవరికీ తీసిపోము అని ఈ రైతుసంఘం అంటోందంటే మోదీ ప్రభుత్వవిధానాలు అందరినీ ఒకేరకంగా వేపుకు తింటున్నాయనే అర్థం. అరుణాచల్‌ప్రదేశ్‌లోని రైతులు కమలాఫలాలకు సరైనధర లభించనందువల్ల వాటిని పార బోయవలసి వస్తోంది. ఈ పళ్ల అమ్మకం రైతులకు పెద్ద సమస్యగా తయారైంది. మోదీ ప్రభుత్వం జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ ఫోన్లను అనుసంధానించామని గొప్పలు చెప్పుకుంటున్నా 2019 తరవాత నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బు బదిలీచేసే పద్ధతి కిందికి ఒక్కరైతును కూడా చేర్చలేదు. వాణిజ్యపన్నుల మంత్రిత్వశాఖ రైతులను శత్రువుగా వ్యవహరిస్తోందని నిరసనకు దిగిన రైతులు ఆరోపించారు. రైతులుపంట బాగా పండిరచిన దశలో ఎగుమతులను నిషేధించి రైతుల పొట్ట కొడ్తున్నారు. ఇక రైతుల ఆదాయం రెండిరతలు అయ్యే అవకాశం ఎన్నటికి నేరవేరుతుంది అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాము దాన ధర్మాలకోసం అడగడంలేదని, పంట పండిరచడానికి అయ్యే ఖర్చయినా రాకపోతే తమ గతి ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. బీజేపీకి అనుకూలమైన రైతుసంఘానికి చెందినవారే ఇలా మాట్లాడుతున్నారంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను తు.చ తప్పకుండా అమలుచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెప్పడం కేవలం డోలు వాయించడమేనని తేలిపోతోంది.
జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రధానమంత్రి ఊదరగొడ్తుంటారు. కానీ ఆయన మంత్రివర్గంలోని వ్యవసాయమంత్రిత్వశాఖ మాత్రం జన్యుమార్పిడి చేసిన పంటలకు అనుమతిస్తుంది. కలుపు మొక్కలవల్ల నష్టం కలగకుండా ఈ ఆవాల రకం చూసేది నిజమే కావచ్చు కానీ ఆ పంట కాన్సర్‌కు దారి తీస్తుంది. ఔషధ గుణాలున్న మొక్కలన్నింటినీ నాశనం చేస్తుంది. తేనెటీగలనూ ధ్వంసంచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో బీజేపీ అనుకూల రైతుసంఘానికి చెందిన వారు నిరసనకు దిగడం అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. జన్యు మార్పిడి రకాలు దేశవాళీ విత్తనాల ఆనవాలు లేకుండా చేస్తాయి. అందుకే రైతులు ‘‘విషం వద్దు, సేంద్రీయ పంటలు కావాలి’’ అనిచేసిన నినాదాలు మిన్నంటాయి. కానీ పార్లమెంటులో ఆసీనులైన బీజేపీ ఎంపీల చెవిదాకా ఈ నినాదాలు ప్రతిధ్వనించాయో లేదో తెలియదు. తమఘోష ప్రభుత్వం చెవికెక్కకపోతే దేశం నలు మూలల నుంచి ఇవే నినాదాలు వినిపిస్తాయని బి.కె.ఎస్‌ నాయకుడు ఒకరన్నారు. చాలాకాలం ఓపికపట్టిన తరవాతే బి.కె.ఎస్‌ ఉద్యమబాట పట్టింది. వ్యవసాయ విధానాల విషయంలో బీజేపీకి అనుకూలమైన రైతుసంఘానికి, మోదీ ప్రభుత్వానికి శ్రుతి కలవడం లేదు. బి.కె.ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కారు అంటే ఇంతవరకు చేసిన విజ్ఞప్తులు, పెట్టుకున్న అర్జీలు, అంతర్గతంగా సాగిన చర్చలు ఏమాత్రం ఫలించ లేదనే అనుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఏప్రభుత్వమైనా ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నప్పుడు తమ బాధ వినిపించే హక్కు బీజేపీ అనుబంధంగా ఉన్న సంఘాలూ వినియోగించుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ అనుకూల సంఘాలు కూడా తమహక్కులకోసం పోరాడవలసిన అగత్యం ఉంటుంది. మోదీ ప్రభుత్వం వ్యవసాయ విధానాలను రూపొందించేటప్పుడు బీజేపీకి అనుకూలమైన వివిధ సంఘాలతో చర్చించకపోలేదు. కానీ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే లాబీలు చాలా శక్తిమంతంగా ఉన్నాయి కనకే ప్రభుత్వం వాటికి లొంగిపోయి రైతులకు నష్టంకలిగించే విధానాలు రూపొందించింది. ఇందులో విదేశీశక్తుల, ముఖ్యంగా అమెరికన్‌ గుత్త కంపెనీల ప్రమేయం ఉందని బి.కె.ఎస్‌ గట్టిగా భావిస్తోంది. విదేశీ ఒత్తిడులకు మోదీప్రభుత్వం లొంగిపోకుండా స్వదేశీ రైతులను ప్రోత్సహిస్తే మూడేళ్లలో నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించి చూపిస్తాం అని రైతులు అంటున్నారు. పప్పుల విషయంలో మనం స్వయంసమృద్ధి సాధించ గలిగాం. కానీ మోదీ ప్రభుత్వం విదేశీ గుత్త కంపెనీలకు ఇచ్చిన విలువ మన రైతులకు ఇవ్వదు. వ్యవసాయరంగానికి ఇస్తున్న రాయితీలు రైతులకు కాకుండా కంపెనీలకు అందుతున్నాయి. పంటరుణాల మాఫీ రైతులకు ప్రయోజనం కలిగించకపోగా బ్యాంకులకే లాభించింది. కేంద్ర ప్రభుత్వం ఎకరాకు ఆరువేల చొప్పున రైతులకు అందిస్తున్నా, ఆమొత్తం నిర్ణయించినప్పటి ధరలు ఇప్పుడు లేవు. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇతర వస్తువుల, వ్యవసాయ పెట్టుబడుల ఖర్చులు పెరిగిపోతూ ఉంటే రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు ఎలాఅవుతుందో సమాధానంచెప్పే నాధుడే లేడు. బీజేపీ పెరట్లోని వివిధసంఘాలే ప్రభుత్వ విధానాలను సహించనిస్థితిలో మోదీ ప్రభుత్వం ఉంది. ఎంత సమర్థకులైనా బాధను ఎల్లకాలం దిగమింగుకోవడం సాధ్యంకావడం లేదని బి.కె.ఎస్‌ దిల్లీ నిరసన నిరూపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img