ఎవరైనా బెయిలుకోసం న్యాయస్థానాన్ని అర్థిస్తే న్యాయమూర్తులు న్యాయసూత్రాలను దృష్టిలో ఉంచుకుని విచక్షణాధికారాన్ని వినియోగించి బెయిల్ మంజూరు చేయాలో లేదో నిర్ణయించాలి అన్నది సువ్యవస్థితమైన న్యాయసూత్రం. అదే సమయంలో నిందుతుడిపై మోపిన ఆరోపణల తీవ్రతను, ప్రాసిక్యూషన్ (ప్రభుత్వ పక్షం) విచారణ కొనసాగిస్తున్న తీరును కూడా న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవాలి. నియమాలు, నిబంధనల మాట ఎలా ఉన్నా బెయిలు మంజూరు చేయాలో వద్దో నిర్ణయించుకోవడంలో న్యాయమూర్తులకు విచక్షణాధికారాన్ని ఉపయోగించే అవకాశమూ ఉంది. విచక్షణాధికారం వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడిరదని చెప్పక్కర్లేదు. న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా సంపూర్ణంగా న్యాయబద్ధంగా, చట్టానికి, తర్కానికి కట్టుబడి ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు. తమకు కిట్టని వారిని న్యాయస్థానాల తీర్పుతో నిమిత్తంలేకుండా కేవలం ఆరోపణల ఆధారంగానే సుదీర్ఘ కాలం జైలులో ఉంచడానికి అనువైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) లాంటివి ఉన్నాయి. డబ్బు అక్రమ చెలామణి నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.ఎ.) కూడా ఈ జాబితాలోకే వస్తుంది. పాలకవర్గాలు తమ ప్రత్యర్థులను వేధించ డానికి ఇలాంటి చట్టాలను బలాదూరుగా ఉపయోగించుకుంటాయి. ఉమర్ ఖాలిద్ లాంటి వారు యు.ఎ.పి.ఎ. చట్టం కింద ఏళ్ల తరబడి బెయిలు కూడా రాకుండా జైలులో మగ్గుతూ ఉంటే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లాంటి వారు పి.ఎం.ఎల్.ఎ. కింద అదే రీతిలో నెలల తరబడి జైలు గోడల వెనకే ఉండిపోయారు. బీమా కోరేగావ్ కేసులో అయిదేళ్ల నుంచి జైలులో ఉన్నవారున్నారు. బెయిలుహక్కు, తప్పనిసరి అయినప్పుడే జైలు అని అత్యున్నత న్యాయస్థానం ఎన్ని సార్లు చెప్పినా అత్యున్నత న్యాయస్థానం తాను చెప్పిన సూత్రాన్ని తానే విస్మరిస్తోంది. విచారణకు ముందే దీర్ఘ కాలం జైలులో ఉంచడం సహజ న్యాయసూత్రాలకే విరుద్ధం. విచారణ జరగకుండానే, కొన్ని సందర్భాలలో సమగ్రమైన చార్జ్‌షీట్ దాఖలు కానందువల్ల నెలలు, ఏళ్ల తరబడి జైలులో మగ్గిపోవాల్సి వస్తోంది. నిందితుడు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటాడేమోనన్న అనుమానం ఉన్నప్పుడో, లేదా ఆ నిందితుడు స్వేచ్ఛగా తిరిగితే సమాజానికి అపకారం జరుగుతుందని భావించినప్పుడో తప్ప బెయిలు నిరాకరించనవసరం లేదని మన న్యాయస్థానాలు అనేక సార్లు చెప్పాయి. కానీ ఆచరణలో అవే న్యాయస్థానాలు తాము నిర్దేశించిన సూత్రాలనే విస్మరిస్తున్నాయి. ఈ విస్మరణ న్యాయసూత్రాలను పరిగణించకపోవడంవల్ల కావొచ్చు. లేదా అధికారంలో ఉన్న వారి ఆంతర్యానికి అనుగుణంగా మెలగితే పోలేదా అనుకునే న్యాయమూర్తులు ఉన్నందువల్లా అయి ఉండొచ్చు. ముఖ్యంగా కింది కోర్టులు బెయిలు మంజూరు చేయడానికి జంకుతున్నట్టు కనిపిస్తోంది. అలాంటి స్థితిలో కింది కోర్టుల దగ్గర్నుంచి మొదలు పెట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కవలసి వస్తోంది. ఏ సందర్భాలలో బెయిలు మంజూరు చేయవచ్చునన్న అంశంలో విధి విధానాలు, నిర్దేశాలు సవివరంగా ఉన్నప్పుడు వాటిని లెక్కలోకి తీసుకోక పోవడంవల్లే నిందితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వస్తోంది. ఇది అనేక రకాలుగా వృథా ప్రయాసగా మిగిలిపోతోంది. బెయిలు మీద నిందితుడు విడుదలైతే తన కేసులో తనను తాను సమర్థించుకోవడానికి తగిన అవకాశం దక్కుతుంది. ఇది నిజానికి ఎంతటి నిందితుడికైనా ఉన్న, లేదా ఉండవలసిన హక్కు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను గత ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. బెయిలుకోసం ఆయన ఎక్కని కోర్టు మెట్లు లేవు. కానీ అన్ని చోట్లా చుక్కెదురే అవ్తుతోంది. గత 30వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్.వి.ఎన్. భట్టితో కూడిన బెంచి సిసోడియాకు బెయిలు మంజూర్ చేయడానికి నిరాకరించడానికి చెప్పిన కారణం వింతగా ఉంది. ఆరు నుంచి ఎనిమిది నెలలలోగా ఈ కేసులో విచారణ పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందువల్ల ఆయనకు బెయిలు మంజూరు చేయలేదట. అంటే ఆ దర్యాప్తు పూర్తయ్యే దాకా సిసోడియాకు ఆరు నుంచి ఎనిమిదినెలల వరకు బెయిలు మంజూరు అయ్యే అవకాశం లేదనేగా! న్యాయమూర్తులు ఇలాంటి వైఖరి అనుసరించడం ఆశ్చర్యకరం. ఒకవేళ విచారణలో జాప్యం అవుతోందని వచ్చే మూడు నెలల కాలంలో భావిస్తే మళ్లీ బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని కూడా న్యాయమూర్తులు సెలవిచ్చారు. త్వరగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించే అధికారం ఉన్న న్యాయాధీశులే విచారణ జాప్యం అయితే అని మాట్లాడడం వింతే. కొందరు రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు కొత్త కాదు. కొందరు నాయకుల మీద క్రిమినల్ కేసులూ ఉన్నాయి. రాజకీయ కక్ష సాధించడంకోసం కూడా అధికారంలో ఉన్న వారు కేసులు మోపవచ్చు. కాని కొన్ని కేసుల్లో నిజమూ ఉండొచ్చు. అవినీతి, డబ్బు అక్రమణ చెలామణి కేసుల్లో నిందితులైన వారు కేసులు, విచారణలాంటి వాటి బాధ ఓర్వలేక అధికార పార్టీలో చేరిపోతున్నారు. అంతటితో వారి మీద విచారణకు తెరపడ్తోంది. అలాంటి స్థితిలో ఒకప్పుడు దాఖలు చేసిన కేసు అమాంతం ఎందుకు తెరమరుగైందో ప్రశ్నించకుండా న్యాయవ్యవస్థ మౌనంగా ఉండడం ఏ రకంగా న్యాయమో అంతు పట్టదు. తమ ముందుకు ప్రస్తావనకు వచ్చిన అంశాలకు పరిమితమై న్యాయస్థానాలు పని చేస్తాయన్నది నిజమే. కానీ సామాన్యుడు కూడా అధికార పక్షం దాష్టీకాన్ని, చట్టాల దుర్వినియోగాన్ని, కక్ష సాధింపు ధోరణిని అర్థం చేసుకుంటున్నప్పుడు న్యాయస్థానాలు ఇవి తమ ముందుకు రాలేదని నిశ్చింతగా ఉండేంత దడి కట్టుకు కూర్చున్నాయా అన్నది అసలు ప్రశ్న. ఏ చట్టాన్ని ఉల్లంఘించడమైనా నేరమే. అనుమానం లేదు. కానీ చట్టాలకు సృజనాత్మక భాష్యం చెప్పే అవకాశం న్యాయవ్యవస్థకు ఉందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. క్రియాశీలమైన న్యాయవ్యవస్థ ఇలాంటి సందర్భాలలో కూడా చట్టాలకు సృజనాత్మకంగా భాష్యం చెప్తుంది. ఉమర్ ఖాలిద్, మనీశ్ సిసోడియా, సంజయ్‌సింగ్ మొదలైన వారికి బెయిలు మంజూరు విషయంలో న్యాయమూర్తులు ఈ క్రియాశీల తత్వాన్ని, సృజనాత్మక వింగడిరపును అనుసరిస్తున్నట్టు లేదు. అదే సమయంలో శరీరంలో 90శాతం సహకరించని డా.సాయి బాబాను విడుదల చేయకపోవడం న్యాయస్థానాల మానవీయ దృక్పథా రాహిత్యానికి నిదర్శనం. డా.బినాయక్ సేన్‌కు ఇచ్చిన సదుపాయం సాయిబాబాకు ఎందుకు వర్తించదో! చట్టాలను రూళ్ల కర్రలా భావించినందువల్లే బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన స్టాన్ స్వామి పోలీసు నిర్బంధంలోనే ప్రాణాలు వదిలారు. ఈ విషాదాన్ని న్యాయవ్యవస్థ ఏ రకంగా సమర్థించు కోగలుగుతుందో! నియమోల్లంఘనను నివారించడం న్యాయవ్యవస్థ బాధ్యత అయినట్టే ప్రభుత్వంతో సహా ఎవరు నియమోల్లంఘనకు పాల్పడ్డా అడ్డుకట్ట వేయడంలో న్యాయవ్యవస్థ బాధ్యత మరింత ఎక్కువే. ప్రభుత్వం చట్టాలను దుర్వినియోగం చేస్తే వినాశనమే జరుగుతుంది. బెయిలు హక్కు అయినప్పుడు విపరీత పరిస్థితులు ఉన్నప్పుడు మినహా బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించడం అన్యాయం. ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకోవలసిన బాధ్యత న్యాయవ్యవస్థకు లేదు. న్యాయాన్యాయ విచక్షణే ఆ వ్యవస్థ కర్తవ్యం.