Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

బ్రిటన్‌ రాజకీయ సంక్షోభం

బ్రిటన్‌ టోరీలకు కుంభకోణాలు కొత్తేమీ కాదు. కాకపోతే, వివాదాల సుడి నుంచి తప్పించుకోలేక ఏ కొద్దిమందో తమ పద వుల నుంచి తప్పుకుంటూ వుంటారు. తాజాగా మరో వివాదాస్పద ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గడిచిన పాతికేళ్లలో ఇద్దరు లేబర్‌ పార్టీ ప్రధానులు దిగ్విజయంగా పనిచేసిన తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి ముగ్గురు ప్రధానులను మార్చు కున్నది. ఈసారి మాత్రం బోరిస్‌ జాన్సన్‌ తమ కన్జర్వేటివ్‌ పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడిని తట్టు కోలేకనే రాజీనామా చేశారన్నది జగద్విదితం. చివరకు పార్టీ అధి నేత పదవి నుంచి తప్పుకునేందుకు కూడా ఆయన అంగీకరించాల్సిన అని వార్య పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగడం ఒక్కటే ఈ సమయంలో ఆయనకు ఊరటనిచ్చే అంశం.
బోరిస్‌ జాన్సన్‌ ఒక నాయకునిగా ఘోరంగా విఫలమయ్యా రన్నది ప్రధాన ఆరోపణ. ఆయన నాయకత్వంపై తోటి మంత్రులు, అధికారులు విశ్వాసం కోల్పోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నది వాస్తవం. బోరిస్‌ మంత్రివర్గం మూడు రోజుల వ్యవధిలో తీవ్రమైన కుదుపునకు గురైంది. ముందుగా బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయా లని డిమాండ్‌ చేస్తూ రెండు రోజుల క్రితం ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే మరో 15 మంది మంత్రులు తమ పదవులను వీడారు. బోరిస్‌ రాజీనామా చేయడానికి కొద్ది నిమిషాల ముందు వరకు ఏకంగా 40 మంది మంత్రులు తమ పదవుల నుంచి దిగిపోయారు. విచిత్రమేమిటంటే, బోరిస్‌ ఏరికోరి ఆర్థికమంత్రిగా నియమించుకున్న ఇరాక్‌ జాతీయుడైన నదీమ్‌ జహావీ సైతం బోరిస్‌కు వ్యతిరేకంగా గొంతువిప్పారు. ‘మీ ముందున్న సరైన కర్తవ్యం రాజీనామానే’ అని నదీమ్‌ చేసిన వ్యాఖ్య బహుశా బోరిస్‌ను మానసికంగా తీవ్రంగా బాధించి ఉండి వుండవచ్చు. చేసేదిలేక ఎంతో కష్టంగానైనా, రాజీనామా పత్రాన్ని రాసిన క్షణాన బోరిస్‌ కంట్లో తడిని చూసినట్లు సన్నిహితవర్గాలు చెపుతున్నాయని ఒక వార్తాసంస్థ ఉటంకించింది.
బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రిగా 2019 జులై 24వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఉక్స్‌బ్రిడ్స్‌`సౌత్‌ రల్‌స్లిప్‌ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బోరిస్‌ రెండు సంవత్సరాల 349 రోజులు అధికారంలో కొనసాగారు. బ్రెగ్జిట్‌కు గుడ్‌బై చెప్పే క్రమంలో థెరిసా మే ఫలప్రదమైన చర్యలను పూర్తిచేసిన తర్వాతనే బోరిస్‌ జాన్సన్‌ ఆ పదవిని అధిష్ఠించారు. కరోనా వైరస్‌ను నీడలా వెంటతీసుకువెళ్లారు. ఈ రెండేళ్లూ బ్రిటన్‌ కొవిడ్‌ మహమ్మారితో పోరాడటానికే సరిపోయింది. ఇంత సంక్లిష్ట సమయంలోనూ బోరిస్‌ దేశాన్ని ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను విస్మరించి, పలు వివాదాల్లో కూరుకుపోయారు. కరోనా సమయంలోనే బ్రిటన్‌ ప్రజలంతా అరచేతిలో ప్రాణాలు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న తరుణంలో బోరిస్‌ జాన్సన్‌ తన అధికార నివాసంలోనే అతిగొప్ప పార్టీ జరుపుకున్నారు. ఈ ఉదంతం సహజంగానే దేశవ్యాప్తంగా విమర్శలు తలెత్తడానికి దారితీసింది. ఎన్నో వివాదాల్లో చిక్కుకొని, తన నడవడికతో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్‌ పిన్సర్‌ అనే వ్యక్తిని బోరిస్‌ జాన్సన్‌ స్వయంగా చేరదీసి మరీ ఆయనకు ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌ పదవిని కట్టబెట్టారు. ఈ విషయంలో సొంత కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన నాయ కులతోపాటు ప్రభుత్వాధికారులు సైతం ఎంత చెప్పినా బోరిస్‌ విన్పించు కోకుండా, ఆయనను కీలకమైన పదవిలో కూర్చోబెట్టడం తీవ్ర వివాదానికి తెరలేపింది. అంతలోనే క్రిస్‌ పిన్సర్‌ అనే ఆ పెద్దమనిషి ఒక క్లబ్‌లో పీకలదాకా తాగి ఆ మత్తులో ఇద్దరు వ్యక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తిం చారు. అప్పటికే అతను ఒక సెక్స్‌ కుంభకోణంలో ఇరుక్కున్నాడని బయట పడిరది. క్రిస్‌ను, తద్వారా బోరిస్‌ను ‘బద్నామ్‌’ చేయడంలో ఈ ఘటన కీలక భూమిక వహించింది. క్రిస్‌ అలాంటివాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్‌ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ అధికారులు ప్రతిఘటించారు. క్రిస్‌ పిన్సర్‌ గురించి తాము ముందే ప్రధానికి నివేదించామని ఓ మాజీ అధికారి మీడియా ముందు బయట పెట్టడంతో బోరిస్‌ మరింత ఇరకాటంలో పడ్డారు. ఈ ఘటన కొందరు మంత్రులు, ఉన్నతాధికారుల రాజీనామాలకు దారితీసింది.
ఇవి చాలదన్నట్లు, మరికొంతమంది టోరీ ఎంపీల సెక్స్‌ కుంభకోణాలు కూడా బోరిస్‌ మెడకు చుట్టుకున్నాయి. ఒక బాలఖైదీని లైంగికంగా వేధించి నందుకు గడిచిన మే నెలలోనే ఓ మాజీ ఎంపీకి 18 నెలల జైలు శిక్ష పడిరది. అత్యాచారం కేసులో ఇంకో ఎంపీ కూడా జైలుపాలయ్యాడు. జులై 5వ తేదీన ఆర్థికమంత్రి రిషి సునాక్‌, ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్‌ జావేద్‌లతో మొదలైన రాజీనామాల ప్రక్రియ పలువురు జూనియర్‌ మంత్రులు, మంత్రివర్గ సహాయక సిబ్బంది, ఇంకొంతమంది క్యాబినెట్‌ మంత్రులు వైదొలిగే దాకా కొనసాగింది. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్‌ బోరిస్‌ వారసునిగా బ్రిటన్‌ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వున్నాయని బీబీసీ న్యూస్‌ కథనం.
అయితే, బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా బ్రిటన్‌ రాజకీయ సంక్షో భంతోపాటు ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ ట్రేడిరగ్‌లో 1% లాభాలను చూపించిన బ్రిటన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఆ తర్వాత పతనం వైపు పయ నించింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా యూరో పతన మైంది. నిజానికి లండన్‌లోని డౌనింగ్‌స్ట్రీట్‌లో బోరిస్‌ చేసిన రాజీనామాతో నెలకొన్న ఈ పరిస్థితి తాత్కాలికమేనని, కొత్త ప్రధాని రాగానే పరిస్థితి చక్కబడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 1987 తర్వాత అతిపెద్ద మెజారిటీని, 1979 తర్వాత అతిపెద్ద ఓటు వాటాను కన్జర్వేటివ్‌ పార్టీకి తెచ్చిన ఘనత బోరిస్‌ జాన్సన్‌దే. 2 కోట్లకు పైగా కరోనా కేసుల నుంచి బ్రిటన్‌ త్వరగా కోలుకోవడానికి కృషి చేసిన ఘనత కూడా బోరిస్‌దే. అయినప్పటికీ, కొన్ని తప్పిదాలు బోరిస్‌ జాన్సన్‌ను పదవీచ్యుతుడ్ని చేశాయి. బోరిస్‌ రాజీనామా బ్రిటన్‌ ప్రజలకు ‘శుభవార్త’ అని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత కెయిర్‌ స్టార్మర్‌ చేసిన వ్యాఖ్య ఈ సంక్షోభంలో కొసమెరుపు. కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం నాయకుడిని మారిస్తే సరిపోదని ఆయన చేసిన జోడిరపు వ్యాఖ్యలు కూడా ఆలోచించదగ్గవే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img