Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

భగవత్‌ మసీదు సందర్శన ఆంతర్యం!

అధికారంలో ఉన్న వారి లేదా అధికారంలో ఉన్న వారిని నడిపించే వ్యవస్థ కాళ్ల కింది నేల జారిపోతుంటే ఏ గుమ్మం అయినా ఎక్కవలసిన పరిస్థితి వస్తుందేమో. మోదీ సర్కారు ఆర్‌.ఎస్‌.ఎస్‌. దృష్టిలో విఫలమైనట్టు కనిపిస్తోందా లేక మోదీ ఆర్‌.ఎస్‌.ఎస్‌. మాట వినిపించుకోవడం లేదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. మోదీ సర్కారు ఎన్నుకున్న సిద్ధాంతాన్ని మరింత బలోపేతం చేయడానికి బీజేపీని నడిపించే ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత ప్రయత్నాలు మొదలు పెట్టారేమో అన్న ప్రశ్నా తలెత్తుతోంది. ఈ ఘర్షణ ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు బీజేపీ మధ్య ఉందా? లేక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారం కోల్పోకుండా చూడడానికి మోహన్‌ భగవత్‌ ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనే స్థితిలో పడిపోయారనిపిస్తోంది. ఆర్‌.ఎస్‌. ఎస్‌. దృష్టితో చూస్తే బీజేపీకి అధికారమూ ఉండాలి. ఆ అధికారం చెలా యించే వారు సైద్ధాంతికంగా తమ చెప్పుచేతల్లో ఉండాలి. మొత్తం మీద ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో ఏదో గుంజాటన స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీని ఎన్నికల్లో గెలిచే యంత్రాంగంగా మార్చేశారు. ఈ పరిస్థితిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ సంఫ్‌ు చాలక్‌ (అధినేత) మోహన్‌ భగవత్‌ అమాంతం దిల్లీలో ఒక మసీదు, ఒక మదర్సా సందర్శించడంలో లోగుట్టు ఏమై ఉంటుందా అన్న అనుమానం కలుగుతోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఇస్లామిక్‌ రాజకీయ సంస్థ అయిన పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పి.ఎఫ్‌.ఐ.) స్థావరాలన్నింటిపై ఏక కాలంలో దాడి జరిగింది. ఈ రెండు పరిణామా లనూ విడివిడిగా చూడడం సాధ్యం కాదు. భగవత్‌ మదర్సాలోని విద్యా ర్థులతో ముచ్చటించారు కూడా. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మసీదుకు వెళ్లడం ఇంతకు ముందెప్పడూ చూడలేదు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ఆర్‌.ఎస్‌. ఎస్‌. అధినేత దేవరసు జైలులో ఉన్నప్పుడు అదే జైలులో జమాత్‌-ఎ-ఇస్లామీకి చెందిన వారు కూడా ఉన్నారు. వారితో దేవరస్‌ సంప్రదింపులు కూడా కొనసాగించారంటారు. దేవరస్‌కు జమాత్‌-ఎ-ఇస్లామీ నాయకు లకు మధ్య ఒక రకమైన సాన్నిహిత్యం కూడా ఏర్పడిరదనుకున్నా ఆయన మసీదుకు వెళ్లే సాహసం ఎప్పుడూ చేయలేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేతగా ఉన్న సుదర్శన్‌కు కూడా కొందరు ముస్లిం నాయకులతో సాన్నిహిత్యం ఉండేది. అయినా ఆయనా ఎన్నడూ మసీదులో ప్రవేశించలేదు. కానీ మోహన్‌ భగవత్‌ చెప్పా పెట్టకుండా మసీదు సందర్శించడంలో పరమార్థం ఏమిటన్న చర్చ బీజేపీని కూడా కలవరపెడ్తున్నట్టు కనిపిస్తోంది. ఆయన మసీదు సందర్శించడంవల్ల బీజేపీ అనుసరిస్తున్న 80-20 అన్న మంత్రం పారకుండా పోతుందా అన్న భయమూ బీజేపీని పీడిస్తోంది. లేదా ఒకవేపు భగవత్‌ లాంటి వారు ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్ని స్తుండగా మరో వేపు ముస్లింలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా ఏక కాలంలో జరుగుతోందనుకోవాలేమో.
బీజేపీ అనుసరిస్తున్న విధానాల పుణ్యమా అని ప్రజాస్వామ్యంలో ముస్లింల ప్రమేయమే లేకుండా పోతోంది. బీజేపీ ప్రతినిధిగా ఒక్క ముస్లిం అయినా ఏ చట్టసభలోనూ లేకపోవడం వారి అవసరం తమకు లేదని బీజేపీ బాహాటంగా ప్రకటిస్తున్న సమయంలో భగవత్‌ ముస్లింలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించడంలో అంతరార్థం ఏదో ఉండే ఉండాలి. మోదీ సర్కారు ద్వారా తన సిద్ధాంతాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రయత్నిస్తూ ఉంటే మోదీ ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను ఖాతర్‌ చేయని పరిస్థితి ఉందేమో అన్న అనుమానాలూ పెరుగుతున్నాయి. ఎందుకంటే వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేతలు వాజ పేయిని, అడ్వాణీని పిలిపించి ఏవో సూచనలు చేసేవారంటారు. కానీ ఇప్పుడు మోదీ ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు సన్నిహితుడైన నితిన్‌ గడ్కరీనే పక్కన పెట్టే స్థితికి వెళ్లిపోయారు. 2014లో మోదీ అధికారంలోకి రాక ముందు ఏ సమస్యలనైతే ఆయన లెవనెత్తి అధికారంలోకి వచ్చారో ఆ సమస్యలేవీ పరిష్కారం కానే లేదు. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. నిరుద్యోగం పడగ విప్పి విలయ తాండవం చేస్తోంది. చుక్కలంటిన ధరలు మరీ సామా న్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం వెతకడానికి లేదా వాటిని మోదీ సర్కారు పట్టించుకునేట్టు చేయడానికి మోహన్‌ భగవత్‌ మసీదు సందర్శించారేమో అనిపిస్తోంది. అధికారంలోకి రాక ముందు బీజేపీ ఈ సమస్యలన్నింటినీ లేవనెత్తి కాంగ్రెస్‌ను బోనులో నిలబెట్టి అధికారం సంపాదించింది. అవినీతి అప్పుడూ ఉంది. ఇప్పుడది వ్యవస్థలో భాగమైపోయి వికటాట్టహాసం చేస్తోంది. వీటికి సమాధానం చెప్పేవారే లేరు. ఇవన్నీ 2024 ఎన్నికల్లో తమకు ప్రతికూలంగా మారతా యన్న భయం అటు మోదీని, ఇటు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేతను పీడిస్తున్నట్టు న్నాయి. సకల అంశాల్లో మోదీ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపి స్తోంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్వయంగా రంగ ప్రవేశం చేయక తప్పదని భావించినందువల్లే మోహన్‌ భగవత్‌ మసీదులోకి వెళ్లారేమో. హెగ్డేవార్‌ అయితే ముస్లింలను ఎంత మాత్రం సహించే వారు కాదు. వారణాసిలో గంగ ఒడ్డున ఉన్న మసీదుల అంశం అదే పనిగా లేవనెత్తే వారు. గోల్వాల్కర్‌ మసీదు, మదర్సాల ఊసే ప్రధానంగా తీసుకొచ్చే వారు. సుదర్శన్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేతగా ఉన్నప్పుడు ముస్లింలతో సంబంధాలు పెట్టుకునే బాధ్యత ఇంద్రేశ్‌ కుమార్‌కు అప్పగించారు. అయినా ఆయన మసీదు ముఖమే చూడలేదు. సుదర్శన్‌ అధినేతగా ఉన్నప్పుడే దిల్లీలో ఆయనతో చర్చల కోసం కొందరు ముస్లింలు వచ్చారు. మధ్యలో నమాజు సమయం అయితే వారు ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యాలయం లోనే నమాజు చేశారు. భగవత్‌ మసీదు సందర్శించినప్పుడు ఆయనతో పాటు ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో మూడో స్థానంలో ఉన్న కృష్ణ గోపాల్‌, ఇంద్రేశ్‌ కుమార్‌ కూడా ఉన్నారు. వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దత్తో పంత్‌ ఠేంగ్డే లాంటి వారు స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ పేరా నానా యాగీ చేసే వారు. గురుమూర్తి కూడా చాలా క్రియాశీలంగా ఉండేవారు. ఇప్పుడు ఆయనను రిజర్వు బ్యాంకు డైరెక్టర్‌ను చేశారు. గోవిందాచార్య అడ్రసే లేకుండా పోయారు. ముమ్మారు తలాక్‌ మొదలైన అంశాల ద్వారా ఒక వేపు ముస్లిం మహిళలకు మేలు చేసినట్టు కనిపిస్తూనే ముస్లింలను ఓ మూలకు నెట్టేస్తున్న దశలో మోహన్‌ భగవత్‌ తన పద్ధతిలో కొత్త దారి వెతుకుతున్నట్టు అనిపిస్తోంది. మరో వేపు ముస్లిం మహిళల హిజాబ్‌ పెనుభూతంగా మారుతోంది. భగవత్‌ గత 20వ తేదీన ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధానాధికారి ఎస్‌.వై.ఖురేషీ, దిల్లీ మాజీ లెఫ్టినెట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ జమీరుద్దీన్‌ షా తో కూడా సంప్రదింపులు జరిపారు. ఆ ఇమామే భగవత్‌ను జాతి పిత అన్నారు. దీని మతలబు ఆలోచించవలసిందే. బీజేపీని గెలిపించ గలిగిన సామర్థ్యంతో పాటు ఓడిరచగల సామర్థ్యమూ ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు ఉందని మోదీకి తెలియజెప్పడానికే భగవత్‌ మసీదు సందర్శించారేమో.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img