Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

భవనం కన్నా విలువలు ప్రధానం

పార్లమెంటు నూతన భవన గృహప్రవేశం మంగళవారం జరిగింది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మహత్తరమైన ఘట్టమే. నూతన భవనంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రతిపాదించడం సానుకూలమైన పరిణామం. అధికార పార్టీ, ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్‌ మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తున్నాయి కనక ఈ బిల్లు సునాయాసంగానే లోకసభ ఆమోదం పొందవచ్చు. రాజ్యసభ ఇదివరకే ఆమోదించింది. బుధవారం ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే నూతన భవనం నుంచి పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభించడం మాత్రమే మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి చిహ్నం అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. 1927లో ఎడ్విన్‌ ల్యూటెన్స్‌, హెర్బర్త్‌ బేకర్‌ నిర్మించిన ఈ భవనం బ్రిటిష్‌ హయాంలోనూ పార్లమెంటుగా ఉపకరించింది. అప్పుడు పార్లమెంటును సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ అనేవారు. రాజ్యాంగ నిర్ణాయకసభ సమావేశాలు కూడా ఈ భవనంలోనే జరిగాయి. రాజ్యాంగాన్ని ఈ భవనంలో నుంచే ఆమోదించారు. స్వాతంత్య్రం తరవాత 75 సంవత్సరాలపాటు పాత భవనం ప్రజాస్వామ్య ప్రస్థానానికి సాక్షిగా నిలిచింది. ఈ భవనంలోనే అనేక చరిత్రాత్మక బిల్లులు ఆమోదించారు. అనేక రికార్డులు నెలకొల్పారు. ఈ భవనంలో పార్లమెంటరీ చరిత్రలో సాధించిన విజయాలు, అనుభవాలు, స్మృతులు కొల్లలుగా ఉన్నాయి. వీటినుంచి ఏం గుణపాఠాలు నేర్చుకున్నాం అన్నదే శేష ప్రశ్న. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో సి.సుబ్రహ్మణ్యం, మోహన కుమార మంగళం, వై.బి. చవాన్‌ లాంటి గొప్ప పార్లమెంటే రియన్లు ఉండేవారు. అయితే గొప్ప పార్లమెంటేరియన్ల చరిత్రను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతిపక్షాలకు చెందిన దిగ్దంతలే ఎక్కువమంది కనిపిస్తారు. సీపీఐ నాయకుడు భూపేశ్‌ గుప్తా రాజ్యసభ ఏర్పడిన నాటి నుంచి మరణించేదాకా సుదీర్ఘకాలం సభ్యుడిగా ఉన్నారు. లోకసభలో అయితే ఇంద్రజిత్‌ గుప్తా ఇప్పటిదాకా అందరికన్నా ఎక్కువకాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆయన 1957 నుంచి మొదలై ఒక్క 1977లో మినహా జీవితాంతం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. హిరేన్‌ ముఖర్జీ, భూపేశ్‌ గుప్తా మాట్లాడుతున్నారంటే అప్పటి ప్రధానమంత్రి పండిత్‌ నెహ్రూ ఆ ఆవరణలో ఎక్కడఉన్నా సభలోకి పరుగెత్తుకొచ్చేవారు. అటల్‌ బిహారీ వాజపేయి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నన్నాళ్లు సభలోకి ప్రవేశించగానే మొదట భూపేశ్‌ గుప్తా కూర్చున్న స్థానం దగ్గరకువెళ్లి నమస్కరించిన తరవాత గాని తన స్థానంలో ఆసీనులయ్యేవారు. ఆ రోజుల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలను నెలకొల్పినవారు ఉండేవారు. పండిత్‌ నెహ్రూ స్వయంగా పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రోది చేశారు. కమ్యూనిస్టు పార్టీ అనేకమంది గొప్ప పార్లమెంటేరియన్లను ఇచ్చింది. ఎస్‌.ఎ.డాంగే, సాధన్‌ ముఖర్జీ, రేణు చక్రవర్తి, హామిదాది, సి.కె.చంద్రప్పన్‌, గీతా ముఖర్జీ, గురుదాస్‌ దాస్‌ గుప్తా మొదలైన వారు సీపీఐ నాయకులే. కాన్పూర్‌ లోకసభ సభ్యుడిగా నాలుగుసార్లు ఎన్నికైన ఎస్‌.ఎం.బెనర్జీ కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు కాకపోయినా సీపీఐ మద్దతుతో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలిచేవారు. సీపీఎం నాయకుల్లో ఎ.కె.గోపాలన్‌, జ్యోతిర్మయ్‌ బసు, సోమ్‌నాథ్‌ చటర్జీ, పి. రామమూర్తి, ఆనంద్‌ నంబియార్‌ ఒక వెలుగు వెలిగారు. మొట్టమొదటి పార్లమెంటులో నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించింది నల్లగొండ ద్విసభ్య నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థులుగా పోటీచేసి రికార్డు సృష్టించిన వారు రావి నారాయణ రెడ్డి, సుంకం అచ్చాలు. ఇద్దరూ నల్లగొండ నుంచే ఎన్నికయ్యారు. వై.బి.చవాన్‌, ఎస్‌.జైపాల్‌ రెడ్డి, మోహన్‌ కుమార మంగళం సోషలిస్టు నాయకులైన డా. రాం మనోహర్‌ లోహియా, రాజ్‌ నారాయణ్‌, మధు లిమాయే, మధు దండవతే, పీలూ మోదీ కూడా పార్లమెంటేరియన్లుగా చెరగని ముద్రవేశారు. ఎస్‌.కె.పాటిల్‌, ఆచార్య ఎన్‌.జి.రంగా పార్లమెంటేరియన్లుగా తమ ప్రతిభ నిరూపించుకున్నారు.
పార్లమెంటు కార్యకలాపాలను హుందాగా నడపడం ఈ రోజుల్లో మృగ్యం అయిపోయింది. ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డు తగలడంలో, తమ వాదన బలంగా వినిపించడానికి ప్రయత్నించడంలో వింతేమీలేదు. కానీ మోదీ హయాంలో అధికారపక్ష సభ్యులే పార్లమెంటు కార్యకలాపాలకు భంగం కలిగించే దుష్ట సంప్రదాయం మొదలైంది. పార్లమెంటు మొట్ట మొదటి సమావేశం ప్రారంభం అయినప్పుడు పండిత్‌ నెహ్రూ ‘‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’’ ప్రసంగం ప్రపంచంలోని గొప్ప ఉపన్యాసాలలో ఒకటిగా నిలిచింది. అర్ధరాత్రి నెహ్రూ చేసిన ఆ ఉపన్యాసం ఇప్పటికీ స్ఫూర్తి కలిగిస్తుందని ప్రధానమంత్రి మోదీ మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో ఇచ్చిన సుదీర్ఘ ఉపన్యాసంలో పేర్కొన్నారు. కానీ పార్లమెంటును మోదీ ఏ మాత్రం గౌరవిస్తున్నారో గమనించే వారికి ఇదీ ఓ లాంఛనంగానే కనిపిస్తుంది. పార్లమెంటు కేవలం భవనంకాదు, అది ప్రజాస్వామ్య సౌధం అన్న విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ అవసరార్థం అంగీకరించిన సందర్భాలున్నా ఆచరణలో ఆ ఊసే కనిపించదు. పాత విభేదాలు మరిచిపోయి నూతన అధ్యాయం ప్రారంభించాలని మోదీ చెప్పిన మాటకు విలువఉంది. కానీ ఆ విలువను కాపాడవలసిన ప్రధాన బాధ్యత కూడా ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీదే. కేవలం భవనం మారినంత మాత్రాన పార్లమెంటరీ వ్యవస్థ పదిలంగా ఉందని చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. నూతన భవనంలోకి ప్రవేశించిన తరుణంలో పార్లమెంటరీ సంప్రదాయాలను ఏ మేరకు పాటిస్తున్నామో బేరీజు వేసుకోవలసిన అగత్యం ఉంది. వైషమ్యాలు వదిలి ఉన్నత ప్రమాణాలు పాటించాలని ప్రస్తుత లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా నూతన భవనంలో మొదటిసారి మాట్లాడుతూ కోరారు. అది ఏ మేరకు ఆచరణలోకి వస్తుందో చూడాలి. ఎన్నికల రాజకీయాలు పార్లమెంటులో కూడా ప్రతిధ్వనించడం ప్రస్తుత దౌర్భాగ్యస్థితి. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి పార్లమెంటు దగ్గరకు వచ్చేసరికి ఉప్పు నిప్పు వ్యవహారంలా తయారైంది. పార్లమెంటును సజావుగా నిర్వహించవలసిన బాధ్యత ప్రధానంగా అధికార పక్షానిదే అన్న విషయాన్ని బీజేపీ ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదు. బిల్లుల మీద చర్చలు, ప్రధానమైన బిల్లులను కూలంకషంగా పరిశీలించడానికి వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపిన సందర్భాలు రాను రాను అరుదైపోతున్నాయి. పార్లమెంటు ఉన్నది సంవాదానికి, చర్చకు అని బీజేపీ గమనించడంలేదు. ప్రతిపక్షం మాట వినిపించుకోవడం పార్లమెంటరీ సంప్రదాయానికి మూల కందం. కానీ ఆ పరిస్థితిలేదు. ప్రతిపక్షం బలహీనంగా ఉన్నంతమాత్రాన ప్రజల వాణిని అణచి వేయాలన్న సంకల్పం ఉత్తమ సంప్రదాయాలను మంట గలపడమే. మెజారిటీ ఉన్న పార్టీగా పార్లమెంటు గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత బీజేపీదే. పరిస్థితి మారకపోతే ప్రజా ప్రతినిధుల మీద ఈ పాటి నమ్మకం, గౌరవం కూడా మిగలవు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img