Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

భీమా కోరేగావ్‌ కేసే ఓ కుట్ర

భీమా కోరేగావ్‌ లో 2018 జనవరి ఒకటిన దళితుల మీద జరిగిన దాడికీ ఎల్గార్‌ పరిషత్‌ సమావేశానికీ ఎలాంటి సంబంధమూ లేదని ఆ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న సీనియర్‌ పోలీసు అధికారి గణేశ్‌ మోరే చెప్పారు. ఎల్గార్‌ పరిషత్‌ సంఘటన పుణేకు 30 కిలోమీటర్ల దూరంలో జరిగింది. దళితుల మీద జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేస్తున్న ఇద్దరు సభ్యులతో కూడిన కమిషన్‌ ముందు వాంగ్మూలం ఇస్తూ మోరే ఈ వాస్తవం వెల్లడిరచారు. మోరే ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. కమిషన్‌ విచారణ ఈ ఏడాది ఏప్రిల్‌ లో మొదలైంది. తన పరిధిలో తొమ్మిది కేసులు దాఖలైనాయనీ అందులో ఒక్క సందర్భంలో కూడా ఎల్గార్‌ పరిషత్‌ సంఘటనకు సంబంధమే లేదని ఆయన అన్నారు. 2018 జనవరి ఒకటవ తేదీన జరిగిన సంఘటనకు 2017 డిసెంబర్‌ 31నాటి ఎల్గార్‌్‌ పరిషత్తుకు సంబంధం ఉన్నట్టు తనకు ఒక్క రుజువూ లభించలేదని మోరే స్పష్టంగా చెప్పారు. జరిగిన హింసాకాండకూ ఎల్గార్‌ పరిషత్‌్‌ సమావేశానికీ ఏ సంబంధమూ లేదని పోలీసు అధికారిగా పని చేసిన వ్యక్తి చెప్పడం బహుశా మొదటి సారి కావొచ్చు. ఎందుకంటే పోలీసు అధికారులు సాధారణంగా అధికారంలో ఉన్న వారి తరఫుననే మాట్లాడుతుంటారు. అంటే మానవ హక్కులకోసం పోరాడే 16 మంది ప్రముఖుల మీద మోపిన కేసు పచ్చి బూటకం అని తేలిపోయింది. ఈ కేసును ముందు పుణే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కలగ జేసుకుని దర్యాపు మహారాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకుండా చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఏ.)కు అప్పగించారు. ఈ 16 మందిలో ముగ్గురు బెయిలు మీద విడుదలైతే 84 ఏళ్ల స్టాన్‌ స్వామి నిర్బంధంలో ఉండగానే మరణించారు. మిగతా 12 మంది ఇంకా జైలులోనే మగ్గుతున్నారు. మోరే వాంగ్మూలాన్నిబట్టి చూస్తే మానవ హక్కులకోసం పాటు పడే 16 మంది అరెస్టు ప్రభుత్వ దాష్టీకానికి పరాకాష్ఠే. వారందరూ నిర్దోషులేనని ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు. మరి భీమా కోరేగావ్‌ సంఘటనకు అసలు బాధ్యులు ఎవరు అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతోంది. ఈ హింసాకాండలో మిలింద్‌ ఎక్బోటే, మనోహర్‌ కులకర్ణి అనే శంభాజీ భీడే పాత్రే ఉందని అర్థం చేసుకోవడానికి అంత పాండిత్యం అక్కర్లేదు. బాధితులు దాఖలు చేసిన ప్రాథమిక సమాచార నివేదికలో కూడా వీరిద్దరి పాత్ర గురించే వేలెత్తి చూపించారు. ఎక్బోటే, భీడే భీమా కోరేగావ్‌లో కొంత కాలంగా క్రియాశీలంగా పని చేస్తున్న నిజాన్ని మాత్రం రాజ్య వ్యవస్థ దాచి పెట్టింది. బాధితులు ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలు చేసిన తరవాత తీవ్ర బ్రాహ్మణవాదులైన ఎక్బోటే, భీడేనే హింసా కాండను రెచ్చగొట్టారని కేసులు దాఖలైనాయి. 2018లో ఎక్బోటేను నామ మాత్రంగా కొద్ది రోజులు నిర్బంధించారు. భీడే మీద మాత్రం ఇప్పటిదాకా ఈగైనా వాల లేదంటే అసత్య ప్రచారంలో రాజ్య వ్యవస్థ పాత్ర ఎంత పెద్దదో చెప్పక్కర్లేదు. బాధితులు రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎన్‌.ఐ.ఏ. మాత్రం ఎల్గార్‌ పరిషత్‌ సమావేశం మీదే దృష్టి కేంద్రీకరించింది అనడం కన్నా పనిగట్టుకుని అసత్య ప్రచారం చేశారని రుజువవుతోంది. ఈ హింసాకాండతో ఏ సంబంధం లేని వారి మీద కూడా కేసులు మాత్రం మోపారు.
కమిషన్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలాలను విచారణ జరుపుతున్న కోర్టులో నేరుగా సాక్ష్యాధారాలుగా వినియోగించడం కుదరక పోవచ్చు కానీ మానవ హక్కుల పరిరక్షకులని ఈ కేసులో ఇరికించడం కేంద్ర ప్రభుత్వానికి తరవాత తట్టిన ఆలోచన అన్నది మాత్రం నిజం. ఎందుకంటే సీనియర్‌ పోలీసు అధికారి ఇచ్చిన వాగ్మూలం గాలికి పోదుగదా! పోలీసు అధికారి ఇచ్చిన వాంగ్మూలం వివరాలను బొంబాయి హైకోర్టుకు అందజేసి తీరాలి. కాని కేంద్ర ప్రభుత్వ వైఖరి అందుకు అనుగుణంగా ఉంటుందనుకోలేం. మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వేపు దర్యాప్తు చేస్తుండగా అమాంతం ఈ వ్యవహారాన్ని ఎన్‌.ఐ.ఏ.కు అప్పగించడంలోనే అసలు కుట్రంతా దాగి ఉంది. అసమ్మతి ప్రకటించే వారిని అణగదొక్కడానికే మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎన్‌.ఐ.ఏ. అనేక మందిని ఈ కేసులో దుష్ట బుద్ధితో ఇరికించింది. వారందరూ మావోయిస్టులేనని ప్రచారం చేసింది. అర్బన్‌ నక్షలైట్లు అన్న మాట ఈ కేసు సందర్భంగానే ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు మహారాష్ట్ర హోం మంత్రిగా ఉన్న అనిల్‌ దేశ్‌ ముఖ్‌ ఈ కేసును ఎన్‌.ఐ.ఏ.కు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న రాజ్యాంగపరమైన మర్యాద కూడా పాటించలేదు. ఆ తరవాతే అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరొక్టొరేట్‌ అరెస్టు చసిన విషయాన్ని విస్మరించడానికీ వీలు లేదు. ఆ 16 మంది మీద ప్రధానమంత్రిని హతమార్చే కుట్ర పన్నారన్న ఆరోపణ కూడా చేశారు. వారి అరెస్టులో అనేక అక్రమ పద్ధతులు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. అధికార దుర్వినియోగం బాహాటంగా జరిగింది. మానవ హక్కులను మంటగలిపారు. మానవహక్కుల కోసం పోరాడుతున్నందువల్లే వారి మీద కత్తిగట్టినట్టు ప్రభుత్వం ప్రవర్తించిందని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు అనేక మంది వాదించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలం వల్లే పుణే పోలీసులు చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘించి ఏలిన వారిని సంతృప్తి పరిచి తరించారు. పుణే కోర్టు ఆ మానవ హక్కుల పరిరక్షకులను నిర్బంధంలో ఉంచాలని వాదిస్తోంది. కానీ బొంబాయి హైకోర్టు మాత్రం ఇప్పటివరకు తమకు అందించిన సమాచారం ప్రకారం వారి మీద ఎలాంటి కేసుకు అవకాశం లేదని అభిప్రాయపడిరది. ఈ వ్యాఖ్యలవల్ల ఒరిగింది ఏమీ లేదు. జైలులో మగ్గుతున్న వారు బెయిలు కోసం అర్జీలు పెట్టుకున్నప్పుడు ప్రాసిక్యూషన్‌ ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న సాక్ష్యాధారాలనే చూపించింది. అయితే ఆ సాక్ష్యాధారలను కోర్టుకు మాత్రం అందజేయలేదు. కనీసం నేర నిరూపణ కోసం ఉపకరించే ఆధారాలను కూడా అందించలేదు.
ఉన్నాయంటున్న సాక్ష్యాధారాల ప్రతులు నిందితులకు కూడా అందించలేదు. ఆ ప్రతులు అందించకపోవడం వారికి న్యాయం జరగకుండా అడ్డుపడడమే. భీమా కోరేగావ్‌ కేసులో అనుమానితుల మీద పుణే పోలీసులు చేసిన ఆరోపణల బండారం మోరే వాంగ్మూలంతో బట్ట బయలైంది. నిందితుల కంప్యూటర్ల లోకి జొరబడి కూట సాక్ష్యాలు జొప్పించినట్టు అంతర్జాతీయ సంస్థలు పరిశోంధించి తేల్చాయి. నిందితులను అరెస్టు చేయడానికి భీమా కోరేగావ్‌ ఘటనకు ముందే వారి కంప్యూటర్లలో తమకు అనుకూలమైన ఫైళ్లను జొప్పించి సకల నైతిక సూత్రాలనూ ఉల్లంఘించారు. నిందితులను అరెస్టు చేసి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటికీ విచారణ ఊసే లేదు. అంటే ప్రభుత్వం వారిని జైలులో ఉంచేసి కక్ష తీర్చుకోవాలనుకుంటోందని స్పష్టం అవుతోంది. ఇలాంటి సందర్భంలో కూడా సుప్రీంకోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదో అంతుపట్టదు. వెంటనే కలగ జేసుకుని అమాయకులకు న్యాయం చేయవలసిన బాధ్యత కచ్చింతంగా సుప్రీంకోర్టుదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img