Monday, February 6, 2023
Monday, February 6, 2023

భూమాతను కాపాడుకుందాం

ప్రపంచ జనాభా విస్పోటనం చెందుతోంది. ప్రస్తుతం జనాభా 800 కోట్లను దాటిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొంది. 2037 నాటకి 900 కోట్లకు చేరుకో వచ్చునని, 2058 నాటికి వేయి కోట్లకు చేరుకుంటుందని ఐరాస 2022 నివేదిక వెల్లడిరచింది. ఇదేమీ సంబర పడవలసిన సందర్భం ఏమీ కాదు. జనాభా వేగంగా పెరుగుతోంది కానీ, భూమి విస్తీర్ణం ఏమీ పెరగదు. భారతదేశంలో జనాభా పెరుగుదల మందగిస్తోందని చెపుతున్నప్పటికీ ఇందుకు సంబంధించిన స్పష్టమైన గణాంకాలు లేవు. జనాభా పెరుగుతున్న కొద్దీ సమస్యల సుడి గుండాలు ప్రజల జీవనాన్ని దుర్బరం చేస్తాయి. జనాభా పెరుగుదలను మించి అతి వేగంగా పర్యావరణం కలుషితమైంది. ఇది తిరిగి పరిష్కరించలేనిస్థాయికి చేరిందని ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తమై కాలుష్యం తగ్గింపు చర్యలను తీసుకోవాలని వాతావరణ శాస్త్రవేత్తలు, అధ్యయన వేత్తలు సుదీర్ఘకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. పర్యావరణ కాలుష్యం అధికమయ్యే కొలదీ ప్రకృతి విపత్తులూ పెరుగుతున్నాయి. జనాభా పెరుగుతున్న కొలదీ పరిష్కరించుకోలేనన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఆహారం కొరత అపరిమితం అవుతుంది. ఒక్క ఆహారమేకాదు, తాగేందుకు మంచినీరు, వ్యవసాయానికి నీళ్ల్లు, ఇంధనం, అన్నిటికీ మించి వైద్య చికిత్స, వనరులు, వసతుల కొరత ఏర్పడటమే గాక, సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోలేని స్థితి ఏర్పడనుంది. ఆరోగ్య రంగం నుండి ప్రభుత్వాలు తప్పుకొని, ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులలో వైద్యం అతి ఖరీదైపోతోంది. మున్ముందు మధ్యతరగతి ప్రజలుసైతం ఆస్పత్రి ఖర్చులు భరించలేనిస్థితి ఎదురుకావచ్చు. ఇప్పటికే నీరు, ఆహారం, ప్రాణాలు నిలిపే వాయువు అపారంగా కలుషితమయ్యాయి. ఫలితంగా ఆనేకరకాల కొత్తకొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొవిడ్‌19 మహమ్మారిలాంటి ప్రకృతి విపత్తులు, తద్వారా సర్వరంగాలలో విధ్వంసం ఊహించలేని స్థాయిలో ఉంటుంది. ఈ ప్రపంచంలోకి ప్రతి బిడ్డ రాక సమస్యలను పెంచుతుంది.. ఆ బిడ్డ జీవన పరిస్థితులూ సుఖంగా ఉండవని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించడమే కాదు, మనం అనుభవిస్తున్నాము కూడా. నీరు, ఆహారం, వైద్య సదుపాయాలు తదితర అన్ని వనరుల కొరత ఎక్కువగా ఉంటుందని నివేదిక సరైన హెచ్చరిక చేసింది. జనాభా పెరుగుదల వేడుక చేసుకొనేదికాదు. చైనా, జపాన్‌ తదితర దేశాలలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా భారతదేశంలో యువత ఎక్కువగా ఉందని, ఇది దేశానికి మంచి అవకాశమని భావిస్తున్నవారు భ్రమపడుతున్నారే కానీ వాస్తవ పరిస్థితులను చూడటంలేదు. అయితే మన దేశ జనాభా అతి త్వరలో బహుశా 2030 నాటికి ప్రథమస్థానంలోఉన్న చైనాను మించిపోవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2030 నాటికి ప్రపంచ జనాభా 850 కోట్లు దాటవచ్చునన్నది ఐరాస అంచనా. అప్పటికి మనదేశ జనాభా 151 కోట్లు దాటవచ్చు. జనాభా నియంత్రణ చర్యలు విజయవంతమైతే పెరుదల రేటు మరింతగా మందగించే అవకాశాలుంటాయి. చైనా జనాభా పెరుగుదల మందగించడం అనేక దేశాలకంటే ఎక్కువగా ఉంది. 2030 నాటికే చైనా జనాభా 141.6కోట్లకు తగ్గవచ్చునని ఐరాస అంచనా. జనాభా నియంత్రణ, పర్యావరణ కాలుష్య కారకాలను భూతాపం పెరుగుదలను తక్షణం అరికట్టడానికి, కార్యాచరణ ప్రణాళికను అమలు చేయకపోతే మానవవాళి మహావిపత్తును తప్పించుకోవడం సాధ్యంకాదని శాస్త్రవేత్తల అంచనాలు. ఇవి వాస్తవం కావచ్చునని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఒకవైపు వాతావరణ సంక్షోభం ఆందోళన కలిగిస్తుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, ఆహార అభద్రత, రోజురోజుకీ పెరుగుతున్న నీటికొరత, ఆరోగ్య సౌకర్యాల కొరత, మానవాళిని పట్టిపీడిస్తున్నాయి. ఆధునిక ఆరోగ్య సౌకర్యాలు, చికిత్సలవలన మనిషి ఆయుర్థాయం పెరుగుతున్నప్పటికీ సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు విజృంభిస్తున్నందున మరణాలు పెరుగుతాయి. అపరిమిత మైన ఎండలు, భూతాపం పెరుగుదల, తుపానులు పెరగడం వల్ల విధ్వంసం అధికమవుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశాంతర వలసలు అధికమయ్యాయి. అనేక దేశాలు వలసకారులను అనుమతించడలేదు. అలాగే సాయుధ ఘర్షణలూ పెరుగు తున్నాయి. యుద్ధాలూ జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగు తున్న రష్యాఉక్రెయిన్‌యుద్ధం ప్రజల, ఆస్తుల విధ్వంసానికి దారితీస్తోంది. అణ్వాయుధాలు, లేదా ఇతర శక్తివంతమైన ఆయుధాల వినియోగం కాలుష్యాన్ని పెంచుతోంది. ప్రభుత్వాలు, మతం, ఛాందస వాదాలవైపు మళ్లుతున్న ధోరణి మిక్కుటమైంది. ఇది క్రమంగా సంపన్నులు, పేదల మధ్య అసమానతలు మరింతగాపెంచి ఆయా సమాజాలలో అశాంతికి దారితీస్తోంది. కల్లోల పరిస్థితులు తలెత్తుతాయి.
అనేక దేశాలు ఆయుధాల నిల్వలను పెంచుకుంటూ, వాటిపై అపరిమితంగా ఖర్చుచేస్తున్నాయి. ప్రజలసంక్షేమం, పేదరికం తగ్గింపు, నిరుద్యోగం నియంత్రణ చర్యలను అలక్ష్యం చేస్తున్నాయి. ఇప్పటికే ఆహారభద్రతకు ప్రమాదం ఏర్పడిరది. మతాలమధ్య సంఘర్షణలు, మతారాధిత ప్రభుత్వాల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తాయి. ప్రజలు, పాలకులు ధరిత్రిని కాపాడు కునేందుకు ఐక్యంగా కృషిచేయాలి. అప్పుడే మానవాళి మనుగడ సాధ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img