Monday, September 25, 2023
Monday, September 25, 2023

భూ పంపిణీ పేర లూటీ

దాదాపు నాలుగేళ్ల కింద జమ్ము-కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి అక్కడ శాంతి భద్రతలు ఎంత మేర మెరుగయ్యాయో, తీవ్రవాదం ఎంతవరకుతగ్గిందో తెలియదు. తీవ్రవాదానికి సంబంధించిన సంఘటనల వివరాలేవీ గత నాలుగేళ్లుగా మునుపటంత తరచుగా బయటికి రావడం లేదు. అక్కడి సమాచారం స్వేచ్ఛగా వెల్లడి కావడంలేదు. అలాగని కశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గిపోయిందనుకోవడానికీ లేదు. ఎందు కంటే అదే నిజమైతే సందర్భం లేకపోయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌ మీద విరుచుకుపడ వలసిన అవసరమే ఉండేది కాదు. బీజేపీ ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌ బూచి ఇంకా వెంటాడుతోందంటే బలమైన కారణం ఏదో ఉండి ఉండాలి. కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాలిత ప్రాంతాలుగా విడగొట్టడానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన గుర్తుకు తెచ్చుకుంటే రాష్ట్రంగా ఉన్న కశ్మీర్‌ స్థాయిని ఎందుకు దిగజార్చవలసి వచ్చిందో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీయవలసి వచ్చిందో కొంతమేరకైనా అర్థం అవుతుంది. ఆ బిల్లు ప్రతిపాదించిన సమయంలో అమిత్‌ షా కాశ్మీర్‌లో అభివృద్ధి కుంటుపడినందువల్ల అక్కడ భూములు కారుచౌక అన్నారు. అంటే భూముల ధరలు అంతకంతకూ ప్రియంకావడం అభివృద్ధికి సూచిక అనుకోవాలేమో. జమ్మూ-కశ్మీర్‌లో ముఖ్యంగా కశ్మీర్‌ లోయలో ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉండడం బీజేపీ ఎన్నడూ సహించలేదు. ఆ కారణంగానే 370వ అధికరణం రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు రోజుల నుంచీ సంఫ్‌ుపరివార్‌ కోరుతూనేఉంది. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రం జమ్మూ-కశ్మీర్‌ ఒక్కటే అయినట్టు బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదో ఒక మేర అనేక రాష్ట్రాలకు కొన్ని విషయాల్లో ప్రత్యేక సదుపాయాలు లేకపోలేదు. ఆ అంశాన్ని వీలైనంత మేరకు మరుగుపరుస్తూ ఉంటారు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా తీవ్రవాదం తాండ విస్తున్నా అక్కడి మానవాభివృద్ధి సూచికలు అనేక రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఉన్నాయి. ప్రశాంతతకు భంగం కలగకుండా ఉంటే మరింత ముందడుగు వేసిఉండేది. 370వ అధికరణం రద్దుచేసిన తరవాత మానవాభివృద్ధి సూచికల్లో గణనీయమైన పెరుగుదలవల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయని, అక్కడి ప్రజలు సిరిసంపదలతో తులగూగుతున్నారనడానికి ఏ రకమైన దాఖలాలూ లేవు. అభివృద్ధి అంటే భూమి లాంటి వనరుల ధరలు పెరిగిపోవాలనుకునేచోట మరో ప్రశ్నకు అవకాశమే ఉండదు. ప్రజల జీవన ప్రమాణాల్లో, స్థితిగతుల్లో మెరుగుదలే అభివృద్ధికి సూచిక అని అంగీకరించనప్పుడు అసలైన అభివృద్ధి గురించి ఏం చెప్పినా దండగే. కశ్మీర్‌ ప్రజలను జనజీవన స్రవంతిలో కలిసేటట్టు చేస్తామని మోదీ ప్రభుత్వం ఊదరగొట్టింది. అందుకే 370వ అధికరణాన్ని రద్దు చేస్తున్నామని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడ్తున్నామని మోదీ, అమిత్‌ షా ద్వయం నిర్విరామంగా చెప్తూనే ఉన్నారు. మోదీ రెండోసారి అధికారం లోకి వచ్చినప్పుడు బీజేపీకి సొంతంగా సంపూర్ణమైన మెజారిటీ వచ్చినందువల్ల కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడానికి అదనపు అవకాశం వచ్చింది. ఈ ప్రయత్నాల వెనక ఆంతర్యం ఏమిటో ఇప్పుడిప్పుడే బయట పడ్తోంది. మోదీ సర్కారు దృష్టిలో అభివృద్ధి అంటే అభివృద్ధి చెందాయనుకుంటున్న రాష్ట్రాలలో ఉన్న అవకతవకలు, ప్రజా వ్యతిరేక పరిణామాలు మిగతా చోట్లను కూడా ఆవరించడమే. కశ్మీర్‌ లోయలో ముస్లిం జనాభా అధికం కనక అక్కడి జనాభా స్వరూపాన్ని మార్చాలని బీజేపీ ఎప్పటి నుంచో కలలు కంటోంది. ఇప్పుడు ఆ ప్రణాళికను అమలులో పెడ్తోంది.
ఈ ఉద్దేశంతోనే జమ్ము కశ్మీర్‌లో ‘‘భూమి లేని వారికి భూమి’’ అన్న పథకం అమలు చేస్తున్నారు. భూమి పంపకం పేర ఇతర ప్రాంతాల నుంచి వలసలను ప్రోత్సహించి వారిని భూమిలేని వారిగా పరిగణించి వారికి భూమిపంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాదాపు పదిలక్షల మంది వలస వచ్చేట్టు చేయాలని అనుకుంటున్నారు. తాము వలసలను ప్రోత్సహించాం, భూ వసతి కల్పించాం కనక ప్రయోజనం పొందిన వారు తమకు విశ్వాస పాత్రులుగా ఉండక ఏం చేస్తారు అన్నది బీజేపీ మనసులోమాట. అంటే వీరందరినీ తమ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నం అంటే ఇదే. ముస్లింలకు వసతులు కల్పించడాన్ని, వారి అభివృద్ధికి సానుకూల చర్యలు తీసుకోవడాన్ని ముస్లింలను సంతృప్తి పరచడం అనీ, ఇది ఓటు బ్యాంకు రాజకీయం అని ఇంతకాలం వాదించిన బీజేపీ ఇప్పుడు అవే ఓటుబ్యాంకు రాజకీయాలను ఆశ్రయి స్తోంది. ఒక్కటే తేడా. ఇదివరకు ముస్లింలు ఉన్నారంటున్న స్థానంలో ఇప్పుడు హిందువులు ఉంటారు. హిందువులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తే అది బీజేపీ దృష్టిలో ఓటుబ్యాంకు రాజకీయం కాదు. జమ్ము-కశ్మీర్‌ లో భూమిలేని ఒక్కొక్క కుటుంబానికి 126 చదరపు మీటర్ల భూమి కేటాయించాలని జూన్‌ 21నే కశ్మీర్‌ పాలనావిభాగం నిర్ణయించేసింది. ఈ విషయం జమ్ము-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా గత మూడోతేదీన ప్రకటించారు. జమ్ము-కశ్మీర్‌లో ఇల్లులేని కుటుంబాలు 2.57 లక్షలు ఉన్నాయని 2011 నాటి సామాజిక ఆర్థిక, కుల గణనలో తేలిందట. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఈ లెక్కలు సేకరించారు. ఈ సాంఘిక సంక్షేమ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. 2018 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో రెండోసారి సర్వే జరిగింది. మొదటిసారి సర్వేలో చేరనివారిని ఈ సర్వే ద్వారా గుర్తించారు. 2019లో 2.65 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవని గుర్తించారు. 63, 426 మందికి ఇళ్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ భూమి కశ్మీర్‌ పాలనాయంత్రాంగం కేటాయించిందట. అయితే 2021 నాటి నివేదిక ప్రకారం జమ్మూ-కశ్మీర్‌లో ఇళ్లులేని వారు కేవలం 19,047 అని మాజీ ముఖ్యమంత్రి, పి.డి.పి. నాయకురాలు మెహబూబా ముఫ్తీ వాదిస్తున్నారు. అంతకన్నా ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం అంటే ఆ ప్రాంతానికి చెందని వారికి సదుపాయాలు కల్పించివారు అక్కడ స్థిరపడేట్టుచేసి జనాభా స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయడమే. మెహబూబా చెప్పిన లెక్కలు 2021లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచినవే. కశ్మీరీల గుర్తింపును సవాలుచేసే ఏ చర్యనైనా ప్రతిఘటిస్తామని మెహబూబా హెచ్చరించారు. 370వ అధికరణాన్ని రద్దు చేసిన తరవాత ప్రత్యేక ప్రతిపత్తి లేకుండా పోయింది కనక అక్కడి వనరులను, భూమిని, ఉపాధి అవకాశాలను లూటీచేసే ప్రయత్నం తీవ్రంగా సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img