Monday, June 5, 2023
Monday, June 5, 2023

మతతత్వ క్రీనీడలు

కర్నాటక శాసనసభ ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు విఫలమై ఉండొచ్చు. బసవ రాజ్‌ బొమ్మై అవినీతి లాంటి ప్రజాసమస్యలు ఓటర్లకు ఈ సారి ప్రధానమైనవిగా కనిపించి ఉండొచ్చు. మతతత్వానికి, ప్రజా సమస్యలకు మధ్య జరిగిన పోటీలో ప్రస్తుతానికి కర్నాటకలో మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం కుదరనట్టు అనిపించవచ్చు. బీజేపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ హిజాబ్‌, హలాల్‌, బురఖా లాంటివాటి మీద వివాదాలు విద్వేషాన్ని నింపి ఉండొచ్చు. హిజాబ్‌ ను నిషేధించిన మంత్రి ఓడిపోయి, హిజాబ్‌ ను కట్టడి చేయడాన్ని ఎదిరించిన ముస్లిం మహిళ గెలిచి ఉండొచ్చు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌ దళ్‌ ను, ఇతర మతతత్వ ముస్లిం సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో చెప్పడం కాంగ్రెస్‌ ను దుయ్యబట్టడానికి బాగానే ఉపకరించింది. బజరంగ్‌ దళ్‌ అనేది సంఫ్‌ు పరివార్‌ కూటమిలోని ఒక విభాగం. హిందువులను రక్షించడం ఆ సంస్థ లక్ష్యం అని అంటారు. ఎవరి నుంచి రక్షిస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఛత్రఛాయల్లోని అనేక విభాగాలు చాలా తీవ్రమైన భావాలు కలిగి ఉంటాయి. సంఫ్‌ు పరివార్‌ లక్ష్యాలను సాధించడంలో ఈ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయి. కర్నాటక ఓటర్లు మతతత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పలేం. మతతత్వాన్ని పెంచి పోషించే మోదీ నాయకత్వంలోని బీజేపీ ఓటమి పాలు కావడం జనం మతతత్వాన్ని వ్యతిరేకించారనడానికి ఆస్కారం లేకపోవచ్చు. మధ్యలో దాదాపు రెండేళ్లు మినహా 2008 నుంచి బీజేపీకి అధికారం కట్టబెట్టిన కర్నాటక ఓటర్లు ఇప్పుడు బీజేపీని ఓడిరచారని సంబరపడవలసిన అగత్యం ఏమీ లేదు. ఎన్నికల సమయంలో ఏది ప్రధాన సమస్యో తేల్చుకోవడంలో రాజకీయ పార్టీలు తికమక పడొచ్చు. లేదా తమ అవసరాలకు అనుగుణంగా ఎన్నికల సమయంలో ప్రస్తావించ వలసిన అంశాలను తారు మారు చేయవచ్చు.
మతతత్వాన్ని ఓటర్లు ఎప్పుడైనా నిర్ద్వంద్వంగా, నిర్భయంగా ఎదిరించారా అన్నది అసలు ప్రశ్న. మతోన్మాదాన్ని సహించని ప్రజల సంఖ్య అపారంగానే ఉండొచ్చు. కానీ మతోన్మాదాన్ని పరాజితం చేయాలన్న దృఢ సంకల్పం వారిలో నియత పద్ధతిలో ఉంటుందనడానికి ఆస్కారం లేదు. ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ బజరంగ్‌ దళ్‌ ను నిషేధిస్తామని చెప్పడాన్ని మోదీ వాటంగానే ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు. బజరంగ్‌దళ్‌ను బజరంగ్‌ బలీతో సమానం చేసేసి హనుమంతుడిని నిర్బంధిస్తారట అని విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ అంటున్న పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాను బీజేపీ సర్కారే నిషేధించింది. అలాంటప్పు బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామంటే ఉలుకు ఎందుకో తెలియదు. అధికారంలోకి వస్తే బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ ప్రకటనను కూడా యథాతథంగా స్వీకరించడానికి వీలు లేదు. కాంగ్రెస్‌ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బజరంగ్‌ దళ్‌ను నిషేదించలేదుగా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. మతతత్వం కొన్ని పార్టీలలో బహిరంగంగా ఉంటే మరి కొన్ని పార్టీలలో నర్మగర్భంగా ఉంది. లేదా అవసరార్థం మతతత్వాన్ని ప్రోత్సహించిన దాఖలాలు ఉండవచ్చు. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోకూడదన్న సూత్రాన్ని పాటించే రాజకీయ పార్టీలు కేవలం వామపక్షాలు మాత్రమే. మిగతా అన్ని పార్టీలూ ఏదో ఒక సమయంలో మతాన్ని బహిరంగంగానో, లోపాయికారీగానో ఆశ్రయిస్తూనే ఉన్నాయి. వ్యక్తిగతంగా అయితే తమ మత భావాలను బాహాటంగా వ్యక్తంచేసే నాయకులకు కొదవే లేదు. వ్యక్తిగతంగా మత విశ్వాసాలు ఉండడాన్ని అభ్యంతర పెట్టలేం. కానీ అధికారంలో ఉన్న వారు బహిరంగంగా తమ మతాభిమానాన్ని ప్రదర్శించడం వెనక మత ప్రాతిపదికన లబ్ధి పొందాలన్న ఆలోచన ఉండబట్టే. ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్న వారు యజ్ఞాలు యాగాలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులను విని యోగించడం మతాన్ని వ్యక్తిగత స్థాయిలో ఉంచడం కానే కాదు.
1989 నాటి పాలంపూర్‌ తీర్మానం ద్వారా బీజేపీ హిందుత్వను తన సిద్ధాంతంగా ఆమోదించింది. హిందుత్వ అన్న మాటను ఆర్‌.ఎస్‌.ఎస్‌. చాలా రోజులుగా వాడుతూనే ఉంది. కానీ 1989కి ముందు బీజేపీ హిందుత్వ ప్రస్తావనను ఇంత బహిరంగంగా తీసుకు రాలేదు. తన ప్రభావాన్ని, పలుకుబడిని పెంచుకోవడానికి, రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి హిందుత్వను బాహాటంగా వినియోగించుకోలేదు. అంతా నర్మగర్భంగానే సాగిపోయేది. వాజపేయి, అడ్వాణీ బీజేపీ నాయకులుగా ఉన్న సమయంలో అయోధ్య ఉద్యమానికి ముందు హిందువుల ప్రస్తావన బీజేపీ వ్యవహారాల్లో ఉన్నా హిందుత్వం కోరలు సాచలేదు. అయోధ్యలో రామమందిర ఉద్యమం తరవాతే హిందుత్వం కోరలు పదునెక్కాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ భారతీయత అంటే హిందుత్వ అని భాష్యం చెప్పేదాకా వెళ్లారు. సాంస్కృతిక జాతీయతావాదం పేర హిందుత్వ భావజాలాన్ని ప్రచారంలో పెట్టడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తే అధికారం చేతిలో ఉన్న నరేంద్ర మోదీ మరో దారిలో హిందుత్వను అమలు చేయడాన్ని నిరాఘాటంగా కొనసాగించగలిగారు. అంతకు ముందు బీజేపీ హిందువులకు అనుకూలమైన, వారి ప్రయోజనాలు కాపాడే పార్టీగా ఉండి ఉండొచ్చు. మోదీ హయాంలో బీజేపీ ముస్లింలను ద్వేషించే పార్టీగా రూపాంతరం చెందింది.
కర్నాటక ఓటర్లు మతతత్వాన్ని ఇంత లోతుగా అవగాహన చేసుకుని బీజేపీని ఓడిరచారని చెప్పడానికి ఆధారాలు లేవు. కర్నాటకలో ఓటమి వల్ల బీజేపీ ప్రభావం భౌగోళికంగా కొంత మేర తగ్గి ఉండవచ్చు. కానీ మానసిక, భావోద్వేగ స్థాయిలో మతతత్వం మటుమాయం అయిందని చెప్పే అవకాశంలేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు తోడు హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే హిందూ మున్నానీ లాంటివి తమిళనాడులో అవతరించి చాలా కాలమే అయింది. కేరళలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలు గట్టిగానే పని చేస్తున్నారు. కర్నాటకలో శ్రీరామ సేన చాలా కాలంగా విద్వేషం రగులుస్తూనే ఉంది. బీజేపీకి జనాదరణ పెరగడానికి ఇలాంటి సంస్థలన్నీ ఏదో ఒక మేరకు దోహదం చేశాయి. కర్నాటకలో బీజేపీ పరాజయం పాలై ఉండొచ్చు. కానీ బీజేపీ ఓట్ల శాతం ఏ మాత్రం తగ్గలేదు. 2018లో వచ్చిన ఓట్ల శాతానికి, ఇప్పుడు సాధించిన ఓట్ల శాతానికి పెద్ద తేడా లేదు. కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెరగడానికి ఇతర కారణాలున్నాయి. కర్నాటకలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన హిందుత్వ వాదం లేదా హిందుత్వ శక్తులనుంచి ముప్పు తగ్గుతుందనుకోవడం భ్రమ. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలవగలగడానికి కారణం హిందుత్వ వాదం బలహీన పడడం కానే కాదు. మతతత్వ రాజకీయాలు ఎన్నికలలో ఉపయోగపడడం వాస్తవమే. కానీ ఇతర అంశాలు ప్రజల దృష్టిలో ప్రధానమైన సందర్భంలో మతపరమైన అంశాలను ఓటర్లు అంతగా పట్టించుకోక పొవచ్చు. కర్నాటకలో జరిగింది ఇదే. బీజేపీ ఓడిపోవడానికి ప్రజలు దృఢ సంకల్పంతో మతతత్వాన్ని తిరస్కరించారని చెప్పే అవకాశం లేదు. ఇలాంటి విషయాలలో ప్రజల నిర్ణయం ఎప్పుడూ ఒకే రకంగా, నిలకడగా ఉంటుందని చెప్పలేం. కర్నాటకలో బీజేపీ ఓటమి మతోన్మాదం అంతరించిందని కాదు. నిరంతర జాగరూతను విస్మరించకూడదు. మతం క్రీనీడలు ఇంకా పాకుతూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img