Monday, October 3, 2022
Monday, October 3, 2022

మద్దతు ధరపై కుటిల రాజకీయం

‘‘కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ఇప్పటికీ నెరవేరలేదు. ఎందుకంటే మోదీకి ఒక మిత్రుడు ఉన్నాడు. ఆయన పేరు అదాని. రైతులకు హామీ ఇచ్చినట్టుగా కనీస మద్దతు ధర ఇవ్వకపోతే రైతులు మళ్లీ పోరుబాట పడ్తారు. అది భీకరంగా ఉంటుంది. ఈ దేశ రైతులను విస్మరించడం సాధ్యం కాదు. వారిని ఓడిరచలేం. రైతులను భయపెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే వారి మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ ను ప్రయోగించడం కుదరదు. అలాంటప్పుడు ఎలా భయపెడ్తారు? రైతులు తమ కోర్కెలు నెరవేరే దాకా పోరాడతారు’’. గత ఆదివారం ఈ మాటలన్నది సాక్షాత్తు మేఘాలయ గవర్నర్‌ సత్పాల్‌ మాలిక్‌. అంతకు ముందు 2021 నవంబర్‌ 8న అంతర్జాతీయ జాట్ల సమావేశానికి ఆహ్వానించినప్పుడు ‘‘మీరు సిక్కులను లొంగ దీయలేరు. సిక్కుల గురువైన గురునానక్‌ నలుగురు కొడుకులను హతమార్చారు. అయినా ఆయన లొంగలేదు. అలాగే జాట్లనూ ఓడిరచడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ మాట అన్నది రైతు ఉద్యం నేపథ్యంలోనే. సత్పాల్‌ మాలిక్‌ బిహార్‌, గోవా, జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ కాక ముందు బీజేపీ నాయకుడే. ఆయిన ఉన్న మాట చెప్పడానికి అలవాటు పడ్డ వారు. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు గత ఏడాది చివరలో మోదీ సర్కారు నిర్ణయించిన తరవాత గానీ రైతులు ఆందోళన విరమించలేదు. అయితే రైతుల ఆందోళనలో మరో అంశమూ ఉంది. అది కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం. దానికీ ప్రభుత్వం తలూపినట్టే కనిపించినా ఇంతవరకు ఆ ఛాయలే లేవు. ఇటీవల మద్దతు ధర వ్యవహారం పరిశీలించడానికి మోదీ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీలో ఉన్నవారు రైతు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే. ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు సంఘాల ముగ్గురు సభ్యులను ఈ కమిటీలో నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఈ కమిటీని బహిష్కరిస్తున్నామని అందువల్ల తమ ప్రతినిధులను సూచించబోమని కూడా సంయుక్త కిసాన్‌ మోర్చా మొహాన కొట్టినట్టు చెప్పింది. మళ్లీ ఉద్యమ బాట పడ్తామని కూడా హెచ్చరింది. దానికి అనుగుణంగానే సోమవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌లో రైతులు ఒక రోజు ఆందోళన చేశారు. ఏడాదికి పైగా దిల్లీ పొలిమేరల్లో జరిగిన ఉద్యమం కేవలం మచ్చు మాత్రమేనని ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోకపోతే అసలు ఉద్యమం భీకరంగా ఉంటుందని సోమవారం రైతు నాయకులు హెచ్చరించారు. సెప్టెంబర్‌ ఆరో తేదీన జరిగే సమావేశంలో భవిష్యత్‌ కార్యక్రమం ఖరారు చేస్తామని సం యుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు రాకేశ్‌ తికైత్‌ తెలియజేశారు. ఈ సారి ఉద్యమం బిహార్‌ నుంచి మొదలవుతుందని కూడా ఆయన అన్నారు. రైతుల వివాదాస్పద చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకుండా ఉంటే కనీస మద్దతు ధర ఇప్పటికే గత చరిత్ర అయిపోయేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వ పంపిణీ విధానం కూడా ఆగిపోయేదని, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడేదని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించదల చుకున్న విద్యుత్‌ బిల్లులు కనక ఆమోదం పొందితే గృహావసరాలకు వాడే విద్యుత్‌ చార్జీలు నాలుగైదు రెట్లు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ బిల్లులు ప్రైవేటు రంగ ప్రయోజనానికే అంటున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక నిబంధనలు కార్మికులకు మరణ శాసనం లాంటివని, భవిష్యత్‌ ఉద్యమం రైతులు, కార్మికవర్గం కలిసి నిర్వహిస్తాయని రైతులు ఖండితంగా చెప్తున్నారు. రైతుల హెచ్చరికల అంతస్సారామే సత్పాలిక్‌ మాలిక్‌ వ్యాఖ్యల్లో ప్రస్ఫుటం అవుతోంది. మాలిక్‌ వ్యాఖ్యలు వివాదాలను రేకెత్తించేవిగా కనిపించవచ్చు. దాదాపు ఏడాది కింద మాలిక్‌ ప్రధానమంత్రి మోదీని కలుసుకుని రైతుల సమస్యను లేవనెత్తి 500 మందికి పైగా రైతులు మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘వారు నా కోసం మరణించారా?’’ అని మోదీ తనకు సహజమైన ఆహంకార పూరిత ధోరణిలో ప్రశ్నిస్తే దీనికి మాలిక్‌ సమాధానమిస్తూ ‘‘అవును రాజు మీరే. మీరు ప్రధానిగా ఉన్నది రైతుల చలవ వల్లే’’ అని కూడా మొహాన చెప్పేశారు. అధికార పక్షంలోని ఏ రాజకీయ నాయకుడూ మోదీ ముందు నోరెత్తే ప్రయత్నమైనా చేయలేని స్థితిలో మాలిక్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఆయన ధైర్య సాహసాలకు ప్రతీక.
రైతుల సత్యాగ్రహాన్ని అణచి వేయడానికి మోదీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వారి సంకల్ప బలం ముందు మోదీయే తల వంచవలసి వచ్చింది. కానీ బూటకపు వాగ్దానాలు చేయడం మోదీ నైజం. అందుకే కనీస మద్దతు ధరపై హామీ ఇంతవరకు నెరవేరలేదు. నెరవేరే సూచనా లేదు. దానికి కారణం కూడా సత్పాల్‌ మాలిక్‌ మాటల్లోనే ఉంది. అదానీ లాంటి కార్పొరేట్‌ సామ్రాట్టులను కాదని ఏమీ చేయలేని దయనీయస్థితిలో మోదీ ఉన్నారు. ప్రధాని పదవిలో ఉన్నది మోదీయే అయినా అసలు ప్రభుత్వ పగ్గాలు అదానీ, అంబానీ లాంటి వారి చేతుల్లోనే ఉన్నాయి. సత్పాల్‌ మాలిక్‌ హెచ్చరికలను ఆషామాషీగా తీసుకోవడం అసలుకే మోసం. రైతుల ఉద్యమానికి ఇది విరామమే తప్ప అది ఆగిపోలేదు అన్నది వాస్తవం. రైతు ఉద్యమం రాజకీయాలతో సంబంధం లేకుండానే సాగి ఉండవచ్చు. కాని అది రాజకీయాల దిశనే మార్చేసింది. బెంగాల్‌ శాసన సభ ఎన్నికలకు ముందు రైతు నాయకులు బెంగాల్‌లో పర్యటించారు. ఫలానా పార్టీకి ఓటు వేయాలని వారు చెప్పకపోయినా బీజేపీకి మాత్రం వేయకండి అని స్పష్టంగానే తెలియజేశారు. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడడమే రైతుల సత్తాకు స్పష్టమైన సంకేతం. పంజాబ్‌ శాసనసభ ఎన్నికలకు ముందు కొన్ని రైతు సంఘాలలో చీలిక వచ్చినట్టు కనిపించింది. కానీ పంజాబ్‌ రైతులతో పాటు హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు రైతులు కూడా సోమవారం దిల్లీలో రోడ్డెక్కారు. అంటే రైతుల ఐక్యత చెక్కు చెదరలేదు. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడంతో పాటు లఖింపూరిఖేరీ సంఘటనలో ప్రధాన నిందితుడైన ఆశీష్‌ మిశ్రా తండ్రి, కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను అరెస్టు చేయాలన్న డిమాండును రైతులు వదులుకోలేదు. మరింత ఉధృతంగా ఉద్యమం ప్రారంభించడానికి సోమవారం నాటి దిల్లీ మహాపంచాయత్‌ రిహార్సల్‌ లాంటిదంటున్నారు. లఖింపూర్‌ఖేరీ సంఘటనలో రైతులు ఇప్పటికీ జైళ్లలోనే మగ్గుతున్నారు. పోలీసులు, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిష్పాక్షికంగా ఉంటే కనీసం వారు బెయిలు మీదైనా విడుదలయ్యే వారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. మోదీ కపట నాటకాన్ని గ్రహించినందువల్లే గ్రామీణ ప్రాంత యువకులు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. కనీస మద్దతు ధరకోసం కంటి తుడుపుగా మోదీ సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలనాంశాల్లో మద్దతు ధర ఊసే లేకపోవడం కుటిల రాజకీయానికి పరాకాష్ఠ. ఈ కుటిలత్వమే మరోసారి రైతుల ఆందోళనకు ఆజ్యం పోస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img