మన ఆర్థికవ్యవస్థ వేగంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నప్పటికీ వృద్ధిరేటు ఆర్‌బీఐ వెల్లడిరచిన దానికంటే మరింత తగ్గనున్నది. ఈ ఆర్థిక సంవత్సరమేగాక రానున్న సంవత్సరాలలోనూ వృద్ధిరేటు తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్) తాజాగా అంచనాను ప్రకటించింది. మరోవైపు అన్నిరకాల నిత్యావసర వస్తువులు, శిలాజ ఇంధనాల ధరల పెరుగుదలను స్థిరీకరించడంపై కూడా ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు చర్చలు జరుపుతోంది. ఈ సంస్థల అధ్వర్యంలో జరుగుతున్న చర్చల్లో అనేక దేశాలు పాల్గొన్నాయి. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం నియంత్రణ అంశాలు ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాదాపు మూడేళ్లపాటు కొవిడ్19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం మూలంగా ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు తల్లకిందులయ్యాయి. భారతదేశం లోనూ ఆర్థికరంగం కుదేలైపోయింది. అలాగే ఉక్రెయిన్
రష్యాల మధ్య ఏడాదికిపైగా జరుగుతున్న యుద్ధం వృద్ధిరేటు తగ్గడానికి ప్రధాన కారణాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు గతంలో 6.1శాతం ఉండవచ్చునని అంచనా వేసినప్పటికీ తాజా అంచనా 5.9శాతం ఉంటుందని ఐఎమ్‌ఎఫ్ ప్రకటించింది. వార్షిక ఆర్థిక దృక్పధం నివేదికలో 202425 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు కూడా 6.3శాతమే ఉంటుందని వార్షిక నివేదిక పేర్కొంది. గతంలో 6.8శాతం ఉండ వచ్చునని అంచనా వేశారు. 2022
23ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.8శాతం ఉన్నప్పటికీ 202324 ఆర్థిక సంవత్సరంలో 5.9శాతం మాత్రమే ఉండవచ్చునని కూడా ఈ సంవత్సరం జనవరిలోనే ఐఎంఎఫ్ ప్రకటించింది. రిజర్వుబ్యాంకు 2022
23లో 7శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.4శాతం ఉండవచ్చునని అంచనావేసింది. అయితే ప్రభుత్వ అంచనాలు, ప్రకటనలు వేరు గానూ, గొప్పలు చెప్పుకోవడం లాంటివి కనిపిస్తాయి. ప్రభుత్వం 2022`23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వం ప్రకటించే గణాంకాలపై గతంలో ఆర్థికనిపుణులు సందేహాలు వెలిబుచ్చారు. 2022లో 6.8శాతంగా ఉన్న వృద్ధిరేటు గణనీయంగా తగ్గుతుందని అది 5.9శాతానికి పరిమితం కావచ్చునని ఐఎంఎఫ్ తెలిపింది. కరోనా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ వృద్ధిరేటు తక్కువ గానే నమోదైంది. చైనా వృద్ధిరేటు కూడా 2023లో 5.2శాతం, 2024లో 4.5శాతం ఉండవచ్చునని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరోనా మహమ్మారి, యుద్ధం కారణంగా కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటున్నది. అయితే ఇదే సమయంలో మళ్లీ ఒమిక్రాన్ మహమ్మారి కొత్తరకం తలెత్తడం, యుద్ధం ఇంకా ఆగకపోవడం, ముడిచమురు ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు నిర్ణయించడం వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది.
మన దేశంలో కరోనా మహమ్మారి తలెత్తిన మొదటి దశ ప్రారంభంలోనే ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. ఉత్పత్తి, పారిశ్రామిక, నిర్మాణ రంగాలు నిలిచిపోయాయి. చిన్నపరిశ్రమలు, వ్యాపారసంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోట్లాదిమంది ఉద్యోగులు, కార్మికులు పనులు కోల్పోయారు. నిరుద్యోగం అపారంగా పెరిగిపోయింది. వలస కార్మికులు సహా అన్ని పరిశ్రమలు, ఉత్పత్తిరంగంలో పనిచేసేవారు ఇండ్లకే పరిమితమైపోయారు. ఆదాయాలు పడిపోయాయి. అనేక కష్టనష్టాలకుగురై వందలు, వేల మైళ్లు నడిచి సొంత గ్రామాలకు చేరుకున్న లక్షలాదిమందికి వ్యవసాయరంగమే కొంతవరకు సహాయ పడిరది. ప్రభుత్వం వీరికి ఏ మాత్రం సహాయపడకపోవడంతో కార్మికులు, ఉద్యోగులు నేటికీ పూర్తిగా కోలుకోలేదు. వీరి ఆదాయాలు పెరగక కొనుగోలుశక్తి పడిపోయింది. ఉత్పత్తి రంగం దెబ్బతిని ఎగుమతులు ఆగిపోయాయి. ఈ పరిస్థితులన్నీ వృద్ధిరేటు తగ్గడానికి కారణమయ్యాయి. ఇప్పుడిప్పుడే అన్నిరంగాలు పుంజుకుంటున్నప్పటికీ ఉత్పత్తులు పెరగడంలేదు. ఫలితంగా ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయి దిగుమతులు పెరిగాయి. మేక్‌ఇన్ ఇండియా నినాదానికి మత్రమే పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం పరిస్థితులు ఏర్పడటం వల్ల పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమలను విస్తరించిఉత్పత్తి పెంచడం కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతోంది. సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు లేదా ఉన్నవాటిని విస్తరించుకోవడానికి బ్యాంకులు అప్పులు విరివిగా వెనుకాడుతున్న గత పదేళ్లకాలంలో బ్యాంకుల నుంచి వేల, లక్షల కోట్లు రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించకుండా అనేకమంది విదేశాలకు పారిపోయారు. దాదాపు 15లక్షల కోట్లు పదేళ్ల కాలంలో ప్రభుత్వం ఈ రుణాలు రద్దుచేశాయి. తాజాగా అదానీ గ్రూపు కంపెనీల కుంభకోణం బ్యాంకులను, ఆర్థికసంస్థలను తీవ్రంగా నష్ట పరిచింది. ఈ పరిణామాలు విదేశీ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు దేశంలోకి రావడం తగ్గింది. ఇవి కూడా ఉత్పత్తి రంగం ఇంకా మాంద్యంలో ఉండేందుకు, వృద్ధిరేటు తగ్గేందుకు కారణమవుతున్నాయి. ప్రభుత్వ అపసవ్య విధానాలు, అసమర్థ పాలన ఈ రుగ్మతలకు ప్రధాన కారణాలవు తున్నాయని అనేకమంది ఆర్థికవేత్తలు, రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్లు విమర్శిస్తున్నారు. ఇక ఆర్థికవ్యవస్థ అభివృద్ధి వేగిరమవుతోందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉండబోదని ఇంతవరకు కలిగిన అనుభవాలు చెప్తున్నాయి. పేదరికం 20శాతానికిపైగా ఉందని అనేక దేశ, విదేశీ సర్వేలు చెప్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం పేదరికమా.. అదెక్కడుందని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తోంది. కార్పొరేట్లకు, బడా పెట్టుబడి దారుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పెద్దగా లేవు. వృద్ధిరేటు, ఆర్థికవ్యవస్థ పెరిగినప్పటికీ దేశంలో ఆర్థిక అసమానతలు మిక్కుటమవుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం పోటీపడి పెరగడం పాలనా అసమర్థతకు సూచికలు కావా!