Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

మరో ఆరేళ్లు ఆగితే…

మరో ఆరేళ్లు ఆగితే మొదటి సారి ఓ మహిళ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి బి.వి.నాగరత్న పేరును సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానానికి సిఫార్సు చేసింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. న్యాయమూర్తి నాగరత్న సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆమె 2027లో న్యాయవ్యవస్థలో అగ్రస్థానాన్ని అందుకోగలుగుతారు. అయితే ఆమె ఆ స్థానంలో ఉండగలిగేది దాదాపు నెలే. 22 నెలల ప్రతిష్ఠంభన తరవాత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ నాయకత్వంలోని అయిదుగురు సభ్యుల కొలీజీయం న్యాయమూర్తి నాగరత్నతో సహా మొత్తం తొమ్మిది మంది వివిధ హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. తెలంగాణ హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి అయింది న్యాయమూర్తి కోహ్లీనే. గుజరాత్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి బేలా త్రివేది పేరు కూడా కోలీజియం సిఫార్సుల్లో ఉంది. వీరితో పాటు గుజరాత్‌ నుంచి విక్రం నాథ్‌, సిక్కిం నుంచి జె.కె. మహేశ్వరి, కర్నాటక నుంచి అభయ్‌ ఓకా, కేరళనుంచి సి.టి రవి, మద్రాసు నుంచి ఎం.ఎం. సుందరేశ్‌ పేర్లు కూడా కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో ఉన్నాయి. మాజీ అదనపు సోలిసిటర్‌ జనరల్‌ పి.ఎస్‌. నరసింహ కూడా ఈ తొమ్మిది మందిలో ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఎవరెవరి పేర్లు సిఫార్సు చేయాలన్న విషయంలో మొన్నటి దాకా కొలీజియంలోనే ఏకాభిప్రాయం కుదరలేదు. కొలీజియం సభ్యులుగా ఉండి కొద్ది రోజుల కింద ఉద్యోగ విరమణ చేసిన రొహింటన్‌ నారిమన్‌ దేశంలోకెల్లా అందరికన్నా సీనియర్లయిన న్యాయమూర్తులు అభయ్‌ ఓకా (కర్నాటక), అకిల్‌ ఖురేషీ (త్రిపుర)ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేయాలని పట్టుబట్టారు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన కొన్నాళ్లకే కొలీజియం సిఫార్సులు పంపడం గమనించదగిన పరిణామం. అయితే న్యాయమూర్తి నారిమన్‌ పట్టుబట్టిన న్యాయమూర్తి అభయ్‌ ఓకా పేరు కొలీజియం పంపిన జాబితాలో ఉంది. కాని అకిల్‌ ఖురేషీ పేరును మాత్రం సిఫార్సు చేయలేదు. ప్రస్తుతం కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల్లో న్యాయమూర్తి ఓకా, హిమా కోహ్లి ప్రభుత్వాలను నిలదీసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓకా మొదటి నుంచి పౌరహక్కులకు అనుకూలంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. కరోనా సందర్భంగా కాలినడకన సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికుల మేలు కోసం ఓకా అనేక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ సైతం ప్రభుత్వాన్ని నిర్భయంగా నిలదీశారు. ఇలాంటి వారి పేర్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థానానికి సిఫార్సు చేయడం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన తరవాత ఎన్‌.వి. రమణ వ్యవహార సరళికి అనుకూలంగా ఉందనుకోవాలేమో. కొలీజియం సిఫార్సు చేసిన మరో న్యాయమూర్తి విక్రం నాథ్‌ గుజరాత్‌ హైకోర్టులో ఉండగా కరోనా సమయంలో ఆసుపత్రుల్లో పడకలు లేకపోవడం, అత్యవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంపై పదునైన విమర్శలు చేశారు. హైకోర్టు విచారణను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించిన మొట్టమొదటి న్యాయమూర్తి కూడా విక్రం నాథే. మొత్తం మీద కొలీజియం సిఫార్సు చేసిన వారు ఏదో ఒక విశిష్ఠత ఉన్నవారిలాగే కనిపిస్తున్నారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో ముగ్గురు మహిళలు ఉండడం అందులో ఒక మహిళా న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండడం విశేషమే. ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థానాల్లో ఖాళీలు భర్తీ అయి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. న్యాయమూర్తి నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడమే కాకుండా 2027లో ఆమె ప్రధాన న్యాయమూర్తి అయితే మరో రికార్డు కూడా నెలకొల్పినట్టవుతుంది. ఆమె తండ్రి ఇ.ఎస్‌. వెంకట్రామయ్య 1989 జూన్‌ నుంచి 1989 డిసెంబర్‌ వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.
న్యాయమూర్తి నాగరత్న ఇటీవల వివిధ కేసుల విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పరిజ్ఞానానికే కాక ఆమె వైఖరికి కూడా నిదర్శనంగా నిలుస్తాయి. ‘‘పితృస్వామికమైన మన సమాజంలో సాధికారికులైన మహిళలతో ఎలా వ్యవహరించాలో తెలియదు’’ అన్నారు. ఇదీ మహిళల మీద ఆమె ధోరణి. బడిపిల్లలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కేసు విచారణకు వచ్చినప్పుడు ‘‘కాలే కడుపుతో ఎవరూ చదువుకోలేరు’’ అనడం చదువుకోవడానికి ఆకలి తీరాలని ఆమె ఆలోచన. అలాగే జులైలో న్యాయమూర్తులు నాగరత్న, హంచతె సంజీవ్‌ కుమారు ‘‘అక్రమమైన తల్లిదండ్రులు ఉండొచ్చు కానీ, అక్రమ సంతానం ఉండరు’’ అన్న వ్యాఖ్య స్త్రీపురుష సంబంధాలనే కాక బాలల భవిష్యత్తు మీద కూడా ఆ ఇద్దరు న్యాయమూర్తులకు ఉన్న నిష్ఠకు తార్కాణం. న్యాయమూర్తి నాగరత్న సాహసి కూడా. 2009లో కర్నాటక హైకోర్టులోని కొందరు న్యాయవాదులు ఆమెతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులను గదిలో బంధిస్తే ఆమె జడవలేదు. ఆగ్రహించలేదు. ‘‘నాకు కోపం లేదు. న్యాయవాదులు ఈ పని చేయడమే విచారకరంగా ఉంది. సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తోంది’’ అనడం ఆమె వ్యక్తిత్వానికి ప్రతిబింబం. మహిళలు ఉన్నత స్థానాల్లోకి వెళ్తే సంతోషించడం నిష్కారణమేమీ కాదు. స్త్రీల విషయంలో సమాజం దృష్టి, వారికి అవకాశాలు తక్కువ కావడం, విద్యలోనూ వెనుకబడి ఉండడం, పురుషాధిక్య సమాజంలో అంతర్నిహితమైన మహిళలంటే చిన్న చూపు లాంటి అడ్డంకులు ఉంటాయి కనక మహిళలు ఒక్క ముందడుగు వేసినా ఆనందించాల్సిందే. న్యాయమూర్తి నాగరత్న ప్రధాన న్యాయమూర్తి అయిన రోజు నిజంగా కొత్త రికార్డే. ఎందుకటే మన గణ తంత్ర దివసం రోజే సుప్రీంకోర్టు కూడా నెలకొంది. అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా మహిళకు అవకాశం రావడం 71 ఏళ్లకూ సాధ్యం కాలేదు. మరో ఆరేళ్లు ఆగాల్సిందే. మొదటి ప్రధానమంత్రి మహిళ కావడానికి స్వాతంత్య్రం తరవాత 20 ఏళ్లే పట్టింది. రాష్ట్రపతి పదవి మహిళకు దక్కడానికి 47 ఏళ్లు పట్టింది. మొదటి లోకసభ స్పీకర్‌ కావడానికి 52 ఏళ్లు పట్టింది. మహిళ గవర్నర్‌ కావడం స్వతంత్రం రావడంతోటే మొదలైంది. సరోజినీ నాయుడు 47 లోనే గవర్నర్‌ అయిన మొదటి మహిళ. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తి హిమా కోహ్లీకీ ఓ ప్రత్యేకత ఉంది. ఆమె ప్రస్తుతం తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి. ఆ పదవిలో ఉన్న మొదటి మహిళ ఆమే. 1989లో ఫాతీమా బీవీతో మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావడం మొదలైంది. కానీ ఇప్పటిదాకా ఎనిమిది మంది మహిళలే ఆ స్థానాన్ని అందుకోగలిగారు. లీలా సేఠ్‌ 1991లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి మహిళ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img