Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

మరో రెండేళ్లు ఆర్థిక మాంద్యం

కొవిడ్‌ మహామ్మారి కొత్త రకాలు భయపెడుతుండటం, ఉక్రెయిన్‌`రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపధ్యంలో మరో రెండేళ్లు, భారత దేశంలో ఆర్థికమాంద్యం కొనసాగే సూచనలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తులు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, విదేశీ మారక ద్రవ్యాల వినియోగం తదితర అనేక కారణాల వలన రానున్న రెండేళ్లలో భారతదేశం ఆర్థికమాంద్యం ఎదుర్కోనున్నదని తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచ ఆర్థికరంగం భవిత’ నివేదిక స్పష్టం చేసింది. 2023లో 6.6, 2024లో 6.1 జీడీపీలు నమోదవుతాయని కూడా ఈ నివేదిక తెలియజేసింది. 2023లో భారతదేశం సహా ప్రపంచ ఆర్ధికరంగంలో మాంద్యం ఉంటుందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టరు క్రిస్టిలినా జార్జివ బహిరంగంగా వెల్లడిరచారు. మన దేశంలో ఒమిక్రాన్‌ కొత్తరకం ఇంకా విస్తరించనందున మనం ధీమాగా ఉండవచ్చునని మన కేంద్ర పాలకులు చెపుతున్నారు. మన ప్రభుత్వంవేసే అంచనాలు, లేదా గణాంకాలు విశ్వసించడం కష్టమే. ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు చేస్తున్న హెచ్చరికలను ఎంతమాత్రం తిరస్కరించలేం. 2023లో ప్రపంచ జీడీపీలో మూడిరట ఒక వంతు కుదించుకుపోతుందని క్రిస్టిలినా హెచ్చరించారు. భారతదేశంలో 2022 జూన్‌లో నమోదైన జీడీపీ వృద్ధిరేటు కంటే 2023లో 0.5శాతం, 2024లో 0.4శాతం తగ్గిపోతుందని ప్రపంచబ్యాంకు నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితులన్నీ కలిసి మనదేశంలో పేదరికం పెరుగుతుందని, ఇది తీవ్రంగానే ఉంటుందని అంచనాలున్నాయి.
మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ సర్వేలను, నివేదికలను ఏ విషయంలోనూ అంగీకరించదు. గడిచిన డిసెంబరు వరకు 81కోట్ల మందికిపైగా ఒక్కొక్కరికి పది కిలోలు ఆహారధాన్యాలను పంపిణీచేసిన మోదీ ప్రభుత్వం పేదరికం ఎక్కడుందని ఎదురుప్రశ్న వేస్తుంది. పైగా ఆర్థికమాంద్యం 24నెలలు కొనసాగుతుందన్న హెచ్చరికల మధ్య ఆహారధాన్యాల పంపిణీని 5కిలోలకు కోసి పెద్ద సంఖ్యలో ప్రజలను మరిన్ని కష్టాలపాలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పూనుకోవడం దారుణం. ఒకవైపు నిరుద్యోగం, ఆర్థికమాంద్యం పెరగనున్న సమయంలో అమెజాన్‌ లాంటి దిగ్గజాలైన కంపెనీలు, ఐటి సంస్థలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించడం ఆర్థిక మాంద్యానికి స్పష్టమైన సంకేతం. ఒక్క అమెజాన్‌లో 20వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. భారతదేశం సహా దక్షిణాసియా దేశాల్లో వడ్డీరేట్ల పెరుగుదల, వాణిజ్య భాగస్వామ్యం పెరుగుదల బలహీనంకావడం, ఎగుమతులు తగ్గిపోవడం ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయి. ప్రపంచ ద్రవ్యపరిస్థితులు క్లిష్టంగా మారడం అంచనావేసిన దానికంటే ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో అన్ని రకాల సేవలరేట్లు అధికమవుతాయి. ఇప్పటికే అన్ని రకాల, వస్తువులు, వంటనూనెలు, రవాణా చార్జీలు, అనేక సేవలరేట్లు పెరిగిపోయి సామాన్య ప్రజల జీవనం భారమైంది. 2019 నాటికంటే భారతదేశం వస్తువుల వాణిజ్యలోటు రెండు రెట్లు తగ్గిపోయింది. 2019 నవంబరులో 24 బిలియన్‌ డాలర్లు కాగా ఇప్పుడు ఈ లోటు రెండు రెట్లు పెరిగింది. పెట్రోలియం ఉత్పత్తుల్లో 7.6 బిలియన్‌ డాలర్లు, మిశ్రమలోహాలు, ఖనిజాల తదితర వస్తువుల్లో 4.2 బిలియన్‌ డాలర్ల లోటు మరింత విస్తరించింది. గత నవంబరులో మనదేశం 550 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఉపయోగించుకున్నది. జీడీపీలో ఇది 16శాతం. అయితే మారక ద్రవ్యరేటు ఎగుడు దిగుళ్లకు లోనుకావడంతో డాలరుతో పోల్చినప్పుడు రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉంది. ప్రస్తుతం రూపాయి విలువ తగ్గుదల పెరిగిందే కానీ తగ్గలేదు. అయితే జీడీపీ వృద్ధిరేటు మన దేశంలో పెరుగుతూనే ఉందని, ప్రపంచ పరిస్థితులు దిగజారిపోతున్నందున పెట్టుబడులు తగ్గిపోయి కొత్త పరిశ్రమలు, ఉత్పత్తులు పెరగడంలేదు.
పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాలు, చైనాలలో ఆర్థికమాంద్యం కొనసాగుతున్నది. ఈ దేశాల్లో కొవిడ్‌ మహమ్మారి విస్తరిస్తున్నదని వార్తలు వస్తున్న నేపధ్యంలో వస్తువుల ఉత్పత్తులు, సరఫరాలు తగ్గిపోయి అభివృద్ధి చెందుతున్న దేశాలపైన ప్రతికూల ప్రభావం పడుతుంది. భారతదేశంలో కొవిడ్‌ నాలుగోదశ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ తాజాగా హెచ్చరించారు. 2020లో మన దేశంలో ఒమిక్రాన్‌ వైరస్‌ ప్రవేశించి రెండేళ్లకు పైగా గడగడలాడిరచింది. లక్షలమంది మృతి చెందారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కోట్లాదిమంది ప్రజలు పని ప్రదేశాల నుంచి తమ నివాస ప్రాంతాలకు చేరుకోవడానికి ఎనలేని కష్టాలు పడ్డారు. ఆకస్మికంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని రంగాలు స్తంభించిపోయి కోట్లాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉత్పతులు క్షీణించాయి. మోదీ ప్రభుత్వం సామాన్యులకు ఎలాంటి సహాయం చేయలేదు. వైద్యసేవలోనూ ప్రభుత్వం విఫలమైంది. వస్తువుల సరఫరా పడిపోయింది. దీనితో కూరగాయల నుంచి అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆనాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక మాంద్యం కొనసాగుతుందన్న హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకొని అప్రమత్తం కావాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img