Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

మళ్లీ చర్చకొచ్చిన ప్రతిపక్ష ఐక్యత

బీజేపీని ఓడిరచడానికి ప్రతిపక్షాల ఐక్యత ఎంత అవసరమో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ మరో మారు చర్చకు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీపై భారీ మెజారిటీతో విజయం సాధించవచ్చునని ఆయన అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు మూడవ ఫ్రంట్‌ ఏర్పాటు లాంటిది ఏమీ ఉండదని ఉండేదల్లా ఒకే ‘‘ప్రధానమైన ఫ్రంట్‌’’ అని జనతాదళ్‌ (యునైటెడ్‌ – జే.డి(యు)) మహాసభలో తేల్చి చెప్పారు. అయితే ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడడానికి సిద్ధమైతేనే బీజేపీని ఓడిరచడం సాధ్యమన్న వాస్తవాన్నీ అరమరికలకు తావు లేకుండా తెలియజేశారు. ప్రతిపక్షాల ఐక్యతను సాకారం చేయడానికి ప్రయత్నిస్తుంటూనే ఉంటానని నితీశ్‌ అన్నారు. ఇటీవలి కాలంలోనే నితీశ్‌ దిల్లీ వెళ్లి అనేకమంది ప్రతిపక్ష నాయకులను కలుసుకుని ఈ ప్రస్తావన గట్టిగా తీసుకొచ్చారు. తాను ప్రధానమంత్రి కావడంకోసమే నితీశ్‌ ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కానీ తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదని అంటున్నారు. ప్రధానమంత్రి ఎవరు అన్న విషయాన్ని 2024 ఎన్నికలు ముగిసిన తరవాత తేల్చుకోవచ్చునన్నది ఆయన అభిప్రాయం. మొన్నమొన్నటి దాకా బీజేపీతో కలిసి బిహార్‌ ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్‌ ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని లాలూ ప్రసాద్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌.ఎల్‌.డి) తో కలిసి సంకీర్ణప్రభుత్వం ఏర్పాటు చేశారు.
బీజేపీతో పొత్తు కొనసాగినన్నాళ్లూ నితీశ్‌ అడగుడుగునా ఒత్తిడి ఎదుర్కుంటూ మానసిక క్షోభ అనుభవించారు. బీజేపీతో ఉన్నన్నాళ్లు నితీశ్‌ది కలహాల కాపురమే. బీజేపీ సిద్ధాంతాలకు, జేె.డి.(యు) సిద్ధాంతానికి ఎక్కడా పొంతనే లేదు. అయినా రాజకీయ అవసరాలకోసం నితీశ్‌ బీజేపీతో చేతులు కలపవలసి వచ్చింది. ఆర్‌.ఎల్‌.డి.తో కలవడంవల్ల నితీశ్‌కు సైద్ధాంతిక సారూప్యత పెరిగింది. వాస్తవాలను వెల్లడిరచడానికి మోదీ సర్కారు మీడియాను అడ్డుకుంటోందనీ బీజేపీ అధికారం కోల్పోతే వాస్తవాలు బయట పడతాయని నితీశ్‌ భావిస్తున్నారు. ప్రతిపక్షాలు ఐక్యమైతే మోదీని గద్దెదించడం సాధ్యమేనని వివిధ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ప్రతిపక్షాలు సమైక్యమైతేనే ఆ గణాంకాలకు విలువ ఉంటుంది. ప్రతిపక్షాల ఐక్యత విజయానికి దారి తీస్తుంది అని నితీశ్‌ లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడే చెప్పక్కర్లేదు. ఐక్యత లేకపోతే మోదీ పాలనకే మళ్లీ పట్టం దక్కుతుంది. ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలలో భాగంగా నితీశ్‌ కుమార్‌ భారత జాతీయ లోక్‌దళ్‌ నాయకుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి దేవీలాల్‌ 109వ జయంతి సందర్భంగా ఫతేబాద్‌లో ఏర్పాటుచేసిన ర్యాలీకి నితీశ్‌ హాజరయ్యారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన నాయకుడు అరవింద్‌ సావంత్‌, శిరోమణి అకాలీదళ్‌ నాయకుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ లాంటి వారు హాజరయ్యారు. గత ఆగస్టులో నితీశ్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్‌.జె.డి., కాంగ్రెస్‌, వామపక్షాలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటినుంచే ప్రతిపక్షాలను ఒక్క తాటి మీదకు తీసుకురావడానికి నిరంతరం పాటు పడుతూనే ఉన్నారు.
ప్రతిపక్ష ఐక్యత కష్టసాధ్యమైన పనే అయినప్పటికీ మోదీని గద్దె దించాలన్న లక్ష్యశుద్ధి ఉంటే అసాధ్యం అయితే కాదు. నితీశ్‌, లాలూ కలిసి గత సెప్టెంబర్‌ 25న సోనియా గాంధీని కలిసినప్పుడూ కాంగ్రెస్‌ ప్రతిపక్ష పార్టీల్లో పెద్దది, దేశవ్యాప్తంగా అస్తిత్వం ఉన్నది కనక కాంగ్రెసే ప్రతిపక్ష ఐక్యతకు చొరవ తీసుకోవాలని కూడా చెప్పారు.
కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలు ఏమిటో కూడా నితీశ్‌కు సంపూర్ణంగా తెలుసు. అయితే ఈ లక్ష్య సాధనకు మరో రెండు మూడు అడ్డంకు లున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత కోసం కొన్నాళ్లు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆసక్తి కనబరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావ్‌ అయితే వివిధ చోట్లకు వెళ్లి ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి ప్రయత్నించారు. కానీ మమతా బెనర్జీ, కె.చంద్రశేఖర రావుకు ఐక్యత మీద ఎంత ఉత్సాహం ఉన్నప్పటికీ అది తమ నాయకత్వంలోనే జరగాలన్నది వారి అభిమతం. ఆ ఇద్దరిలోనూ ఐక్యత గురించి ఏకాభిప్రాయం అయితే ఉంది కాని ప్రతిపక్ష ఫ్రంట్‌కు నాయకత్వం తమకే దక్కాలన్న ఆశకూడా ఉంది. అంటే అందరూ ప్రధానమంత్రి పదవిమీద ఆశలు పెంచుకుంటున్నారు. అదే పెద్ద అడ్డంకి. శరద్‌ పవార్‌, శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్‌.జె.డి. నాయకుడు తేజస్వీ యాదవ్‌ కూడా ప్రతిపక్షాల ఐక్యతనే కాంక్షిస్తున్నా వీరెవరికీ వెంటనే ప్రధానమంతి కావాలన్న కోరిక లేదు. ఇంకో వేపు నుంచి కేజ్రీవాల్‌ ఒంటరిగానే మోదీని ఓడిరచాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ప్రయత్నాలలో తాను ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌ ఓట్లను కొల్లగొట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనకు ఆ దృక్పథం లేకపోతే మొన్నటి గుజరాత్‌ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉండేదేమో. కేజ్రీవాల్‌ ను మినహాయించినా మిగతా ప్రతిపక్షాలన్నీ సమైక్యమైతే గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేజ్రీవాల్‌ హఠాత్తుగా తన పార్టీని దేశవ్యాప్తం చేయడం సాధ్యమయ్యే పని కాదు. కాంగ్రెస్‌ ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించకుండా ప్రతిపక్షాలకు వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. 1996లో దేవెగౌడ ప్రధానిగా యునైటెడ్‌ ఫ్రంట్‌, ఐ.కె.గుజ్రాల్‌ ప్రధానిగా 1998లో రెండోసారి ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏదీ ఏడాది కాలమైనా కొనసాగలేదు.
మోదీని గద్దె దించాలన్న కోరిక మేరకు కె.చంద్రశేఖర రావుకు ఏకాభిప్రాయం ఉన్నా ఆయన నితీశ్‌ లాంటి కోరుకుంటున్న విశాల ప్రతిపక్ష వేదికకు సిద్ధంగా లేరు. తమ ఆధిపత్యమే కొనసాగాలన్నదే ఆయన అభిమతం గనక తెలంగాణా రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చేశారు. అంటే ఆయన ఇల్లు అలికేశారు. పండగ చేసుకునే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. నితీశ్‌ ధోరణి దానికి భిన్నంగా ఉంది. కేసీఆర్‌ ఆగస్టులో నితీశ్‌ను కలుసుకున్న తరవాత నితీశ్‌ రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, శరద్‌ పవార్‌, హెచ్‌.డి.కుమార స్వామి, అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యడర్శి డి.రాజాతో కూడా చర్చించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా బీజేపీకి దక్కింది 38 శాతం ఓట్లు మాత్రమే. అంటే 62 శాతం మంది ఓటర్లు మోదీని సమర్థించకుండా వివిధ పార్టీలకు మద్దతు పలికారు. ఈ 62 శాతం ఓట్లను సమీకరించే దిశగా ప్రయత్నాలు జరిగితేనే ప్రతిపక్ష ఐక్యతకు సార్థకత. ఈ ప్రక్రియ మొదలు కాకుండానే కొందరు నాయకుల గురి ఐక్యతమీద కాకుండా ప్రధానమంత్రి పదవి మీద ఉండడమే అసలైన సమస్యగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img