Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

మహిళా రిజర్వేషన్లు అందని ద్రాక్షే!

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఆమోదించడం హర్షదాయకమే అయినా అది అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టి తాము మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం టముకు వేసుకుంటోంది. బిల్లు ఆమోదించడంతో దాదాపు మూడు దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశ ఉన్నా అది అమలులోకి రావడానికి కనీసం 2034 దాకా వేచి ఉండక తప్పదు. అందువల్ల ఇది 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ పంచి పెడ్తున్న తాయిలంగానే మిగిలిపోక తప్పదు. 1996లో సోషలిస్టు నాయకురాలు ప్రమీలా దండవతే మొట్టమొదటి సారి ప్రైవేటు మెంబెర్‌ బిల్లు ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఈ అంశం నానుతూనే ఉంది. ఆ తరవాత సీపీఐ నాయకురాలు గీతా ముఖర్జీ నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. అన్ని రాజకీయ పార్టీలూ ఈ బిల్లుకు సూత్ర ప్రాయంగా అనుకూలత వ్యక్తం చేసినా ఆచరణలో అడుగడుగునా ఆటంకాలు తప్పలేదు. ఈ బిల్లును ఆమోదించడం అంటే ఆకాశంలో సగం అనుకునే మహిళలకు రాజకీయ హక్కుని చట్టబద్ధం చేయడమే. సిద్ధాంత రీత్యా మహిళలకు ఈ హక్కు ఉండాలన్న అంగీకారం అయితే కుదిరింది. ఈ బిల్లును బుధవారం లోకసభ ఆమోదించినప్పుడు 454 మంది అనుకూలంగా ఓటు వేశారు. కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇందులో ముస్లిం మహిళలకు రిజర్వేషన్‌ సదుపాయం లేనందువల్ల మజ్లిస్‌ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళలను అపారంగా గౌరవిస్తామని, స్త్రీ అంటే లక్ష్మి, సరస్వతి అన్న స్తోత్ర పాఠాలు అనునిత్యం వింటూనే ఉంటాం. కానీ రాజకీయంగా ఇప్పటికి మహిళలకు దక్కింది నామ మాత్రమే. బిల్లుపై చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఇందులోని లోపాలను విస్తారంగానే ఎత్తి చూపాయి. కానీ ఇప్పుడు ఆమోదించే అవకాశం ఉన్నందువల్ల ఆ లోపాల కారణంగా బిల్లు ఆమోదానికి అడ్డు చెప్పలేదు. కనీసం సవరణలూ ప్రతిపాదించలేదు. అంటే ప్రతిపక్షాలు సంపూర్ణంగా సహకరించాయి. ఈ బిల్లు ఆమోదం పొందినందుకు సర్వత్రా ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ అది ఎక్కడా కనిపించలేదు. కారణం ఏమిటంటే ఈ రిజర్వేషన్లు అమలులోకి రావడానికి దశాబ్దం కన్నా ఎక్కువ కాలమే పట్టొచ్చు. అంటే ఎప్పుడు దక్కుతాయన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఎవరికి వీటివల్ల ఫలితం ఉంటుంది అన్న ప్రశ్నకైతే పూర్తిగా అసంతృప్తికరమైన సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇందులో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) రిజర్వేషన్ల సదుపాయం లేదు. 2010లో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదించినా లోకసభ ఆమోదం పొందకపోవడానికి ప్రధాన కారణం ఇదే. 13ఏళ్ల తరవాత కూడా మోదీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. నిజానికి పట్టించు కోదలచుకోలేదు. 1998, 1999 లోనూ ఇదే ప్రధాన అడ్డంకి అయింది. దేశ జనాభాలో 50 శాతం పైగా ఓబీసీలు ఉన్నారు. మహిళల సంగతి ఎలా ఉన్నా ఓబీసీ పురుషులకు కూడా చట్టసభల్లో జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం లేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలులోకి రావు అన్న అంశం బిల్లులోనే స్పష్టంగా ఉంది. అంటే మొదట జనాభా లెక్కలు పూర్తి కావాలి. ఆ తరవాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అన్న షరతు పెట్టారు. 2010లో రాజ్యసభ ఆమఒదించిన బిల్లులో ఈ షరతులు లేవు. అలాగే అప్పుడు ఆమోదించిన బిల్లులో ఒక ఎన్నికల్లో మహిళలకు ఒక స్థానం రిజర్వు చేస్తే తరవాతి ఎన్నికలలో మరో స్థానం రిజర్వు అవుతుంది అన్న మాట ఉంది. అంటే రొటేషన్‌ పద్ధతి అమలు అవుతుంది. కానీ ప్రస్తుతం ఆ మాట లేదు. నియోజకవర్గాల పునర్విభజన తరవాతే రొటేషన్‌ పద్ధతి అమలులోకి వస్తుందట. ఈ పునర్విభజన పదేళ్లకు ఒకసారి జరగాలి. కానీ దశాబ్దాలు పడ్తోంది. 2001 జనాభా లెక్కలు జరిగాయి. కానీ నివేదిక 2007లో వచ్చింది. అంటే జనాభా లెక్కల తంతు పూర్తి అయ్యేటప్పటికి అయిదారేళ్లు కనీసం పడుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తక్షణం సాధ్యమయ్యేది కాదు. వాజపేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2026 తరవాతే పునర్విభజన అన్న ఆంక్ష పెట్టారు. ఈ నిర్ణయం రాజ్యాంగ సవరణ కనక 2027 లో పని ప్రారంభించినా పునర్విభజన పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. అంటే 2034 కన్నా ముందు ఈ రిజర్వేషన్లు అమలయ్యే ఆశే లేదు.
ఓటు వేసే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 1962లో కేవలం 46 శాతం మంది మహిళలే ఓటు వేస్తే 2019లో అది 66 శాతానికి పెరిగింది. అయినా పార్లమెంటులో ఉన్న మహిళు 15శాతం మాత్రమే. ఉభయ సభల్లోనూ కలిపి బీజేపీ ప్రతినిధులుగా ఉన్న మహిళలు 14 శాతమే. మోదీ ఉద్దేశం బిల్లు, దానివల్ల కలిగే ప్రయోజనం కాదు. తన ప్రచారమే ఆయనకు అన్నింటికన్నా ముఖ్యం. మోదీ ప్రభుత్వానికి లోకసభలో సంపూర్ణమైన మెజారిటీ ఉన్నా ఓబీసీలకు, ముస్లింలవంటి అల్పసంఖ్యాక వర్గాల వారికి రిజర్వేషన్లు వర్తింప చేయలేదు. ముస్లింలకు ఇప్పుడూ లేవుగా అని వాదించవచ్చు. కానీ అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి ప్రత్యేక ఏర్పాటు అవసరం. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించడమే లేదు. ఓబీసీలకు రిజర్వేషన్లు లేని మహిళా బిల్లు నిష్ప్రయోజనకరంగా మిగిలిపోతుంది. మహిళలు ఇప్పటికీ అనేక రకాలుగా వెనుకబడే ఉన్నారు. ఇలాంటి స్థితిలో రాజకీయాధికారం ఈ పరిస్థితిని మార్చడానికి ఉపకరిస్తుంది. ప్రతి అంశాన్ని మహాద్భుతమైన ఘట్టంగా ప్రచారం చేసే మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కూడా అదే గతి పట్టించింది. తన మాయాజాలం ప్రదర్శించడానికి మోదీ మంగళవారం పాత పార్లమెంటులో, ఆ తరవాత కొద్ది సేపటికే కొత్త పార్లమెంటులో సుదీర్ఘంగా, గంభీరంగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రసంగించారు. అయిదు రోజులపాటు జరగవలసిన పార్లమెంటు సమావేశాలు ప్రధానమంత్రి ప్రసంగాల ప్రత్యేక సమావేశాలలాగా తయారయ్యాయి. మొదటి రోజు సమావేశాలను మోదీ తరగతి గదిలా మార్చేశారు. ప్రత్యేక సందర్భాలలో మినహా మిగతా సమయాల్లో ప్రధానమంత్రి పార్లమెంటులో అడుగే పెట్టరు. ఈ లోకసభ తొమ్మిదన్నరేళ్ల కాలంలో ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పవలసిన సందర్భాలలో తప్ప కేవలం రెండు సార్లు మాత్రమే సమాధానం చెప్పారు. హిందీలో పేర్లు పెట్టడంలో అపారమైన చాతుర్యం సంపాదించిన కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు కూడా నారీ శక్తి వందన్‌ అని నామకరణం చేశారు. పేర్లు పెట్టడంలో దిట్ట కనక పాత పార్లమెంటును ఇక మీదట సన్సద్‌ సదన్‌ అనాలని ప్రకటించారు. ఈ విషయంలో ఆయన ఎవరితోనూ చర్చించరు, సంప్రదించరు. ప్రకటించేస్తారు. దేశమంతా ఆ మాటను అంగీకరించి తీరవలసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img