Friday, June 2, 2023
Friday, June 2, 2023

మానని గాయానికి కొంత ఊరట

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని జి.మాడుగుల మండలంలో కూంబింగ్‌ కార్యక్రమం కోసం వెళ్లిన ప్రత్యేక దళానికి చెందిన 21 మంది పోలీసులు 11 మంది గిరిజన మహిళలమీద దారుణంగా అత్యాచారం చేశారు. సాధారణంగా అత్యాచారం జరిగినప్పుడు మహిళలు తమ గోడు చెప్పుకోవడానికి, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రారు. కానీ వాకపల్లి సంఘటనలో బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడమే కాక ఈ కేసు మీద విచారణ మొదలయ్యే దాకా నిరంతరం పోరాడారు. వీరి పోరాటం గురువారం ఒక మేరకు ఫలించింది. ఈ కేసులో నిందితులైన పోలీసులందరినీ న్యాయస్థానం శిక్షించకుండా వదిలేసింది. కానీ వీరు నిర్దోషులని తేలినందువల్ల విడుదల కాలేదు. ఈ కేసులో దర్యాప్తు సరిగా జరగనందువల్ల, నిందితులమీద ఉన్న ఆరోపణలను కచ్చితంగా నిరూపించే అవకాశం లేనందువల్ల వీరిని న్యాయస్థానం వదిలేయవలసి వచ్చింది. అయితే బాధిత మహిళలకు పరిహారం ఇప్పించాలని ఆదేశించింది. 2007 ఆగస్టు 20న గిరిజన మహిళల మీద అత్యాచారం జరిగితే కేసు నమోదు చేయించడం, విచారణ జరిగేట్టు చూడడానికే విశ్వ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. బాధిత మహిళల పట్టుదలవల్లే ఇది సాధ్యమైంది. నిందితులకు శిక్షపడి ఉండకపోవచ్చు. కానీ వారు నిర్దోషులని కోర్టు తేల్చలేదు. దర్యాప్తు సరిగా జరగనందువల్లే వారు దోషులుగా తేలలేదని న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. అత్యాచారం జరిగిన 11 ఏళ్లకు హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన తరవాత విశాఖపట్నంలో 2018లో విచారణ మొదలైంది. నాలుగేళ్ల పాటు విచారణ జరిగిన తరవాత గురువారం 11వ అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో దర్యాప్తే నిందితులను కాపాడే దురుద్దేశంతో జరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితులకు శిక్ష పడకపోయినా వారికి జిల్లా లీగల్‌ సర్వీసు అథారిటీ పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారంటే వారి వాంగ్మూలాలను న్యాయస్థానం విశ్వసించినట్టే. ఈ కేసును దర్యాప్తు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు నిష్పాక్షికంగా, న్యాయంగా దర్యాప్తు చేయలేదని న్యాయమూర్తి అరమరికలు లేకుండానే తేల్చేశారు. దర్యాప్తు అధికారుల్లో ఒకరైన ఆనందరావు మరణించారు. రెండవ దర్యాప్తు అధికారి శివానందరెడ్డి చేసిన దర్యాప్తు ఏ మాత్రం పొందికగా లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆయన సవ్యంగా దర్యాప్తు చేసి ఉంటే నిందితులకు శిక్ష పడేదేమో. ఆయన సవ్యంగా దర్యాప్తు చేయలేదు కనక ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపెక్స్‌ కమిటీకి నివేదించాలని కూడా ఆదేశించారు.
ఈ కేసులో మొదటి నుంచీ దర్యాప్తు క్రమంలో రాజీ పడ్డారని ఆదివాసీ మహిళా సంఘాలవారు, మానవ హక్కుల సంఘాల వారు వాదిస్తూనే వచ్చారు. దర్యాప్తు మొదలు పెట్టిన మొదటి రోజునుంచీ దర్యాప్తు చేసిన గిరిజన మహిళలపై అత్యాచారం చేశారన్న తీవ్ర ఆరోపణలను ఎదుర్కుంటున్న తమ తోటి పోలీసు అధికారులను ఎలా కాపాడాలా అనే ప్రయత్నించారు. నేర శిక్షా స్మృతి ప్రకారం దర్యాప్తుకు అనుసరించవలసిన ఏ సూత్రాన్నీ పాటించలేదు. ఈ మహిళల మీద అత్యాచారం జరిగిందో లేదో నిర్ధారించడానికి ఉపకరించే ఫోరెన్సిక్‌ పరిక్షా ప్రక్రియ కూడా అడ్డదిడ్డంగానే సాగింది. బాధితుల్లో ఇద్దరు గిరిజన మహిళలు ఇదివరకే మరణించారు. నిందితులైన మహిళలు న్యాయం కోసం దృఢంగా నిలబడి ఇన్నేళ్లుగా పోరాడి ఉండకపోతే ఈ మాత్రం న్యాయమైనా జరిగి ఉండేది కాదు. ఈ మహిళలు గిరిజనులే కాక నిరక్షరాస్యులు. అయిన వారు ధైర్యంచేసి న్యాయ పోరాటం కొనసాగిస్తూనే వచ్చారు.
ఈ క్రమంలో అనేక అవమానాలు భరించవలసి వచ్చింది. న్యాయ స్థానంలో విచారణ సందర్భంగా వారిని ప్రశ్నలడిగిన భాష కూడా ఆ మహిళలకు తెలియదు. వీరి మీద జరిగిన మూకుమ్మడి అత్యాచారం మానవతను మంటగలిపింది. పైగా చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు నానా అడ్డదార్లూ తొక్కారు. నక్సలైట్ల ప్రభావం ఉందనుకునే ప్రాంతాలలో నక్సలైట్లను ఏరివేసే మహత్కార్యంలో పాలు పంచుకునే గ్రే హౌండ్స్‌ లాంటి ప్రత్యేక పోలీసు దళాల వారి ప్రవర్తన, పాల్పడే అఘాయిత్యాలు కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. బాధితుల్లో ఒక మహిళ పాముకాటువల్ల మరో మహిళ మలేరియా వ్యాధి వల్ల మరణించారు. ఎంతమంది వారి పోరాటాన్ని ఎద్దేవా చేసినా మిగతా తొమ్మిది మంది మహిళలు 16 ఏళ్లుగా మొక్కవోని ధైర్యంతో అన్యాయాన్ని ఎదిరించడానికి కట్టుబడి ఉన్నందువల్లే పాక్షిక విజయమైనా సాధించగలిగారు. అత్యాచారం జరిగిన వెంటనే ఈ మహిళలు గ్రామ పెద్ద, ఆదివాసీల హక్కుల పరిరక్షణకోసం పాటు పడే స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి ఏళ్ల తరబడి ఈ మహిళలు ప్రతి రోజూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగానే జీవనం గడపవలసి వచ్చింది. మొదట్లో సీఐడి దర్యాప్తు ఫలితం అత్యాచారం చేసిన వారికి అనుకూలంగానే వచ్చింది. బాధితులంటున్న వారికి వైద్య పరీక్షలే జరగలేదని అన్నారు. అందువల్ల హైకోర్టు వారి అర్జీని తోసిపుచ్చింది. ఆ తరవాత ఈ మహిళలు 2008 ఏప్రిల్‌లో పాడేరు మండలంలో జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో నిరసనగా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ నివేదికను తోసిపుచ్చి తాజాగా దర్యాప్తు చేయించాలని ఈ పిటిషన్‌లో కోరారు. వారం రోజుల్లో హైకోర్టు వారి మొర ఆలకించగానే నిందితులు హైకోర్టుకెళ్లి దర్యాప్తును నిలిపి వేయించాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు.
ఏప్రిల్‌ 2012లో 21 మంది నిందితుల్లో 13 మంది మీద దర్యాప్తు చేయవచ్చునని భావించింది. వెంటనే నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంవల్ల విచారణ మరో నాలుగేళ్లుఆగింది. పదేళ్లుగా ఈ కేసు కొనసాగడం ఆశ్చర్యకరంగా ఉందని భావించిన సుప్రీంకోర్టు గత సంవత్సరం సెప్టెంబర్‌ లో నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేసి విచారణ త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించింది. అప్పుడు విచారణ బాధ్యతను విశాఖపట్నం ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. తమకు నచ్చిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించడంకోసం కూడా బాధితులు మళ్లీ హైకోర్టు మెట్లెక్కవలసి వచ్చింది. 2018 జనవరిలో హైకోర్టు పల్లా త్రినాథ రావును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గా నియమించింది. అయితే మరో కేసుకు సంబంధించి త్రినాధ రావును అరెస్టు చేశారు. అప్పుడు విజయవాడకు చెందిన సుంకర రాజేంద్రప్రసాద్‌ను ఆ స్థానంలో నియమించారు. పోలీసులు, ప్రభుత్వం బాధితులైన గిరిజన మహిళలను బెదిరించి, వేధించినా వారు ధైర్యం విడనాడలేదు. తాము ఇచ్చిన వాంగ్మూలానికి తుదికంటా కట్టుబడి ఉన్నారు. బాధితుల గాయం ఎన్నటికీ మానేది కాదు. పైగా నిందితులకు శిక్ష అయినా పడలేదు. కానీ పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినందువల్ల కొంత ఊరట అయినా మిగిలింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img