Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మాయావతి ఒంటరి పోరు!

చాలా కాలంగా రాజకీయాలలో అంత చురుకుగాలేని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బి.ఎస్‌.పి.) నాయకురాలు మాయావతి 2024 సార్వత్రిక ఎన్నికలలో తన సత్తా నిరూపించడానికి మళ్లీ క్రియాశీలంగా మారారు. బి.ఎస్‌.పి.ని పరిపుష్టం చేయాలని ప్రయత్నిస్తున్నారు. తన అనుయాయులందరికీ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. కొంతకాలంగా ఉదాసీనంగాఉన్న వారందరూ చురుకుగా పనిచేయాలనికోరారు. మాయావతి బి.ఎస్‌.పి.ని బలోపేతంచేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర్లేదు. బి.ఎస్‌.పి. కేవలం దళితులకే పరిమితం అయిన పార్టీ కాదని నిరూపించడానికి గతంలో ఆమె బ్రాహ్మణులనూ చేరదీశారు. వారికీ టికెట్లు ఇచ్చారు. ఆ తరవాత ఆ మాట ప్రస్తావించడమే మానేశారు. తాజా రాజకీయ పరిణామాలనుబట్టి దేశంలోని రాజకీయ పార్టీలన్నీ రెండు శిబిరాల కింద సమీకృతం అవుతున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం జాతీయ పార్టీలే కాకుండా ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రెండు శిబిరాల్లో ఏదో ఒక పక్షాన నిలబడుతున్నాయి. బిజూ జనతా దళ్‌ లాంటి పార్టీలు తటస్థంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలు అంతిమంగా బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ. సరసన నిలిచినా ఆశ్చర్య పడక్కర్లేదు. తెలుగుదేశం లాంటి పార్టీ సైతం అటు ఎన్‌.డి.ఎ. శిబిరంలోనూ లేదు. ఇటు 28 పార్టీలతో కూడిన ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనతోనూ లేదు. నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడినప్పుడు తెలుగు దేశం జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆ దశలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో క్రియాశీలంగా వ్యవహరించింది. ఆ తరవాత మోదీ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. కడకు ఆ శిబిరాన్నీ వదిలేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బలహీనపడినట్టు కనిపిస్తోంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలోని జనసేన పార్టీ మాత్రం తెలుగుదేశంతో కలిసే ప్రయాణిస్తామని చెపుతోంది. మరోవేపు జనసేన బీజేపీ వైపు మొగ్గే సూచనలూ ఉన్నాయి. మొత్తం మీద తెలుగుదేశం కూడా ప్రస్తుతానికి ‘‘ఇండియా’’ కూటమిలోనైతే లేదు. అవసరం వస్తే ఎన్‌.డి.ఎ. వైపు మొగ్గదన్న భరోసాలేదు. మోదీ ప్రభుత్వం ఎన్ని ప్రజావ్యతిరేక చర్యలు తీసుకున్నా తెలుగు దేశం పెదవి విప్పి ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఇలాంటి కొద్ది పార్టీలను వదిలేస్తే చాలా రాజకీయ పార్టీలు మోదీకి అనుకూలంగానో, వ్యతిరకంగానో నిలబడుతున్నాయి. ఎలాగైనా సరే మోదీని గద్దె దించాలన్న దృఢమైన సంకల్పం ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో కనిపిస్తోంది. ఈ ఐక్య సంఘటన ఏర్పడే క్రమంలో ప్రతిపక్షాలను ఏకంచేయడానికి ప్రబలమైన ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి స్థితిలో బి.ఎస్‌.పి. నాయకురాలు మాయావతి వచ్చే లోకసభ ఎన్నికలలోనూ, ఆ తరవాత శాసనసభ ఎన్నికలలోనూ ఒంటరిగానే పోటీచేయాలని సంకల్పించారు. అందుకే తమ పార్టీని పటిష్ఠం చేయాలని మాయావతి భావిస్తున్నారు. అయితే మాయావతి నాయకత్వంలోని బి.ఎస్‌.పి. సైతం ఒక దశలో బీజేపీతో కలిసి ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉంది. మోదీని గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలతో మాత్రం చేతులు కలపడం లేదు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన ఏర్పడే క్రమంలో ఏ సమావేశంలోనూ బి.ఎస్‌.పి. పాల్గొనలేదు. 2024 లోకసభ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి నికరంగా ప్రకటించారు. అంటే ప్రస్తుతం ఉన్న రెండు శిబిరాలకూ మాయావతి దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ., ప్రతిపక్ష ఐక్య సంఘటన అయిన ‘‘ఇండియా’’ కూడా పేదలకు వ్యతిరేకమైనవేనని, అవి కులతత్వం, మతతత్వంతో నిండి ఉన్నాయని, పెట్టుబడిదారులకు అనుకూలమైనవనీ మాయావతి సూత్రీకరిస్తున్నారు. తాను ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో చేరనందువల్ల తమ పార్టీ బీజేపీకి అనుకూలమైందన్న వాదనలనూ ఆమె గట్టిగా తిప్పికొడ్తున్నారు. అయినప్పటికీ బీజేపీ కానీ, ‘‘ఇండియా’’ కూటమి కానీ ప్రస్తుతానికి మాయావతి వైఖరిపై ప్రతికూల వ్యాఖ్యలు ఏమీచేయకపోవడం గమనార్హం. రెండు శిబిరాలూ అంతిమ క్షణాల్లోనైనా బి.ఎస్‌.పి.ని తమవేపు తిప్పుకునే అవకాశంకోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మాత్రం మాయావతి పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాయావతి నిజంగా కుల, మత తత్వాలను వ్యతిరేకిస్తున్నట్టయితే ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో చేరాల్సింది. కానీ మాయావతి అందుకు సిద్ధంగాలేరు. తన పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడంలో ఆమె నిమగ్నమై ఉన్నారు. అట్టడుగుస్థాయి నుంచి పార్టీని శక్తిమంతంగా తయారుచేయాలన్నది ఆమె ప్రయత్నం. ఈ శిక్షణా శిబిరాలలో బి.ఎస్‌.పి. కార్యకర్తల కుటుంబాలు కూడా పాల్గొనేట్టు చేయాలనుకుంటున్నారు. ఒక్కో శిక్షణా శిబిరానికి కనీసం 500మంది హాజరయ్యేలా చూడాలని ఆమె తన అనుయాయులను ఆదేశించారు. శిక్షణా శిబిరాలలో దళిత సమాజం వారు ప్రధానంగా హాజరయ్యేట్టు చూడాలనికూడా కోరారు. 1984లో బి.ఎస్‌.పి. అవతరించినప్పుడు కూడా ఇలాంటి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఇవి ఆ పార్టీకి బాగా ఉపకరించాయి. నిరాశకు గురై బి.ఎస్‌.పి.కి దూరంగా ఉన్నవారు కూడా మళ్లీ క్రియాశీలంగా వ్యవహరించాలని కూడా ఆమె అంటున్నారు. అంటే చేజారిన మద్దతును మళ్లీ కూడగట్టాలనుకుంటున్నారు. ఈ శిక్షణా శిబిరాలకు హాజరయ్యేవారు ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయానికి తోడ్పడతారన్నది మాయావతి అంచనా. 2014 ఎన్నికలలో బి.ఎస్‌.పి.కి లోకసభలో ఒక్క సీటు కూడా దక్కలేదు. కానీ 2019లో మాయావతి సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకుని పదిస్థానాలు సంపాదించారు. కానీ ఎన్నికలు పూర్తిఅయిన వెంటనే సమాజ్‌వాది పార్టీ తమ అభ్యర్థులకు ఓట్లు వేయించలేదని ఆరోపించి ఆ పొత్తు రద్దుచేసుకున్నారు. సమాజ్‌వాది పార్టీ అండతోనే బి.ఎస్‌.పి.కి ముస్లింల ఓట్లు దక్కాయి. ఇప్పుడు ఏ పక్షంతో పొత్తు లేకపోతే ‘‘ఇండియా’’ కూటమి స్పష్టమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నప్పుడు ముస్లింలు మాయావతికి అండగా నిలుస్తారన్నది అనుమానమే. అయితే తాజా నిర్ణయాన్ని అమలుచేయడానికి బి.ఎస్‌.పి. తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. మాయావతి దగ్గరి బంధువు ఆకాశ్‌ చురుకుగా బి.ఎస్‌.పి. కార్యకలాపాల్లో నిమగ్నమైఉన్నారు. దళిత సమాజం, వెనుకబడిన తరగతుల వారు, ముస్లింలు తమకు అండగా ఉంటారని మాయావతి ఆశిస్తున్నారు. 2007 ఎన్నికలకు ముందు మాయావతి బ్రాహ్మణులకు స్థానం కల్పించినందువల్లే సొంతంగా ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రాగలిగిందన్న వాదనా ఉంది. వెనుకబడిన తరగతుల వారు, ముస్లింలు తనకు అండగా ఉంటారన్న భరోసా మాయావతిని ఏ మేరకు గట్టెక్కిస్తుందో వేచి చూడాల్సిందే. ఏమైనా మాయావతి ఒంటరి పోటీ ‘‘ఇండియా’’ ఐక్యసంఘటనకు ప్రతికూలంగా పనిచేయడం మాత్రం ఖాయం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img