Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

మారణకాండ వాస్తవం నిందితులంతా నిర్దోషులే

న్యాయం నత్త నడక అన్యాయం అన్నది నానుడి. గుజరాత్‌ మారణ కాండలో న్యాయం నత్తకే నడకలు నేర్పించడమే కాక మత మారణహోమంలో బాధితులకు వారి బంధు మిత్రులకు, సన్నిహితులకు కూడా ఆందోళన కలిగించే తీర్పు వెలువడిరది. 2002 ఫిబ్రవరి 28న అహమదాబాద్‌ నగరంలోని నరోదా గ్రామం లో నిర్భీతిగా, నిర్లజ్జగా, పోలీసు బలగాల సహాయ నిరాకరణ నేపథ్యంలో జరిగిన మారణ కాండలో 11 మందిని సజీవ దహనం చేశారు. అంతకు ఒక రోజు ముందు సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పెట్టె దహనం కేసులో 58 మంది మరణించారు. వీరంతా అయోధ్య నుంచి తిరిగి వస్తున్న వారేనంటారు. ఈ వ్యవహారంపై అనేక దర్యాప్తులు జరిగినా అసలు దోషులు ఎవరో తేలలేదు కానీ కొందరు అమాయకులు శిక్షలకు గురయ్యారు. ఆ మర్నాడు ఈ 58 మంది మృతదేహాలను అప్పటి మోదీ ప్రభుత్వం విశ్వహిందూ పరిషత్తుకు అప్పగించింది. వారి అంత్యక్రియల సందర్భంగానే విశ్వహిందూ పరిషత్‌ బంద్‌ కు పిలుపు ఇచ్చింది. 58 మంది మృతదేహాలను నడివీధుల్లో ఊరేగించడానికి అను మతించడం వెనక మోదీ ప్రభుత్వానికి ఏ దురుద్దేశం లేదు అంటే నమ్మడం దుర్లభం. ప్రజల మనోభావాలు రెచ్చగొట్టడానికే ఇదంతా చేశారని చెప్పక్కర్లేదు. గోధ్రా రైలు పెట్టె దహనం సాకుగా గుజరాత్‌ లో భారీ ఎత్తున మారణ కాండ కొనసాగింది. ఈ దారుణంలో ఎంతమంది బలయ్యారు అన్న విషయంలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నవి కాకి లెక్కలే. వెయ్యి మందికి పైగా అని కొందరు అంటే కాదు కనీసం రెండు వేల మంది అని మరికొందరు అంటుంటారు. ఆ సంఖ్య నికరంగా తేలనప్పటికీ మృతుల్లో అత్యధిక సంఖ్యాకులు ముస్లింలేనన్నది నిర్వివాదాంశం. ఆ తరవాత గుజరాత్‌లో ఎన్నడూ మతకలహాలు జరగలేదని ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గొప్పగా చెప్పు కుంటారు.
తాము 2002లో తగిన గుణపాఠం చెప్పినందువల్లే మతకలహాలు జరగడం లేదని అమిత్‌ షా గర్వంగా ప్రకటించారు. ముస్లింలకు గుణపాఠం చెప్పారని ఆయన ఆంతర్యం. నిజానికి అవి మతకలహాలు కావు. రెండు మతాలవారు సంఘర్షిస్తే దాన్ని మతకలహం అనొచ్చు. కానీ అప్పుడు జరిగింది కేవలం మారణ హోమం. ఈ వ్యవహారంపై అనేక దర్యాప్తులు జరిగాయి. విచారణ కమిషన్లు ఏర్పడ్డాయి. అయినా బాధితులకు, మృతుల కుటుంబాలకు జరిగిన న్యాయం మాత్రం పూజ్యం. తాజాగా నరోదా గ్రామం మారణ కాండలో 11 మంది సజీవ దహనానికి కారకులన్న ఆరోపణ ఎదుర్కుంటున్న 68 మంది నిర్దోషులని ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ 68 మందిలో మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మాయా కొద్నానీ కూడా ఉన్నారు. 97 మంది మృతికి కారణమైన నరోదా పాటియా కేసులో ఆమెకు మొదట శిక్ష పడిరది. ఆ తరవాత ఆమె నిర్దోషిగా తేలడం న్యాయం జరగవలసిన చోట అన్యాయం మాత్రమే జరగడానికి నిదర్శనం. 2002 మారణ కాండలో ప్రధానమైన తొమ్మిది సంఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడిరది. ప్రత్యేక కోర్టులూ ఏర్పడ్డాయి. న్యాయం మాత్రం లేశమాత్రమే. 2012లో అంటే మారణకాండ జరిగిన దశాబ్దానికి మాయా కొద్నానీకి 28 ఏళ్ల శిక్ష పడిరది. ఈ కేసులో నిజానికి మరణ శిక్ష విధించాలి కాని మహిళ అయినందువల్ల 28 ఏళ్ల శిక్ష విధిస్తున్నానని అప్పటి న్యాయమూర్తి అన్నారు. కానీ 2018లో గుజరాత్‌ హైకోర్టు ఆమెను నిర్దోషి అని తేల్చి వదిలేసింది.
గుజరాత్‌ మారణకాండలోని అన్ని ముఖ్యమైన కేసుల్లోనూ విచారణ తంతు దశాబ్దాలపాటు సాగింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటేనే కానీ 2008 ఆగస్టు 26న ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడలేదు. మొత్తం మీద విచారణ 2010లో మొదలైంది. తీర్పు రావడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది. బాబూ బజరంగీ పాత్ర గురించి అశీష్‌ ఖేతన్‌ అనే పత్రికా రచయిత రహస్యంగా సమాచారం సేకరించినప్పుడు బాబూ బజరంగీ తన పాత్రను అంగీకరించాడు. కానీ తీర్పు చెప్పిన న్యాయమూర్తి దీన్ని నమ్మదగిన సాక్షంగా భావించలేదు. కోర్టులో ఈ కేసును ఇంతవరకు ఆరుగురు న్యాయమూర్తులు విచారించారు. మొదట ఎస్‌.హెచ్‌. ఓరా విచారించారు. తరవాత ఆయన గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆ తరవాత జ్యోత్స్న యాగ్నిక్‌, కె.కె. భట్‌, పి.బి.దేశాయ్‌ విచారించారు. వీరందరూ విచారణ పూర్తి కాక ముందే ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరవాత విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.దవేను బదిలీచేశారు. సాక్ష్యులను విచారించడం నాలుగేళ్ల్లు సాగింది. చివరకు న్యాయమూర్తి బక్షీ తీర్పు వెలువరించారు. నరోదా గ్రామ కేసులో నిందితులపై హత్య, హత్యా యత్నం, చట్ట వ్యతిరేకంగా గుమి కూడడం, దొమ్మీకి పాల్పడడం, మారుణాయుధాలతో దాడి చేయడం లాంటి తీవ్రమైన ఆరోపణలే ఉన్నా 11 మంది మరణించడం నిరాకరించలేని వాస్తవమే అయినా ప్రాసిక్యూషన్‌ ఏ ఆరోపణనూ రుజువు చేయడానికి తగిన సాక్ష్యాధారాలను సమకూర్చలేక పోయింది. ప్రాసిక్యూషన్‌ వైఫల్యం అంటే అది గుజరాత్‌లో అప్పటి నుంచి ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే. ఈ నేరాలు గనక రుజువై అత్యధిక శిక్ష విధించేటట్టయితే అది మరణ శిక్ష అయి ఉండేది. కానీ నిందితులందరూ నిర్దోషులుగా తేలి లేదా తేల్చి విడుదలై పోయారు.
నరోదా గ్రామ కేసులో మొత్తం నిందితులు 86 మంది. విచారణ కొలిక్కి రాకముందే 18 మంది మరణించారు. ఒక వ్యక్తి ఇంతకు ముందే నిర్దోషిగా బయటపడ్డారు. గుజరాత్‌ మారణకాండ కేసుల్లో చివరి విచారణ నరోదా గ్రామ మారణకాండదే. 11 మంది మృతి చెందిన కేసులో మరణాలు వాస్తవం. హంతకులు ఎవరూ లేరు అని తేలింది. మూక దాడులు జరిగినప్పుడు నిందితులు ఫలానా వారు అని చెప్పడం కుదరకపోవచ్చు. కానీ నిందితుల జాబితాలో పోలీసులు అనేకమందినిచేర్చినా వారిమీద తామేమోపిన ఆరోపణలను రుజువు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. నిందితులను దోషులుగా నిలబెట్టడానికి అవసరమైన సాక్ష్య్యా ధారాలను ప్రాసిక్యూషన్‌ సమర్పించి ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సేకరించిన సాక్ష్యాలు విస్తృతంగానే ఉన్నాయి. వీటినీ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చిన న్యాయమూర్తి శుభద బక్షి నమ్మడానికి నిరాకరించారు. విచారణ క్రమంలో ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌ షా కూడా 2018లో సాక్ష్యం చెప్పారు. మారణకాండ జరిగిన సమయంలో మాయా కొద్నానీ శాసనసభలో ఉన్నారని అమిత్‌షా చెప్పిన మాటను మాత్రం బక్షీ నూటికి నూరుపాళ్లు నిజమని నమ్మారు. హత్యలు, సజీవ దహనాలు, మారణ కాండకు కారకులు ఎవరో నిర్ధారించలేకపోవడం మన విచారణా ప్రక్రియ విశిష్టత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img