Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

మితిమీరిన మోదీ స్వీయాభిమానం

రాజ్యాంగానికి అనుగుణంగా పాలనా లేదా పాలనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని వక్రీకరించడమా అని నిర్ణయించు కోవలసిన సమయం వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోదీ కచ్చితంగా రెండో మార్గాన్నే ఎంచుకుంటారు. మోదీకి పదవీ కాంక్ష ఎంత ఉందో కీర్తి కాంక్షా అంతకన్నా ఎక్కువే ఉంది. తన పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలన్న దుగ్ధ ఆయనలో అవధులులేని రీతిలో ఉంది. అందుకే సకల రాజ్యాంగ మర్యాదలను బేఖాతరు చేసి కొత్త పార్లమెంటు భవనాన్ని తానే ప్రారంభిస్తానని భీష్మించుకు కూర్చున్నారు. పార్లమెంటుకు సంబంధించినంత మేరకు మోదీ ఇతరులలాగే లోకసభ సభ్యుడు. మెజారిటీఉన్న పక్షానికి నాయకుడు కనక ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. అధికార క్రమం ప్రకారం చూసినా మొదట ఉండేది రాష్ట్రపతి, ఆ తరవాత ఉప రాష్ట్రపతి. ఆ తరవాతే ప్రధానమంత్రి. కానీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నందువల్ల మోదీ తానే సర్వాధికారిననుకుంటారు. అధికారక్రమాన్ని ఎంత మాత్రం లెక్క చేయరు. వచ్చే ఆదివారం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం ఎంతో ఆనందంగా, గర్వంగా జరుపుకో వలసింది. కానీ తానే ఆ భవనాన్ని ప్రారంభించాలని మోదీ మంకు పట్టు పట్టినందువల్ల ఆ వ్యవహారం మొత్తం వివాదాస్పదం అయింది. ప్రతిపక్షాలు లేకుండా ఆ ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని 19 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌.డి.ఏ.)లో ఉన్న పక్షాలన్నీ ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతాయని గొప్పగా చెప్పు కుంటున్నారు. ఇంతకీ వాటి లెక్క తేలిస్తే బీజేపీని మినహాయిస్తే రెండే పార్టీలు మిగులుతాయి. అవి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతాదళ్‌, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ మాత్రమే. బి.ఎస్‌.పి. అధినేత మాయావతి ప్రతిపక్షాలనే తప్పు పడ్తున్నారు. అంటే ఆ పార్టీకి మోదీ పట్టుదల అభ్యంతరకరంగా కనిపిస్తున్నట్టు లేదు. అకాలీ దళ్‌ కూడా అదే దారిలో ఉన్నట్టుంది. ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని 19 ప్రతిపక్షాలు నిర్ణయించడానికి ముందు ఈ కార్యక్రమం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జరిగితే సముచితంగా ఉంటుందని ప్రధానమంత్రి మోదీకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాయి. ఆయన ఎవరి మాట చెవిన పెట్టరు కనక ప్రతిపక్షాల ప్రయత్నం చెవిటి వాడి ముందు శంఖం ఊదడంగానే తయారైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కనీసం ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం మరీ దారుణం. మాజీ రాష్ట్రపతుల్లో సజీవంగా ఉన్న ప్రతిభా పాటిల్‌, రాం నాథ్‌ కోవింద్‌ కు కూడా ఆహ్వానాలు వెళ్లలేదు. ఇది మరీ విడ్డూరం. రిబ్బన్లు కత్తిరించడం, శంకుస్థాపనలు చేయడం అంటే మోదీకి ఎంత ఇష్టమో చెప్పలేం. కొన్ని సందర్భాలలో రెండోసారి, మూడోసారి కూడా శంకుస్థాపన చేసే స్తుంటారు. వందేభారత్‌ రైలు మొదటిసారి వచ్చినప్పుడు మోదీ ప్రారంభించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కొత్త వందే భారత్‌ ప్రారంభం అయినా మోదీనే వెళ్లి పచ్చజెండా ఊపుతున్నారు. రైల్వే శాఖ మంత్రి ఎందుకూ కొరగాకుండా మిగిలి పోతున్నారు. అశ్వినీ వైష్ణవ్‌ రైల్వే శాఖ మంత్రి అని బుర్రగోక్కుంటే తప్ప గుర్తొచ్చే పరిస్థితిలేదు. గురువారం మోదీ దిల్లీ-డెహ్రాడూన్‌ మధ్య వందేభారత్‌ను ప్రారంభించారు. మూడు రోజుల ముందు కేరళలో కొచ్చిలో ఓ వందే భారత్‌కు పచ్చ జెండా ఊపి మురిసిపోయారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులను ఎవరినీ లెక్క చేయకుండా తానే సర్వాంతర్యామిగా వ్యవహరించినట్టే కొత్త పథకాలు, శంకుస్థాపనలు ఏం జరిగినా మోదీ ప్రత్యక్షమైపోతారు. ఆయనకు తన మీద తనకు వల్లమాలిన అపేక్ష.
రాష్ట్రపతి ముర్ము పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తే సముచితంగా ఉండేదని భావించే వారిలో కొందరు విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. రాష్ట్రపతి మహిళ కనక, ఆదివాసీ కనక ఆమెకు అవకాశం ఇచ్చి ఉండాలని అంటున్నారు. ఇవి కచ్చితంగా అసంబద్ధమైన వాదనలే. పార్లమెంటు అంటే రాష్ట్రపతి కూడా అయినందువల్ల ఆ స్థానంలో ఉన్న వారు కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి వీలు కల్పించి ఉంటే మనది అత్యంత ప్రాచీనమైన ప్రజాస్వామ్య దేశమని, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని టముకు వేస్తే అంతో ఇంతో ఔచిత్యం పాటించినట్టయ్యేది. కానీ ప్రతి శిలా ఫలకం మీద తన పేరే ఉండాలన్న మోదీ అపరిమిత కాంక్ష వల్ల సకల ఔచిత్యాలనూ పక్కకు నెట్టేస్తున్నారు. మోదీ కీర్తి కండూతి ఎంత బలీయమైంది అంటే కరోనా సమయంలో టీకాలు వేయించుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్ల మీద కూడా ఆయన బొమ్మే ఉంటుంది. కరోనావల్ల మరణించిన వారికి ఇచ్చే సర్టిఫికేట్లను మాత్రం దయతలిచి వదిలేసినట్టున్నారు. మోదీ ప్రచార కాంక్షను చూస్తే శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు కూడా ఒక అధికార క్రమాన్ని నెలకొల్పవలసిన ఆవశ్యకత కనిపిస్తోంది. ఒక నిర్దిష్ట విధానానికి రూపకల్పన చేయవలసిందే. ఏ స్థాయి పతకాన్ని ఏ స్థాయి వారు ప్రారంభించాలో, పునాది రాయి వేయాలో నిర్దిష్టంగా తేల్చక తప్పదేమో! ముర్మును రాష్ట్రపతిని చేసి ఆదివాసీలకు అపారమైన గౌరవం ఇచ్చామని గొప్పగా ప్రచారం చేసుకున్న మోదీ రాజ్యాంగ రీత్యా ఆమె నిర్వర్తించ వలసిన బాధ్యతలను తానే నిర్వహిస్తూ ఆమెను పక్కకు నెట్టేస్తున్నారు. ఎవరు ఆ స్థానంలో ఉన్నా మోదీ లెక్కచేసే స్థితిలో లేరు. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి ఎంపిక చేసిన తేదీ వెనక కూడా మతలబు ఉంది. ఆ రోజు సావర్కర్‌ జయంతి. నిజానికి స్వాతంత్య్ర పోరాటసమయంలో, ముఖ్యంగా క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్‌ సామ్రాజ్య వాదులతో కుమ్మక్కైన వ్యక్తి జయంతిని పార్లమెంటు ప్రారంభోత్సవంతో కలపడందుర్మార్గం.
బీజేపీ అనేక విధానాలను దొంగచాటుగా అమలుచేస్తూ ఉంటుంది. ఇదీ అంతే. సావర్కర్‌ జయంతి రోజే పార్లమెంటు నూతన భవనాన్ని ఆవిష్కరించడం యాదృచ్ఛికం కాదు. జిన్నా కన్నా ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవచించిన సావర్కర్‌ను నెత్తిన పెట్టుకోవడం స్వాతంత్య్ర ఉద్యమం మీద, ఆ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏ మాత్రం నమ్మకం లేని వారు మాత్రమే చేయగలిగిన పని. పైగా రాజాజీ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూకు అందించిన రాజదండాన్ని ఆయన అలహాబాద్‌లోని మ్యూజియంలో పెడ్తే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి లోకసభ స్పీకర్‌ స్థానం పక్కన పెడ్తారట. ఇది నూటికి నూరుపాళ్లు ఫ్యూడల్‌ సంస్కృతే. ఆ రాచరిక సంస్కృతిని పాటిస్తారు కనకే మోదీ సకల ప్రజాస్వామ్య సంప్రదాయాలను చిన్న చూపు చూస్తున్నారు. ముర్ము చేయవలసిన పని తాను లాగేసుకోవడం వ్యక్తిగతంగా ముర్మును అవ మానించడం కాదు. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే అవమానించడం. మోదీకి, ఆయన పార్టీకి రాజ్యంగం మీద, ప్రజాస్వామ్యం మీద ఎన్నడు విశ్వాసం ఉంది కనక! అందుకే మోదీ స్వీయాభిమానం ముందు ఏదైనా దిగదుడుపే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img