Friday, September 22, 2023
Friday, September 22, 2023

మిత్ర పక్షాలకోసం బీజేపీ వేట

గాలి ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుదనుకోవడం కుదరదు అని బీజేపీకి ప్రధాన చోదక శక్తిగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రమంగా గ్రహిస్తున్నట్టున్నారు. ఆయన పదే పదే వల్లించే ‘‘విశ్వ గురువు’’ అన్న ఊతపదం హిందుత్వ ఓటర్లను ఆకట్టుకున్నట్టు కనిపించడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా విజయ ఢంకా మోగించాలన్న మోదీ ప్రయత్నాలకు అడుగడుగునా చుక్కెదురు అవుతోంది. ఓ దశాబ్ద కాలంపాటు దేశంలో హిందుత్వ ఆసరాగా రాజ్యమేలిన తరవాత ఆ ప్రభావం క్రమంగా క్షీణిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటకలో బీజేపీ ఓటమి పాలైంది. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే అన్న మాట ఎందుకూ కొరగాకుండా పోయింది. హిందుత్వ జనాన్ని ఆకర్షించడం తగ్గుతున్న స్థితిలో కేవలం ఆ విధానంపై ఆధారపడి విజయం సాధించదం సాధ్యం కాదని తేలిపోతూ ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటకలో హిందుత్వపై బీజేపీ గుడ్డి నమ్మకమే బీజేపీకి ప్రతికూలంగా పరిణమించింది. మోదీ రాజకీయ చాతుర్యానికి 2024 సార్వత్రిక ఎన్నికలు విషమ పరీక్షగా మారనున్నాయి. ప్రతిపక్షాలు ఐక్యత సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వచ్చే 23వ తేదీన పట్నాలో జరగనున్న ప్రతిపక్షాల సమావేశంలో ఈ ఐక్యతా యత్నాలు మరో అడుగు ముందుకు వేస్తే అనేక నియోజక వర్గాలలో బీజేపీ ముఖాముఖి పోటీ ఎదుర్కోక తప్పదు. మతతత్వ విధానాలకు చుక్కెదురవుతున్న తరుణంలో బీజేపీలో అంత:కలహాలు పెద్ద సవాలుగా మారుతున్నాయి. కేంద్ర నాయకత్వంతో మొదలు పెట్టి కింది స్థాయి కార్యకర్తల్లో కూడా పరస్పర కలహాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక శాసనసభ ఎన్నికల సమయంలో ఈ అంత:కలహాలే బీజేపీని ఓటమి పాలు చేశాయి. ఈ కలహాలను తీర్చడం బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా తలకు మించిన భారం అయిపోయింది. ఈ ఏడాది ఆఖరులోగా శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌లో కొంత కాలంగా బీజేపీలో అంత:కలహాలు పెచ్చరిల్లి పోయాయి. ఈ శాసనభ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ధోరణిని నిర్ణయించడం ఖాయం. కాంగ్రెస్‌ లో కుమ్ములాటలు లేవని కాదు. కానీ పొరుగింట్లో కలహాలు సొంతింట్లో కలహాలను కప్పి పుచ్చలేవు. హిందూ మతతత్వ భావన సన్నగిల్లడానికి తోడు సామాన్యుల బతుకు భారమై పోవడం, నిరుద్యోగం అదీ యువతలో విపరీతమైన సమస్యగా మారుతుండడం, జీవన వ్యయం పెరగడం బీజేపీకి ప్రతికూలంగా మారుతోంది. దశాబ్ద కాలం నుంచి బాగా అరగదీసిన హిందుత్వ నినాదం సానుకూల ఫలితాలు ఇచ్చే సూచన ఏ మాత్రం లేదు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో కాంగ్రెస్‌ నెమ్మదిగా బలం పుంజుకుంటోంది. దీనికి కాంగ్రెస్‌ సామర్థ్యం పెరగడం కన్నా బీజేపీ మీద అసంతృప్తే ప్రధాన కారణంగా తయారైంది. అందువల్ల ప్రజలకు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయంగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంటుంది! హిందుత్వ భావనలను తమ వేపు తిప్పుకోవడానికి బీజేపీ-ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగలిగినా 2014లో వ్యక్తమైన మద్దతు ఇప్పటికీ మళ్లీ కనిపించడం లేదు. 2014 ఎన్నికలలో బీజేపీ ఉత్తరప్రదేశ్‌ లోని మొత్తం 80 లోకసభ స్థానాలలో 71 సాధించింది. బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్‌ రెండు లోకసభ స్థానాలలో విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లో 2019లో బీజేపీ కేవలం 62 సీట్లకు పరిమితం అయింది.
2019 తరవాత బీజేపీకి గాలి ఎదురు తిరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీర్‌ లోని పుల్వామాలోమన సాయుధ దళాల బిడారుపై తీవ్రవాదులు దాడి చేశారు. తరవాత కొద్ది రోజులకే ఫిబ్రవరి 26న సర్జికల్‌ స్ట్రైక్‌ చేశామని మోదీ ప్రజల్లో మైనారిటీల మీద ద్వేషం పెంచగలిగారు. యుద్ధోన్మాదం పెంచగలిగారు. ఈ కారణంగా 2014లో బీజేపీ 282 లోకసభ సీట్లు సాధిస్తే 2019లో 303 స్థానాలు సంపాదించగలిగింది. పుల్వామా ఘాతుకం, సర్జికల్‌ స్ట్రైక్‌ దేశవ్యాప్తంగా వెర్రి హిందూ మతాభిమానాన్ని పెంచింది. కానీ జమ్మూ-కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ పుల్వామా గుట్టు విప్పేశారు. మోదీ అసత్యాల చిట్ఠా విప్పుతున్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోతే తమ విజయం సునాయాసం అని బీజేపీ భావించింది. కానీ ఎన్ని విభేదాలున్నా ప్రతిపక్షాలు ఐక్యత కోసం పాటు పడుతూనే ఉన్నాయి. బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లో భాగస్వామ్యం లేని ఆంధ్ర ప్రదేశ్‌ లోని వై.ఎస్‌.ఆర్‌. సి.పి, ఒడిశాలోని బిజూ జనతా దళ్‌, తెలంగాణలోని బి.ఆర్‌.ఎస్‌. ప్రతిపక్ష ఐక్యత విషయంలో అంత ఆసక్తి చూపని మాట వాస్తవమే. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఇటీవల బీజేపీ మీద ఒంటికాలి మీద లేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించినా మర్యాద కోసమైనా ఆయన మోదీని కలుసుకోవడం లేదు. దీనికి తోడు ఈ రాష్ట్రాలలో బీజేపీకి ఉన్న బలం కూడా నామమాత్రమైందే. మొత్తం మీద తిరుగు లేదనుకున్న మోదీ చక్రవ్యూహంలో చిక్కుకున్నారు. అడ్డ దారిలో మహారాష్ట్రలో బీజేపీ శివసేనను చీల్చి చీలిక వర్గం నాయకుడు షిండేను ముఖ్యమంత్రిని చేసి అధికారంలో కొనసాగుతున్నా షిండే వర్గానికి, బీజేపీకి మధ్య పొరపొచ్చాలు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి వెలువడే సకాల్‌ పత్రిక నిర్వహించిన సర్వేలో ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా దేశమంతటా బీజేపీ పరిస్థితి జారుడు మెట్ల మీద ఉన్నట్టు తేలింది. బీజేపీ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సర్వేల్లో కూడా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. పాతికేళ్ల కింద అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఎన్‌.డి.ఏ. ఏర్పడినప్పుడు దాదాపు మూడు పదుల పార్టీలు ఆ కూటమిలో ఉండేవి. ఇప్పుడు ఎన్‌.డి.ఏ. లో మిగిలిందల్లా మహారాష్ట్రలో శివసేన నుంచి చీలిపోగా మిగిలిన షిండే వర్గం, పశుపతి పారస్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌ జనశక్తి, అప్నా దళ్‌కు చెందిన సోనేలాల్‌ వర్గం, తమిళనాడులో అన్నా డి.ఎం.కె. మాత్రమే. ఇవన్నీ చాలా చిన్న పార్టీలే. అందుకని ఒకప్పుడు ఎన్‌.డి.ఏ. భాగస్వామ్యం ఉన్న తెలుగు దేశం, పంజాబ్‌లోని అకాలీ దళ్‌ లాంటి పార్టీలను మళ్లీ ఎన్‌.డి.ఏ. లో భాగం చేయాలని బీజేపీ పాటుపడ్తోంది.
జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్‌.ఆర్‌.సి.పి. మద్దతు కూడగడ్తున్న సూచనలూ ఉన్నాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్‌ లో తెలుగు దేశం, వై.ఎస్‌.ఆర్‌.సి.పి. ప్రత్యర్థి పక్షాలు. ఎన్‌.డి.ఏ.లో చేరడానికి టి.డి.పి. నాయకుడు చంద్రబాబు ఉబలాట పడ్తున్నారు కానీ జగన్‌ నుంచి ఆ సంకేతాలేవీ ఇప్పటికైతే లేవు. కర్నాటకలో ఓటమి పాలైన తరవాత దక్షిణాది విషయంలో బీజేపీ ఆశ వదులుకోవలసిందే. కేరళలో కాలు మోపడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం శూన్యమే. తమది విభిన్నమైన పార్టీ అని బీజేపీ మొన్నటిదాకా చెప్పుకునేది. ఈ మధ్య ఆ మాటే ఎత్తడం లేదు. ప్రత్యర్థి పక్షాలన్నింటిపైనా మోదీ ప్రభుత్వం సీబీఐ, ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖలను ప్రయోగించి మిత్రులే మిగలకుండా చేసుకుంది. ఎంత ప్రయత్నించినా అకాలీ దళ్‌, బిజూ జనతా దళ్‌ ఎన్‌.డి.ఏ. కూటమిలో చేరే అవకాశం మృగ్యమే. బీజేపీకి మిగిలింది మిత్ర పక్షాలకోసం వేటే!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img