Friday, December 1, 2023
Friday, December 1, 2023

మేనేజర్లు ఎన్నికల్లో గెలిపిస్తారా!

మరో ఆరేడు నెలల్లో ఆరు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల మీద చర్చ కన్నా ఎన్నికలలో వివిధ పార్టీలు గెలిపించే నైపుణ్యం ఉందనుకుంటున్న ప్రశాంత్‌ కిశోర్‌ గురించే రాజకీయ వర్గాలు అధికంగా మాట్లాడుకుంటున్నాయి. ఆయన మహారాష్ట్ర దిగ్దంత, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ను రెండు సార్లు కలుసుకున్నారు. ఆ తరవాత కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో కూడా సంభాషించారు. ఈ వరస సమావేశాలు అనేక ఊహాగానాలకు తావిచ్చాయి. కాంగ్రెస్‌ నాయకత్రయాన్ని కలుసుకున్నందువల్ల ఆయన కాంగ్రెస్‌ లో చేరతారేమోనని భాష్యం చెప్పిన వారికీ కొదవలేదు. ప్రశాంత్‌ కిశోర్‌ తనను కలుసుకున్నది తన కంపెనీ గురించి మాట్లాడడానికేనని శరద్‌ పవార్‌ అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో మంతనాలు జరపడం సహజంగానే అనేక అంచనాలకు రావడానికి దారి తీసింది. ప్రశాంత్‌ కిశోర్‌ స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. ఆయన ప్రధానంగా ఎన్నికల వ్యూహాలు రూపొందించడంలో నిష్ణాతుడంటారు. ఒకప్పుడు ఆయన బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జె.డి.(యు)లో చేరి ఉపాధ్యక్షుడయ్యారు. కానీ అక్కడ ఇమడలేక పోయారు. ఆయన కాంగ్రెస్‌లో చేరినందువల్ల కీలక స్థానం ఎటూ దక్కదు కనక ఆ అవకాశం తక్కువే. కాంగ్రెసే ప్రస్తుతం తెరచాప లేని నావలా ఉంది. రెండేళ్ల నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేయలేనంతగా బలహీనపడి పోయింది. రాష్ట్రాల కాంగ్రెస్‌ అధ్యక్షులను మాత్రం మారుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్‌ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. అలాగే త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు కట్టబెట్టింది. అయితే 2019 ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైనందుకు బాధ్యుడిని తానేనని రాహుల్‌ గాంధీ తప్పుకున్నారు. విధిలేక సోనియా గాంధీకి ఆ స్థానం అప్పగించారు. అది తాత్కాలిక ఏర్పాటే అన్నారు. ఇదంతా కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారం. దీనిలో ప్రశాంత్‌ కిశోర్‌ తన నైపుణ్యాన్ని ఉపయోగించి చేయగలిగింది ఏమీ ఉండదు. ఏదో ‘‘బ్రహ్మాండమైన’’ పని చేస్తానని ప్రశాంత్‌ కిశోర్‌ అనుకోవచ్చు. లేదా అది భ్రమగానే మిగలనూ వచ్చు. కాంగ్రెస్‌ నిర్మాణ స్వరూపం ఇందిరా గాంధీ వారసులకు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వదు. పైగా ప్రశాంత్‌ కిశోర్‌కు రాజకీయాల మీద, ఎన్నికల వ్యూహాలు రూపొందించడం మీద ఎంత ఆసక్తి ఉన్నా రాజకీయ నాయకుడిగా పరిగణించడానికి అవకాశం లేదు. శరద్‌పవార్‌ను, ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలను కలుసుకున్నప్పుడు వచ్చే ఏడాది వివిధ శాసనసభలకు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో యోగీ ఆదిత్యనాథ్‌ను గద్దె దింపడానికి అనుసరించవలసిన పంథా గురించి చర్చించి ఉంటారేమో అనుకోవడానికి ఆస్కారం ఉంది. మరికొంచెం దీర్ఘదృష్టితో చూస్తే 2024 ఎన్నికలు కూడా ప్రస్తావనకు వచ్చిఉండవచ్చు. అయితే ప్రశాంత్‌ కిశోర్‌తో ఏం చర్చించింది అటు కాంగ్రెస్‌ గానీ ఇటు ప్రశాంత్‌ కిశోర్‌ గానీ బాహాటంగా చెప్పిందీ లేదు. అందుకే ఊహలే రాజ్యమేలుతున్నాయి.
ప్రశాంత్‌ కిశోర్‌కు చాలామంది రాజకీయ నాయకులు సన్నిహితంగా తెలిసిన మాట నిజం. ఆయన తెలివితేటలనూ తక్కువ అంచనా వేయలేం. 2014లో మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయానికి ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహమే ప్రధాన పాత్ర నిర్వర్తించిందని నమ్మే వారికీ కొదవలేదు. వాస్తవం పూర్తిగా దానికి విరుద్ధం. 2014లో బీజేపీకి ప్రశాంత్‌ కిశోర్‌ సహకారం ఉన్నప్పుడు బీజేపీకి 282 సీట్లు వస్తే ఆ సహాయం ఏమీ లేకుండానే 2019లో మోదీ నేతృత్వంలో బీజేపీ 303 స్థానాలు సంపాదించింది. అందువల్ల ఆయన వ్యూహాలే బీజేపీని గెలిపించాయనుకోవడానికి వీల్లేదు. ఆయనకు సంబంధించి ఎన్నికల వ్యూహాలు రూపొందించడం, తాను కలిసి పనిచేసే పార్టీ విజయానికి దోహదం చేయడం ఆయన వృత్తి నైపుణ్యంలో భాగమే తప్ప మరేమీ కాదు. దిల్లీలో కేజ్రీవాల్‌ను గెలిపించాడంటారు. అక్కడ కూడా ప్రశాంత్‌ కిశోర్‌ సాయం లేనప్పుడు కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ మరిన్ని ఎక్కువ స్థానాలే సంపాదించింది. ఆ తరవాత కాంగ్రెస్‌కు, ఇటీవల తమిళనాడులో స్టాలిన్‌ విజయానికి, బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలవడానికి కారకుడయ్యారనీ నమ్మే వాళ్లున్నారు. ఈ అన్ని సందర్భాలలోనూ ప్రశాంత్‌ కిశోర్‌ నిపుణత కన్నా వాస్తవ పరిస్థితులే ఆయా పార్టీల విజయానికి దోహదం చేశాయి. మహా అయితే నాల్గు సీట్లు ఎక్కువ రావడానికి ఆయన వ్యూహాలు తోడ్పడి ఉండవచ్చు. ఓడిపోతుందనుకున్న పార్టీని ఆయన గెలిపించిన దాఖలా ఒక్కటి కూడా లేదు. ఆయన పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌కు కూడా కావలసిన మనిషే. పంజాబ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అమరేంద్ర సింగ్‌ ప్రశాంత్‌ కిశోర్‌ సాయం అడిగినట్టు లేదు. పంజాబ్‌లో నిజానికి కాంగ్రెస్‌ సునాయాసంగా గెలవగలిగిన పరిస్థితే. కానీ ఇంటిపోరు ఆ అవకాశాలను దెబ్బ తీయవచ్చు. ఇలాంటి స్థితిలో ప్రశాంత్‌ కిశోర్‌ ఏం చేయగలరన్నదే అసలు ప్రశ్న. 2017లో ఉత్తరప్రదేశ్‌లో ఆయన కాంగ్రెస్‌ కోసం పని చేసినా ఒరిగింది ఏమీ లేదు. ఆయన వైఖరిని జాగ్రత్తగా గమనిస్తే గెలిచే చోట్లే ఆయన ఒప్పందాలు కుదుర్చుకుంటారనిపిస్తుంది. ఓటర్లు, ఓటింగ్‌ విధానం, సామాజిక వర్గాల పొందిక, ఓటర్ల ధోరణి, వివిధ ఎన్నికలలో గెలుపోటములకు సంబంధించిన గణాంకాలు ఆయన సేకరించిపెట్టారు. అవి ఎవరికైనా ఉపయోగపడతాయి. యు.పి. ఎన్నికలలో కనీసం కాంగ్రెస్‌ను సమాజ్‌ వాదీ పార్టీని ఒక వేదిక మీదకు ఆయన తీసుకురాగలరా? 2024 ఎన్నికలలో మోదీని ఓడిరచే చిట్కా ఏదైనా చెప్పగలరా? ప్రతిపక్షాల ఐక్యత లేకుండా మోదీని ఎలా ఓడిరచగలరు. కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్ష ఫ్రంట్‌ సాధ్యం కాదన్న ఆయన మాట మాత్రం నిజం. అన్నింటికన్నా మించి ఇంతకీ ప్రశాంత్‌ కిశోర్‌ ఎటువేపు నిలబడుతున్నట్టు? ఆయన ఎవరికి అనుకూలం? ఎవరికి వ్యతిరేకం? ఆయన సైద్ధాంతిక ప్రాతిపదిక, భావజాలం ఏమిటో కూడా తెలియదు. మహా అయితే ఆయన భిన్నమైన నాయకుల మధ్య, విభిన్న పార్టీలకు మధ్య వారధిగా ఉపకరించగలరేమో. భిన్నమైన నాయకుల మధ్య సంధానకర్తగా వ్యవహరించగల సామర్థ్యం ఆయనకు ఉన్న మాట నిజం. ఎన్నికలలో విజయానికి పార్టీల విధానాలు, కార్యక్రమాలు, ప్రజాసమస్యల మీద వైఖరి ప్రధానం. ఈ విషయాలేవీ ప్రశాంత్‌ కిశోర్‌ ఎరుకలోనివి కావు. ఎన్నికలలో గెలిపించే సత్తా పార్టీలకు ఉండొచ్చు. ఆ పార్టీల నాయకులకు ఉండొచ్చు. కేవల వ్యూహకర్తలవల్ల గెలుపు అసాధ్యం. మేనేజర్లు ఏ ఎన్నికలలో ఎవరినీ గెలిపించలేరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img