Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

మేలైన జనాభా విధానం అవశ్యం

జనాభా సంఖ్యలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానానికి చేరుకున్నదని పాలక వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు సంబరపడిపోతున్నాయి. గొప్ప పరిణామంగా భావిస్తు న్నాయి. చైనాను మించిపోయామని చెప్పుకోవడం చూస్తున్నాం. దేశ ఆర్థిక వృద్ధి త్వరలో ఐదు ట్రిలియన్లకు చేరుకొంటుందని కేంద్ర పాలకులు ప్రజలను నమ్మించేందుకు పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రజల ఆదాయాలు పెరగలేదు. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతోంది. స్థూల జాతీయ వృద్ధి రేటు 202223లో ఆ తర్వాత 2024లో తగ్గుతుందని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు అంచనా వేశాయి. జనాభా 142 కోట్లకు పైగా పెరిగినట్టు అధ్యయనం ప్రకటించింది. పెరిగే జనాభాకు సరిపడ ఆహారం, నివాస వసతి, ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత. అయితే రానురాను పాలకులు... సంపన్నులు మరింత సంపన్నులు కావడానికి, పేదలు ఇంకా అధికమయ్యేందుకు దోహదం చేసే విధానాలు అనుసరిస్తు న్నారు. ఇప్పుడున్న జనాభాలో దాదాపు 58 శాతం పనులు చేయగల వయస్కులు. 1524 వయస్సున్న నవ యవ్వనులు చదువుకున్న తర్వాత అందుకు తగిన ఉద్యోగాలు లభించడం లేదని నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. వృద్ధిరేటు పెరుగుదలకు తగినన్ని పెట్టుబడులు, ఉత్పత్తులు, ఎగుమతులు ప్రస్తుతం లేవని అధికార వర్గాలు అందజేస్తున్న గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఎగువ, మధ్య, దిగువ తరగతుల ప్రజలందరి ఆదాయాలు సమంగా లేవు. కుబేరుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. దీంతో ఆర్థిక, సామాజిక అంతరాలు ఉహించలేని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ స్థితిలో దిగువ మధ్య తరగతి, పేదల ఆదాయాలు పెరగకుండా వారి కొనుగోలు శక్తి పెరగదు. మధ్య తరగతి పెరిగిందని, వారి ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరిగిందని, ఇది వృద్ధికి దోహదం చేస్తుందని పాలకులు చెబుతున్నారు. ఇదే నిజమైతే ఉత్పత్తి రంగం వేగంగా వృద్ధి చెంది ఎగుమతులు పెరిగి వృద్ధిరేటు, ఆర్థిక పురోగతి నమోదు కావాలి. కానీ అలా పెరగడంలేదు. ఇప్పుడున్న జనాభాకే తగినంత పౌష్ఠికాహారం, పరిశుభ్రమైన నీరు, కాలుష్యరహిత గాలి అందడం లేదు. దీంతో అన్ని రకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షపండు అయింది. జనాభా పెరుగుతున్న కొలదీ పర్యావరణ కాలుష్యం, భూతాపం అధికమై వాతావరణ విపత్తులు విజృంభిస్తాయి. ఐక్యరాజ్య సమితి నిర్దేశించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడం అసాధ్యమవుతుంది. 800 కోట్లకు చేరిన జనాభాని ధరిత్రి భరించలేని స్థితి వల్లనే ఈ అనర్థాలకు కారణమవుతోంది. మంది పెరిగితే మజ్జిగ పలచనవుతాయన్న సామెత రుజువవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయి. వినిమయం తగ్గుతుంది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని ఆనాటి జవహర్‌లాల్‌ ప్రభుత్వం యోచించింది. కుటుంబ నియంత్రణ కోసం, ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకువెళ్లి వారిని చైతన్యం చేసేందుకు ఒక స్థంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుటుంబ నియంత్రణ ఫౌండేషన్‌ను నెలకొల్పి ప్రచారం గావించారు. అనంతర కాలంలో ఫౌండేషన్‌ పేరును భారత జనాభా ఫౌండేషన్‌గా మార్చారు. 1992`93లో డా॥ఎం.ఎస్‌.స్వామినాథన్‌ చైర్మన్‌గా ఉన్నతాధికార గ్రూపును ఏర్పాటు చేశారు. ఇది జాతీయ జనాభా విధానం ముసాయిదాను రూపొందించి ఆనాటి పి.వి.నరసింహారావు సంకీర్ణ ప్రభుత్వానికి అందజేసింది. అయితే ముసాయిదాను పార్లమెంటు చర్చించి, చట్టం చేసి అమలు చేయలేదు. దీంతో జనాభా నియంత్రణ కోసం అరకొర చర్యలు మాత్రమే చేపట్టారు. అంతేకాదు…ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రైవేటు రంగాన్ని, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేసి దేశంలో ఆర్థిక అసమానతలు పెంచారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ జనాభా విధానం విషయమే చర్చకు రాలేదు. అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతున్నదన్న సమాచారం మంచి పరిణామమే. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలలో నీటి వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా భూగర్భ నీటిస్థాయిలు రోజురోజుకీ పడిపోతున్నాయి. పుట్టే ప్రతి శిశువుకీ కనీస నాణ్యమైన గాలి, నీరు, ఆహారం అవసరం. ఇప్పటికే నాణ్యమైన, సురక్షితమైన ఆహారం, నీరు, గాలి లేని దుస్థితిలో మనం ఉన్నాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. ఇప్పుడున్న సమస్యల జడి నుండి బయటపడి రానున్న తరాలకు మెరుగైన జీవనాన్ని అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఇప్పటికైనా నాణ్యమైన కొత్త జనాభా విధానాన్ని, ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళిక రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. అతి జాతీయవాదం, మెజారిటీ మతవాదం అనుసరిస్తూ కార్పొరేట్లకు అనుకూల నిర్ణయాలు అమలుచేసే పాలకులు కొత్త జనాభా విధానాన్ని రూపొందించి అమలు చేస్తాయా?. మతాధిపత్య శక్తులు సాధారణంగా కుటుంబ నియంత్రణ వ్యతిరేక భావన కలిగి ఉంటాయి.
ఇప్పటికే అనేక మంది బీజేపీ, సంఘ పరివార్‌ నేతలు ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చి ప్రచారం సాగించారు. వీళ్లేకాదు…ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు సైతం అధిక సంతానాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడటం ఇలాంటి వారికి అలవాటు ఉండదు. అధికమవుతున్న జనాభా అనేక సమస్యలను సృష్టిస్తుందన్నది సత్యం. దీన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img