Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

మోదీకి మింగుడు పడని నిష్ఠుర సత్యం

మొహం బాగాలేక అద్దం పగులగొట్టినట్టు మోదీ సర్కారు 2002లో గుజరాత్‌ మారణకాండపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని వీక్షించడానికి వీలులేకుండా నిషేధించింది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా రైలుపెట్టె దహనం పర్యవసానంగా మూడురోజులపాటు తీవ్ర స్థాయిలో ముస్లింలపై మారణకాండ కొనసాగింది. సాధారణంగా ఈ మారణకాండను గుజరాత్‌ మతకలహాలు అనడం పరిపాటి అయింది. నిజానికి ఇవి మతకలహాలు కావు. రెండు మతవర్గాలు కలహాలకు పాల్పడితే అవి మత కలహాల కింద లెక్క. కానీ 1984లో దిల్లీలో సిక్కులమీద భీకరమైన దాడి, 2002లో గుజరాత్‌లో ముస్లింలపై కిరాతకమైన దాడి ఒక మతం వారిపై కసి తీర్చుకోవడానికి, లేదా ఆ మతం వారిని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలే. లక్ష్యం సాధించారా లేదా అన్న అంశం పక్కనపెడ్తే ఈ మారణకాండ వెనక ఉన్న ఉద్దేశాన్ని తక్కువ అంచనా వేయలేం. సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రెండుదశాబ్దాల కింద తాము గుణపాఠం చెప్పిన తరవాతే మతకలహాలు ఆగాయని ఢంకామీద దెబ్బవేసి మరీ చెప్పారు. ఇది గుజరాత్‌ మారణకాండలో అప్పటి ముఖ్యమంత్రి మోదీ పాత్రను అంగీకరించడమేగా! గుజరాత్‌ మారణకాండ జరిగిన తరవాత, మేధావులు, రచయితలు, పత్రికా రచయితలు అక్కడ పర్యటించి బోలెడు నివేదికలు విడుదల చేశారు. ఈ నివేదికలన్నీ మోదీ వేపే వేలెత్తి చూపించాయి. గుజరాత్‌ మండిపోతుంటే మోదీప్రభుత్వం చూస్తూ కూర్చోవడమే కాదు జనాగ్రహం వెళ్లగక్కడానికి అవకాశం ఇవ్వాలని పోలీసులని ఆదేశించాలని నోటిమాటగా ఉత్తర్వులు జారీచేసినట్టు కూడా వార్తలొచ్చాయి. సాక్షాత్తు అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజపేయి గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీని తొలగించాలని అనుకున్నారు. అధికారంలో ఉన్నవారు రాజధర్మం పాటించాలని కూడా అన్నారు. కానీ బీజేపీ సీనియర్‌ నాయకుడు లాల్‌కృష్ణఅడ్వానీ అడ్డు పడ్డందువల్ల మోదీ పదవిలో కొనసాగారు. ఆ తరవాత మోదీ గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని ఇది గుజరాత్‌ నమూనా అని భారీఎత్తున ప్రచారం చేసుకున్నారు. గుజరాత్‌ నమూనా అన్న పదబంధానికి మోదీ, ఆయన భక్తులు ఏ నిర్వచనం చెప్పినా గుజరాత్‌ నమూనా అంటే మారణకాండే గుర్తుకు వస్తుంది. మోదీ మీద దాఖలైన అనేక కేసులు న్యాయస్థానాల్లో తేలిపోయాయి. అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించడం సులభం కానందువల్లే మోదీ నిర్దోషిగా బయటపడ్డారు. ఆ సమయంలో ప్రపంచమంతా గుజరాత్‌ మారణ కాండను తీవ్రంగా దుయ్యబట్టింది. అమెరికా అయితే మోదీకి వీసా ఇవ్వడానికి నిరాకరించింది. బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని మోదీ ప్రభుత్వం నిషేధించినా ఇప్పటికే ఆ డాక్యుమెంటరీని చూడడమే కాదు ట్విట్టర్‌లో ఇతరులకు పంపిన ప్రముఖులూ ఉన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు మహువా మొయిత్రి, డెరిక్‌ ఓబ్రియాన్‌ ఇలా ట్విట్టర్‌ ద్వారా పంపారు. ఈ లింకులను ప్రభుత్వం తొలగింప చేసింది. ఇది సూర్యకాంతికి అరచేయి అడ్డం పెట్టడంలాంటిదే. ఉత్తరప్రదేశ్‌లో ఇలాగే మతకలహాలు రెచ్చగొట్టిన నేపథ్యంలో ముజఫÛర్‌ నగర్‌ బాఖీహై సినిమావస్తే దాని మీదా బీజేపీ నానా రచ్చచేసింది. ఆ సినిమాను ఎక్కడ ప్రదర్శిస్తే అక్కడ గొడవచేసింది. ఆ సినిమాను మెచ్చుకున్న వారందరినీ దేశద్రోహుల జాబితాలో చేర్చింది. 

గుజరాత్‌ మారణకాండపై బిబిసి డాక్యుమెంటరీ మొదటిభాగం మాత్రమే వచ్చింది. ఇంకా రెండో భాగం రావలసి ఉంది. ఈ సినిమాలో అప్పటి ఇంగ్లాండ్‌ విదేశాంగశాఖమంత్రి జాక్‌ స్ట్రా ఇంటర్వ్యూ కూడా ఉంది. అప్పుడు ఇంగ్లాండ్‌ ప్రభుత్వంకూడా దర్యాప్తు లాంటిది నిర్వహించింది. బిబిసి డాక్యుమెంటరీ ఒక ప్రచారాస్త్రం అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ అంటున్నారు. ఇంతకీ ఆయన ఈ డాక్యుమెంటరీ చూడనేలేదు. చూడకపోయినా ఏలినవారి మానరక్షణ బాధ్యత నెరవేర్చడానికి ఆయన పడరాని పాట్లు పడ్డారు. అసలు పరాయిదేశం మనదేశంలో దర్యాప్తు చేయడం ఏమిటి అనికూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మానవ హననం ఎక్కడ జరిగినా మానవాళి ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉంది. అలాంటి దురాగతాల్ని ఖండిస్తూనే ఉంది. రికార్డు చేస్తూనే ఉంది. బాధితుల తరఫున నిలబడడాన్ని ఎవరిని ఎవరూ ఆపలేరు. కానీ మోదీ ప్రభుత్వంలాగే వితండవాదానికి దిగేవారు ఇంగ్లాండ్‌లోనూ ఉన్నారు. ఇంగ్లాండ్‌ పార్లమెంటు ఎగువసభ సభ్యుడు లార్డ్‌ రమీరంగెర్‌ భారత్‌ జి20 బృందానికి అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ విడుదల చేయడం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి రుషి సునక్‌ భారతీయ మూలాలున్న వారు కనక ఇప్పుడు ఈ గొడవేమిటి అనే వాళ్లూ ఉన్నారు. ఈ డాక్యుమెంటరీలో మోదీని చిత్రించిన తీరును తాను ఆమోదించలేనని సునక్‌ సెలవిచ్చారు. ఎవరిఅభిప్రాయం ఎలాఉన్నా ఈ డాక్యు మెంటరీని చూసిన వారిలో చాలామంది ఇది జాగ్రత్తగా, లోతైన పరిశోధనచేసి రూపొందించినచిత్రం అంటున్నారు. సుప్రీంకోర్టు మోదీని నిర్దోషిగా వదిలేస్తే ఇప్పుడు ఆయనను బిబిసి దోషిగా నిలబెడ్తుందా అని నిలదీస్తున్న వారికీ కొదవలేదు. ఉత్తమ పరిశోధనాత్మక పత్రికా రచనకు ప్రతీకగా నిలిచిన తెహల్కా పత్రిక గుజరాత్‌ మారణకాండ జరిగిన దాదాపు పదేళ్లకు రాణా అయూబ్‌ అనే పత్రికా రచయితను గుజరాత్‌ పంపి వాస్తవాన్ని వెలికి తీయమని చెప్పింది. అనేక నెలలు కష్టపడి రాణా అయూబ్‌ చాలా విలువైన సాక్ష్యాధారాలు సేకరించారు. చివరకు తెహల్కా పత్రిక ఆమె సేకరించిన వార్తలను ప్రచురించే సాహసం చేయలేకపోయింది. మోదీ ప్రభావం అంటే అదే. ఏ వాదనా దొరకని వారు ఈ డాక్యుమెంటరీ భారత సార్వభౌమత్వం మీద దాడి అని పెద్దబండరాళ్ల లాంటి మాటలను నిష్ప్రయోజనకరంగా దొర్లిస్తున్నారు. బిబిసి ప్రధానంగా మీడియా వ్యవస్థ. ఆ వ్యవస్థ వెలు వరించే వార్తలకు చాలా గౌరవం ఉంటుంది. కచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి, లేదా తెలిసిన సమాచారాన్ని ధ్రువీకరించుకోవడానికి బిబిసి మీద ఆధారపడే వారు చాలా మంది ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని బోర విరుచుకు తిరిగే మోదీ ప్రభుత్వం మాత్రం నిష్ఠుర సత్యాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img