Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

మోదీయే సర్వస్వం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) బీజేపీని నడిపిస్తుందా లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. మార్గదర్శకత్వాన్ని మించిపోయిందా అని ఇటీవలి కాలంలో జరుగుతున్న చర్చకు సమాధానం దొరికింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలను చూస్తే మోదీ మాటే సుగ్రీవాజ్ఞ అని అర్థం అయిపోయింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం ఆరు కొత్త మొఖాలు ఉన్నాయి. రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాననీ తాను ఇంతవరకు పోటీ చేస్తూ వచ్చిన షికారీపుర నియోజకవర్గం నుంచి తన చిన్న కొడుకు విజయేంద్రకు అవకాశం ఇస్తే చాలునని చెప్తూ వచ్చిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్పకు పార్లమెంటరీ బోర్డులో స్థానం దక్కడం అన్నింటికన్నా ఆసక్తికరమైన అంశం. బీజేపీకి తిరుగులేని నాయకుడు మోదీ అన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అలాగే ఆయన అనుంగు మిత్రుడు అమిత్‌ షా స్థానమూ చెక్కు చెదరలేదు. మోదీ తరవాతి స్థానం కచ్చితంగా ఆయనదే. మోదీ, షా తరవాత బీజేపీ నాయకుల వరసలో వినిపించే మరో పేరు పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ దే. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ప్రభ కొంత కొడిగట్టింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు మహత్తరమైన బాధ్యతలేవీ అప్పగించలేదు. కానీ ఇప్పుడు ఆయనకు పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకోవడానికి ప్రధాన కారకుడైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీకి, ఇరవై ఏళ్లుగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు పార్లమెంటరీ బోర్డులో స్థానం దక్కకపోవడం మోదీ ఆధిపత్యానికి తిరుగులేదనడానికి నిదర్శనం. నితిన్‌ గడ్కరీకి స్థానం దక్కకపోవడం విశేషమే అయినా మోదీ ఆధిపత్యానికి తిరుగు లేదు కనక ఆశ్చర్యకరమైతే కాదు. గడ్కరీకి ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రతి వారం నాగ్‌పూర్‌ వెళ్తూనే ఉంటారు. ఇది మోదీకి నచ్చినట్టు లేదు. విధాన నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులో గడ్కరీకి స్థానం దక్కక పోయినా ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకత్వం ఏమీ చేయలేని స్థాయికి మోదీ ఎదిగిపోయారు. నాగపూర్‌ అధినేతలకు ఇష్టుడైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మాత్రం కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు దక్కింది. ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వం లోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఫడ్నవీస్‌దే కీలక పాత్ర కనక ఆయనకు ఇది ఓ రకమైన బహుమానమే అనుకోవాలి. యోగీ ఆదిత్యనాథ్‌ బలమైన నాయకుడే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు, ఆయన భాషలో చెప్పాలంటే మొత్తం 80 సీట్లు బీజేపీ బుట్టలో పడేయడానికి యోగి ఆదిత్యనాథ్‌ కీలక పాత్ర పోషించవలసి ఉంది. అయినా ఆయనకు పార్లమెంటరీ బోర్డులో చోటు దొరకలేదు. యోగి ఆదిత్యనాథ్‌ కరడుగట్టిన హిందుత్వ వాదే అయినా ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుదురులోని వారు కాదు. గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగానే ఆయన ప్రధానంగా వెలుగులోకి వచ్చారు. అదీగాక మోదీకి ఆయనే వారసుడు అన్న ప్రచారం సహజంగానే మోదీ, షా ద్వయానికి మింగుడు పడలేదు. ఎన్నికల ప్రచారంలో యోగీ కీలక పాత్ర పోషించడంవల్ల మోదీకి ఆయనే వారసుడు అన్న అభిప్రాయం కలగడం మోదీకి మింగుడు పడలేదు. అందుకే ఆయనకు పెద్ద పీట వేయడానికి మోదీ సిద్ధంగా లేరు. పైగా ఈ దశలో అమిత్‌ షాకు ఆగ్రహం కలిగించే సాహసం మోదీ చేయలేరు. గత ఏడేళ్ల నుంచి ఉత్తరప్రదేశ్‌లో అమిత్‌ షాకు కుడిభుజంగా ఉన్న సీనియర్‌ బీజేపీ నాయకుడు సునీల్‌ బన్సల్‌ను ఉత్తరప్రదేశ్‌ నుంచి ఉపసం హరించారు. బన్సల్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా కూడా పని చేశారు. కానీ యోగీ ఆదిత్యనాథ్‌కు ఆయనతో సరిపడలేదు. ఎమ్మెల్యేలు బన్సల్‌ చుట్టూ తిరగడం యోగికి కంటగింపైంది. బన్సల్‌ను పంపించడమే యోగీకి దక్కిన ఊరట.
బీజేపీ తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ ప్రభుత్వాన్ని కూలదోసి మళ్లీ ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నప్పటికీ పార్లమెంటరీ బోర్డులో మాత్రం స్థానం దక్కలేదు. చౌహాన్‌ మీద మోదీ శీతకన్ను వేయడానికి మరో రెండు కారణాలున్నాయి. మోదీ ప్రధాని కాక ముందు చౌహాన్‌ ఒకప్పుడు బీజేపీ అగ్రనాయకులు లాల్‌ కృష్ణ అడ్వానీ, సుష్మా స్వరాజ్‌ సహాయంతో ప్రధానమంత్రి పదవి మీద కన్నేశారు. రాజకీయాల్లో తన కుటుంబాన్ని ప్రోత్సహిం చాలనుకోవడం కూడా మోదీకి రుచించలేదు. వచ్చే ఏడాది కర్నాటక శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉండడమే యడియూరప్ప పునరుథానానికి ప్రధాన కారణం. మోదీ లెక్క ప్రకారం 75 ఏళ్లు మించిన వారికి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించకూడదు. యడియూరప్పకు 77 ఏళ్లు అయినా మళ్లీ ఆయనను అందలం ఎక్కించడానికి కర్నాటక రాజకీయాలపై ఆయనకు ఉన్న పట్టే కారణం. కర్నాటకలో లింగాయత్‌లు 18 శాతం ఉన్నారు. ఆ వర్గానికి యడియూరప్పే నాయకుడు. అందుకని ఆ ఓట్లను వదులుకోవడం ఎన్నికల్లో విజయం సాధించడమే పరమ లక్ష్యమైన మోదీకి సాధ్యమయ్యే పని కాదు. రాజకీయ అవతారం చాలిస్తానని ప్రకటించిన యడియూరప్పతో ఇటీవల అమిత్‌ షా సంప్రదింపులు జరిపి కర్నాటక ఎన్నికలలో బీజేపీని మళ్లీ గెలిపించడమే కాక దక్షిణాదిలో బీజేపీ పాగా వేయడానికి చేయాల్సింది చాలా ఉంటుందని అనునయించారు. కర్నాటక బీజేపీలో అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణల కారణంగా గత ఏడాది యడియూరప్ప చేత రాజీనామా చేయించారు. అందుకే కొంత కాలంగా ఆయన కినుక వహించి ఉన్నారు. ఎన్నికల్లో విజయానికి మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కనక మళ్లీ యడియూరప్పను పార్లమెంటరీ బోర్డులో నియ మించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ఆనువంశిక పాలన, అవినీతి అంటూ ఒంటికాలి మీద లేచి దుమ్మెత్తి పోశారు. కానీ ఈ రెండు ‘‘లక్షణాలు’’ యడియూరప్పకు ఉన్నాయి. యడియూరప్ప పెద్ద కొడుకు రాఘవేంద్ర పార్లమెంటు సభ్యుడు. చిన్న కొడుకు విజయేంద్రను తన రాజకీయ వారసుడిని చేయాలను కుంటున్నారు. బీజేపీ నేతల్లో అవినీతిపరుల గురించి చెప్పాలంటే యడియూరప్ప పేరే ముందు వరసలో ఉంటుంది. ఎన్నికలలో విజయం కోసం మోదీ చెప్పే నీతులను అవలీలగా ఉల్లంఘించి రాజీ పడగలరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img