Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

యుద్ధరంగమైన మణిపూర్‌

గత మే మూడవ తేదీనుంచి అగ్నిగుండంగా మారిన మణిపూర్‌లో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు. మాట్లాడినా అక్కడ అశాంతికి కారణం కాంగ్రెస్‌ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. మణిపూర్‌ లో వాస్తవ పరిస్థితి వివరించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అనేక సార్లు దిల్లీ సందర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తూనే ఉన్నారు. అయినా మణిపూర్‌ నాలుగున్నర నెలలుగా పరిస్థితి చక్కబడుతున్న ఛాయలే లేవు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మణిపూర్‌ లో పర్యటించినా అక్కడి ప్రజలకు కలిగిన ఊరటా లేదు. ఇంతవరకు దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,786 గృహదహనాలు జరిగాయి. అయినా మెయితీలు, కుకీల మధ్య రగిలిన చిచ్చును చల్లార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్దిష్ట చర్యలేమీ లేవు. ఇటీవల ఇద్దరిని హతమార్చిన తీరు విస్మయం కలిగిస్తోంది. జులై ఆరో తేదీ నుంచి కనిపించకుండా పోయిన వీరి మృతదేహాలు ఏదో కొండమీద కనిపించాయి. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే చివరకు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పూర్వీకుల ఇంటిని దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు నెరవేరకపోవడం విశేషం కాదు. ముఖ్యమంత్రి ఆ ఇంట్లో నివాసం ఉండడం లేదనీ, అది ఖాళీగా ఉందని పోలీసులు గొప్పగా చెప్తున్నారు. నిజమే కావచ్చు. ముఖ్యమంత్రి ఇంఫాల్‌ లో అధికారిక నివాసంలో ఉంటున్నారు. దుండగులను చెదరగొట్టడానికి రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు, రాష్ట్ర పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించవలసి వచ్చింది. దుండగులకు ఏమీ కనిపించకుండా చేయడానికి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇవన్నీ అవసరమైన చర్యలు అయితే కావచ్చు. కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదన్నది అంతకన్నా సత్యం. భద్రతా దళాల ప్రభావం దుండగులమీద పనిచేస్తున్న దాఖలాలే లేవు. కాని ఆయన ఇంటిని దగ్ధం చేయడానికి ప్రయత్నం జరిగిందంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఇంటి మీద దాడిచేయడానికి చేసిన ప్రయత్నం విఫలమై ఉండొచ్చు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏమీ లేకపోవచ్చు. కానీ ఇది చెదురుమదురు సంఘటన మాత్రం కాదు. ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలో దుండగులు డిప్యూటీ కమిషనర్‌ ఆఫీసును బుధవారం చిందరవందర చేశారు. హింసాకాండ నిత్యకృత్యమై పోయింది. ఇద్దరు విద్యార్థులను గత మంగళవారం హతమార్చిన తరవాత భద్రతా దళాలకు, స్థానికులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ విద్యార్థులు జులై ఆరు నుంచి కనిపించకుండా పోయినవారే. మణిపూర్‌లో కొనసాగుతున్న ఘర్షణల్లో ప్రధానంగా మహిళలు, బాలలపైన దాడులు జరగడం కొత్త ధోరణికి నిదర్శనం. మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అసమర్థత అడుగడుగునా కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వెనక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలకు తావిస్తోంది.
ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి మోదీ మణిపూర్‌ గురించి ప్రస్తావించడమే లేదు. శాసనసభ ఎన్నికలు జరగవలసిఉన్న రాష్ట్రాలలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి మోదీకి బోలెడు తీరికఉంది. కానీ మణిపూర్‌ వెళ్లడానికి మాత్రం ఆయనకు తీరికలేదు అనడంకన్నా మరేదో మతలబు ఉందనే అనుకోవాలి. తన సొంత పలుకుబడి పెంచుకోవడానికి మోదీ అనేక వ్యూహాలు పన్నుతుంటారు. తాజాగా యూ ట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ప్రధానమైన మీడియా వ్యవస్థ మొత్తం మోదీకి, ఆయన ప్రభుత్వానికి దాసోహం అంటున్న దశలో ప్రత్యేకంగా యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించారంటే ప్రచార కండూతికి అంతులేదు అని రుజువు అవుతోంది. పత్రికలు, ప్రసార మాధ్యమాలను పూర్తిగా లొంగదీసుకున్న మోదీ ఇక సామాజిక మాధ్యమాలలోనూ తానే ప్రత్యక్షం కావాలనుకుంటున్నారు. మణిపూర్‌లో జరుగుతున్న ఎంత తీవ్రమైన దారుణమైనా మోదీలో చలనం కలిగించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలకు బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వంపై నమ్మకంలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశాలేదు. మణిపూర్‌లో శాంతి నెలకొనాలంటే మొట్ట మొదట చేయవలసినపని ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేయడం అని మణిపూర్‌లో పర్యటించి వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు అభిప్రాయ పడ్తున్నారు. అయినా మోదీ ప్రభుత్వంలో చలనం లేదంటే అక్కడ శాంతి నెలకొనడం ఇష్టం లేదనుకోవాలేమో! కుకీలు ఎక్కువగా ఉండే చోట మెయితీలు, మెయితీలు అధిక సంఖ్యలో ఉండే చోట్లకు కుకీలు వెళ్లే అవకాశమే లేనంతగా వైషమ్యాలు పెరిగిపోయాయి. సేనాపతి జిల్లా నుంచి 2000 మంది మెయితీలను తరిమేశారన్న ఆరోపణలున్నాయి. మెయితీల మద్దతు బీజేపీకే ఉంది. వారికీ రక్షణ లేదు. ఇంఫాల్‌ లోయలో పెద్ద సంఖ్యలో మణిపూర్‌ పోలీసులను, కేంద్ర రిజర్వు పోలీసు బలగాలను, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను నియోగించినా పరిస్థితి మెరుగుపడడం లేదు. బుధవారం మణిపూర్‌ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినా విద్యార్థులు మాత్రం తమ పాఠశాలల దగ్గర గుమికూడారు. గిరిజనులైన కుకీలను, మైదాన ప్రాంతాలకు చెందిన మెయితీలను బీజేపీ శత్రు శిబిరాలుగా మార్చేసింది. రాష్త్రం అంతా పెద్ద యుద్ధ రంగంగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా, భద్రతా దళాలను నియోగిస్తున్నా, అదనపు భద్రతా దళాలను నియోగించడానికి అవకాశం ఉన్నా పరిస్థితి కుదుటపడడం లేదంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియా పరత్వమో, నిస్సహాయతో కాదు. రెండుచోట్ల అధికారంలో ఉన్న బీజేపీకి మణిపూర్‌లో పెద్ద ఎజెండాయే ఉందన్న అభిప్రాయం ఇప్పటికే విస్తారంగా ఉంది. ఒక రకంగా 2022 నాటి గుజరాత్‌ పరిస్థితికి, ప్రస్తుతం మణిపూర్‌ పరిస్థితికి పోలిక కనిపిస్తోంది. శాంతి భద్రతలు నెలకొల్పవలసిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పనుపున అధికార యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే పరిస్థితి చక్కబడుతుందనుకోవడానికి ఆస్కారమే లేదు. మోదీ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే ప్రతిపక్ష నేతలనూ మణిపూర్‌ తీసుకెళ్లి శాంతి నెలకొనడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం నిరర్థకంగా తయారైంది కనక ముందు చేయవలసినపని ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయడం. రాష్ట్రపతి పాలన విధించి సాధారణ పరిస్థితులు నెలకొనడానికి సకల ఏర్పాట్లూ చేయడం. అయితే మణిపూర్‌లో శాంతి నెలకొనేట్టు చేయాలన్న సంకల్పం మోదీ ప్రభుత్వానికి ఉందా అన్నది పెద్ద ప్రశ్న. లోపాయికారీ ఎజెండా ఏదో లేకపోతే ఇంతకాలం ఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోదు. ఏ నాయకుడూ పెదవి విప్పకుండా ఉండరు. మణిపూర్‌ లో అశాంతి ప్రభావం మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్నింటి మీదా ఉండక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img