Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం

గత కొన్ని వారాలుగా, నిజానికి దాదాపు ఏడాది నుంచి రష్యాకు ఉక్రెయిన్‌కు మధ్యన మాటల రూపంలో ఆరోపణలు, ప్రత్యారోపణల రూపంలో కొనసాగుతున్న ఘర్షణ గురువారం యుద్ధానికి దారితీసింది. రష్యా విశాలమైనదేశం కనక ఉక్రెయిన్‌ లోకి సైన్యాలను నడిపించడం సాధారణంగా విమర్శలకు గురికాక తప్పదు. అందుకే అనేక దేశాలు రష్యా దురాక్రమణ చేస్తోంది అంటున్నారు. భారత్‌ ఇప్పటి దాకా తటస్థ వైఖరినే అనుసరిస్తోంది కాని భారత్‌ సహాయం చేస్తుందన్న ఆశ ఉక్రెయిన్‌కు ఏ మూలనో ఉన్నట్టుంది. మునుపటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌లో 2021జులై నుంచి పరిస్థితి విషమించడం మొదలైంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఓలొదిమిర్‌ జెలెన్స్కీ అమెరికా నాయకత్వంలోని నాటో సైనిక కూటమిలో చేరాలని తహతహలాడుతున్నాడు. అంటే రష్యా ముంగిట నాటో సైనిక దళాల ప్రవేశానికి అవకాశం కల్పించి రష్యా గుండె మీద కుంపటి రాజేయడం అన్న మాట. దీనితో ఆగ్రహించిన రష్యా అధినేత పుతిన్‌ గతఏడాదిలోనే ఉక్రెయిన్‌ సరిహద్దులో సైనికవిన్యాసాలు చేయడానికి తమ సేనలను పంపించాడు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి రష్యా సేనలు మోహరిస్తోందని అమెరికా హడావుడి మొదలు పెట్టింది. రష్యా మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. రష్యా దూకుడు వైఖరి అనుసరిస్తోందని ఆరోపిస్తున్న అమెరికా ఉక్రెయిన్‌ను నాటోకూటమిలోచేరడానికి ప్రోత్సహిస్తున్న వాస్తవాన్ని మాత్రం గంప కింద కమ్మేస్తోంది. నిజానికి ప్రస్తుతం ఉక్రేన్‌లో అధికారంలో ఉన్న ఓలొదిమిర్‌ జెలెన్స్కీ నాయకత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది ఏమీ కాదు. రష్యా అననుకూల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో అమెరికా దుష్టపాత్ర దాచినా దాగని సత్యం. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జెలెన్స్కీ ప్రభుత్వం అమెరికా చేతిలో కీలుబొమ్మగానే వ్యవహరిస్తోంది. మునుపటి సోవియట్‌ శిబిరంలో ఉన్న తూర్పు యూరప్‌దేశాలలో నాటోఎలాంటి సైనిక కార్యకలాపాలూ కొన సాగించబోదని పశ్చిమదేశాలు హామీ ఇవ్వాలని పుతిన్‌ పెట్టిన షరతును అమెరికాగానీ, అమెరికా ఆడిరచినట్టల్లా ఆడే యూరప్‌ దేశాలు గానీ పట్టించుకోనే లేదు. 29 దేశాలతో కూడిన నాటో సైనిక కూటమిలో 14 దేశాలు తూర్పు యూరప్‌ దేశాలేనని గమనిస్తే ఉక్రెయిన్‌ నాటోలో చేరితే తమకు ప్రమాదం అని పుతిన్‌ ఎందుకు భావిస్తున్నారో అర్థం అవుతుంది. వాస్తవానికి 1990లో రష్యా అధినేత గోర్బచేవ్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడికి మధ్యన రష్యా వేపు ఒక్క అంగుళం కూడా ముందుకెళ్లకూడదని ఒప్పందం కుదిరిన విషయాన్ని ఇప్పుడు అమెరికా, దానికి వత్తాసు పలికే యూరప్‌ దేశాలు వాటంగా విస్మరిస్తున్నాయి. జార్జియా నాటో కూటమిలో చేరకుండా చేయగలిగిన పుతిన్‌ ఉక్రెయిన్‌ను నిలవరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించనందువల్లే యుద్ధం అనివార్యం అయింది. రష్యాకు ఉక్రెయిన్‌కు మధ్య ఉద్రిక్తతలు హఠాత్తుగా తలెత్తినవేమీ కాదు. ఇప్పుడవి అనివార్యంగా యుద్ధ ప్రకటన స్థాయికి దిగజారాయి. 2014లో ఇలాంటి యుద్ధవాతావరణమే నెలకొంది. అప్పుడే పుతిన్‌ మద్దతుఉన్న తూర్పు ఉక్రెయిన్‌లోని చాలాభాగాలను ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదార్లు ఆక్రమించారు. ఉక్రెయిన్‌లో రష్యా వ్యతిరేకులను ప్రోత్సహించింది అమెరికానే. అందుకే అప్పుడూ, ఇప్పుడూ పుతిన్‌ కరకువైఖరి అనుసరిస్తూ న్నారనిపిస్తోంది. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టడం సాధ్యం కాదనడం ఇందుకే.
నిజానికి మునుపటి సోవియట్‌ రిపబ్లిక్‌లో భాగమైన ఉక్రెయిన్‌కు రష్యాకు సన్నిహిత సామాజిక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాష మాట్లాడే వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. 2014 పరిణామాల నేపథ్యంలో ఈ సాన్నిహిత్యానికి విఘాతం కలిగింది. అందుకే డోంబాస్‌ రిపబ్లికుల స్వాతంత్య్రాన్ని గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించాడు. డిపిఆర్‌ (డోనెట్క్స్‌ పీపుల్‌ రిపబ్లిక్‌), ఎల్‌ఎన్‌ఆర్‌ (బహాన్క్స్‌ పీపుల్‌ రిపబ్లిక్‌)లను స్వతంత్రదేశాలుగా గుర్తించాలనే చర్చ ఎప్పటి నుండో జరుగుతోంది. ఈ రెండు రిపబ్లిక్కుల భూభాగాన్ని డోన్బాస్‌ ప్రాంతం అంటారు. ఈ భూభాగంలో రష్యన్లే అధిక సంఖ్యాకులు. బ్రెజ్ఞేవ్‌, కృశ్చేవ్‌ ఉక్రేన్‌ ప్రాంతం నుంచి వచ్చిన వారే. 2014లో అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రోత్సహించిన రష్యా ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటును డోన్బాస్‌ ప్రజలు వ్యతిరేకించారు. స్వతంత్రంగా ఉంటామని ఈ ప్రాంత ప్రజలు ప్రకటించుకొన్నారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి డోన్బాస్‌ తిరుగుబాటుదార్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 15 వేల మంది మరణించారు. డోన్బాస్‌ ప్రాంతంతో సహా ఉక్రెయిన్‌ తూర్పుప్రాంతంలో సాయుధ ఘర్షణలు నివారించడానికి మిన్స్క్‌ శాంతి ఒప్పందం ఎందుకూ కొరగాకుండా పోయింది. ఉక్రెయిన్‌, రష్యాకు మధ్య ఘర్షణ యూరప్‌ సమాజం మీద కూడా ప్రభావం చూపుతుంది. అందుకే వారం రోజుల కిందటే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ స్వయంగా వెళ్లి పుతిన్‌తో సంప్రదింపులు జరపవలసి వచ్చింది. అయితే రాజకీయ, భౌగోళిక అంశాల కారణంగా పశ్చిమ దేశాలు అమెరికా విధానాలను సమర్థించడం సహజమే. దీనికి అనుగుణంగానే యూరప్‌సమాజం ‘‘రష్యా మునుపెన్నడూ లేని విధంగా ఒంటరిదైపోయింది’’ అనడంతో పాటు కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా దూకుడును సంపూర్ణంగా ఆమోదించని యూరప్‌ దేశాలున్నాయి. అదే విధంగా మునుపటి సోవియట్‌ శిబిరంలో ఉన్న తూర్పు యూరప్‌ దేశాలు కూడా రష్యా ‘‘దురాక్రమణను’’ ఆమోదించడం లేదు. రష్యా గురువారం ప్రారంభించిన దాడుల్లో మొదటిదెబ్బ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం మీదే పడిరది. బలాబలాలను బేరీజు వేస్తే ఉక్రెయిన్‌ దగ్గర రెండు లక్షల మంది సైనికులున్నారు. మరో రెండున్నర లక్షల మేర రిజర్వు సేనలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రేన్‌ సరిహద్దులో లక్షన్నర మంది సైనికులను మోహరించింది. బలా బలాలు తేల్చుకునే దాకా పరిస్థితిని తెగలాగడం ఏ దృష్టితో చూసినా ఉక్రెయిన్‌కు అనుకూలమైంది కాదు.
అన్నింటికన్నా మించి ఏ యుద్ధంలోనైనా మరణించేది రెండు వేపుల ఉన్న సైనికులు, యుద్ధ ప్రభావాన్ని తప్పించుకోలేని సామాన్య ప్రజలే. యుద్ధం మొదలైంది కనక రెండు పక్షాలు యుద్ధం గురించి చెప్పే మాటల్లో సత్యం నామ మాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే యుద్ధంలో మొట్ట మొదట బలయ్యేది సత్యమే. రష్యా చుట్టూ నాటో దళాలను మోహరించి రష్యాలోని వనరులను కొల్లగొట్టాలన్న ఆలోచన అమెరికాకు లేకపోతే ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టే పని చేసేదే కాదు. పుతిన్‌ యుద్ధానికి దిగడంలో మంచి చెడ్డలు చర్చనీయాంశం కావచ్చు. కానీ తన గడ్డ మీద ఒక్కసారైనా యుద్ధం చేయని అమెరికాకు ఉక్రెయిన్‌ పరిస్థితిని వినియోగించుకునే అవకాశం వచ్చింది. అమెరికా పెత్తందారీ ధోరణి మరోసారి బాహాటంగా వ్యక్తం అయింది. ఇది కచ్చితంగా వినాశకరమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img