Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

రాజకీయ కుస్తీలో మల్ల యోధులు చిత్తు

విశ్వ క్రీడావేదిక అయిన ఒలింపిక్స్‌ క్రీడల్లో కుస్తీ పోటీలు పెట్టి పతకాలు సాధించడం పరిశ్రమ, సంకల్పబలం ఉంటే సులభం కావచ్చు. కానీ రాజకీయ నాయకులతో తలపడడం ఎంతటి మల్ల యోధులకైనా కష్టసాధ్యమే. అదీ ఆ రాజకీయ నాయకులు అధికార పార్టీకి చెందిన వారైతే, దానికి తోడు పార్లమెంటు సభ్యుడైతే ఆ వ్యక్తి ఎంత నైచ్యానికి పాల్పడినా తలపడడం సులభం కాదు. ఇక ఆ రాజకీయ నాయకుడు అధికార పార్టీకి చెందిన వాడైతే ఎన్ని ఫిర్యాదులు చేసినా అరణ్యరోదనగానే మిగిలిపోతాయి. ఒలింపిక్‌ క్రీడల్లో పతకాలు సంపాదించిన వారు, జాతీయ చాంపియన్‌ షిప్‌ పథకాలు సాధించిన వారైనా వినిపించుకునే నాథుడే ఉండడు. పతకాలు సాధించిన మల్ల యోధులు ఉమ్మడిగా భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరన్‌ సింగ్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కి దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు కూడా వీరు నిరసన గళాలు వినిపించినా పట్టించుకున్న వారు లేకపోవడంతో మళ్లీ గత ఆదివారం నుంచి నిరసన ప్రారంభించారు. అనేక మంది మల్ల యోధులు ఈ నిరసనోద్యమంలో భాగస్వాములయ్యారు. భారత మల్లయోధుల సంఘాల సమాఖ్యకు అధ్యక్షుడిగా వెలిగిన బ్రిజ్‌ భూషణ్‌ పై పోరాటం ప్రారంభించారు. ఆ పెద్దమనిషి రాజకీయ అండచూసుకుని మల్ల యుద్ధంలో పాల్గొంటున్న మహిళలపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలున్నాయి. తమకు న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగిస్తామని వారు అంటున్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ప్రపంచ ఛాంపియన్‌ వినేశ్‌ ఫోగాట్‌, ఒలంపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. వీరు గత జనవరిలో నిరసన తెలియజేసినప్పుడు రాజకీయ నాయకులను దరి చేర నివ్వలేదు. మద్దతు తెలియజేద్దామనుకున్న సీపీఎం నాయకురాలు బృందా కరత్‌ను వేదిక మీంచి దింపేశారు. ఇప్పుడు బీజేపీ సహా ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా మద్దతు ఇవ్వొచ్చునంటున్నారు. ఇటీవలి కాలం దాకా కాంగ్రెస్‌ నాయకుడిగా, మాజీ న్యాయశాఖ మంత్రిగా, ప్రస్తుతం ఇన్సాఫ్‌ కె సిపాహీ అన్న సంస్థను నడుపుతున్న కపిల్‌ సిబాల్‌ ఈ మల్ల యోధులకు మద్దతు ప్రకటించారు. అలాగే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హూడా, అఖిలభారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నెట్టా డి సౌజా, కాంగ్రెస్‌ నాయకుడు ఉదిత్‌ రాజ్‌ లాంటి వారు జంతర్‌ మంతర్‌ లోని నిరసన శిబిరం దగ్గరకు వెళ్లి అండగా నిలబడ్డారు. మల్ల యోధుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ మాత్రమే కాక వీరికి శిక్షణ ఇచ్చే వారు కూడా ఇలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారట. ఏడుగురు మల్ల యోధులు మంగళవారం ఉమ్మడిగా సుప్రీంకోర్టులో ఒక అర్జీ దాఖలుచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ తో కూడిన ఇద్దరు సభ్యుల బెంచి వీరి పిటిషన్‌ను విచారణకు స్వీక రించింది. వచ్చే శుక్రవారం విచారణ జరుగుతుంది. వీరు కోరిందల్లా బ్రిజ్‌ భూషణ్‌ పై ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయాలనే. అంటే గత జనవరిలోనే ఈ అంశం వెలికి వచ్చినప్పటికీ బ్రిజ్‌ భూషణ్‌ పై ఎఫ్‌.ఐ.ఆర్‌. అయినా దాఖలు కాలేదంటే రాజకీయ నాయకుల భల్లూకపు పట్టు ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. బ్రిజ్‌భూషణ్‌ చేతిలో లైంగికవేధింపునకు గురైన అమ్మాయిల్లో ఒకరి వయసు ఆ సంఘటన జరిగినప్పుడు కేవలం పదహారేళ్లే అని కపిల్‌ సిబ్బల్‌ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు. ఆ అమ్మాయి బంగారు పతకం సాధించింది. బ్రిజ్‌భూషణ్‌ మీద వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలు చేయనందుకు పోలీసులమీద ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు అన్న ప్రశ్నకు ఆయన బీజేపీ నాయకుడు కావడమే అన్న సమాధానమే వస్తుంది.
అలసట లేకుండా ‘‘బేటీ బచావో బేటీ పఢావో’’ అని నినాదాలిచ్చే ప్రధానమంత్రి మోదీ చెవికి జంతర్‌ మంతర్‌లో పిక్కటిల్లుతున్న నిరసన ధ్వనులు వినిపించలేదేమో. వినిపించినా ఏ ముఖ్యమైన అంశంపైనైనా మౌనం పాటించడం ఆయన విశిష్ట శైలి. దేశ విదేశాల్లో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగురవేస్తున్న ఈ మల్లయోధులకు నెలలు గడిచినా న్యాయం జరగకపోవడం క్రీడా రంగంలోనూ రాజకీయాల ప్రభావ తీవ్రతకు సంకేతం. వీరు పతకాలు సాధించినప్పుడు రాజకీయ నాయకులు పోటీ పడి అభినందన సందేశాలు గుప్పిస్తుంటారు. లైంగిక దాడికి గురై ఫిర్యాదు చేసిన ఏడుగురు అమ్మాయిల మీద బ్రిజ్‌ భూషణ్‌ పై ఇచ్చిన ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. మరీ విచిత్రం ఏమిటంటే ఫిర్యాదు వెనక్కు తీసుకుని, ఆందోళన మానుకుంటే డబ్బు ముట్ట చెప్తామని మల్ల యోధుల సంఘాల సమాఖ్యకు చెందిన వారు నిస్సిగ్గుగా ప్రలోభ పెడ్తున్నారు. ఇంతకు ముందు వీరు ఆందోళనకు దిగినప్పుడు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికైనా సమర్పించలేదు. దీనికి కారణం ఆరోపణలకు గురైంది బీజేపీ నాయకుడు కావడమే.
ఏ క్రీడా సంఘమైనా రాజకీయ నాయకుల ఆధిపత్యంలోనే ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతమైన పోరాటం దుర్లభమే. గత జనవరిలో ఈ అమ్మాయిలు నిరసనకు దిగినప్పుడు బ్రిజ్‌ భూషణ్‌ మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కమిటీ నియమిస్తామంటే ఆందోళన విరమించారు. ఇంతవరకు తమ ఫిర్యాదుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడనందువల్ల మళ్లీ ఆందోళన ప్రారంభించక తప్పలేదు. లైంగిక వేధింపులకు గురైన ఈ మల్లయోధులు గత మూడు నెలలుగా అనిర్వచనీయమైన మానసిక వ్యధ అనుభవిస్తున్నారు. ‘‘దయచేసి మా గోడు వినిపించుకోండి’’ అని ప్రధానమంత్రికి మొరపెట్టుకుంటున్నారు. వీరు పతకాలు సాధించినప్పుడు మోదీ క్రీడాకారులను ఉదయం ఫలహారానికి ఆహ్వానించారు. ఆయనకు ఆ విషయమైనా జ్ఞప్తికి వస్తే బ్రిజ్‌ భూషణ్‌ మీద చర్య తీసుకోవడానికి ముందుకు వస్తారా? ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎదుట బాధితులు వాంగ్మూలాలు నమోదు చేసినా ఏ చర్యా తీసుకోలేదు. మేం అబద్ధం చెప్తున్నామనుకుంటే నార్కో పరీక్షకైనా సిద్ధమేనంటున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన వారు ఉన్నారన్నధి ఖాయం. లైంగిక వేధింపులకు పాల్పడేది కేవలం రాజకీయ నాయకులే కానక్కర్లేదు. అయితే ఆ పని చేసిన వారికి రాజకీయాలు రక్షా కవచంగా పని చేస్తాయి. దుర్బేధ్యమైన ఆ కవచాన్ని ఛేదించడానికి ఈ మల్ల యోధులకు రాజకీయ పార్టీల అండ అవసరం. లేకపోతే అధికార పార్టీ ఎంపీ మెడలు వంచడం దుర్లభమే. క్రీడా రంగంలో రాజకీయ నాయకుల ఆధిపత్యానికి ముగింపు పలకాల్సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img