Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

రాజకీయ మల్ల యోధుడు ములాయం

మల్ల యుద్ధాలు రాజకీయాల్లో కూడా ఉపయోగపడతాయని ఐదున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో ఉండి సోమవారం, 82వ ఏట తనువు చాలించిన ములాయం సింగ్‌ యాదవ్‌ను చూస్తే తెలుస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను చేరదీస్తాడు అన్న విమర్శలు భరించిన ములాయం ఇతర వెనుకబడిన కులాల వారిని (ఒ.బి.సి.), ముస్లింలను కూడగట్టగలిగారు. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలలోని యాదవులు ప్రధానంగా హిందూ సంప్రదాయాలకు నిబద్ధులు. వారు బీజేపీ వలలో చిక్కకుండా నివారించిన ఖ్యాతి మాత్రం కచ్చితంగా ములాయం, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ లాంటి నాయకులదే. ప్రాంతీయంగా మాత్రమే బలం ఉన్న సమాజ్‌ వాదీ పార్టీ, లాలూ యాదవ్‌ నాయ కత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.) మాత్రమే ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా ఎన్నడూ బీజేపీతో చేయి కలపలేదు. అడ్వాణీ రథయాత్ర పుణ్యమా అని రేగిన చిచ్చులో హిందుత్వ దాడిని ఎదుర్కోవడం లోనూ ఈ యాదవులు ఇద్దరూ సాహసోపేతంగా వ్యవహరించారు. ములాయం సింగ్‌ మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన సమయంలో మండల్‌ వివాదం, మందిర్‌ చిచ్చు తార స్థాయిలో ఉన్నాయి. బాబరీ మసీదు ఉన్న చోట రామ మందిరానికి శిలాన్యాసం కోసం వెళ్తున్న కరసేవకులను నిరోధించడం కోసం ములాయం వారిపై పోలీసు కాల్పులకు ఆదేశించారు. అంతకు ముందే బాబరీ మసీదు మీంచి ఒక్క పక్షి అయినా ఎగరకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి కాల్పులకు ఆదేశించ డానికీ వెనుకాడలేదు. ఈ కాల్పుల్లో 16 మంది మరణించారు. ఈ దశలో ములాయం ఒక వేపు హిందువుల ఆగ్రహానికీ రెండవ వేపున మసీదును రక్షించడానికి చేయవలసినంత చేయలేదు అని ముస్లింల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ అదే సమయంలో ఉత్తర భారత రాజకీయా లలో ముస్లింల, యాద వుల మధ్య సఖ్యత కుదిరింది. అడ్వాణీ రథ యాత్ర 1990 అక్టోబర్‌ 19న బిహార్‌లో ప్రవేశించింది. ఎలాగైనా ఆ రథ యాత్రను ఆపాలన్న దృఢ సంకల్పంతో ఉన్న లాలూ యాదవ్‌ 1990 అక్టోబర్‌ 24న అడ్వాణీని అరెస్టు చేయించారు. బీజేపీని ఎదుర్కోవడానికి ములాయం, లాలూ ఎంత పట్టు దలతో వ్యవహరించారో అర్థం అవుతోంది. మరణాంతాని వైరాణీ అంటారు కనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ములాయం మృతి సందర్భంగా సంతాపం తెలియజేస్తూ ఎమర్జెన్సీలో ములాయం ఒక యోధుడు అని అభివర్ణించారు. ఈ సందేశంలో మోదీ రాజకీయ వైఖరిని పక్కన పెట్టొచ్చు. కానీ ములాయం నిరంతరం బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ములాయం ప్రజోద్యమాల నుంచి ఎదిగి వచ్చిన నాయకుడు. ఆయన తిరుగులేని వ్యూహకర్త అంటారు. కానీ ఆయన వ్యూహాలు అనేక సందర్భాలలో ప్రత్యర్థులనే కాక మద్దతుదార్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసేవి. ప్రాంతీయ రాజకీయాల, జాతీయ రాజకీయ మేళవింపులో ఆయన దిట్ట. అందుకే 15వ ఏటనే రాజకీయాల్లోకి వచ్చిన ములాయం చివరి దాకా అందరి స్మృతిపథంలో మెదులుతూనే ఉన్నారు. నిరాశాజనకమైన పరిస్థితు లను కూడా అధిగమించి మళ్లీ నిటారుగా నిలబడి సత్తా చాటుకోగలిన నైపుణ్యం ములాయం సొంతం. వాస్తవ పరిస్థితులు ఆయనకు క్షుణ్నంగా తెలుసు. సామాన్య జనంతో మమేకం కాగల సామర్థ్యం ఉంది. అనేక రాజకీయ పార్టీలతో సంబంధాలు కొనసాగించే వారు. దిగువ కులాల వారిని, అల్పసంఖ్యాకవర్గాల వారిని సమీకరించడం మీద ములాయంకు ఉన్న శ్రద్ధే సమాజ్‌ వాదీ పార్టీ బలం.
రాం మనోహర్‌ లోహియా రాజకీయాలతో ప్రేరణ పొందిన ములాయం మొట్టమొదటిసారి 1967లో శాసనసభలో అడుగు పెట్టారు. అప్పుడు వయసులో సభలో అందరికన్నా పిన్న వయస్కుడు ఆయనే. పది సార్లు శాసనసభకు, ఒకసారి శాసన మండలికి, ఏడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ జీవితంలో ఓటమి చవి చూసింది 1980లో మాత్రమే. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభావం ఎక్కువగా పని చేసింది. కానీ తరవాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంటే 1967 నుంచి నిరంతరం ఏదో ఒక చట్టసభలో ఉంటూనే ఉన్నారు. 1989లో మొదటిసారి ముఖ్య మంత్రి అయ్యారు. కానీ అధికారంలో ఉన్నది 1991 దాకా మాత్రమే. అయినా రాజకీయాల మీద ఆయన బలమైన ముద్రే వేశారు. 1992లో బాబరీ మసీదు కూల్చివేసిన తరవాత ములాయంకు ముస్లింల మద్దతు నిండుగా సమకూరింది. ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బాబరీ మసీదును కాపాడగలిగారన్న అభిప్రాయంవల్ల ముస్లింల దృష్టిలో ములాయం వీరుడిగా నిలిచారు. బహుజన సమాజ్‌ పార్టీ అంటే ఆయనకు కిట్టక పోయినా 1994లో బి.ఎస్‌.పి. మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1995లో బి.ఎస్‌.పి. అధినేత మాయావతి మద్దతు ఉపసంహరించారు. బీజేపీ మద్దతుతో ఆమే ముఖ్యమంత్రి అయిపోయారు. 1996లో వాజపేయి ప్రభుత్వం 13 రోజులకే పడిపోయిన నేపథ్యంలో సోనియా గాంధీ ప్రధాని కావడాన్ని ములాయం గట్టిగా వ్యతిరేకించారు. ఈ కారణం చేతే 2002 ఫిబ్రవరి ఎన్నికలలో ములాయం పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. 2003లో ములాయం మూడవసారి ముఖ్యమంత్రి అయి 2007 దాకా కొనసాగారు. 2012లో సమాజ్‌ వాదీ పార్టీకి సంపూర్ణ మెజారిటీ దక్కింది. ఆయన కొడుకు అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ క్రమంగా ములాయం కుటుంబం లోనే అంతర్గత కలహాలు రేగాయి. ములాయం సోదరుడు శివపాల్‌కు అఖిలేశ్‌ యాదవ్‌కు పొంతన కుదరలేదు. ఈ పరిణామాల కారణంగానే ములాయం అఖిలేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తరవాత తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య సాధ్యమైంది. సమాజ్‌ వాదీ పార్టీలో కలహాలే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేశాయి. రాజకీయాలలో ఎలా నిలదొక్కు కోవాలన్న కిటుకులు ములాయంకు బాగా తెలుసు. 2019లో లోకసభలో మోదీని పొగిడి ములాయం మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే అత్యాచారాలకు పాల్పడిన యువకులకు మరణ దండన విధించకూడదన్న ఆయన వ్యాఖ్య కూడా విమర్శలకు దారి తీసింది. కుర్రాళ్లు పొరపాట్లు చేస్తుంటారు అని ఆ సమయంలో ములాయం అన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనుకున్నప్పుడూ జుత్తు కత్తిరించు కున్న మహిళలు అని ఆయన అన్న మాటపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. చట్టసభల్లో రిజర్వేషన్లలో మళ్లీ రిజర్వేషన్లు ఉండాలని ఆయన పట్టుబట్ట డమూ వివాదాలకు దారి తీసింది. రాజకీయాలలో మనుగడ కోసం ములాయం నిత్య పోరాటం చేశారు తప్ప ఎదురుగాలి ఉన్నప్పుడూ మౌనంగా ఉండిపోకపోవడం ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టత. మల్ల యుద్ధంలో ఆరి తేరిన ములాయం రాజకీయాలలోనూ కలహప్రియుడే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img