Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

రాజ్యాంగంపై బీజేపీ దొంగ దాడి

భారత రాజ్యాంగంపై మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి విశ్వాసంలేదని మరోసారి రుజువు అయింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభం అయిన సందర్భంగా పార్లమెంటు సభ్యులందరికీ రాజ్యాంగం ప్రతులు పంచి పెట్టారు. ఇందులో రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్‌, సెక్యులర్‌ అన్న మాటలు బీజేపీ సర్కారు మాయం చేసేసింది. సెక్యులర్‌, సోషలిస్ట్‌ అన్న మాటలు వింటేనే బీజేపీకి కంపరం పుడుతుందని అనేకసార్లు రుజువైంది. 2015 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వ్యాపార ప్రకటనలో రాజ్యాంగ పీఠిక ప్రచురించారు. అందులో కూడా సోషలిస్టు, సెక్యులర్‌ మాటలను తొలగించారు. అప్పుడూ పెద్ద రభస జరిగింది. ‘‘నెహ్రూకు సెక్యులరిజం అన్నమాట గురించి అవగాహన లేదా’’ అని అప్పుడు అప్పటి కేంద్రమంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వితండవాదం ప్రారంభించారు. నెహ్రూకు ఈ మాటలు రాజ్యాంగంలో చేర్చాలని తెలియదా అని ప్రశ్నించడం రవిశంకర్‌ ప్రసాద్‌ ఉద్దేశం. అలా అడగకుండా నెహ్రూకు తెలియదా అనడం ద్వారా ఈ మాటలు అంత అవసరమైతే నెహ్రూ అప్పుడే ఈ మాటలను చేర్పించే వారు కదా అని చెప్పాలనుకున్నారు. ఇందులో ఓ ధర్మ సూక్ష్మం ఉంది. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ అన్న అభిప్రాయం సర్వత్రా ఉన్నప్పుడు సదరు బీజేపీ నాయకుడు నెహ్రూ పేరెందుకు ప్రస్తావించినట్టు? అంటే రాజ్యాంగ రూపకల్పనలో నెహ్రూ కీలక పాత్ర నిర్వహించారని అంగీకరిస్తున్నట్టే కదా! రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటామని చేసిన ప్రమాణాన్ని ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించడం అంటే అది వారి నైజం అని సరిపెట్టుకోవడానికి వీలులేదు. అది కేవలం ఉల్లంఘనే కాదు. నేరం కూడా. మంగళవారం పార్లమెంటు సభ్యులకు అందజేసిన రాజ్యాంగ ప్రతుల్లో సెక్యులర్‌, సోషలిస్టు అన్న మాటలు లేకపోవడాన్ని అనేక ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది నేరం అని అభివర్ణించాయి. అయితే సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ విచిత్రమైన వాదనకు దిగారు. రాజ్యాంగం అసలు ప్రతిలో ఆ రెండు మాటలూ లేవు అంటున్నారు. 2015లో రవి శంకర్‌ ప్రసాద్‌ కూడా ఇలాగే వాదించారు. ఈ రెండు మాటలను 1976లో చేర్చిన విషయం బీజేపీ నాయకులకు తెలియక కాదు. ఈ చేర్చిన మాటలతో కూడిరదే ప్రస్తుతం పాటించవలసిన ప్రతి అనీ తెలుసు. అయినా దొంగ చాటుగా ఆ మాటలు తొలగించడానికి అనువైనప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ ప్రవర్తన బీజేపీ నిజస్వరూపాన్ని బయట పెడ్తుంది. ఈ రెండు మాటలను తొలగించడం యథాలాపంగా చేయగలిగిన పని కాదు. దీనికి రాజ్యాంగాన్ని సవరించవలసి ఉంటుంది. అది చేయలేకే దొడ్డి దారిలో ఆ మాటలను తొలగించి తమ ‘‘నేర’’ ప్రవృత్తిని బయట పెట్టుకోవడం సంఫ్‌ు పరివార్‌ కుదురుకు పరిపాటి అయి పోయింది.
రాజ్యాంగం మీద సంఫ్‌ు పరివార్‌ కూటమికి ఉన్న అయిష్టతకు పెద్ద నేపథ్యమే ఉంది. మొదట ఆర్‌.ఎస్‌.ఎస్‌. చాలా కాలం రాజ్యాంగాన్ని అమోదించనే లేదు. గాంధీజీ హత్య తరవాత అప్పటి కేంద్ర హోం మంత్రి 1948 ఫిబ్రవరి నాలుగున ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నిషేధించారు. ప్రస్తుతం సంఫ్‌ు పరివార్‌ సర్దార్‌ పటేల్‌ను కీర్తించడంలో నిమగ్నమై ఉంది. పటేల్‌కు ఆర్‌.ఎస్‌.ఎస్‌. మీద కొంత సానుకూల దృక్పథం ఉండేది. కానీ గాంధీజీ హత్య తరవాత ఆయనే ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నిషేధించాలని నిర్ణయించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ను నిషేధించినప్పుడు దానికి కారణాలేమిటో సవివరంగా అప్పటి ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకులకు తెలియజేశారు. ‘‘మన దేశంలో విద్వేషాన్ని, హింసాకాండను ప్రోత్సహించి దేశ స్వాతంత్య్రాన్ని ప్రమాదంలో పడవేసే శక్తులను నిర్మూలించడానికే ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నిషేధిస్తున్నాం’’ అని సర్దార్‌ పటేల్‌ స్పష్టం చేశారు. సంఫ్‌ు పరివార్‌ సభ్యులు అవాంఛనీయ, ప్రమాదకరమైన కార్యకలా పాలకు పాల్పడుతున్నారని పటేల్‌ వివరించారు. సంఫ్‌ు పరివార్‌ సభ్యులు దేశంలోని అనేక ప్రాంతాలలో దహనకాండ, దోపిడీ, బందిపోటు, హత్యలు, అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని పటేల్‌ స్పష్టం చేశారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడాలని ప్రజలను ప్రేరేపిస్తూ ఆర్‌.ఎస్‌.ఎస్‌. కరపత్రాలు కూడా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమాలన్నీ రహస్యంగా కొనసాగించే వారు. 1948 నవంబర్‌ ఆఖరులో దిల్లీలో సంస్థానాధీశుల, హోం మంత్రుల సమావేశంలో కూడా పటేల్‌ ఈ అంశాలను ప్రస్తావించారు. ఆ తరవాతే సంఫ్‌ు పరివార్‌ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయినా ఆర్‌.ఎస్‌.ఎస్‌. విధ్వంసకర కార్యకలాపాలు మానలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవలసి వచ్చింది. చట్టానికి, దేశ సంక్షేమానికి కట్టుబడే వారందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు. గాంధీ హత్య తరవాత పటేల్‌ హిందూ మహాసభ నాయకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీకి, ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకులకు 1948 జులై 18న లేఖలు కూడా రాశారు. ‘‘హిందూ మహాసభలోని తీవ్రవాద శక్తులు మహాత్మా గాంధీ హత్యకు కుట్రపన్నారన్న విషయంలో నాకు ఎలాంటి అనుమానమూ లేదు. ప్రభుత్వ అస్తిత్వానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రమాదకారిగా తయారైంది. నిషేధించిన తరవాత కూడా ఈ విధ్వంస కార్యకలాపాలు ఆగలేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. వాళ్లు మరింత తీవ్రంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు’’ అని పటేల్‌ ఆ లేఖల్లో తెలియజేశారు. 1948 సెప్టెంబర్‌ లో పటేల్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ కు రాసిన లేఖలో కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నిషేధించడానికి కారణం వెల్లడిరచారు. ఈ పర్యవసానంగానే గోల్వాల్కర్‌ 1948లో సర్దార్‌ పటేల్‌ ను కలుసుకోవాలని అభ్యర్థించారు. వారిద్దరి మధ్య రెండు మూడు దఫాలు చర్చలూ జరిగాయి. నిషేధం తొలగిస్తేనే తప్ప తమ వాళ్లకు విధ్వంసం ఆపాలని ఆదేశించలేనని గోల్వాల్కర్‌ అన్నారు. ఆ దశలోనే పటేల్‌ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించారు. నిషేధం తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ తరవాత భారత్‌ సెక్యులర్‌ దేశమని, జాతీయ పతాకాన్ని అంగీకరిస్తామని ఆర్‌.ఎస్‌.ఎస్‌. కాళ్ల బేరానికి వచ్చింది. అందువల్ల నిషేధం తొలగించవచ్చునని నెహ్రూకు రాసిన లేఖలో పటేల్‌ వివరించారు. గోల్వాల్కర్‌ స్పష్టమైన హామీ ఇచ్చిన తరవాత 1949 జులై 11న ఆర్‌.ఎస్‌.ఎస్‌. మీద నిషేధం తొలగింది. భారత రాజ్యాంగానికి, జాతీయ పతాకానికి విధేయంగా ఉంటామని ఆర్‌.ఎస్‌.ఎస్‌. వాగ్దానం చేసింది. అయితే ఇది మనస్ఫూర్తిగా చెప్పిన మాట కాదని అనేక సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు కూడా భారత రాజ్యాంగంమీద ప్రమాణంచేసి మంత్రు లైన కొందరు ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకులు మనుస్మృతి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. అంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌. నైజం మారలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ కుదురు నుంచి వచ్చిన వారే. అవకాశం వచ్చినప్పుడల్లా సెక్యులర్‌, సోషలిస్టు అన్న భావనలను తూర్పార పడ్తూనే ఉన్నారు. సెక్యులరిజం భారత ప్రాచీన సంస్కృతిలోనే ఉందని వాదిస్తుంటారు. అడ్వాణీ బీజేపీ అగ్ర నాయకుడిగా ఉన్నప్పుడు సెక్యులర్‌ అన్న మాటను ‘‘సిక్యులర్‌’’ (రుజాగ్రస్థ) అని ఎద్దేవా చేసిన వాస్తవాన్ని విస్మరించలేం. మోదీ అడ్వాణీకి ప్రత్యక్ష శిష్యుడేగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img